మెయన్ ఫీచర్

వైవిధ్య భాషల వైరుధ్య భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతి వ్యతిరేక ప్రవృత్తి పెరిగిపోతుండడానికి ప్రధాన కారణం బ్రిటిష్ వారు వదలిపెట్టి వెళ్లిన బౌద్ధిక వారసత్వం. అద్వితీయ జాతీయత మన దేశపు అనాది స్వభావం. అనేకానేక వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేకపోవడం ఈ వౌలిక స్వభావం. పరస్పర పరిపోషకాలైన వైవిధ్యాలు సనాతన భూమిగా, అజనాభంగా, భరత ఖండంగా హిందుస్థానంగా వినుతికెక్కిన మనదేశపు అద్వితీయ జాతీయతలో భాగం కావడం చరిత్ర. బ్రిటిష్ వారు ఈ చరిత్రను చెరచిపోయారు. అద్వితీయ జాతీయత ‘అనేక జాతీయత’ల కూటమిగా పరస్పరం విరోధించుకుంటున్న కూడలిగా చిత్రీకరించి వెళ్లారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి స్నాతకోత్తర స్థాయి వరకూ బ్రిటిష్ వారు నేర్పిన పాఠాలను ఇప్పటికీ వల్లె వేస్తుండడం దేశ విద్రోహ భావాలు పుట్టుకొని రావడానికి మూలం. ఈ విద్రోహ భావన విషవృక్ష మూలమైన బ్రిటిష్ కృతక సిద్ధాంతాలను కృత్రిమ కథలను ఛేదించడానికి క్రీస్తుశకం 1947 నుంచీ కూడ విద్యారంగంలో ప్రయత్నాలు జరగలేదు. అత్యధికులు బ్రిటిష్ వారి భారత వ్యతిరేక సైద్ధాంతిక భూమికను దున్ని పండిస్తున్న పరిశోధక ఫలాలు మరింత విద్రోహ ముఖాన్ని వ్యాపించేస్తున్నాయి. వివిధ విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు మాత్రమే కాదు దాదాపు అన్ని జీవన రంగాలలోను ‘‘మాతృదేశ మమకార భావ జ్యోతులు’’ ఆరిపోయా యి, అరిపోతున్నాయి, కొడిగట్టి ఉన్నాయి. ఆరిపోయిన జ్యోతులను మళ్లీ వెలిగించడానికి, ఆరిపోతున్న వాటికి ఆజ్య ప్రదానం చేసి ఆరిపోకుండా నిరోధించడానికి, కొడిగట్టిన వాటిని పునరుజ్వలనం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను చూసి దేశ విద్రోహులు, బ్రిటిష్ భావదాసులు వికృతంగా విలపిస్తుండడం ఈ ఏడాది అంతర్జాతీయ భాషాదినోత్సవానికి నేపథ్యం. మాతృభాషా దినోత్సవానికి మాతృదేశం పట్ల మమకారం ప్రాతిపదిక. భాష మాధ్యమం మాత్రమే. లక్ష్యం మాతృ జాతీయతా పరిరక్షణ. మాతృదేశం పట్ల కల మమకారం జాతీయ సంస్కృతి. మాతృభాష స్వరూపం, మాతృ సంస్కృతి స్వభావం. స్వ రూప రక్షణ ద్వారా స్వభావ పరిరక్షణ ఐక్యరాజ్య సమితి సైతం నిర్దేశించిన మాతృభాషా దినోత్సవ లక్ష్యం!
ఈ స్వభావం భంగపడివున్న వారు దేశద్రోహి అఫ్జల్ గురును విశ్వవిద్యాలయ ప్రాంగణాలలో ప్రశంసిస్తున్నారు, సంస్మరించుకొంటున్నారు. ఈ విద్రోహానికి మూలాలు బ్రిటిష్ వారు కల్పించి వెళ్లిన ఒక దేశంలో భిన్న జాతుల వారు ఉన్నారన్న కృత్రిమ సిద్ధాంతం. ఈ దేశంలో అనాదిగా అనేక భాషలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు, అనేక సంప్రదాయాలు, ఆచారాలు, ఆహార పద్ధతులు, ఆహార్య ధారణలు, ఆలోచనా రీతులు పరిఢవిల్లాయి. ఇంకా లెక్కకు మిక్కుటమైన వైవిధ్యాలు విలసిల్లుతున్నాయి. కానీ ఈ దేశంలోని జాతి ఒక్కటే, సంస్కృతి ఒక్కటే! ఈ దేశంలో జాతీయతకు మతంకాని, ప్రాంతంకాని, భాషకాని, ప్రాతిపదికలు కాలేదు. సకల వైవిధ్యాల సంపుటమైన సనాతన సంస్కృతి మాత్రమే ఈ జాతికి ప్రాతిపదిక. బ్రిటిష్ వారు ఈ అద్వితీయ జాతి ఈ దేశంలో ఉందన్న వాస్తవానికి విరుద్ధంగా మత జాతులను, ప్రాంత జాతులను భాషా జాతులను, కుల జాతులను, కల్పించి పోయారు. ఈ కృత్రిమ సిద్ధాంతం అన్ని రంగాలలోను జాతీయతను పరిమార్చుతోంది. సనాతనం అని అంటే పాతది అని అర్థం ప్రచారం కావడం భయంకరమైన భాషా వికృతి. బ్రిటిష్ వారి భాషా పాఠాలు ఈ వికృతిని వ్యాపింప చేశాయి, చేస్తున్నాయి. సనాతనం అని అంటే శాశ్వతం అని మాత్రమే అర్థం. మన జాతి సనాతనమైనది అని అంటే మన జాతి శాశ్వతమైనది అని అర్థం. ఇలా మనజాతికి కల శాశ్వతమైన అస్తిత్వం పట్ల విశ్వాసం జాతీయత. ఈ అస్తిత్వ పరిరక్షణ మాతృభాషాదినోత్సవ నిర్వహణ లక్ష్యం.
ఫిబ్రవరి 21న అంతర్జాతయ మాతృభాషా దినోత్సవం జరపాలన్న ఐక్యరాజ్య సమితి తీర్మానం స్ఫూర్తి ఇదే. 1961 ఫిబ్రవరి 21వ తేదీన మళ్లీ 1966 ఫిబ్రవరి 21న అప్పటి తూర్పు పాకిస్తాన్ లోని ఇప్పటి బంగ్లాదేశ్‌లో ఢాకా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన బెంగాలీ భాషా పరిరక్షణ ఉద్యమం సమితి తీర్మానానికి నేపథ్యం. బంగ్లాదేశ్‌లో ప్రధాన భాష వంగ భాష. కాని వంగభాషను హతమార్చి బంగ్లాదేశీయులకు బలవంతంగా ఉర్దూ భాషను మప్పాలన్న పశ్చిమ పాకిస్తాన్ ప్రభుత్వ దమన నీతికి వ్యతిరేకంగా ఆ ఉద్యమం జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వ సైనికులు జరిపిన కాల్పులలో తొమ్మిది మంది మరణించారు. హంతక భాషల ఆధిపత్యం నుంచి మాతృభాషలను తప్పించడం మాతృభాషా దినోత్సవ స్ఫూర్తి! బంగ్లాదేశ్‌లో హంతక భాష ఉర్దూ, మాతృభాష బెంగాలీ. కానీ మనదేశంలోను వివిధ దేశాలలోను హంతక భాష ఆంగ్లం. ప్రాథమిక విద్యను మాతృభాషా మాధ్యమం ద్వారా మాత్రమే బోధించాలన్న 1953 నాటి సమితి తీర్మానానికి, ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం జరపాలన్న 1999 నాటి తీర్మానానికి విఘాతం కలిగిస్తున్న భాష ఇంగ్లీషు...ఇది మొదటి వైపరీత్యం. రెండవ వైపరీత్యం భాషల పేరుతో జాతులను ఏర్పరచడానికి జరిగిన, జరుగుతున్న ప్రయత్నం!
ఐక్యరాజ్య సమితి తీర్మానంలోని ఒక ప్రధానమైన లోపం ఒక జాతికి ఒక భాష మాత్రమే ఉండాలన్న భ్రమ. అందువల్ల మనదేశం వంటి అనేక ప్రాంతీయ మాతృభాషలున్న చోట్ల మొత్తం దేశానికి మాతృభాష ఏదన్నది సమితికి సమాధానం తెలియని ప్రశ్న. వివిధ భాషలున్న మనదేశంలో అన్ని భాషల మాధ్యమాల ద్వారా పరిరక్షణ పొందినది, పొందుతున్నది ఒకే జాతీయ సంస్కృతి మాత్రమే. సనాతన వాస్తవానికి భంగకరమైన పరిణామ క్రమం బ్రిటిష్ వారి పాలనలో అంకురార్పణ జరిగింది. అనాదిగా ఇక్కడ భిన్న భాషలు ఉన్నప్పటికీ, భిన్న సంస్కృతులు లేవు. భిన్న జాతీయతలు లేవు. అన్ని భాషా జన సముదాయాల జాతి ఒక్కటే. సంస్కృతి ఒక్కటే. ఈ అద్వితీయ జాతీయతను అద్వితీయ సంస్కృతిని భంగ పరచడానికై బ్రిటిష్ వారు భిన్న జాతుల సిద్ధాంతాన్ని, భిన్న, భిన్న భాషా కుటుంబాలను సృష్టించారు. లేని వైరుధ్యాలను కృతకంగా కల్పించారు. ఆర్యులు, ద్రావిడులు అన్న వేరువేరు జాతులను కల్పించడం ద్వారా అనాదిగా మనదేశం ఒకే భరత జాతి అన్న వాస్తవాన్ని వక్రీకరించారు. ద్రవిడ అన్న పదం భౌగోళికమైనది. ఆర్య పదం గుణ నిర్దేశకం. వింధ్యకు దక్షిణాన ఉన్న ప్రాంతం ద్రవిడ సీమ అయింది. ‘ద్రమిళుడు’ అన్న ఆదర్శ పాలకుని పేరుతో ఈ దక్షిణ భారతానికి ‘ద్రమిళసీమ’, ‘ద్రవిడ’ సీమ అన్న పేర్లు వచ్చాయి. ఈ భౌగోళిక విభాగంలోని జాతీయత కూడ అనాదిగా భారతీయమే. కానీ బ్రిటిష్ వారి ద్రవిడ ప్రాంతం వారు ప్రత్యేక జాతి అన్న కట్టు కథను కల్పించారు. ఈ కట్టు కథను విశ్వవిద్యాలయాలలో ఇప్పటికీ బోధిస్తుండడం అద్వితీయ భారత జాతీయతకు భంగం కలిగిస్తోంది. అలాగే ఆర్య అన్న గుణవాచకం, కొలంబో నుంచి కైలాసం వరకు సకల భారతీయులకు అనాదిగా వర్తించింది. సంస్కారవంతుడు ఆర్యుడు. సంస్కారం లేనివాడు అనార్యుడు. అందువల్ల ఆర్య అన్న ప్రత్యేక జాతి లేదు. దక్షిణ భారత దేశంలోను, ఉత్తర భారత దేశంలోను కూడ అర్యులు, అనార్యులు అనాదిగా ఉన్నారు. ఆర్యత్వం వెలుగు, అనార్యత్వం చీకటి. పెళ్లి చేసుకున్న తరువాత తనను తిరస్కరించిన భర్త దుష్యంతుడిని శకుంతల ‘అనార్య’ అని సంబోధించడం మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అన్న నాటకంలోని ఘట్టం. మహాకవి కాళిదాసు క్రీస్తుకు పూర్వం ఒకటవ శతాబ్దినాటి వాడు.
మహాకవి కాళిదాసు కాలం నాటికి దేశంలో అనేక ప్రాకృత భాషలు ఉన్నాయి. ఇవన్నీ కూడ సంస్కృత భాషకు రూపాంతరాలు. నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి టిబెట్ నుంచి సింహళం వరకు మాల్‌దీవుల వరకు విస్తరించిన ప్రాంతాలలోని అన్ని భారతీయ భాషలూ సంస్కృత భాషా రూపాంతరాలు. భారత ఖండం వెలుపల ఉన్న ధాయ్‌లాండ్ , కంబోడియా వంటి దేశాల భాషలు కూడ సంస్కృత భాషా జన్యాలన్నది వేరే చరిత్ర. కానీ ఒకప్పుడు ఈ మొత్తం భరత ఖండంలోని ప్రజలంతా మాట్లాడిన భాష సంస్కృత భాష. వైవిధ్య పరిపోషకమైన భారత జాతీయ స్వభావం ఒకే జాతికి అనేక భాషలు, మతాలు ఉండడానికి ప్రధాన కారణం. ఒక జాతికి ఒకే భాష ఉండాలన్న బ్రిటిష్ వారి కృతక సిద్ధాంతానికి మూలం ఐరోపాలో భాషా ప్రాతిపదికగా జాతులు ఏర్పడి ఉండడం. రెండవ భాషను సహించలేని ఉన్మాదం ఐరోపా దేశాలలో మాత్రమే కాదు అవనీతలంపై భాషా జాతులను ఏర్పాటు చేసింది. కానీ భారతదేశంలో ఒకే సంస్కృత భాష నుంచి జన్మించిన ఉత్తరాది భాషలు, దక్షిణాది భాషలు కూడా ఒకే సంస్కృతిని ప్రస్ఫుటింపజేశాయి, చేస్తున్నాయి. ఇందుకు కారణం ఈ భాషలన్నీ తమ తల్లి అయిన సంస్కృత భాషతో అనుసంధానమై ఉండడం. భారత జాతీయతత్వం వికసించడానికి మాధ్యమం సంస్కృత భాష! సంస్కృత భాషను అతి ప్రాచీన కాలంలో బ్రాహ్మీ లిపిలో వ్రాశారు. ఒకే సంస్కృత భాష సింహళ, తమిళ, తెలుగు, కశ్మీరీ, త్రివిష్టప వంటి అనేక భాషలుగా రూపాంతరం చెందిందన్న సనాతన వాస్తవాన్ని బ్రిటిష్ వారి బిషప్ కాల్డ్‌వెల్ భంగపరచడం 1858 నాటి మాట. కాల్డ్‌వెల్ సృష్టించిన భాషా చరిత్రను విద్యాలయంలో బోధిస్తున్నంత కాలం భారతీయత భంగపడుతూనే ఉంటుంది. భారతీయత భంగపడడం జాతి విద్రోహ చిత్తవృత్తికి మూలం.
ఒకే సంస్కృత భాష నుంచి వివిధ భారతీయ భాషలు ఏర్పడినట్టే ఒకే బ్రాహ్మీ లిపి వివిధ రూపాలను సంతరించుకొని వివిధ భారతీయ భాషలకు లిపిగా మారడం చరిత్ర. బ్రాహ్మీ లిపి నుంచి ‘శారద’, ‘గురుముఖ’ ‘నాగరి’, ‘దేవనాగరి’ వంటి లిపులు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల లిపులు, కశ్మీరీ, అస్సామీ భాషల లిపులు బ్రాహ్మీ లిపికి రూపాంతరమన్నది చరిత్ర. ఈ వాస్తవం వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని భారతీయతకు సనాతన సాక్ష్యం. తవ్వకాలలో, పంజాబ్‌లోను, తమిళనాడులోను బ్రాహ్మీ లిపిలో వ్రాసిన ప్రాచీన సాహిత్య రూపాలు బయటపడ్డాయి. అన్ని భాషా జనసముదాయాలదీ ఒకే భారత జాతి. ప్రాంతీయ మాతృభాషలకు మూలమైన సంస్కృతం జాతీయ మాతృభాష. వైవిద్యాల మధ్య వైరుధ్యం ఉందన్నది భ్రమ!

- హెబ్బార్ నాగేశ్వరరావు సెల్ : 9951038352