సబ్ ఫీచర్

భవిష్యత్తును దెబ్బతీస్తున్న ర్యాగింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థుల జీవితాలను అభివృద్ధి పథంలో నడిపించి, వారి జీవితాలను నిలబెట్టవలసిన విద్యాసంస్థల్లో రోజురోజుకు ర్యాగింగ్ పేట్రేగిపోతున్నది. అలా విద్యార్థుల జీవితాలను బలికోరుతున్నది. అప్పుడు రిషితేశ్వరి కావచ్చు, సాయినాథ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. దీనికి ప్రాంతం ప్రదేశం, రాష్ట్రం, అనే తేడాలు ఏమీ లేవు. ఈ 21వ శతాబ్దపు విద్యార్థుల ముందు అనేక పెను సవాళ్లు కళ్ల ఎదుటే కదలాడుతున్నాయి. కానీ నేడు విద్యాలయాల్లో పెరిగిపోతున్న ర్యాగింగ్ సంస్కృతి వల్ల, ఒక విద్యార్థిని సాటి విద్యార్థి గౌరవించలేని దుస్థితి నెలకొన్నది. అంతేకాదు కళాశాలలో చేర్పించిన అనంతరం తమ పిల్లల భవితవ్యంపై తల్లిదండ్రులు తీవ్రంగా ఆవేదన చెందాల్సి పరిస్థితులు దాపురించాయి. తమకు అండగా ఉండాల్సిన బిడ్డ ర్యాగింగ్ భూతానికి బలైతే ఆ తల్లిదండ్రులు పడే నరకయాతనను అర్థం చేసుకున్నవారెవరూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడరు. అసలు ఇంతటి దుస్థితి ఎందుకు కలగాలి? ర్యాగింగ్ పేరుతో హింసించేంతటి కాఠిన్యం ఎందుకు ఏర్పడుతోంది? ర్యాగింగ్‌ను నిర్వహించేవారిలో ఏమాత్రం మానవత్వం లేని కాఠిన్యత ఎందుకు పెచ్చరిల్లుతోంది?
ర్యాగింగ్‌కు పాల్పడే వారు ముందుగా ఒక్క విషయం ఆలోచించాలి. ర్యాగింగ్ చేయడం ద్వారా తన తోటి విద్యార్థి ఆశలు, ఆశయాలు, అతడు నిర్మించుకోవాలనుకున్న భవిష్యత్తును నాశనం చేస్తున్నామని, అతని మనోభావలను అణగదొక్కేస్తున్నామన్న వివేచన సీనియర్ విద్యార్థుల్లో కలగాలి. తాము ఇవ్వాళ ర్యాగింగ్ ద్వారా ఆనందం పొందామని భావించినా, తర్వాత మీ సంబంధీకులు, మీ సహోదరులకు కూడా ఇటువంటి దారుణ అనుభవమే కలిగి, తీవ్రమైన మనస్తాపంతో చదువు మానేయడమో, ఆత్మహత్యాయత్నం చేస్తేనో మీరు ఎంతగా బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. సరీగ్గా అదే బాధను మీరు ర్యాగింగ్‌కు గురిచేసే విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనుభవిస్తారు. ఒకే తల్లి కడుపున మీకంటే ముందు జన్మించిన మీ అన్నయ్యలు, లేదా అక్కలు మిమ్మల్ని ఇదేవిధంగా ర్యాగింగ్‌కు గురిచేశారా? మరి వారు మీకు సీనియర్లే కదా! వారికి లేని ర్యాగింగ్ భావన మీకెందుకు? మీ కుటుంబంలోని వ్యక్తులంతా మీకు అనుకూలంగా ఉండాలని భావిస్తారు. కానీ అదే సమయంలో మరో కుటుంబానికి చెందిన యువకుడు మీవల్ల అవస్థలపాలై, మనోవేదనకు గురికావాలా? ఇదేనా మానవత్వమంటే?
ఈ సమాజం ఏమాత్రం హర్షించని ఈ ర్యాగింగ్ దుశ్చర్యకు మీరు ఎందుకు పాల్పడుతున్నారు? చదువుల తల్లి సమక్షంలో ఈవిధమైన రాక్షస చర్యలకు పాల్పడితే ఆ తల్లి అవమానంతో తలదించుకునే పరిస్థితి దాపురిస్తుంది. ఆనాడు ధర్మ సంస్థాపనార్థం ఏదో ఒక అతీతశక్తి భువికి దిగి వచ్చాడని చెబుతుంటారు. బ్రిటిష్ వారినుండి మనదేశ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించడానికి మహాత్మునితో సహా ఎందరో మహనీయులు అహర్నిశలు శ్రమించారు. వారు ఎన్నో త్యాగాలు చేయడం వల్లనే మనం నేడు స్వేచ్ఛా భారతంలో జీవించగలుగుతున్నాం. కానీ నేడు సాటి విద్యార్థుల పాలిటి రాక్షసులుగా తయారవుతున్నారు కదా. మరి ఇలాంటి దుష్కృత్యాలనుంచి మనకు స్వాతంత్య్రం తెచ్చేందుకు ఏ మహాత్ముడు దిగిరావాలి? ఎన్ని త్యాగాలు చెయ్యాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో లేదు. మీలోనే ఉంది. ప్రతి విద్యార్థి హృదయంలో ఉంది. ఆలోచించండి. కార్యోన్ముఖులు కండి. రోజురోజుకు విజృంభిస్తున్న ర్యాగింగ్ భూతాన్ని చేయి చేయి కలిపి అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించి కలిసి నడవాల్సిన తరుణం ఆసన్నమైంది.

-సూరం అనిల్ సెల్: 9059457045