సంపాదకీయం

అమీర్‌ఖాన్ అభినయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమీర్‌ఖాన్ అనే ఆయన ఎమ్‌ఎఫ్ హుస్సేన్‌ను తలపిస్తున్నాడు! మన దేశంలో మత పరమైన అసహిష్ణుత పెరిగిపోయిందని ప్రకటించడం ద్వారా అమీర్‌ఖాన్ నిజానికి మరో ఎమ్‌ఎఫ్ హుస్సేన్‌లాగా ప్రవర్తిస్తున్నాడు...్భరత మాతను నగ్నంగా చిత్రీకరించడంలో కాదు, భరత భూమిని అప్రతిష్టపాలు చేయడానికై నిర్లజ్జగా అభినయించడంలో మాత్రమే! గతంలో భరత మాతను, భారతీయ సంస్కృతిని అత్యంత దుర్మార్గమైన రీతిలో అవమానించిన బౌద్ధిక బీభత్స కారుడు ఎమ్‌ఎఫ్ హుస్సేన్! ఇలా జాతీయతను నీచంగా కించపరిచిన ఆరోపణపై అతగాడికి వ్యతిరేకంగా న్యాయస్థానాలలో అనేక అభియోగాలు దాఖలయ్యాయి. ఈ కేసులనుంచి తప్పించుకొనడానికై హుస్సేన్ ఖతర్ దేశానికి వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు. కానీ అతగాడికి మన దేశంలో ప్రాణభయం ఏర్పడిన కారణంగా దేశం వదిలి పోయాడన్న ప్రచారం జరిగింది. ఆ ప్రాణభయాన్ని ఇప్పుడు అమీర్‌ఖాన్ అభినయిస్తున్నాడు. హిందీ చిత్ర రంగానికి చెందిన ఈ అమీర్‌ఖాన్ ఇలా ఇప్పుడు మళ్లీ పేరు తెచ్చుకుంటున్నాడు. అమెరికాలోని హాలీవుడ్ పట్ల వెర్రి వ్యామోహంతో బాలీవుడ్‌గా పేరు మార్చుకుని అంథానుకరణకు పేరు మోసిన హిందీ చలనచిత్ర ప్రపంచంలో నాయక్-హీరో-లకు, ఖల్‌నాయక్- యాంటీ హీరో-లకు కొదువ లేదు! నిజ జీవితంలో ఖల్‌నాయకుడుగా మారి కటకటాలను లెక్కపెడుతున్న వారున్నారు. కటకటాలనుండి తప్పించుకొనడానికై యత్నిస్తున్నవారున్నారు, కారుతో ఢీకొట్టి హత్యలు చేసినవారు, తప్ప తాగి క్రికెట్ క్రీడాంగణంలో వికృత నృత్యాలు చేసి వినుతికెక్కిన వారూ ఉన్నారు. ఏదోవిధంగా లైమ్‌లైట్‌లో ఉండడమే ఈ ఇందరి నాయకుల, ఖల్‌నాయకుల లక్ష్యం... కుండను పగలగొట్టి కాని- ఘటం భింద్యాత్-, బట్టలను చింపుకొని కాని-పటం ఛింద్యాత్-గాడిదల్లాగా ఓండ్రపెట్టికాని-కుర్యాత్ తా గార్ధ్భ స్వరం-ప్రసిద్ధిని పొందడమే కొందరి లక్ష్యం మరి! అందువల్ల ఇటీవల ప్రసిద్ధి తగ్గిన అమీర్‌ఖాన్ అసహిష్ణుత అస్త్రాన్ని ఆలస్యంగా అందిపుచ్చుకున్నాడు! మాతృదేశంలో ఆయనకు భద్రత లేదట! అందువల్ల దేశం వదిలి ప్రాణభయంతో పారిపోవాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుకున్నారట. ఇతర దేశాలకు వెళ్లి ప్రాణాలను రక్షించుకోవాలని భావించారట! అమీర్‌ఖాన్ అల్పసంఖ్యాక మత వర్గం వాడు కాబట్టి, అధిక సంఖ్యలో ఉన్న మత వర్గాలనుండి ఆయనకు ప్రాణభయం ఏర్పండిందన్న ప్రచారం హటాత్తుగా మొదలైంది. అధిక సంఖ్యాక మత వర్గం వారు అల్పసంఖ్యాక మతం వారిని నిర్మూలించడం అనేక దేశాలలో చరిత్ర...ఈ చరిత్ర వర్తమాన ప్రపంచంలో కూడా కొనసాగుతోంది. కానీ ఈ మత విద్వేష చరిత్ర మన దేశంలో లేదు, ఈ దేశంలోని అనాది జాతీయత అయిన హిందుత్వం సర్వమత సమభావ వ్యవస్థ కావడం ఇందుకు ఏకైక కారణం! ఈ హిందుత్వ స్వభావమే మనకు సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థను ప్రసాదించింది! ప్రాణభయంతో ఒక్క ఇస్లాం మతస్తుడు కాని, క్రైస్తవుడు కాని, పార్సీ కాని, యూదు మతస్థుడు కాని మన దేశంనుండి విదేశాలకు పారిపోయిన ఘటన ఒక్కటి కూడ జరగలేదు! మరి అమీర్‌ఖాన్ ప్రాణాలకు ముప్పు వాటిల్లిందన్న ప్రచారంలోని ఔచిత్యం ఏమిటి? సర్వమత సమభావ వ్యవస్థకు ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన మన మాతృదేశాన్ని ఎందుకిలా అప్రతిష్టపాలు చేస్తున్నారు? అమీర్‌ఖాన్ కుటుంబంవారు నిజంగా భయపడినారా? లేక ఆయన అభినయిస్తున్నాడా?
సర్వమత సమభావం రాజకీయం కాదు. ఈ దేశ ప్రజల సమష్టి జీవన స్వభావం! అందువల్ల ప్రభుత్వ నిర్వాహకులను అప్రతిష్ఠపాలు చేయడానికై ప్రతిపక్షాలు కాని, ప్రతిపక్షాలను తిప్పికొట్టడానికై ప్రభుత్వ పక్షం వారు కాని ఈ దేశం ప్రజల సమష్ఠి స్వభావమైన సర్వమత సమానతత్త్వాన్ని కించపరచరాదు! కానీ ఇలా కించపరిచే కుట్ర నెలల తరబడి జరిగిపోతోంది! ఫలితంగా భారతదేశంలో సర్వమత సమభావ-సెక్యులర్-రాజ్యాంగ వ్యవస్థకు భంగం కలిగిపోతోందని విదేశాలలోని మాధ్యమాలలో విపరీత ప్రచారం జరిగిపోతోంది! గోరక్షణ ఉద్యమం రాజ్యాంగంలోని నలబయి ఎనిమిదవ అధికరణానికి అనుగుణమైనది. కానీ ఆవులను హత్య చేయరాదని కోరడం అసహనానికి ప్రతీకగా ప్రచారమైంది! వివిధ రకాల పురస్కారాలను తిప్పి పంపించే లాంఛనానికి ఒడిగట్టిన వారు అసహిష్ణుతను ప్రచారం చేశారు! ఈ కుట్రను తిప్పి కొట్టవలసిన కేంద్ర ప్రభుత్వం వారు నంగినంగిగా వివరణలను స్పష్టీకరణలను ఇవ్వడం మరో జాతీయ వైపరీత్యం! ఇలాంటి వివరణలు ప్రధాని నరేంద్ర మోదీ కూడ బ్రిటన్‌లోను ఇతర దేశాలలోను ఇవ్వవలసి రావడం, దేశాన్ని అప్రతిష్ఠపాలు చేయదలచిన వారి వ్యూహానికి విజయం! గోరక్షణ ప్రాధాన్యాన్ని తగ్గించడం, ఈ వౌలికమైన అంశాన్ని అటకెక్కించడం అసహిష్ణుతను ప్రచారం చేసిన వారి అసలు లక్ష్యం! అసహిష్ణుత ప్రచారం మొదలైన తరువాత గోరక్షణకు సమగ్రమైన చట్టం చేయాలన్న జాతీయ ఆకాంక్షలకు ప్రాధాన్యం తగ్గిపోవడం ప్రస్ఫుటించిన విపరిణామం!
అసహిష్ణుత ప్రచార ఉద్ధృతి ప్రస్తుతం తగ్గింది! లేని అసహిష్ణుత ఉన్నట్టుగా జరిగిన అసత్య ప్రచారం ఎంతకాలం సాగుతుంది? అందువల్ల ప్రచార కర్తలు ఇప్పుడు అమీర్‌ఖాన్‌ను అకస్మాత్తుగా ప్రవేశం చేయించారు! అమీర్‌ఖాన్ చెబుతున్న ప్రాణభయం నిజమైతే ఏర్పడిన వెంటనే ఆయన ఎందుకని ఈ సంగతిని బయటపెట్టలేదు? కనీసం అసహిష్ణుత దుష్ప్రచారోద్యమం మొదలైన వెంటనే ఆయన తన భయాన్ని ఎందుకని బయటపెట్టలేదు? తాము ఉంటున్న దేశంలో తమకు ప్రాణభద్రత లేదని నిజంగా భయపడుతున్నవారు, నిజంగానే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిన వారు ప్రకటనలను జారీ చేసి ప్రచారం పొందడానికి ప్రయత్నించరు. గుట్టు చప్పుడు కాకుండా ఇతర దేశాలకు వెళ్లిపోతారు, పారిపోతారు. స్వదేశంలో తమకు ప్రాణభయం ఏర్పడినందువల్లనే పారిపోయి వచ్చామని విదేశాలలో మాత్రమే ప్రకటిస్తారు. బంగ్లాదేశ్ నుండి ప్రాణభయంతో పారిపోయి మన దేశానికి వచ్చేసిన రచయిత్రి తస్లిమా నస్రీన్ ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే! పాకిస్తాన్‌నుంచి మతోన్మాద అసహిష్ణుతను, జిహాదీల క్రౌర్యాన్ని తప్పించుకొనడానికై వేలాది హిందువులు మన దేశానికి పారిపోయి వస్తూనే ఉన్నారు! పాకిస్తాన్‌లో అత్యల్ప సంఖ్యాకులైన హిందువులకు ప్రాణభయం కలిగిస్తున్నది పాకిస్తాన్ ప్రభుత్వం! అదీ అసహిష్ణుత, అదీ ప్రాణభయం. పురస్కారాలను తిరిగి ఇచ్చినవారు-డబ్బు మాత్రం తమ వద్దనే ఉంచుకుని-కాని, అమీర్‌ఖాన్ వంటి అభినయ వేత్తలు కాని పాకిస్తాన్‌నుండి తరిమివేతకు గురి అయి మన దేశంలో తలదాచుకుంటున్న అత్యల్ప సంఖ్యాకులకు మద్దతుగా ఎప్పుడైనా ఒక మాట మాట్లాడారా?
పాకిస్తాన్ విదేశం...దాని సంగతి మీద మనకెందుకు? మనదేశంలో మాత్రం సర్వమత సమభావ వ్యవస్థ ఉండాలి...అన్న విచిత్ర వాదాన్ని కూడ అసహిష్ణుత ప్రచారవేత్తలు వినిపించారు! అయితే మన దేశంలోని కశ్మీర్ లోయ ప్రాంతంలో 1947 నాటి అల్పసంఖ్యాకులుగా మారిన హిందువుల మాటేమిటి? 1990 వరకు జిహాదీలు కశ్మీర్ లోయలోని వేలాది హిందువులను చంపేశారు, లక్షలాదిమందిని తరిమేశారు. కశ్మీర్ లోయలో 1991 నాటికి హిందువులు మిగలలేదు! ఇదీ అసహిష్ణుత, ప్రాణభయం పారిపోయిన హిందువులది! అమీర్‌ఖాన్ వంటి ఘరానాలకు ప్రాణభయం లేదు. వారికున్నది దేశాన్ని, మాతృదేశాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న వికృత వాంఛ మాత్రమే!