Others

రిజర్వేషన్ల రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒబి.సి. రిజర్వేషన్ల కోసం జాట్ వర్గం ప్రారంభంచిన ఉద్యమం మూలంగా హర్యానా రణ రంగంగా మారింది. పోలీసుకాల్పుల్లో పది మంది వరకు మరణించటంతో సైన్యాన్ని దించి ఫ్లాగ్ మార్చ్ చేయిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో బి.సి. రిజర్వేషన్ల కోసం కాపు వర్గం చేసిన గొడవ గురించి అందరికి తెలిసిందే. గుజరాత్‌లో హర్దిక్ పటేల్ పటేల్ తమ వర్గాన్ని బి.సి జాబితలో చేర్చాలంటూ ఉద్యమం జరిపి ప్రస్తుతం దేశ విద్రోహ నేరం కింద జైల్లో ఉన్నాడు. రాజస్తాన్‌లో మీనాలు, జాట్‌లు బి.సి రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాపిత ఉద్యమం చేశారు. బి.సి రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఈ ఉద్యమాలు నిజంగానే ఆయా కులాల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఉద్యమాలు కానేకాదు. కొందరు నాయకుల పదవీ రాజకీయం కోసం జరుగుతున్న ఉద్యమాలు మాత్రమే. సామాజికంగా, ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న వర్గాలు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తే అర్థం చేసుకోచ్చు కానీ బాగా అభివృద్ధి చెందిన కులాలు కాపులు, జాట్‌లు, పటేల్ వర్గాలు బి.సి రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్నాయి.
కులాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం, రాజ్యాధికారం కోసం ఒక ఆయుధంగా ఉపయోగించుకునేందుకే ఈ ఉద్యమాలు తలెత్తుతున్నాయి. హర్యానాలో జాట్‌లను బి.సిల్లో చేర్చాలంటూ జరుగుతున్న ఉద్యమం వెనక కాంగ్రెస్ హస్తం ఉన్నదనే ఆరోపణ వినిపిస్తోంది. రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరగని జాట్ ఉద్యమం ఇప్పుడు బి.జె.పి అధికారంలోకి రాగానే ఎందు కు ప్రారంభమైంది? హర్యానాలో జాట్‌లది అత్యంత బలమైన సామాజిక వర్గం. జాట్‌లు మెజారిటీలో ఉన్న ఈ రాష్టంలో ఈ వర్గానికి చెందిన వారే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయినా జాట్‌లు వెనుకబడిన కులాల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేయటం ఏమిటి? అనే ప్రశ్న ఉదయించక మానదు.
ముఖ్యమంత్రులు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తే రిజర్వేషన్ రాజకీయాలకు తావే ఉండదు. అధికారంలో ఉన్న వారు తమ వర్గం, ప్రాంతం అభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికారం కోల్పోయిన తరువాత వీరే రిజర్వేషన్ల పేరుతో ఉద్యమాలకు ఆజ్యం పోస్తున్నారని చెప్పకతప్పదు. హర్యానాలో ఇటీవలి కాలం వరకు భుపెందర్ సింగ్‌హుడా ముఖ్యమంత్రి అనేది అందరికి తెలిసిందే. జాట్ వర్గానికి చెందిన హుడా రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సాధించారని అప్పట్లో బాకా ఊదుకున్నారు. హుడా హయాంలో అభివృద్ధి జరిగితే ఇప్పుడు జాట్‌లు బి.సి రిజర్వేషన్ల కోసం ఎందుకు ఉద్యమిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో కాపులు ఆర్థికంగా, సామాజికంగా ఎంతగా అభివృద్ధి చెందారనేది విడిగా చెప్పవలసిన అవసరం లేదు. పెద్ద సంఖ్యలో శాసన సభ్యులు, ఎం.పిలు, ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులతో పాటు పలు ముఖ్యమైన పదవులు నిర్వహిస్తున్న కాపు వర్గం వారు ఎంతో అభివృద్దిర చెందారు. అయినా వారు తమను బి.సి వర్గంలో చేర్చాలంటూ ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమాల వెనక రాజకీయల కారణాలున్నాయనేది జగమెరిగిన సత్యం. రాజకీయ అధికారం కోసం కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నారనేది పచ్చి నిజం.
కాపులు తమను బి.సిలో చేర్చాలని డిమాండ్ చేస్తే సామాజికంగా, ఆర్థికంగా, ఇతరత్రా ఎంతో వెనుకబడి ఉన్న బి.సి కులాల వారు తమను ఎస్.సి, ఎస్.టి వర్గాల్లో చేర్చాలని డిమాండ్ చేయవలసి వస్తుంది. జాట్‌లు, కాపు లు, పటేల్ వర్గం వారి వాదన ప్రకారం వ్యవహరిస్తే బి.సి లను ఎస్.సి వర్గంలో చేర్చ వలసి వస్తుంది. కొందరు బి.సిలను ఎస్.టి వర్గంలో చేర్చవలసి వస్తుంది. అలాంటప్పుడు సమాజంలో అట్టడుగున ఉంటూ దేనికీ నోచుకోని ఎస్.సి, ఎస్.టిలను ఏ వర్గంలో చేర్చాలి? ప్రతి కులం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెంది పైకి వెళ్లాలని ఆలోచించాలి తప్ప ఇలా కింది స్థాయిలో చేరిపోవాలని ఆలోచించటం ఏమిటి? నిజంగానే వెనుకబడి ఉన్న కులాలు, వర్గాలు ఎన్నో ఉన్నాయి. వీరితో పోలిస్తే కాపులు, జాట్‌లు, పటేల్‌లు ఎంతో అభివృద్ది చెందారు. అభివృద్ధి చెందిన వారు ఇలా బి.సి రిజర్వేషన్లు కోరటం సమర్థనీయం కాదు. గుజరాత్‌లో పటేల్ వర్గం అర్థికంగా, సామాజికంగా ఎంతో అభివృద్ది చెందిందనేది అందరికి తెలిసిందే. పటేల్ వర్గం వారు అత్యంత ధనికులు. వీరు కూడా బి.సి రిజర్వేషన్ల కోసం ఉద్యమించటం ఏ విధంగా సమర్థనీయం.
రాజకీయ పార్టీలు కుల రాజకీయం, మత రాజకీయం మాననంత వరకు ఇలాంటి ఉద్యమాలు తలెత్తుతూనే ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీ కుల రాజకీయం చేస్తోంది కాబట్టే సామాజికంగా, ఆర్థికంగా బాగా ఉన్నత స్థితిలోకి వచ్చిన ఇతర కులాల వారు రిజర్వేషన్ల పేరుతో కుల రాజకీయం చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఏదో ఒక కులానికి ప్రాధాన్యత ఇవ్వకుండా సమాజంలోని అన్ని కులాలు, వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తే ఇలా జరిగి ఉండేది కాదు. రిజర్వేషన్ల పేరుతో జరుగుతున్న కుల రాజకీయం అసలు లక్ష్యం రాజ్యాధికారమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కుల,మత రిజర్వేషన్ల రాజకీయాలకు తెర దించాలి. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అమలులో ఉన్న వివిధ కుల రిజర్వేషన్ల వలన ఎవరికి ఎంత ప్రయోజనం కలిగిందనేది సర్వే చేయించాలి. అప్రకటిత రిజర్వేషన్ల రాజకీయానికి కూడా చరమగీతం పాడాలి. కొన్ని కులాల వారు మాత్రమే రాజ్యమేలేందుకు అర్హులు, మిగతా కులాలకు రాజ్యాధికారం అవసరం లేదు, వారు పాలితలుగానే ఉండాలనే కాలం చెల్లిన ఆలోచనా విధానానికి స్వస్తి పలకవలసిన సమయం ఆసన్నమైంది.