సంపాదకీయం

‘విద్రోహం’ ముందు మోకరిల్లి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరుముతున్న పోలీసులు తడబడితే ఏమవుతుంది? దేశద్రోహులు తప్పించుకొని పోతారన్నది అందరికీ అర్థమయ్యే మామూలు వ్యవహారం. దేశద్రోహులు అంతర్గత విచ్ఛిన్నకారులు కావచ్చు, బాహ్య శత్రువులు కావచ్చు. ఆయుధాలతో అమాయకులపై, నిరాయుధులపై దాడి చేసి హత్యలు చేసే భౌతిక బీభత్సకారులు కావచ్చు. చాపకింది విషయం వలె విస్తరించిపోయి ఈ దేశపు అస్తిత్వ మూలాలను వికృత భావాలతో తెగనరుకుతున్న బౌద్ధిక బీభత్సకారులు కావచ్చు. కానీ నేరం చేసి పారిపోతున్న వారిని వెన్నంటి తరిమి పట్టుకోవడం పోలీసులు కర్తవ్యం. నక్కి ఉన్నవారిని పొంచి ఉన్నవారిని పట్టి బంధించడం పోలీసుల ధర్మం. పారిపోతున్న టెర్రరిస్టులు ఒక విశ్వవిదాయలయం ప్రాంగణంలోకి చొరబడిపోయారనుకోండి- భద్రతా దళాలు కూడ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి చొచ్చుకొని పోయి గాలింపు జరపాలా? లేక విశ్వవిద్యాలయ ప్రాంగణం ద్వారాల వద్ద కూలబడిపోవాలా? ఇలా పోలీసులు కూలబడిపోయి ఉన్న దృశ్యం దేశ రాజధానిలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రవేశ ద్వారాల వద్ద ఇప్పుడు ఆవిష్కృతమవుతోంది. దేశద్రోహం చేసిన అభియోగానికి గురి అవుతున్న ఐదుమంది ఇప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం-జెఎన్‌యు-లో నక్కి ఉన్నారు. వారు బయటికి వస్తే అరెస్టు చేస్తామన్నది పోలీసులు చెబుతున్న మాట. ‘‘ఎందుకయ్యా మీరు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనికి చొచ్చుకొనిపోయి అభియోగ గ్రస్తులను అరెస్టు చేయవచ్చు కదా...గేట్ల వద్ద కూలబడి ఉండటం ఎందుకు?’’ అన్న ప్రశ్నలకు పోలీసులు చెబుతున్న సమాధానం ‘‘విశ్వవిద్యాలయం ఉపకులపతి అనుమతిస్తేకాని లోపలికి మేము వెళ్లడానికి వీల్లేదు..’’ అని అన్నది. విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి పోలీసులు వైస్‌ఛాన్స్‌లర్ అనుమతితో ప్రవేశించాలన్నది సాధారణ నిబంధన కావచ్చు. సాధారణ పరిస్థితులలో పోలీసులు ఉపకులపతి అనుమతి లేకుండా విశ్వవిద్యాలయ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు. కానీ దేశద్రోహం నేరం చేసినవారు, పది రోజులుపాటు పారిపోయిన వారు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే ఉన్నట్టు స్పష్టమైన తరువాత, వారిని పోలీసులు పట్టుకొనడానికి వైస్‌ఛాన్స్‌లర్ అనుమతి ఏమిటి?? దేశ ద్రోహం విశ్వవిద్యాలయ అంతర్గత వ్యవహారం కాదు, కాలేదు..దేశద్రోహం మొత్తం దేశానికి సంబంధించిన అంతర్గత వైపరీత్యం. నిరోధించడానికి సహజంగా సాగిపోయే వ్యవహారంలో ప్రత్యేకించి ఎవరి అనుమతీ అవసరంలేదు. ఎందుకంటే దేశాన్ని అంతర్గతం గాను, బాహ్య ప్రమాదాల నుంచి కూడ రక్షించే కార్యక్రమానికి సంబంధిత అధికారులు, అధిపతుల అంగీకారం సహజంగా నిహితమైంది.
అందువల్ల దేశద్రోహ అభియోగగ్రస్తులు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్నట్టు వెల్లడైన వెంటనే పోలీసులు వారున్న చోటికి వెళ్లి నిర్బంధించి న్యాయస్థానంలో నిలబెట్టి ఉండాలి. ఈ న్యాయ ప్రక్రియకు వైస్‌ఛాన్స్‌లర్ అనుమతి ఉన్నట్టుగానే భావించడం తార్కికం, సహజం. ఇప్పుడు అభియోగ గ్రస్తులు అక్కడే ఉన్నారు కాబట్టి సరిపోయింది. కానీ పారిపోయిన టెర్రరిస్టులు విద్యార్థుల రూపంలో కాని దేశద్రోహులు ప్రాంగణంలోకి చొరబడితే పోలీసులు మాత్రం గేటు దగ్గరే ఆగిపోవాలా? ఆగిపోయి వైస్‌ఛాన్స్‌లర్‌కు దరఖాస్తు పెట్టుకోవాలా? అనుమతి మంజూరయి వచ్చే వరకు పారిపోతున్న వారు అక్కడ ఎదురుచూస్తూ ఉంటారా? అందువల్ల ఇలాంటి సందర్భాలలో పోలీసుల ప్రవేశానికి ఉపకులపతి అనుమతి శాశ్వత వ్యవస్థలో భాగం. ఒకవేళ ఉపకులపతి అనుమతి మళ్లీ ప్రత్యేకంగా అవసరం అనుకున్నప్పటికీ ఇంత జాప్యం దేనికి? దూరవాణి సంభాషణ ద్వారా రెండు నిముషాలలో పోలీసులు ప్రాంగణ ప్రవేశ అనుమతి లభించి ఉండాలి. లేదా అభియోగ గ్రస్తులు పది రోజులు పరారీలో ఉన్నవారు ప్రాంగణంలోకి మళ్లీ వచ్చినట్టు తెలియగానే ఉపకులపతి స్వయంగా పోలీసులను ఆహ్వానించి ఉండాలి. రెండు రోజుల తర్వాత అనుమతినిచ్చే ప్రక్రియ పూర్తి కాలేదు. చట్టం తన పని తాను చేసుకొనడానికి ఇంత విలంబనం, దీనికి అడ్డుపడుతున్నదెవరు? ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు ఎందుకని సంశయగ్రస్తులై ఉన్నారు?
దేశద్రోహ ఆరోపణ గ్రస్తులైన ఉమర్ ఖలీద్, పంచకం చేస్తున్న ఆర్భాటం అంతా ఇంతా కాదు. ఈ ఆర్భాటానికి మాధ్యమాలలో అనవసర ప్రాధాన్యం ప్రచారం లభించడం మరో ఘోరమైన వైపరీత్యం. టెర్రరిస్టులకు, దేశద్రోహులకు మతం, భాష లేవన్నది ప్రచారం...ఏ మతం వాడైనా ఏ భాష మాట్లాడినా, దేశద్రోహులను ఆయా మతాలతో భాషలతో ముడిపెట్టరాదు. అలాగే వృత్తిలో కూడ వారిని ముడిపెట్టరాదనడం తార్కికం. ఉమర్ ఖలీద్, అమిర్ బన్ భట్టాచార్య, అనంత ప్రకాశ్, రామనాగా, అశుతోష్ కుమార్ అన్న ఈ ఐదుగురు అఫ్జల్ గురుకు అనుకూలంగాను, దేశానికి వ్యతిరేకంగాను నినాదాలు చేయడం ప్రధాన అభియోగం. అందువల్ల అభియోగ గ్రస్తులైన ఈ నిందితులకు, పోలీసులకు మధ్య ఘర్షణ కొనసాగుతోంది. కానీ పోలీసులకు విద్యార్థులకు మధ్య ఘర్షణ కొనసాగుతోందన్న ప్రచారం జరగడం దౌర్భాగ్యం. ‘‘మేము పోలీసులకు లొంగం..కావాలంటే వారే వచ్చి మమ్మల్ని అరెస్టు చేసుకోవచ్చు..’’ అని అశుతోశ్ అనే నిందితుడు సవాలు చేశాడట. మరో వైపు ఖలీద్ అనేవాడు తనకు పోలీసుల రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం న్యాయ ప్రక్రియ దురుపయోగం... ఈ ఖలీద్ కాని మిగిలిన నిందితులు కాని పోలీసులకు దొరకకుండా కోర్టుకు వెళ్లి లొంగిపోవచ్చు. అలా లొంగిపోయేలోగా పోలీసుల కంటపడితే పోలీసులు నిందితులను అరెస్టు చేయాలి, కోర్టుకు తీసుకెళ్లాలి. అలాంటప్పుడు నిర్బంధించవలసిన పోలీసులు ఈ నిందితులకు కాపలా ఉండి వారు యదేచ్ఛగా కోర్టునకు వెళ్లడానికి సహకరించాలా?? అరెస్టు చేసిన పోలీసులు నిందితులకు ఎలాగూ రక్షణ కల్పిస్తారు. కానీ మొత్తం ప్రక్రియను తల్లక్రిందులు చేయడానికి వీలుగా ఖలీద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దేశద్రోహ నేరంపై అరెస్టయిన మరో నిందితుడు కన్హయ్య కుమార్ ప్రత్యేక న్యాయస్థానాన్ని, హైకోర్టును లెక్కచేయకుండా సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. ఇలాంటి చర్యల ద్వారా ప్రచారం పొందడానికి యత్నిస్తున్న నిందితుల పిటిషన్‌లను ఉన్నత సర్వోన్నత న్యాయస్థానాలు విచారణకు స్వీకరించకుండానే తోసిపుచ్చడం న్యాయానికి అనుగుణం కాగలదు. కన్హయ్య పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఆ తరువాత తోసిపుచ్చింది.
విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ పోలీసులను ప్రాంగణంలోకి అనుమతించాలా? వద్దా? అన్న విషయమై అధ్యాపకులతో చర్చలు జరుపుతున్నాడట. పోలీసులకు అనుమతి ఇవ్వరాదని అధికాధిక అధ్యాపకులు కోరారట. ఇదేం వైపరీత్యం? దేశద్రోహ నిందితులను న్యాయస్థానంలో నిలబెట్టవద్దా??