మెయన్ ఫీచర్

హింస వద్దు, ఎంతైనా చర్చించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెఎన్‌యు ఘటనలపై ఈనెల 24వ తేదీన లోక్‌సభలో చర్చ జరిగినప్పుడు తథాగత శతపథి అనే బిజూ జనతాదళ్ సభ్యుడు మరెవరూ అనని విషయం ఒకటి చెప్పారు. యూనివర్సిటీలో ఆ వివాదాస్పద నినాదాల వార్తలు వచ్చినప్పుడు పటియాలా హౌజ్ కోర్టు దృశ్యాలను గమనించిన మీదట ఆ వైఖరి మారిందన్నారాయన. వైఖరి మారడమంటే మొదట ఆ నినాదాలను వ్యతిరేకించినవారు ఇప్పుడు సమర్థిస్తున్నారని కాదు. కాని తటస్థస్థితికి వచ్చారని, ఇరుపక్షాల్లో ఎవరు మెరుగో అర్థం కాని స్థితికి లోనవుతున్నారని అర్థం. ఆమాట ఆయనే సూటిగా చె ప్పారు కూడా. తన వేలిని అధికారపక్షం వై పు, ప్రతిపక్షాలు వైపు కూడా చూపుతూ, మీ ఇద్దరిలో ఎవరిని సమర్థించాలో ప్రజలకు అర్థం కావడం లేదని అన్నారు. దీని నుంచి అర్థం చేసుకోవలసింది చాలా ఉంది.
శతపథి ఈ మాటలు స్వత రాజకీయ కారణాల వల్ల అన్నట్లు భావించలేం. ఒకప్పటి సుప్రసిద్ధ నాయకురాలైన నందినీ శతపథి కుమారుడైన ఆయన చాలాకాలం పాటు అదే పార్టీలో ఉండి తర్వాత బిజూ జనతాదళ్‌లో చేరారు. విస్తృతంగా చదివి ప్రపంచమంతా చూసిన మేధావి. బిజూ జనతాదళ్ మొదట బిజెపితో, ప్రతిపక్షాల కూటమిలో కొంతకాలం పాటు ఉండిన తర్వాత పలు సంవత్సరాలుగా స్వతంత్ర రాజకీయాలు చేస్తున్నారు. అయితే అందుకుగాని, లేదా వ్యక్తిగతమైన ధోరణుల వల్లగాని ఆ సభ్యుడు ఆవిధమైన మాటలు అ న్నారనేందుకు ఆస్కారం లేదు. ఎందుకం టే, నినాదాల వార్తల దశలో మద్దతు ప్రభుత్వానికి, అధికారపక్షమైన భాజపాకు అనుకూలంగా వ్యక్తమైందని స్పష్టంగా చెప్పారాయన. అదేవిధంగా, పటియాలా కోర్టులో జరిగిన దాని తర్వాత పరిస్థితి పూర్తిగా తిరగబడిందని కూడా అనలేదు. తటస్థమైందన్నారు. కనుక మొత్తం అన్ని పరిణామాల ను నిష్పాక్షిక దృష్టితో చూసేందుకు ప్రయత్నించినట్లు భావించాలి. కనుకనే ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. జెఎన్‌యు నినాదాలు దేశద్రోహకరమైనవనే భావన బలంగా ఉంది. దేశద్రోహమన్నది పై వర్గాలలోనే కాక సాధారణ ప్రజల దృష్టిలో కూడా చాలా తీవ్రమైనది. దానితో పోల్చినప్పుడు పటియాలా కోర్టు ఘటనలు అవాంఛనీయమే అయినా ఆ నినాదాలంత తీవ్ర స్వ భావం కలవి కావు. ఈ ఘటనల కారణంగా నినాదాల తీవ్రత తటస్థంగా మారనక్కరలేదు. అటువంటప్పుడు, అట్లా జరిగిందని శతపథి పేర్కొనడం హేతుబద్ధమవుతుం దా? యథాతథంగా ఇది తార్కికమైన ప్రశే్న. కాని ఇక్కడ గమనించవలసిన విషయాలు రెండు ఉన్నాయి. పోలిక కేవలం నినాదాలు, పాటియాలా కోర్టు ఘటనల మధ్య అయి తే త్రాసు నిస్సందేహంగా నినాదాలకు వ్యతిరేకంగా మొగ్గుతుంది. కాని శతపథి ప్రస్తావించిన ప్రజలు కాని, స్వయంగా ఆ యన గాని కేవలం ఆవిధమైన పోలికకు పరిమితం కావడం లేదన్నమాట. కోర్టు ఘటనలతో ముడిపడి ఉన్నట్లు తాము భావించే ఇతర అంశాలను కూడా ఆ పోలిక పరిథిలోకి తెస్తున్నారు. తెచ్చి, వాటిని, ఆ ఘటనలను కలిపి నినాదాల ఉదంతంతో పోలుస్తున్నారు.
ఆ ఇతర అంశాలేమిటి? కోర్టు వద్ద లాయర్లు కొందరు దాడులు జరపడం సరేసరి. కాని వారిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించకపోవడం అన్నది మొదటి అంశం. దానిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినా రెండవ రోజు కూడా పోలీసుల తీరు మారకపోవమే కాక ఢిల్లీ పోలీస్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలు వారు ఉద్దేశ పూర్వకంగానే అట్లా వ్యవహరిస్తున్నారనే భావనను కలిగించాయి. విమర్శలనుండి బయలుదేరిన అనుమానాలు ప్రభు త్వం వైపు, అధికార పక్షంవైపు వేలెత్తి చూపేటట్లు చేశాయి. నినాదాలను, ఆ వీడియోలను ప్రజలు ఛానళ్లలో చూసి అవాక్కయ్యా రు. ఆగ్రహించారు. అయితే కోర్టు వద్ద దృశ్యాలను వరుసగా రెండు రోజులు అవే ఛానళ్లలో గమనించి అంతే అవాక్కయ్యారు. పోలీసు కమిషనర్ వ్యాఖ్యలు సరేసరి. అటువంటి స్థితిలో, ఆ దాడులను ప్రభుత్వం, అధికారపక్షం స్వయంగా పూనుకొని జరిపించకపోయినా వాటి పట్ల నిష్క్రియాపరంగా ఉండిపోయిందనే అభిప్రాయం విస్తృతంగా ఏర్పడిపోయింది. అది 48 నుంచి 72 గంటల పరిధిలో జరగడంతో శతపథి అన్న మార్పులు చోటు చేసుకున్నాయి. పటియాలా ఘటనల వెనుక రాజకీయం ఉందనే అభిప్రాయం వచ్చింది. ఒకసారి అది వచ్చిందంటే కేసు తీవ్రత పలచబడుతుంది. ఇది ఈ విషయంలో అనే కాదు, విషయాలను రాజకీయం చేయడం జరుగుతున్నదని ప్రజలు అనుమానిస్తే ఏదైనా పలచబడుతుంది. ఎందుకంటే ఈ రోజున జనసామాన్యానికి అసలు ఏ రాజకీయాల పట్ల కూడా గౌరవ విశ్వాసాలు లేకుండా పోయాయి. చులకన భావన ఏర్పడిపోయింది.
ఇటువంటి నేపథ్యం కారణంగానే పటియాలా కోర్టు దాడులు జెఎన్‌యు నినాదాల తీవ్రతను తగ్గించాయి తప్ప, యథాతథంగా ప్రజలు నినాదాల తీవ్రత, దాడులు ఒకే గాటన కట్టదగ్గవని భావించడం వల్ల కాదు. అదే సమయంలో ఒకటి గుర్తించాలి. వౌలిక పరిస్థితి ఇదైనప్పటి, ఒకసారి రెండింటికి మధ్య వ్యత్యాస తీవ్రత తగ్గడమంటూ మొదలైతే ఇక అది ఎటు పోయేదీ తదనంతర అనేకానేక పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. జెఎన్‌యు కేసు ఆరోపణలను పోలీసులు కోర్టులో నిరూపించి నిందితులకు శిక్షలు పడడం, అదికూడా ఇతర ఆరోపణలు గాక దేశద్రోహం అనే అత్యంత తీవ్రమైన నేరం ప్రకారం జరిగినట్లయితే ప్రజల దృష్టి కోర్టు దాడులనుంచి క్రమంగా మారుతుంది. అది కాకపోతే మాత్రం నినాదాల పట్ల గల ఆగ్రహం తగ్గుతుంది. ఇప్పుడు అంతా దేశద్రోహం ఆరోపణలు రుజువు కావడంపై ఆధారపడి ఉం టుంది.
ఇటువంటి కేసులు వాటికి అవిగా, ఎటువంటి జోక్యం లేకుండా నడిచి రుజువైతే, అప్పుడు నిందితులకు ఎంతటి శిక్షలు పడినా ప్రజాభిప్రాయం దానిని ఆమోదిస్తుంది. కాని మధ్యలో ఇందరి జోక్యాలు గురించిన సందేహాలు కలిగించే దృష్టి సహజంగానే మారుతుంది. తథాగత శతపథి చెప్పిన మాటలలో ఇమిడి ఉన్న సారాంశం ఇదంతా.
విషయాల గురించి చర్చించడం, వాటిని పురస్కరించుకొని, హింసకు పాల్పడటం అనే విస్తృతమైన ప్రశ్న కూడా ఈ సందర్భంలో ప్రస్తావనకు వస్తుంది. నిజానికి కోర్టు కేసులన్నవి కూడా ఆయా ఘటనలపై హింసకు తావులేని చర్చలే. ఒక ఘటనలోని వాస్తవాలు-అవాస్తవాలు, సామంజస్యాలు-అసామంజస్యాలు, అందుకు దారితీసిన పరిస్థితులు, నేర తీవ్రతలు-వాటి స్థాయి, ఋజువు కాకపోవడం-కావడం, శిక్షిందగిన స్థాయి అనేవి అన్నీ కూడా చర్చలే. రెండు వైపులావాదనలు వినిపించే లాయర్ల సామర్థ్యాన్ని బట్టి, చివరన తీర్పు చెప్పే న్యాయమూర్తి వివేచనాశక్తిని బట్టి ప్రతి ఒక్కటీ, గొప్ప చర్చ అవుతుంది. అందుకే వేల సంవత్సరాల మానవజాతి వికాసంలో, ప్రజాస్వామిక వ్యవస్థలలోను, న్యాయ శాస్త్రానికి అంతటి విశిష్ఠస్థానమున్నది.
మనిషి తనంతట తాను రూపొందించుకొని వ్యవస్థీకరించిన ఈ విలువలకు విరుద్ధంగా, భిన్నాభిప్రాయాలపై చర్చలకు బదులు హింసకు తలపడటమన్నది ఒక్కోసారి తాత్కాలిక ఫలితాలనిస్తే ఇవ్వవచ్చుగాని దీర్ఘకాలిక మార్పులను తేలేదు. అది ప్రజాస్వామిక వ్యవస్థలో అసలు జరగవలసింది కాదు. తాత్కాలిక ఫలితం కోసం చేయవలసింది కూడా కాదు. భారత ప్రజాస్వామ్యానికి ఈ పాఠాలు స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ నుండి వచ్చినవే. ఆయన తన దక్షిణాఫ్రికా ఉద్యమాల కాలం నుంచి ఆరంభించి, 1915లో స్వదేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి మొదలుకొని స్వాతంత్య్రం వరకు దానిని కొనసాగించారు. అటువంటి విధానం వల్ల మధ్యలో ఉద్యమానికి నష్టాలు కలిగి తన సన్నిహిత సహచరులతో సహా అనేకులు విమర్శించినా ఆ మార్గాన్ని వదలలేదు. చివరకు 1947 ఆగస్టు 15న ఢిల్లీలో త్రివర్ణ పతాకారోహణ జరుగుతున్న సమయంలోనూ ఆయన రాజధానిలో గాక, హింస చెలరేగుతుండిన బెంగాల్‌లో ఇరువర్గాల మధ్య చర్చలకోసం ప్రయత్నిస్తూ ఉం డిపోవడం ఒక అరుదైన ఘట్టం. దానితో పోల్చదగ్గ విలువ బహుశా మొత్తం ప్రపంచపు ఆధునిక చరిత్రలో మరెక్కడా లేదేమో!
హింసకు బదులు నిరంతర చర్చలలోను గాంధీజీతో పోల్చదగ్గవారు లేరు. వలస పాలకులతో, ఇతర అంతర్జాతీయ నేతలతో, మేధావులతో, పార్టీ సహచరులతో, నిర్మాణ కార్యకర్తలతో, సాధారణ ప్రజలతో తన చర్చలు ఒక సమాంతర ఉద్యమం వలె సాగాయి. ముఖాముఖి మాటలు, ప్రసంగాలు, రచనలు, అసంఖ్యామైన లేఖల రూపంలో ఎదుటివారితో ఆలోచనలు పంచుకొనే బహుముఖమైన ప్రజాస్వామిక కృషిని ఆయన దశాబ్దాల తరబడి తన జీవితాంతం సాగిస్తూనే పోయారు. ప్రజాస్వామ్యంలో హింసకు బదులు చర్చ అన్నది మొదటి నుంచి గల విలువ కాగా, దానిని అత్యున్నత స్థాయికి తీసుకుపోయి దేశానికి తన వారసత్వాలలో ఒకటిగా మిగిల్చిపోయినవాడాయన. తనతో ఇతరత్రా అనేక విషయాలలో విభేదించే ప్రజాస్వామిక వాదులు కూడా కాదనలేని విలువ అది.
గమనించదగిన ఒక ఆసక్తికరమైన విశేషం ఉంది. చివరకు దేశద్రోహ ఆరోపణలతో సహా మన చట్టాలు కూడా ఒక తేడాను చూస్తున్నాయి. జెఎన్‌యు కేసునే చూస్తే, ఆ తరహా తీవ్ర అభ్యంతరకరమైన నినాదాలు సైతం దేశద్రోహం కిందికి రావని, నినాదాలు హింసకు కాని, అటువంటి చర్యలకు గాని పురికొల్పితే మాత్రమే ఆ నిబంధనలు వర్తిస్తాయని చట్టంలో ఉంది. గతంలో ఆమేరకు తీర్పులు కూడా వెలువడ్డాయి. న్యాయశాస్త్రం ఈవిధంగా చెప్పడం సరైనదా కాదా అనే ప్రశ్నపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. కానీ మనం స్వీకరించిన పాశ్చాత్య న్యాయ నిబంధనలు, స్వయంగా మన నిబంధనలు, ఏడు దశాబ్దాలుగా న్యాయస్థానాలు ఆమోదించి నిర్వచించినవి ఆ విధంగా ఉన్నాయన్నది మాత్రం వాస్తవం. ఐతే ఆసక్తికరమైనదేమంటే, ఈ నిబంధనలను సవరించాలన్న ప్రతిపాదనలు కూడా ఇనే్నళ్లలో ఏ పార్టీ నుంచి, సభ్యుని నుంచి, లా కమిషన్ వంటి వ్యవస్థల నుంచి రాలేదు.
ఇటువంటి అనేకానేక విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు, భిన్నాభిప్రాయాలు గలవారి మధ్య, అదెంత తీవ్రమైన భిన్నత్వం అయినప్పటికీ, వాంఛనీయమైనది చర్చే కాని, హింసకాదన్న అభిప్రాయం బలపడుతున్నది. పటియాలా కోర్టు వద్ద కొందరు లాయర్లు ఒకవేళ ఆవేశం పట్టలేక నినాదాలు చేసి ఉన్నా, అంతకన్నా ముందుకు వెళ్ళి భౌతికంగా దాడులు చేయడంతో పరిస్థితి మారిందన్నది నిజం. జర్నలిస్టులు, విద్యార్థులపైనే కాదు, నిందితులపై కూడా చేయరాని పని అది. ఇంకా చెప్పాలంటే కోర్టు ముందు దోషాదోష నిర్ధారణకు నిలబడిన నిందితులపై అసలు జరగకూడదు. స్వయంగా న్యాయశాస్త్రాన్ని అభ్యసించినవారు ఆ విలువలను ఉల్లంఘించడం తమకు, తాము బలపరుస్తున్నామనుకునే వాదనకు కూడా హాని చేసింది. భవిష్యత్తులో ఎప్పుడూ, ఎవ్వరూ ఈ పని చేయబోరని ఆశించాలి..

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)