మెయన్ ఫీచర్

వ్యవసాయానికీ పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన మూడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన కొనసాగిస్తున్నప్పుడు...తాము అనుకున్న విధంగానే బడ్జెట్ ఉన్నదనే సర్వే సర్వత్రా వ్యక్తమైన అభిప్రాయం. ఋతుపవనాలు దాగుడు మూతల పుణ్యమాని రెండు వరుస సీజన్లలో పంటలు దెబ్బతిని నానా ఇబ్బందులకు గురవుతున్న రైతుల పట్ల ఈసారి కేంద్ర ప్రభుత్వం అపారమైన ప్రేమను కనబరచింది. ముఖ్యంగా రైతులు తమ జీవన భృతిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఈసారి కేంద్ర బడ్జెట్ వారిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం విశేషం. ఇక వంటింటి కార్యకలాపాల్లో తలమునకలుగా ఉండే మహిళలు, పొగ కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిని రకరకాల శ్వాసకోశ వ్యాధులకు గురికావడం కూడా ప్రభుత్వాన్ని కదిలించింది. ‘ప్రమాదకరమైన రోగాల బారిన పడుతున్న’ నిరుపేద కుటుంబాల వారికి బీమా కవరేజీ కల్పించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది.
తన బడ్జెట్ ప్రసంగం కొనసాగే కొద్దీ ముఖ్యంగా చివరి 40 నిముషాల సమయంలో అరుణ్ జైట్లీ భారతీయ సామాజిక రాజకీయవేత్త స్థాయి నుంచి క్రమంగా కార్పొరేట్ లాయర్‌గా, గణాంకవేత్తగా మారిపోయారు. ఆయన తన ప్రసంగంలో విస్తృత ప్రాతిపదికన వివరించిన ప్రతిపాదనలు, గొప్ప ఆర్థిక వేత్తలకు కూడా సామాన్యుడికి అర్థమయ్యే భాషలో వివరించడం సాధ్యంకాదు! విద్య, ఆరోగ్యం, నైపుణ్యం, ఉపాధి కల్పన, వౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ద్రవ్య నియంత్రణ, సుపరిపాలన, వివిధ కార్యకలాపాల నిర్వహణను మరింత సులభతరం చేయడం వంటి అంశాలను చాలా విపులంగా వివరించారు. ఇదే సమయంలో పన్నుల విధానంలో మరింత స్పష్టతను తీసుకొని రావడం ద్వారా, లిటిగేషన్లను తగ్గిస్తామని కూడా స్పష్టం చేశారు.
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆయన మరింత తక్కువ పారదర్శకంగా వ్యవహరించారనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన ప్రకటించిన ‘‘కాంప్లయన్స్ విండో’’ పథకం, మరో ‘పన్ను ఉదారత’ లేదా ‘స్వచ్ఛందంగా ఆదాయాన్ని ప్రకటించే’ ప్రణాళికగా పరిగణించాల్సి ఉంటుందని కొందరు వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఆయన విభేదించడం ఆయనలోని పారదర్శక లేమికి నిదర్శనం. ప్రస్తుతం అరుణ్ జైట్లీ ప్రకటించిన పథకం ప్రకారం, వచ్చే జూన్ నుంచి మరో నాలుగు నెలల కాలంలోపు, ఎవరైనా ఇప్పటివరకు తాము ప్రకటించని ఆదాయం వివరాలు, లేదా ఆస్తుల రూపంలో ఉన్న ఆదాయం వంటివాటిని స్వచ్ఛందంగా ప్రకటిస్తే, అటువంటి ఆదాయంపై 45 శాతం పన్ను చెల్లించి బయటపడవచ్చు.
వెల్లడించని ఆస్తుల తనిఖీ లేదా వాటిపై విచారణ జరపాలన్న నిబంధనలు ఆదాయపు పన్ను చట్టం, సంపద పన్ను చట్టాల్లో ఎక్కడా పేర్కొని లేవు. స్వచ్ఛందంగా ప్రకటించిన వారు ‘బినామీ లావాదేవీల (నిరోధక) చట్టం’ కింద విచారణ నుంచి మినహాయింపు పొందుతారు. అయినప్పటికీ ఇందులో కూడా కొన్ని నిబంధనలు విధించారు. ఇప్పటివరకు వెల్లడించని ఆస్తులపై 7.5 శాతం సర్‌చార్జ్‌ని వసూలు చేయాలన్నదే ఆ నిబంధన. ఈ సర్‌చార్జ్‌నే ‘కృషి కళ్యాణ్’ సర్‌చార్జ్ అని ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎందుకంటే ఈవిధంగా సమకూరిన మొత్తాన్ని రైతులు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికోసం ఖర్చు చేస్తారు. వినడానికి బాగానే ఉన్నా, అమలుకు వచ్చేసరికి పరిస్థితి ఎట్లా ఉంటుందనేదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇప్పుడే సమాధానం లభించదు. నిజం చెప్పాలంటే ఈ పథకం, నిజాయితీయిగా పన్నులు చెల్లించే బాధ్యతాయుత పౌరులను ఈ పథకం నైతికంగా నిరుత్సాహపరుస్తుందనడంలో ఏవిధమైన సందే హం లేదు. ఎందుకంటే ఈ పథకం ఉద్దేశపూర్వకంగా పన్నులు ఎగవేసేవారిని ప్రోత్సహించే అవకాశాలే ఎక్కువ. ఇందులోని లొసుగుల ఆధారంగా, భవిష్యత్తులో మరిన్ని రాయితీలు లభించవచ్చునన్న అభిప్రాయం, తెలివిగా పన్ను ఎగ్గొట్టేవారిలో కలుగవచ్చు. అందువల్ల యథాప్రకారం తమ అస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించకుండా జాగ్రత్త పడవచ్చు. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా ఒక వాస్తవాన్ని అంగీకరించడం లేదు. నల్లధన ఉత్పత్తిని సమర్ధవంతంగా అరికట్టడంలో ఈ పథకం ప్రభావయుతంగా పనిచేసిందన్న మాట ప్రభుత్వం నుంచి రావడం లేదు. ఎందుకంటే ఈ పథకం వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదన్న సత్యం ప్రభుత్వానికి బాగా తెలుసు. అటువంటప్పుడు ఈ పథకాన్ని కొనసాగించడం ద్వారా ప్రభుత్వం ఎటువంటి ప్రయోజనాన్ని ఆశిస్తోంది?
ఇక మరో విషయానికి వద్దాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ.55,000 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడం ద్వారా తగిన ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ అమ్మకాలు ‘వ్యూహాత్మకంగా’ కొనసాగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా ఇవి ప్రైవేటీకరణను ప్రోత్సహించే దిశగానే కొనసాగుతాయి. నిజానికి ఇది నేటి ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రవేశపెటింది కాదు. యుపిఎ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. ఇది దానికి కొనసాగింపు మాత్రమే. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల వసూళ్ల ద్వారా కేంద్రం రూ.69,500 కోట్ల మేర ఆదాయం పొందాలని భావించింది. కానీ మార్కెట్ పరిస్థితులు బాగాలేకపోవడంతో కేవలం రూ.25,000 కోట్లు మాత్రమే సేకరించగలిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో 2016-17 ఆర్థిక సంవత్సరంలో, ఒక్కసారిగా మార్కెట్ పరిస్థితులు ఊపందుకొని సానుకూల పవనాలు వీస్తాయని భావించడం కూడా అత్యాశే అవుతుంది. అందువల్ల ప్రభుత్వం ఈ దిశగా ఆశించిన లక్ష్యం ఎంతమేర సఫలమవుతుందనేది, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నది నిర్ధారిత సత్యం.
ఇక ఆర్థిక మంత్రి చెప్పిన మరో విషయం.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.38,500 కోట్లు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజిఎన్‌ఆర్‌ఈజీఏ) పథకం కింద ఖర్చు చేస్తామని! నిజంగా ఈ పథకం అమలులో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దారుణంగా విఫలం కావడం వల్ల, ఒక ఉత్సవ విగ్రహంలా మిగిలిన ఈ కార్యక్రమాన్ని మరింత సమర్ధవంతంగా అమలు పరుస్తామని ఎన్‌డిఎ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు ఈ పథకానికి ఎన్నడూ కేటాయించనంతటి మొత్తాన్ని తమ ప్రభుత్వ కేటాయిస్తున్నదంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ప్రభుత్వం ఏవిధంగా చెప్పినా ఎంజిఎన్‌ఆర్‌ఈజీఏకు నిధుల కేటాయింపులో వాస్తవాలు మరోలా ఉన్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద కేటాయించిన నిధుల రూ.34,699 కోట్ల నుంచి 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.38,500 కోట్లకు నిధుల కేటాయింపును పెంచామని ఆర్థిక మంత్రి చెబుతున్నారు. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికోసం ఉన్న డిమాండ్ కంటే నిధుల కేటాయింపు చాలా తక్కువ. అంతేకాదు గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద ఖర్చు ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.41,000 కోట్లు! దీంతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటాయింపు చాలా తక్కువే కదా! ఇదే సమయంలో ఇప్పటి వరకు ఈ పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.6,500 కోట్ల వరకు ఉన్నాయి. మరి నూతన బడ్జెట్‌లో కేటాయించిన మొత్తంలో ఈ బాకీ మొత్తాన్ని తీసివేస్తే ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎ పథకానికి ప్రభుత్వం కేటాయించే అసలు నిధులు రూ.32,000 కోట్లు మాత్ర మే. అంటే ప్రభుత్వం ఈ విషయంలో ఆసలు వాస్తవాన్ని దాచి జిమ్మిక్కులు ప్రదర్శించినట్లే కదా!
ఇక ప్రభుత్వం భౌతికపరమైన వౌలిక సదుపాయాల పట్ల ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు చెబుతోంది. కానీ 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో పోలిస్తే ఖర్చు చేసింది తక్కువే. అయినప్పటికీ 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అంతే మొత్తంలో నిధులను కేటాయించడం విచిత్రం! రసాయన ఎరువులు, ఆహార పదార్థాలపై ఇచ్చే సబ్సిడీల్లో ప్రభుత్వం కోత విధించింది. ఇదే సమయంలో సమీకృత శిశు అభివృద్ధి పథకానికి కేటాయింపులు కూడా కుదించారు. మైనారిటీల సంక్షేమానికి నిధులు కూడా పడిపోయాయి. ఇక ప్రతిపాదిత మొత్తం ప్రణాళికా వ్యయంలోని, ఉప-ప్రణాళిక కింద గిరిజనులు, ఎస్సీలకు కేటాయించిన మొత్తాలు కూడా తక్కువగానే ఉన్నాయి.
ఇక సర్వీస్ ట్యాక్స్ పూర్తి మొత్తంలో వసూళ్లు గతంతో పోలిస్తే పెరగడం కష్టసాధ్యమేనని ఆర్థిక మంత్రి ఎందుకని అంచనా వేస్తున్నారో అర్థం కానిది. ఇక కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయ పన్నుల వసూళ్లు కూడా బడ్జెట్ అంచనాలకంటే చాలా తక్కువగా అంటే దాదాపు రూ.46,000 కోట్ల మేర ఉంటున్నాయి. దీనివల్ల కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గిపోతుంది. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం ద్వారా ద్రవ్యలోటును పూడ్చడానికి కేంద్రం యత్నిస్తోంది. ఈవిధంగా పెంచడం వల్ల ప్రభుత్వానికి రూ.56,000 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. ఇది బడ్జెట్ అంచనాలకంటే ఎక్కువ! బడ్జెట్ విషయంలో అరుణ్ జైట్లీ, తనకు ముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన పళనియప్పన్ చిదంబరాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తున్నారనే అనుకోవాలి. ఎందుకంటే, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తాము అంచనా వేసే ఆశావహ దృశ్యానికి, దేశ ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా రంగులద్దాలనే వీరిద్దరి ప్రయత్నాల్లో ఏమాత్రం తేడా లేదు. కాని వర్తమాన పరిస్థితి మాత్రం వీరి అంచనాకు పూర్తి తల్లక్రిందులుగా ఉండటమే విషాదం. ఇందుకు కారణం ప్రపంచీకరణ. ఈ నేపథ్యంలోనే, బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టే సమయంలోనే జెట్లీ ఒక విషయంపై హెచ్చరించారు. అదే ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది’’. ఇది ఆర్థిక సానుకూలత లేదన్న సంగతిని మనకు స్పష్టం చేయడం లేదా?

- పరంజయ్ గుహ థకుర్తా