మెయన్ ఫీచర్

బడుగుల కో-ఆప్షన్ బహువిధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బడుగువర్గాలను ఇతర వర్గాలవారు కో-ఆప్ట్ చేసుకుంటున్నారని, అందువల్లనే బడుగులు ఒకటి కాలేకపోవటం, జనసంఖ్యలో మెజారిటీ అయి కూడా అధికారాన్ని సాధించలేక పోవటం జరుగుతున్నదని ఒక అభిప్రాయం ఉంది. ఇది కొంతవరకు నిజమే. కాని ఈ కోఆప్షన్ చర్చ పాక్షికంగా జరుగుతున్నది తప్ప సమగ్రంగా కాదు. బిహార్ ఎన్నికల సందర్భంగా ఈ అంశాన్ని మరొకమారు చర్చించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కోఆప్షన్‌కు అనేక రూపాలున్నాయి.
బడుగులను ఇతరులు కోఆప్ట్ చేసుకుంటున్నారనే మాటను సర్వసాధారణంగా ఏ అర్థంలో వాడుతున్నారు? వారిలో కొందరికి రాజకీయంగా పదవులిచ్చి, ఆర్థిక ప్రయోజనాలు ఏవో సమకూర్చి తమవైపు తిప్పుకోవటం అనే అర్థంలో. ఆ పని చేయగలిగితే బడుగువర్గాల ఐక్యత దెబ్బతింటుందని, తమకు వారు పోటీగా నిలిచే అవకాశం ఉందని, వారి ద్వారా తమకు బడుగుల ఓట్లుకూడా రాగలవని అవతలివారి ఆలోచన. ఇది అవతలివారు ఎప్పటినుంచో అనుసరిస్తున్న వ్యూహం. కాని ఈ రాజకీయ, ఆర్థిక కో-ఆప్షన్ గాక మరి రెండువిధాలైన కోఆప్షన్లు కూడా జరుగుతున్నాయి. అవి సైద్ధాంతిక కోఆప్షన్, సాంస్కృతిక కోఆప్షన్. ఈ రెండింటి గురించిన చర్చ జరగటం లేదు. గమనించదగినదేమంటే, రాజకీయంగా కోఆప్ట్ కాకుండా దూరంగా ఉండిపోయి, ఉన్నత వర్గాలతో పోటీపడి అధికారానికి వచ్చినవారు కూడా సైద్ధాంతికంగా, సాంస్కృతికంగా మాత్రం ఉన్నతవర్గాల సిద్ధాంతాలకు, సంస్కృతులకు కోఆప్ట్ అయిపోవచ్చు. అది జరిగితే ఉన్నతవర్గాలకు రాజకీయ అధికారం పోయినప్పటికీ వారి సైద్ధాంతిక వ్యవస్థ, సాంస్కృతిక వ్యవస్థ మాత్రం చెక్కుచెదరకుండా నిలిచే ఉంటాయి. వౌలికంగా వాటిల్లే ముప్పేమీ ఉండదు.
ఇపుడు బిహార్‌ను ఉదాహరణగా తీసుకుని సూటిగా మాట్లాడుకుందాం. లాలూప్రసాద్‌యాదవ్, నితీశ్‌కుమార్ ఈసారి రాజకీయంగా కోఆప్ట్ కాలేదు. లాలూప్రసాద్ గతంలోనూ కాలేదు. నితీష్ గతంలో అయ్యారు. ఈసారి ఇద్దరూ కాకుండా కలిసి నిలిచారు, గెలిచారు. మరి ఇవే పరిణామాలను సైద్ధాంతిక కోఆప్షన్, సాంస్కృతిక కోఆప్షన్ అనే కొలబద్ధలతో అంచనావేస్తే ఏమితేలుతుంది? మొదట సైద్ధాంతికత విషయం చూద్దాం. ఇక్కడ సైద్ధాంతికం అంటున్నది హిందూత్వ సిద్ధాంతం వంటివి కాదు. ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడిదారీ, విదేశీ-స్వదేశీ పెద్ద కంపెనీలు, వ్యాపార సంస్థలు వగైరాల వంటివిగల సైద్ధాంతికత. ఉన్నత వర్గాల పార్టీలు అనబడే వాటివి ఇందుకు అనుకూలమైన సైద్ధాంతికతలు. ఆ పార్టీలు ఏర్పడటానికి, అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించటానికి గల ప్రధాన కారణాలలో ఈ సైద్ధాంతికత ఒకటి. ఇది మొదటినుంచి ఉంది, ఇప్పటికీ ఉంది. తమ సిద్ధాంతమే అది గనుక వారందుకు కట్టుబడటం సహజం.
కాని ఒకవేళ బడుగుల పార్టీలు రాజకీయంగా కోఆప్ట్‌కాకుండా స్వతంత్రంగా నిలిచి, తమ చేతికి అధికారాన్ని తెచ్చుకున్నప్పటికీ, ఆర్థిక రంగంలో సైద్ధాంతికంగా పైన పేర్కొన్నట్లు వ్యవహరించాయనుకుందాం. అపుడు దానిని సైద్ధాంతిక కోఆప్షన్ అనవలసి ఉంటుంది. లాలూప్రసాద్, నితీశ్‌ల విషయం చూస్తే వారు గతంలో ఈ విధంగా కోఆప్ట్ అయినవారే. లాలూప్రసాద్ పార్టీ 15 సంవత్సరాలపాటు పాలించింది. తర్వాత 10 ఏళ్లపాటు నితీశ్‌కుమార్ బిజెపి సహా వేర్వేరు పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ మొత్తం 25 సంవత్సరాల కాలంలో జరిగిందేమిటి? సైద్ధాంతికంగా కోఆప్ట్‌అయిన పాలనే. వీరిరువురు సంక్షేమ రంగంలో అవతలి పార్టీలకన్నా మరొక వీసమెత్తు ఎక్కువచేసి ఉంటే ఉండవచ్చుగాక. ఇతరత్రా కూడా బడుగులకు అదనపు మేలు జరిగి ఉండవచ్చుగాక. (లాలూ అదికూడా చేయలేదంటారు.) కాని వౌలికంగా వారిద్దరిదీ సైద్ధాంతికంగా కోఆప్ట్ అయిన పరిపాలనే. ఇపుడు ఉభయులు కలిసి అయిదేళ్లు పాలించనున్నారు. కాని ఈ సైద్ధాంతికత పోయిన 25 ఏళ్లకన్నా భిన్నంగా ఉంటుందా? నమ్మకం లేదు.
ఈ సైద్ధాంతికతకు ఈ విధంగా కోఆప్ట్ కమ్మని అవతలి వర్గాలవారు వీరిని ప్రత్యేకంగా ఏమీకోరరు. రాజకీయంగా కోఆప్ట్ చేసుకునే ప్రత్యక్ష పద్ధతిలో ఈ సైద్ధాంతిక కోఆప్షన్ ఉండదు. అది స్వయంగా ఎంచుకునేది. ఆ విధంగా అది స్వచ్ఛందంగా కోఆప్ట్ కావటమవుతుంది. కాకపోతే అందుకు తగిన వాతావరణాన్ని, పరిస్థితులను ఉన్నతవర్గాలవారు సృష్టిస్తారు. ఆ విధమైన విధానాలను తమ పరిధిలో చేస్తారు. మనది సమాఖ్య వ్యవస్థ అయినందున, కేంద్రం చేసే చట్టాలు రాష్ట్రాలకు గణనీయంగా వర్తిస్తాయి. గనుక, నచ్చినానచ్చకపోయినా వాటిని తగినంత మేర అనుసరించవలసి ఉంటుంది గనుక, అదే విధంగా ఆర్థిక సంస్కరణలన్నవి చాలావరకు యుగధర్మమన్న పరిస్థితి ఏర్పడిన స్థితిలో. ఒకమేరకు కోఆప్షన్ అన్నది విధిలేని స్థితి వంటిది. అదే సమయంలో, సరైన స్పృహ కలిగి వ్యవహరించినట్లయితే కోఆప్షన్ పరిధికి వెలుపల ఉండే అవకాశాలు కూడా తగినన్ని ఉన్నాయి. బడుగువర్గాల నేతలు అటువంటి స్పృహను ఎంత చూపుతున్నారన్నది గమనించదగిన ప్రశ్న. అది చేయకపోతే వారు సైద్ధాంతిక కోఆప్షన్‌లోకి వెళుతున్నట్లే. అందుకు కారణం, ఉన్నత వర్గాల ప్రయోజనాలు ఏమిటో, బడుగుపార్టీల నాయక వర్గాల ప్రయోజనాలు కూడా అవే కావటమన్నమాట. ఆ స్థాయిలో అది ఇరువురి మధ్య కొలాబరేషన్, లేదా ఇరువురికీ వర్తించే ఉమ్మడి ప్రయోజనం అవుతుంది. ఇక్కడ గమనించవలసిన మరొక అంశం ఉంది. అది వ్యూహాత్మకంగా కీలకమైంది. సైద్ధాంతిక కోణంనుంచి ఉన్నత వర్గాల విధానపరమైన పరిస్థితి ఏమిటో పైన చెప్పుకున్నాము. దానినట్లుంచి కూడా అదే సైద్ధాంతిక వలయంలోకి బడుగువర్గాల నాయక శ్రేణులను ఆకర్షించేందుకు, విధిలేని పరిస్థితులను సృష్టించి వారిని అందులోకి తోసేందుకు ఉన్నత వర్గాలు ప్రయత్నిస్తాయి.
లాలూప్రసాద్, నితీశ్‌కుమార్ కలిసి అయినా, విడివిడిగానైనా రాజకీయ అధికారాన్ని సాధిస్తే అది ఉన్నతవర్గాలకు, జాతీయ-అంతర్జాతీయ వ్యాపార వర్గాలకు వ్యవస్థాపరమైన సవాలుకాబోదు. విధానపరమైన సవాలుకాబోదు. వారికి వౌలికంగా రాగల ముప్పేమీలేదు. ఇక్కడి ఉన్నతవర్గాలకు అందువల్ల కొంతకాలం అధికారం లేకుండాపోవచ్చు. అది వారికి చింత కలిగించే విషయమేగాని, వారి వ్యవస్థను వౌలికంగానే తలకిందులు చేసేదికాదు. అట్లా తలకిందులు చేసే సవాలు ఎదురైతేనే వారది నిజమైన ప్రమాదమని భావిస్తారు. నిజానికి, బడుగువర్గాలు తమనుంచి కొంతకాలం అధికారాన్ని తీసుకున్నా, సైద్ధాంతికంగా తమ పరిధిలోకి వస్తే అంతకన్నా కావలసింది లేదు. వీరికి దీర్ఘకాలంలో కావలసింది ఆ విధంగా బడుగులు సైద్ధాంతికంగా, విధానాలపరంగా తమ వలయంలోకి రావటమే. సాలెపురుగు గూటిలో ఈగలవలె చిక్కుకోవటమే. అందుకోసం బడుగులకు అనువైన ఆకర్షణలను కూడా కల్పిస్తారు వారు. మొత్తం మీద అది కోఆప్షన్‌గా మారుతుంది. రాజకీయ పదవులను, ఆర్థిక ప్రయోజనాలను కల్పించి వ్యక్తులను, సంస్థలను, పార్టీలను, కులాలను కోఆప్ట్‌చేసుకోవటానికి మించిన కోఆప్షన్ ఇది. దానిని ఇక్కడి ఉన్నత వర్గాలనుంచి ప్రపంచ బ్యాంకు, మల్టీ నేషనల్స్ వరకు, ఆ రెండింటిమధ్య ఇక్కడి ఉన్నతవర్గాల పారిశ్రామిక సంస్థలవరకు వారంతా స్వాగతిస్తారు కూడా. అది ‘శత్రువు’ను రక్తపాతం లేకుండా హత్య చేయడమవుతుందన్నమాట. ఆ పని ఎంత జరిగితే బడుగులు తమ ప్రత్యామ్నాయాలను సృష్టించుకునే అవకాశాలు, అట్లా సృష్టించుకుని తమ వ్యవస్థను వౌలికంగా సవాలుచేసే పరిస్థితులు అంతగా పోతాయి.
దేశంలో ఇంతవరకుగల అనుభవాలను ఒకసారి సమీక్షించి చూడండి. ఉత్తరాన, దక్షిణాన బడుగువర్గాల ప్రభుత్వాలు గత నాలుగు దశాబ్దాలలో అనేకం ఏర్పడ్డాయి. ఆ వర్గాలవారు కోఆప్ట్ అయినందువల్ల అధికారానికి అవకాశం కోల్పోయిన సందర్భాలున్నాయి. కోఆప్ట్ అయి ఉన్నతవర్గాల చెప్పుచేతలలో ఉంటూ ప్రభుత్వాలను నడిపిన ఉదాహరణలున్నాయి. స్వంత బలంతో అధికారానికి రావటమూ జరిగింది. కాని పైన చెప్పిన నిర్వచనం ప్రకారం సైద్ధాంతికంగా కోఆప్ట్‌కాని ఉదాహరణ ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అందువల్లనే వీరు అధికారానికి వచ్చికూడా, ఆ తరగతుల నాయకవర్గాలు వ్యక్తిగతంగా లాభపడుతున్నాయి గాని, ఆ సమాజానికి చెందిన సామాన్యులు బాగుపడుతున్నది తక్కువ. పైవారి వ్యవస్థను వౌలికంగా, సైద్ధాంతికమైన రీతిలో సవాలుచేయకపోయినా, అదే పరిధిలో చేయగలిగింది కూడా తగినంత ఉంది. ఉదాహరణకు బిహార్‌లో అటువంటి ప్రయత్నం పట్టుదలతో జరిగితే గత పాతికేళ్లలో ఈ వర్గాల అక్షరాస్యత ఎంత పెరగవలసింది? వారి సంక్షేమంకోసమంటూ కేటాయించిన నిధులు ఎంత బాగా వినియోగమై వారెంత బాగుపడవలసింది? కాని కోఆప్షన్ సైద్ధాంతికంగానూ ఉన్నపుడు దాని ప్రభావం ఆలోచనలు, పరిపాలనా సమర్థతలు, చిత్తశుద్ధిపై కూడా పడుతుంది. లేనట్లయితే బిహార్, యుపిలలో కొన్ని సామాజిక అద్భుతాలు జరిగి ఉండేవి.
సాంస్కృతికమైన కోఆప్షన్ కూడా ఇటువంటిదే. ఉదాహరణకు అవినీతి. ఈ విషయంలో ఉన్నతవర్గాల నేతలకు, బడుగువర్గాల నేతలకు తేడా ఎంత? ఉన్నత వర్గాలకొక పట్నాయక్, బడుగువర్గాలకొక నితీశ్ అవినీతి రాహిత్యానికి వ్యక్తిగత స్థాయిలో ఉదాహరణలుగా నిలుస్తారు. కాని కావలసింది మినహాయింపులు కాదు. నితీశ్‌కుమార్ ఒక ‘్ధర్మం’(రూల్) వంటివాడు కావాలి. కాని జరుగుతున్నది ఈ వర్గాలవారు సాంస్కృతికంగా కోఆప్ట్ కావటం. నీతి అవినీతులు సంస్కృతిలో ఒక ముఖ్యమైన పార్శ్వం.
బడుగులకు రాజకీయంగా, ఆర్థికంగా లాభాలుచేకూర్చి కోఆప్ట్ చేసుకోవటం గురించి పైన చూసాము. సైద్ధాంతికమైన కోఆప్షన్‌లోనూ అంతర్నిహితమైన అవినీతి ఉంది. సాంస్కృతిక కోఆప్షన్‌లో అది స్పష్టంగా కనిపించే విషయం. ప్రత్యర్థిని సాంస్కృతికంగా (అందులో ఆర్థిక అవినీతి, ఇతర నైతికలు ప్రముఖంగా వస్తాయి) కోఆప్ట్‌చేసుకోవటం, పతనం చేయటమన్నది పైవర్గాలు మొదటినుంచి అనుసరిస్తున్న వ్యూహం. అది ఎంతమాత్రం తక్కువ ప్రమాదకరమైనది కాదు. అయినప్పటికీ, బడుగువర్గాల నేతలు ఆ కోణంనుంచి కూడా కోఆప్ట్‌అయి ఆ సాలెగూడులో చిక్కుకుంటూనే ఉన్నారు. బడుగుల నేతలు నైతికను కోల్పోయి తమ వలయంలోకి రావటమే అవతలివారికి కావలసింది. అది తాము నేరుగా చూపే ప్రలోభాలవల్ల జరుగుతుందా, లేక బడుగుల నేతలు తాము స్వయంగా ఆ పని చేస్తారా అన్నది ప్రధానం కాదు. ఏ విధంగా జరిగినా ఆ వ్యవస్థలోకి కోఆప్ట్‌అవుతారు. పైవారి వ్యవస్థను సవాలు చేయకుండా, అందులో తాముకూడా ఇమిడిపోయి, అవే విలువలను పాటించటం జరిగినపుడు, అవతలి వారికి అంతకన్నా కావలసిందేమిటి? ఇటువంటి కోఆప్షన్లు అన్నీ వారి వ్యవస్థకు మరింత భద్రతను కల్పిస్తాయి.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)