మెయన్ ఫీచర్
‘ఆచరణ’ను మింగుతున్న అభినయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దేశద్రోహ కలాపాలు జరిగిపోవడం గురించి దేశ ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలోనే పూణె నగరంలో మరో చారిత్రక వైపరీత్యం సంభవించింది. సంఘ విద్రోహ కలాపాలకు పాల్పడినందుకు శిక్షను అనుభవిస్తుండిన సంజయ్‌దత్‌కు అర్థాంతరంగా నిర్బంధ విముక్తి లభించడం ఈ వైపరీత్యం. ఈ సంజయ్‌దత్ హిందీ చలన చిత్రాలలో నటించి పేరుమోసినవాడు. పేరుమోసిన ప్రతివాడికీ మనదేశంలో అనుయాయులు, అభిమానులు ఏర్పడిపోతున్నారు. ఫిబ్రవరి 25వ తేదీన సంజయ్‌దత్ పూణెలోని కారాగృహం నుంచి బయటకు వచ్చిన సందర్భంగా అభిమానులు ఆర్భాటంగా ఉత్సవ ప్రదర్శనలు చేశారు. జీవన ఆదర్శాలు క్రమంగా పతనమైపోతున్న తీరునకు ఈ ఆర్భాటం మరో మచ్చుతునక. ఆదర్శాలను ఆచరించిన వారు ఆరాధ్యులు కావడం గతమైంది. ఆదర్శాలను అభినయిస్తున్న వారు జనానికి ఆరాధ్యులైపోతుండటం వర్తమానం..అందువల్ల అభినయించిన ఈ చలనచిత్ర కళాకారునికి నిర్బంధ విముక్తి లభించడం అభిలషణీయమైన చారిత్రక పరిణామమన్న భ్రాంతి వ్యాపించింది.
క్రీస్తుశకం 1993లో ముంబయిలో భయంకరమైన పేలుళ్ళు జరిపించి పాకిస్తాన్‌కు పారిపోయిన దావూద్ ఇబ్రహీం అనేవాడి ముఠాలో ఈ సంజయ్‌దత్ కూడ ఉన్నాడన్నది అనేక ఏళ్లపాటు విచారణకు గురైన అరోపణ. ఈ ఆరోపణను ప్రత్యేక న్యాయస్థానంలో ప్రభుత్వం ఋజువు చేయలేకపోయింది. కానీ ఈ సంజయ్‌దత్ తన ఇంట్లో అక్రమంగా మారణాయుధాలు దాచాడాన్న అభియోగం మాత్రం ముంబ యి ప్రత్యేక న్యాయస్థానంలో ఋజువైంది. అందువల్ల అతగాడిని అరేళ్ల జైలుశిక్ష పడింది. 2006లో ఆయనకు జైలుశిక్ష విధించిన సందర్భంగా ముంబయి ప్రత్యేక న్యాయమూర్తి ఈ సంజయ్‌దత్‌తో కొంతసేపు ప్రసంగించినట్టు అప్పుడు ప్రచారమైంది. తన విలువైన జీవితాన్ని జైలుపాలు చేయవద్దని సంజయ్‌దత్ కోరినట్టు, ‘‘నీ జీవితం నుండి కేవలం ఆరేళ్లను మాత్రమే నిర్బంధగ్రస్తం చేస్తున్నాము..’’ అని ప్రత్యేక న్యాయమూర్తి చెప్పినట్టు అప్పుడు ప్రచారమైంది. మామూలు నేరస్థుల విషయంలో ఇలాంటి ప్రచారం జరగదు. ప్రసిద్ధుడైనా అప్రసిద్ధుడైనా చట్టం దృష్టిలో సమానమన్నది న్యాయసూత్రం. కానీ ప్రసిద్ధ నేరస్థులను అప్రసిద్ధ నేరస్థులకు మధ్య తేడా ఉందన్నది ప్రచార సూత్రం. సంజయ్‌దత్ ఘరానా నేరస్థుడు. అక్రమంగా ఆయుధాలను కలిగివుడడం, వాటిని రవాణా చేయడం సంఘ విద్రోహ చర్య. సంజయ్‌దత్ అలాంటి సంఘ విద్రోహి. అనేక హిందీ సినిమాలలో కథానాయకుడైన సంజయ్‌దత్ 1990వ దశకంలో ఖల్‌నాయక్ అన్న హిందీ చలనచిత్రంలో సంఘ విద్రోహిగానే నటించాడు. ఆ తరవాత అతగాడి జీవితంలోని సంఘవిద్రోహ చర్య బయటపడింది.
సంజయ్‌దత్‌కు వ్యతిరేకంగా అభియోగ విచారణ జరిగిన సమయంలో అతగాడి పట్ల సానుభూడి కట్టలు తెంచుకొని ప్రవహించింది. అతగాడు అప్పటికి న్యాయస్థానంలో నేరస్థుడుగా ధ్రువపడలేదు కనుక, అభిమానుల ఆ కరుణ రసానుభూతిని తప్పు పట్టనవసరంలేదు. కాని లభించిన ప్రచారం మాత్రం అతగాడిని నిజ జీవితంలో అన్యాయానికి గురైన ఆదర్శవంతుడన్న భ్రాంతి కలిగించింది. కానీ ఇతగాడిని న్యాయస్థానం కరడుకట్టిన సంఘవిద్రోహిగా ధ్రువపరచిన తరువాత కూడ అతనిపట్ల అభిమానుల గుండెల్లో ఈ విచిత్ర కరుణ రసానుభూతి పొంగిపొరలి వరదలెత్తింది. ఇలా వరదలెత్తడం నైతికత, సౌశీల్యం, దేశభక్తి, జాతీయత, సమాజహితం వంటి విలువలకు అర్థాలు మారిపోతున్న తీరునకు నిదర్శనం. ఇప్పుడు అతగాడికి ఎనిమిది నెలల శిక్షను రద్దుకూడ చేశారు. ఇలా అర్ధాంతరంగా సంజయ్‌దత్‌ను వదలిపెట్టడానికి కారణం అతని సత్‌ప్రవర్తన అని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
అందువల్ల అభిమానులు ఈ అభినయవేత్త విడుదల సందర్భంగా పెద్ద జాతర చేశారు. గొప్పతనంపై ప్రశంసల జల్లులను కురిపించాలి, ఉత్సవాలు జరపాలి. కానీ సంజయ్‌దత్ కొత్తగా సాధించిన గొప్పదనం ఏమిటి? నేరం చేయడం పాపం, శిక్షను అనుభవించడం పరిహారం! ‘సత్‌ప్రవర్తన’ కారణంగా శిక్ష తగ్గిపోయింది. అందువల్ల జైలు నుంచి బయటపడిన సంజయ్‌దత్ గొప్పవాడు కాదు, దుర్మార్గుడూ కాదు-అన్నది కర్మ సిద్ధాంతం. లేని గొప్పతనానికి సమ్మానం చేయడం మారిపోతున్న జీవన విలువలకు నిదర్శనం. సంజయ్‌దత్ నేరస్థుడుగా ధ్రువపడిన తరువాత కూడ రాజకీయ పక్షాల అధినేతలు అతగాడి పట్ల గౌరవం ఘటించడం చరిత్ర. నేరం ధ్రువపడిన తరువాత సంజయ్‌దత్ ఉన్నత న్యాయస్థానాలలో తీర్పును సవాలు చేశాడు. విచారణ అపరిష్కృతంగా ఉండిన సమయంలో సంజయ్‌దత్ లోక్‌సభకు పోటీ చేయడానికి ముస్తాబయ్యాడు. 2009 నాటి ఎన్నికలలో అతగాడిని సమాజ్‌వాదీ పార్టీ వారు అభ్యర్థిగా కూడా నిర్ణయించారు. సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో సంజయ్‌దత్ అప్పుడు ఎన్నికలలో పోటీ చేయలేకపోయాడు. చలనచిత్ర కళాకారులు నిజ జీవితంలో చేసే ఘోర నేరాలను కూడ ఘనకార్యాలుగా భావించడం దేనికి నిదర్శనం?
ప్రత్యేక న్యాయస్థానం విధించిన ఆరేళ్ల శిక్షను సుప్రీంకోర్టు ఐదేళ్లకు తగ్గించింది. 2013 మే నుంచి ఇప్పటివరకు రెండేళ్ల ఐదునెలలు మాత్రమే సంజయ్‌దత్ జైల్లో గడిపాడు. పాటలు విన్నాడట. పాటలు పాడాడట. ‘బట్ట’ కుర్చీలను, నూలు సంచులను తయారు చేశాడట. కానీ ఎకథాటిగా సంవత్సరం కూడా ఆయన నిర్బంధంలో ఉండలేదు. ఈ రెండున్నర ఏళ్లలో మహారాష్ట్ర ప్రభుత్వం అతగాడిని నాలుగుసార్లు తాత్కాలిక స్వేచ్ఛను ప్రసాదించింది. మామూలు ఖైదీలకు, సామాన్య నేరస్తులకు, ఊరుపేరు లేని వారికి లభించని గొప్ప గౌరవం ఇతగాడికి లభించడానికి కారణం అతగాడు సినిమాలలో ఆదర్శాలను అభినయించడం. సుప్రసిద్ధ రచయిత స్వర్గీయ మధురాంతకం రాజారాం 1987లో వ్రాసిన ‘అర్హత’ అన్న కథలో చిత్ర జీవుల ఆదర్శాభినయం గురించి ఇలా వివరించి ఉన్నాడు.‘‘..రంగభూమి సినిమాలో షావుకార్లనుంచి దోచుకున్న డబ్బును నిరుపేదల వాడల్లో చల్లిందెవరు? ‘మృగరాజు’ సినిమాలోఒక అబలను రక్షించడం కోసం పాతికమంది గూండాలతో పోరాడిందెవరు? ‘సర్కస్ డేరా’ చిత్రంలో పులినోట్లో తల దూర్చిందెవరు? అదంతా నటనే కదా అని కొందరు పనికిమాలినవాళ్లు అనుకోవచ్చు. వీరోచిత కృత్యాల కితాబును ‘డ్యూప్’కు అంటగట్టవచ్చు...నామట్టుకు నాకు మాత్రం చైతన్య ప్రదీపే హీరో..’’ అందువల్ల చలన చిత్రాలలో సంజయ్‌దత్ చేసిన అభినయం ప్రభావానికి లోనైన ‘వేత్త’లు ‘కోవిదులు’ ప్రభుత్వ నిర్వాహకులు నిజ జీవితంలో అతగాడి ఆచరణను గుర్తించడం లేదు. అందువల్ల అతగాడు జైల్లో ‘పడరాని బాధలు పడుతున్నాడన్న’ సానుభూతిలో మహారాష్ట్ర ప్రభుత్వం నాలుగుసార్లు అతడిని పేరోల్‌పై విడుదల చేసింది. యరవాడ జైలుకెళ్లిన తరువాత అరునెలలు గడవకముందే సంజయ్‌దత్ 2013 అక్టోబర్‌లో మూడు వారాల పాటు బయటికి వచ్చి స్వేచ్ఛగా విహరించి వెళ్లాడు. మళ్లీ 2014 జనవరిలోనే అతగాడిని రెండు నెలలపాటు నిర్బంధ విముక్తి లభించింది. నూతన ఆంగ్ల సంవత్సర ఉత్సవాలలో కుటుంబ సభ్యులతోకలిసి పాల్గొనడానికై అతనికి మళ్లీ 2014 డిసెంబర్ చివరిలో రెండు వారాల స్వేచ్ఛ లభించింది. ఆయన కుమార్తె ముక్కునకు శస్తచ్రికిత్స జరిగిందట. చికిత్సను స్వయంగా పర్యవేక్షించడానికి వీలుగా సంజయ్‌దత్ 2015 ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాలలో ఆరవై రోజులపాటు స్వేచ్ఛను పొందాడు. ఇతర ఖైదీల పిల్లలకు ముక్కు చికిత్సలు, మూతి చికిత్సలు జరిగి ఉండవా? వారందరినీ జైళ్లనుండి తాత్కాలికంగా విడుదల చేశారా? ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ ప్రసాదిస్తున్న సమాన న్యాయమిదేనా?
అభియోగంపై విచారణ జరిగిన సమయంలో పద్ధెనిమిది నెలల పాటు సంజయ్‌దత్ నిర్బంధంలో ఉన్నాడు. అప్పుడు కూడ అతగాడు ఐదుసార్లు విడుదలను పొంది ఉన్నాడు. 2013 తరువాత జైలుశిక్షను అనుభవించిన సమయంలో ఈ ‘దత్తు’ నూటయాబయి రోజులపాటు బయటనే ఉన్నా డు. ఇలా స్వేచ్ఛను అనుభవించిన 155 రోజులలో 44 రోజులు అతగాడు జైలుశిక్షను అనుభవించినట్టుగానే భావించాలని ప్రభుత్వం నిర్ణయించడం మరో ‘గౌరవం’. ఇలా మొత్తం మూడు సంవత్సరాల పదకొండు నెలలు మాత్రమే ఈ ఘరానా నటుడు జైలుశిక్ష అనుభవించాడు. 2013కు పూర్వం ఆరునెలలపాటు విదేశాలకు వెళ్లిరావడానికై సంజయ్‌దత్‌కు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇవ్వడం మరో న్యాయ వైపరీత్యం. సినిమాలలో నటించడానికి వీలుగా సంజయ్‌దత్ అలా ఆర్నెల్లపాటు విదేశాలలలో విహరించి రాగలిగాడు. సంజయ్‌దత్ మంచి ప్రవర్తనను ధ్రువీకరించిన నాడు యరవాడ-పూణె-జైలు సూపరింటెండెంట్ ఈ మంచి ప్రవర్తనకు గీటురాయి ఏమిటన్నది మాత్రం వెల్లడించాడు. ‘‘కోరలన్ని ఊడిన తోడేలు వేటను మానుకొంది..’’ నిర్బంధంలో ఉన్న సంజయ్‌దత్ వంటివారు దుష్ట ప్రవర్తనకు ఎలా పాలుపడగలరు? అవకాశం ఏదీ? సంజయ్‌దత్‌ను నిర్బంధ కాల వ్యవధి పూర్తికాక ముందే కారాగృహం నుండి వదలిపెట్టడాన్ని నిరోధించాలని కోరుతూ ప్రజాహిత వ్యాజం-పిల్- ముంబయి హైకోర్టులో దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ పూర్తికాకముందే సంజయ్‌దత్ జైలునుంచి బయటకు వచ్చేశాడు.
జాతీయ సంస్కారం అడుగంటిపోయిన సమాజ సమష్టి మన ప్రవృత్తి శూన్యస్థితికి గురవుతోంది. ఈ ఖాళీని సమాజ వ్యతిరేక పద్ధతులు, ప్రవర్తనలు ఆక్రమించడం సహ జం. మనదేశంలో వ్యక్తులకంటె విలువలకు అధిక ప్రాధాన్యం లభించడం సనాతన జాతీయ సంస్కారం. తల్లిపట్ల కల ప్రేమ భక్తి...దేశం పట్లకల ప్రేమ దేశభక్తి..‘‘మాతా భూమిఃపుత్రోహం ఫృథి వ్యాః’’- భూమి తల్లి, నేను నేలతల్లి కుమారుడను- అన్న జీవన సత్యాన్ని వేదఋషులు దర్శించిన నాటి నుంచి ఈ వాస్తవం భారతీయులను ప్రభావితం చేసింది. ఇది సహజ మాతృదేశ నిష్ఠకు ప్రాతిపదిక. ‘‘సమాతుః పరదైవతమ్’’- స్వజాతీయ సమాజానికి మాతృభూమిని మించిన దేవత లేదు. అందువల్లనే భరతమాత పరమోన్నత దేవత...ఈ సహజ సంస్కారం బ్రిటిష్ పాలన ఫలితంగా నశించింది. వ్యక్తులను పరమోన్నతులుగా ఆరాధించే కృతకమైన దేశభక్తి, కుహనా అనుభూతి విస్తరించాయి. రాజకీయ నాయకులకు ఉద్యమ కారులకు జయధ్వానాలు చేయ డం నిన్నటి మాట. నేడు అభినయ వేత్తలను ఆదర్శంగా భావించి మోకరిల్లుతున్నాము.