మెయన్ ఫీచర్
పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆర్థిక రంగంలో భారత్ ఎక్కడ పొరపాట్లు చేస్తున్నదన్న అంశాన్ని ఆర్థిక సర్వే 2015-16 చక్కగా వివరించింది. అంతే కాదు వీటిని సరిదిద్దుకొనేందుకు వీలైన ఆచరణశీల మార్గాలను కూడా సూచించడం విశేషం. ముఖ్యంగా ఈ సర్వే సూచించిన అతిముఖ్యమైన అంశం వ్యవసాయానికి సంబంధించినది. మనదేశ వ్యవసాయం తృణధాన్యాల కేంద్రంగా మారిపోతున్నదన్నది సర్వే స్పష్టం చేసిన ముఖ్యమైన అంశం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వరి, గోధుమ పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించి దాన్ని అమలు పరుస్తున్నది. కేంద్రం మొత్తం 23 పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌ఎం) ప్రకటించినప్పటికీ, ఎక్కువగా కొనుగోలు చేసేది మాత్రం వరి, గోధుమ, కొంతమేర పత్తి మాత్రమే. చెరకు పంటకు కూడా ఎంఎస్‌ఎమ్ వంటి సదుపాయమున్నప్పటికీ, అది కేవలం కొన్ని చెరకు మిల్లులకు మాత్రమే పరిమితం. అంటే చట్టబద్ధంగా రైతులనుంచి చెరకు పంటను తప్పనిసరిగా కొనుగోలు చేయాలన్న నిబంధన వర్తించే మిల్లులు మాత్రమే ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు చెరకును కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఈ సర్వే ఇంకా చెప్పిందేమంటే..‘‘ అధిక పంటలకు ఈ కనీస మద్దతు ధర అమల్లో ఉన్నప్పటికీ, దాని వాస్తవ ప్రభావం మాత్రం చాలా పరిమితం. అందువల్ల దేశంలో అధిక శాతం మంది రైతులకు దీనివల్ల ప్రయోజనం కలగడం లేదు. గోధుమ, వరి, చెరకు వంటి పంట ఉత్పత్తులను అధికమొత్తంలో సేకరించడానికి మాత్రమే ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం పప్పు్ధన్యాలు, చమురు ధాన్యాల వంటి పంటలపై పెను ప్రభావం చూపుతోంది.’’ ప్రభుత్వం అనుసరించే ఈ విధానం వల్ల, వరి, గోధుమ ధాన్యాల నిల్వలు, నిబంధనల కంటె అధికమొత్తంలో పేరుకుపోతున్నాయి. అంతేకాదు దీనివల్ల కలిగే మరో నష్టమేమంటే, పప్పు ధాన్యాల ధరలు తరచుగా ఆకాశాన్నంటడం! ఇటీవలి కాలంలో కంది పప్పు ధర కిలోకు రూ.200ను తాకడాన్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. గతంలో ఉల్లిగడ్డ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల, ప్రభుత్వాలే పడిపోయిన సంగతి మనకు తెలిసిందే. దీన్ని బట్టి చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో పప్పు ధాన్యాల ధరలు కూడా ప్రభుత్వ మనుగడను శాసిస్తాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అంటే పప్పు్ధన్యాల ధరలు ఇదేమాదిరిగా పెరుగుతూ పోతే ప్రభుత్వాలు కొనసాగడం కూడా కష్టమేనన్నది గుర్తించాల్సిన సత్యం.
పప్పు్ధన్యాలను దిగుమతి చేసుకోవడం భారత్‌కు ఎంతమాత్రం సరైంది కాదు. ఎందుకంటే ప్రపంచలోనే పప్పు్ధన్యాల ఉత్పత్తి, వినియోగాల్లో మనదేశానిది అగ్రస్థానం. సర్వే దీన్ని ఈవిధంగా పేర్కొంది: ‘‘దేశంలో పప్పు ధాన్యాలకు పెద్దమొత్తంలో డిమాండ్ ఉంది. డిమాండ్‌కు తగినట్టుగానే మనదేశంలో పప్పు ధాన్యాలు పండుతాయ. ఈ నేపధ్యంలో కేవలం దిగుమతులు మాత్రమే స్థానిక డిమాండ్‌ను తీర్చే ప్రధాన వనరు కాబోవు.’’ దీనర్ధం ఏమిటి?? పప్పు ధాన్యాల విస్తీర్ణాన్ని పెంచడానికి వీలుగా రైతులకు తగిన ప్రోత్సాహకాలను ప్రకటించాలి. ఇదే సమయంలో దేశంలో పప్పు్ధన్యాల ఉత్పత్తిని కూడా బాగా పెంచాలని ఆర్థిక సర్వే స్పష్టం చేసినట్లయింది. అయితే ఇప్పుడొక ప్రధాన సమస్య ఎదురవుతోంది. వరి, గోధుమ పంటలను పెద్ద విస్తీర్ణంలో పండిస్తున్న రైతులను, పప్పు ధాన్యాలను పండించే దిశగా ఏవిధంగా మలచాలి? ఈ దిశగా రైతులను చైతన్యపరచడం ప్రభుత్వానికి పెద్ద సమస్యే.
‘‘ఖరీఫ్ పంటలకు ధరల విధానం’’ పేరుతో ఈ నివేదికను ఆర్థిక సర్వే వెలువరించింది. 2015-16 మార్కెట్ సీజన్‌ను పరిశీలించినప్పుడు ఒక్క విషయం స్పష్టమవుతోంది. ‘‘రైతులు మనస్ఫూర్తిగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు పండించడానికి ఎందుకు ఇష్టపడటం లేదు? దీన్ని తెలుసుకోవడంకోసం వ్యవసాయ ఖర్చు లు, ధరలపై కమిషన్ ఇటీవల రైతులతో విస్తృతంగా చర్చలు జరిపింది. ఇందుకోసం వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించింది. అక్కడి రైతులతో ముచ్చటించి, వారి అభిప్రాయాలను సేకరించింది. ఈ విస్తృత పరిశీలన వల్ల తేలిందేమంటే..పప్పు్ధన్యాలు, నూనె గింజల పంటలు పండించినప్పుడు తమకు గిట్టుబాటు ధర లభించే విధంగా చూసే గట్టి యంత్రాంగం ఉండాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా ఉత్పత్తి పెరిగినప్పుడు, మార్కెట్ ధరలు, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకంటే దిగువకు పడిపోయినప్పుడు తమకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసే యంత్రాంగం ఉండాలని రైతులు స్పష్టం చేశారు. అంటే కనీస మద్దతు ధర లభించే భద్రత ఉండాలని వారు కోరుకుంటున్నారు.’’
ఈ నేపథ్యంలో పప్పు ధాన్యాల కొనుగోలుకు గట్టి యంత్రాంగం ఉండాలని ఆర్థిక సర్వే పేర్కొన్న నేపథ్యంలో, అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అదే దిశగా తన బడ్జెట్‌లో ముందుకెళ్లారు. పప్పు్ధన్యాల సేకరణకు గట్టి యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచితే తగిన ప్రోత్సాహకాలను కూడా అందిస్తామని ప్రకటించారు. ఆహార భద్రతా మిషన్ కింద ఇందుకోసం రూ.500 కోట్లు కేటాయిస్తునట్లు కూడా జైట్లీ వెల్లడించారు. ఇదే సమయంలో వరి, గోధుమలకు మాదిరిగానే పప్పు ధాన్యాలను కూడా పెద్ద ఎత్తున నిల్వ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ‘‘ఒక్కసారిగా చోటుచేసుకున్న పప్పు్ధన్యాల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే పప్పు్ధన్యాలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి వీటిని పెద్ద ఎత్తున నిల్వ చేసేందుకు కూడా ప్రభుత్వం అనుమతించింది. ఈ కొనుగోళ్లకోసం స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. మొత్తం రూ.900 కోట్ల మేర ఈ నిధులను మార్కెట్ అవసరాలకోసం కేంద్రం కేటాయించింది,’’ అని అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
ప్రస్తుత వ్యవసాయ ఆర్థిక నిర్మాణం నేపథ్యంలో ప్రభుత్వం సరైన దిశగానే చర్యలు తీసుకున్నదని భావించాలి. అధికమొత్తంలో పప్పు ధాన్యాలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం వల్ల రైతుల్లో మరింత ఉత్సాహం పెరిగి, పప్పు ధాన్యపు పంటల విస్తీర్ణాన్ని మరింతగా పెంచుతారు. అంతేకాదు శాఖాహారుల్లో అత్యధిక ప్రోటీన్ ఉన్న ఆహారం పప్పు ధాన్యాలు మాత్రమే! ఇక మనదేశంలో పప్పు్ధన్యాల విషయంలో ఉత్పన్నమయ్యే మరో ప్రధాన సమస్య ఏమంటే, వీటిని నీటిపారుదల సౌకర్యంలేని భూముల్లో పండించడం.
ఆర్థిక సర్వే మరో అంశాన్ని కూడా వేలెత్తి చూపింది. ‘‘పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సాగునీటి సదుపాయం కలిగిన అత్యధిక శాతం భూముల్లో వరి, గోధుమ, చెరకు పండిస్తున్నారు. ఇక నీటి ఎద్దడి విపరీతంగా ఉన్న మహారాష్టల్రో కూడా నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో చెరకును మాత్రమే పండించడం విచిత్రం. మరి చెరకును నీటి వసతి ఉన్న భూముల్లో మాత్రమే పండిస్తారు. దేశంలో ప్రస్తుతం పప్పు ధాన్యాల కొరత విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో పప్పు ధాన్యాలను నీటి సదుపాయం ఉన్న భూముల్లో పండించాలి. తద్వారా వీటి ఉత్పత్తిని పెంచాలి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానం, కేవలం తృణధాన్యాలు, చెరకు పంటలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నది,’’ అని పేర్కొంది. అందువల్ల పప్పు్ధన్యాల నూతన సేకరణ విధానం మాత్రమే వీటి ఉత్పత్తిని పెంచేలా దోహదపడగలదు.
మరో విషయం. పప్పు ధాన్యాల దిగుబడి తక్కువ. నిజం చెప్పాలంటే బ్రెజిల్, మయన్మార్, నైజీరియా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో వీటి సగటు దిగుబడి చాలా తక్కువ. మనదేశంలో పప్పు ధాన్యాలు అత్యధికంగా పండే రాష్ట్రం మధ్యప్రదేశ్. ఇక్కడ హెక్టారుకు సగటున 938 కిలోల దిగుబడి మాత్రమే ఉంటుంది. అదే చైనాలో హెక్టారుకు 1550 కిలోల పప్పు్ధన్యాల దిగుబడి కొనసాగుతోంది. మనం జీర్ణించుకోవలసిన సత్యమేమంటే, మొత్తం మీద వీటి దిగుబడి ఎక్కువ, తక్కువ కాకుండా సమానంగా కొనసాగడం. 2007-08 సీజన్‌లో కందిపప్పు హెక్టారుకు దిగుబడి 826 కిలోలుగా ఉంది. అదే 2013-14 నాటికి ఇది కేవలం 859 కిలోలకు మాత్రమే దిగుబడి పెరిగింది. అంటే కేవలం సుమారు 0.7 శాతం పెరుగుదల అన్నమాట.
క్రిసిల్‌కు చెందిన ధర్మకీర్తి జోషి, దీప్తి దేశ్‌పాండేలు ‘‘ప్రతి మూడేళ్లకోమారు ఆకాశాన్నంటుతున్న పప్పు్ధన్యాల ధరలు’’ అనే శీర్షికన ఒక నివేదికను విడుదల చేశారు. మొత్తం ఆహార ధాన్యాలు పండించే విస్తీర్ణంలో పప్పు ధాన్యాల విస్తీర్ణం 20 శాతం వరకు ఉండగా, దిగుబడి విషయానికి వస్తే మొత్తం ఆహార పంటల ఉత్పత్తిలో 10 శాతం కూడా ఉండటం లేదు! అంతేకాదు పెరుగుతున్న డిమాండ్‌ను ఉత్పత్తి అయిన పప్పు ధాన్యాలు తీర్చలేకపోయాయి. గత రెండు దశాబ్దాల కాలాన్ని పరిశీలిస్తే సగటున ఈ పప్పు ధాన్యాల ఉత్పత్తి కేవలం రెండు శాతం మాత్రమే వృద్ధి చూపడం గమనార్హం! ఇక పంట విస్తీర్ణం కూడా 0.8శాతం కంటే తక్కువే పెరిగింది. దానికి తగ్గట్టుగానే దిగుబడి కూడా 0.9 శాతం పెరగడంలో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
ఈ నేపథ్యంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచాలంటే రెండే మార్గాలు. ఒకటి సాగునీటి సదుపాయం ఉన్న భూముల్లో వీటిని పండించడం. రెండవది వీటిని పండించే మెట్ట భూములకు నీటి సదుపాయం కలిగించడం. ఇందులో మెట్ట భూములకు నీటి సదుపాయం కలిగించే ప్రక్రియ దీర్ఘకాలికమైంది. అందువల్ల, సాగునీరు అందుబాటులో ఉన్న భూముల్లోనే వీటిని పండించడానికి రైతులను ప్రోత్సహించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకు మించి మార్గాంతరం లేదు. దీన్ని గమనించే అరుణ్ జైట్లీ పప్పు ధాన్యాల ఉత్పత్తి కోసం తగిన విధానం ప్రకటించారు. మిగిలిన విషయాలు ఎట్లా ఉన్నప్పటికీ పప్పు ధాన్యాల విషయంలో ఆయన బడ్జెట్‌లో ప్రకటించిన చర్యలు మాత్రం సముచితమైనవి.