మెయన్ ఫీచర్
దేశంలో దొంగలు పడ్డారు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒకడు హతమైనా, హత్యచేసినా వాడు తప్పక ఏ మతానికో, జాతికో, భాషకో చెందినవాడై ఉంటాడు. అతడి మరణానికి గానీ, మారణానికిగానీ కులమతాలే కారణం కానక్కర్లేదు. కానీ రాజకీయ లబ్ధి కోరే స్వార్ధపరులు ఆ వ్యక్తి కులాన్ని, మతాన్ని పేర్కొంటూ ఆ వార్తని వివాదం చేసి కుల మత వైషమ్యాలను రగుల్చుతారు. తద్వారా - తమ పదవులు తిరిగి పొందగలమని వారి ఆశ.
అమెరికా సైన్యం బిన్ లాడెన్‌ను వెంటాడి వేటాడి సంహరిస్తే అది ‘హీరోయిజం’గా ఆ దేశంలో పాలక ప్రతిపక్షాలన్నీ వేనోళ్ళ పొగిడాయి. అంతేకానీ ఆ తీవ్రవాదికి చెందిన మతాన్ని తడిమి, ఆ మతం వారికి తమ దేశంలో రక్షణ కరవవుతుందని ప్రతిపక్షం నోరుపారేసుకోలేదు. అక్కడి విశ్వవిద్యాలయాల్లో ఆ మతాభిమానులు ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేయలేదు. మేధావులు ‘అసహనం’ అంటూ గోలచేయలేదు. అందుకే ఆ దేశం, అలాంటి దేశాలు అభ్యుదయ దేశాలనిపించుకుంటున్నాయి. అందుకు భిన్నంగా- స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి పేద దేశంగా ముద్రపడిన మన దేశానికి ఇన్నాళ్ళకి అభ్యుదయాన్ని కలిగించడానికి ఒక్క వ్యక్తి ఉద్యమిస్తే అతడిని సవరించడమో, ప్రోత్సహించడమో మానివేసి - తాము కోల్పోయిన పదవుల్ని తిరిగి తెచ్చుకోవడానికి దేశ ప్రతిష్ఠను సైతం దెబ్బతీస్తున్న మహా నాయకుల్ని చూస్తున్నాం. స్వచ్ఛ భారతమనో, రైతు సంక్షేమమనో, సమగ్ర దేశాభివృద్ధి అనో, విదేశీ సంబంధాల మెరుగుదల అనో - కేవలం దేశాభ్యుదయం కోసం కుల మత ప్రసక్తి లేకుండా పాటుపడుతుంటే - ఆ ప్రయత్నానికి గండికొడుతూ ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొడుతున్న నాయకులు, మేధావులు, వర్గవిభేదాల ఆవేశపరులు ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యాలు.
ఈ పదవీ లాలసులు ఈ దుష్కృత్యాలతో తాము భారతీయతకి వ్యతిరేకులమనీ, ఈ దేశంలో అధిక సంఖ్యాకులకు శత్రువులమనీ నిరూపించుకుంటున్నారు. వారికో ధీమా ఉంది -ఇక్కడ అల్పసంఖ్యాకంగా ఉంటూ, అనేక విదేశాలలో అధిక సంఖ్యాకంగా ఉన్న మతాలవారికి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లు అల్లరి చేస్తే విదేశ నిధుల బలంతోపాటు, ఈ దేశంలో సమైక్యమైన ఓటు బ్యాంకు బలం నిస్సందేహంగా తమదవుతుందన్న ఆశ. దానితోపాటు ఎంత గింజుకున్నా ఏకం కాని అధిక సంఖ్యాకుల వల్ల తమకేం ప్రమాదం ఉండదనే తెలివి. వాళ్ళని కలవనివ్వకుండా కులాల పేరుతో చీల్చడానికి తమ పన్నాగాలు ఎలాగూ ఉన్నాయి. వీరంతా సృష్టిస్తున్న అవాస్తవాలు, అసత్య చిత్రీకరణలు అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయన్న స్పృహ కూడా లేదు.
మన దేశంలో ‘మేధావి వర్గాలు’ అనిపించుకొనే వారు తప్పనిసరిగా 1. హిందూ వ్యతిరేకులై ఉండాలి. 2. జాతీయ భావాలను ద్వేషించాలి. 3. వీలైనంతగా భారతీయతను, ఈ దేశ ఔన్నత్యాన్ని వక్రీకరించాలి. కానీ ఇతర సంపన్న దేశాలు వారి దేశాలలోని మతంపట్ల గౌరవమే కాదు, ఆ మత వ్యాప్తికి సహకరిస్తూనే ఉంటారు. ప్రపంచంలో అన్ని దేశాలనూ తమ మతాలే ఆక్రమించాలనే వారి మత సంస్థలకు చేయూతనిస్తూనే ఉంటారు. పైగా - హిందూమతానికి తప్ప మిగిలిన మతాలకు రాజ్యాలేలాలనీ, ఆక్రమించాలనీ స్పష్టమైన లక్ష్యం, లక్షణం, ప్రణాళికలు మెండుగా ఉన్నాయి. ఆ వ్యాప్తికి ఎక్కడైనా అడ్డుతగిలితే - అక్కడ మానవ హక్కులు దెబ్బతిన్నాయనో, తమ మతం వారికి రక్షణ లేదనో అభియోగాలు కూడా చేస్తారు. వారికి ఇక్కడి కొందరు నాయకులు ఉప్పందిస్తుంటారు.
ఈ మధ్య అమెరికాలో ఒక న్యాయవాది బృందం మన ప్రధానిగారికి లేఖ రాసిందట - మన దేశంలో మైనారిటీ మతాలకు రక్షణ కరవుతోందనీ, వారి ప్రాథమిక హక్కులు దెబ్బతింటున్నాయనీ వస్తున్న వార్తలకు చలించిపోతూ - ‘మైనారిటీ హక్కులు కాపాడబడతాయ’నే హామీని కోరుతూ, వారికి లభించిన వార్త్ధారాలు చూపించారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో కొన్ని గ్రామాలవారు అన్యమత ప్రచారాన్ని నిషేధించినందుకు తెగ బాధపడిపోతూ ఈ లేఖను రాశామని పేర్కొన్నారు. నిజానికి ఆ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా గుర్తించి గౌరవించవలసినది పోయి ఈ అభియోగం దేనికి? ఆ గ్రామాలేమీ ఇతర మతాలపై దాడులు చేయలేదే? నిందించలేదే? తమ గ్రామంలో అప్పటికే ఒక మతానికి చెందినవారు ప్రలోభాలకో, స్వార్థాలకో లొంగిపోయి, మారిపోయి తమ పూర్వ మతంపై ద్వేషం పెంచుకొని, క్రమంగా వైషమ్యాలకు దారితీయకుండా కాపాడుకుంటున్నారు. మతమార్పిడి మహా వ్యాపారమైపోయినప్పుడు కొన్ని చోట్ల ఆ వ్యాపారానికి లాభం, ఇంకొన్ని చోట్ల నష్టం తప్పదు. దానికి ప్రభుత్వాలేం చేస్తాయి? ప్రచారం చేయడం వారి హక్కయితే, మాకక్కర్లేదు అనడం వీరి హక్కు. అందులో హింస, దాడి లేకపోతే చాలు.
అప్పటికే వివాహమైన స్ర్తికి, మరో సంబంధం తీసుకువచ్చినప్పుడు ‘నాకు ఇప్పటికే పెళ్ళయింది. నాకో భర్త, సంసారం ఉన్నాయి. మరో సంబంధం అక్కర్లేదు’ అని చెప్పడంలో తప్పులేదు కదా! అందునా - భారతీయ స్ర్తికి! అదేవిధంగా ‘నాకో మతం ఉంది. మరో మతం అక్కర్లేదు’ అనడం అన్యమత ద్వేషమూ కాదు. వైషమ్యమూ కాదు. ప్రపంచంలో ఇతర దేశాలలోకంటే ఈ దేశంలోనే మైనారిటీ మతాలు స్వేచ్ఛగా, ప్రత్యేక హక్కులతో జీవిస్తున్నారనడం దాచేస్తే దాగని సత్యం.
ఇప్పుడీ విదేశీ న్యాయవాద బృందంవంటి వారి బాధంతా ఈ దేశాన్ని తమ మతమే మొత్తం ఏలలేకపోతోందే - అనే విచారం. ఈ వాదాలలో వారి మతాలతోపాటు సిక్కు సోదరులను కూడా కలిపేయడం మరీ విడ్డూరం.
ఆ రోజుల్లో ఒక హింసావాద మతం చేస్తున్న దౌర్జన్యానికి తట్టుకోలేక - హిందూ మత భావాలతో తయారైన ఒక ప్రత్యేక పవిత్ర మహామతం సిక్కు ధర్మం. వారెప్పుడూ భారతీయతలో అంతర్భాగమే. ఇతర రెండు మతాలకీ, ఈ పవిత్ర సిక్కు మతానికీ సహపంక్తి ఎన్నడూ లేదు.
ఇప్పుడు దేశంలో కుల మతాలకతీతంగా భారతీయులందరూ కృషి చేయవలసిన అంశాలు చాలా ఉన్నాయి. అన్ని కులాల వారికీ, మతాల వారికీ - అంటే భారతదేశంలోని అందరకూ రోడ్లు, పంటలు, కనీస సౌకర్యాలు, రవాణా సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రత, దేశ భద్రత, అవినీతి నిర్మూలన, ఉపాధి కల్పన... ఇలా సార్వజన అంశాలు ఎన్నో ఉంటుంటే - వాటి మెరుగుదలకు ఆరు దశాబ్దాల పైబడిన స్వతంత్ర భారతంలో జరిగిన కృషి అత్యంత అల్పంగా కనబడుతుంటే - వాటి గురించి ఈషణ్మాత్రం కూడా పట్టించుకోకుండా, కేవలం కుల - మతాల పేరున ద్వేషాలు రెచ్చగొట్టడం హేయం.
ఒక మతం పేరున ఉన్న పార్టీ నేతలు తమ మతోన్మాదంతో దేశద్రోహుల్ని సమర్థించవచ్చు. విదేశాల తీవ్రవాదులకు ఆసరా, ఆదరణ అందించవచ్చు. కానీ దేశ పౌరులందరి ఓట్లతో ఒకప్పుడు అందలాలెక్కినవారు, ఇప్పుడు పదవులూడగానే ఓటు బ్యాంకుల కోసం దేశద్రోహులవలె ప్రవర్తిస్తుంటే వారిని హెచ్చరించలేని మేధావులు, మాధ్యమరంగాలు ఈ దేశానికి మాత్రమే ప్రత్యేకం.
‘తమ వర్గానికి మేలు జరగాలి’ అని మాత్రమే ఆవేశంతో, ఉన్మాదంతో ఉద్యమాలు నడిపే దేశంలో - అందరి క్షేమం కోసం ఉద్యమించే వారు కనబడటం కష్టమే. కులగర్జనలు, మత సంక్షేమాల కోసం పోరాటాలు వంటి సంకుచితమైన భావజాలాల నుండి - సమగ్ర దేశాభివృద్ధికోసం స్ఫూర్తిమంతంగా పాటుపడే విధానాలు ఎప్పుడు వస్తాయోనని నిజమైన దేశ హితం కోరే వాస్తవవాది ఎదురు చూస్తాడు. ఆ విధానాలకు అండగా నిలిచే మేధావులు రావాలని కలలు కంటాడు.