సంపాదకీయం

మొన్‌సాంటో మాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్‌సాంటో అన్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థ-మల్టీ నేషనల్ కంపెనీ చేస్తున్న దోపిడీని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం అభినందనీయం. కానీ ఈ కృషి ఫలితాలు వ్యవసాయదారులకు దక్కుతాయా? అన్నది హైదరాబాద్ హైకోర్టు చెప్పనున్న తీర్పుపై ఆధారపడి ఉంది! మొన్‌సాంటో సంస్థవారు దశాబ్దికి పైగా బిటి పత్తి విత్తనాలను భయంకరమైన ధరలకు రైతులకు విక్రయించి పెద్దఎత్తున అక్రమార్జనను మూటకట్టుకొనడం గురించి తెలంగాణ ప్రభుత్వం మార్చి ఎనిమిదవ తేదీన హైకోర్టునకు నివేదించింది! బిటి పత్తి విత్తనాల ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించలసి ఉందన్నది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ భోంస్లే న్యాయమూర్తి నవీన్‌రావు ఎనిమిదవ తేదీన చెప్పిన మాట! ఇరవై రెండవ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం బిటి పత్తివిత్తనాల గరిష్ఠపు అమ్మకం ధరలను నిర్ణయించకపోయినట్టయితే హైకోర్టు తగిన చర్యలను తీసుకుంటుందన్నది న్యాయమూర్తులు చేసిన నిర్ధారణ! ఏమయినప్పటికీ ఉన్నత న్యాయస్థానం చెప్పనున్న తీర్పు బిటి పత్తివిత్తనాల అమ్మకం ధరలను నిర్దేశించనుంది. బిటి పత్తివిత్తనాలపై మొన్‌సాంటో కంపెనీ పొందుతున్న మితిమీరిన లాభం- రాయల్టీ-న్యాయస్థానంలో వివాదానికి నేపథ్యం. ఈ రాయల్టీని తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తరువును హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఏకన్యాయమూర్తి-సింగిల్ జడ్జి- ఆదేశించిన ఈ నిలిపివేత ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలన పరిధిలో ఉంది! రైతులకు విక్రయిస్తున్న పత్తి విత్తనాలపై కిలోకు నలబయి రూపాయల చొప్పున మాత్రమే మొన్‌సాంటో కంపెనీకి రాయల్టీ చెల్లించాలని మార్చి నెలలో ఆరంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్థారించినట్టు ప్రచారమైంది. కానీ ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధికారికంగా వెల్లడించలేదు! అనేక ఏళ్లుగా మొన్‌సాంటో సంస్థవారు కిలోకు నూట తొంబయి రూపాయలు చొప్పున బిటి పత్తివిత్తనాలపై రాయల్టీని గుంజుకుంటున్నారు. ఈ రాయల్టీ కిలోకు యాబయి రూపాయలకు మించరాదని తెలంగాణ ప్రభుత్వం నిర్ధారించడం రైతులకు ఊరట కలిగించిన పరిణామం. కానీ హైకోర్టు తాత్కాలికంగా తెలంగాణ ప్రభుత్వపుటుత్తరువును నిలిపివేయడంవల్ల ధరలు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిలోకు తొంబయి రూపాయల చొప్పున మొన్‌సాంటోకు రాయల్టీ నిర్ధారించిందట! రాయల్టీ ఎంత? అన్న వివాదం ఉన్నత సర్వోన్నత న్యాయస్థానాల తీర్పులవల్ల పరిష్కారం కావచ్చు! కానీ బిటి పత్తివిత్తనాలపై మొన్‌సాంటోకు మనం ఎందుకని రాయల్టీని చెల్లించాలన్నది ముద్రల-పేటెంట్స్ చట్టం ప్రకారం పరిష్కారం కావలసిన విస్తృతమైన సమస్య! బిటి విత్తనాలను మన దేశంలో ఎందుకని ఉపయోగించాలి? అన్నది మరింత విస్తృతమైన సమస్య! సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాలన్న కేంద్రరాష్ట్రాల విధానానికి బిటి విత్తనాలు మూలచ్ఛేదం చేస్తున్న గొడ్డళ్లు!
బాసిలస్ తురంజెన్సిస్-అన్న జీవ రసాయనం నిండిన పంటలను బిటి పంటలు! జన్యుపరివర్తక-జెనటిక్ మాడిఫికేషన్ ప్రక్రియ ద్వారా తయారవుతున్న మహా సంకర రకాల పంటలు బిటి విత్తనాలు, వంగడాలు! జెనటిక్ మాడిఫికేషన్ ప్రక్రియ- జిఎమ్-మొదలైన నాటినుంచి కూడ ప్రపంచ వ్యాప్తంగా ఈ జిఎమ్ పంటలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడుస్తున్నాయి. వర్ధమాన దేశాలలో రైతుల ఆత్మహత్యలకు జిఎమ్ ద్వారా తయారవుతున్న బిటి పంటలు కారణమని బ్రిటన్ యువరాజు చార్లెస్ అనేకసార్లు ప్రకటించి ఉన్నాడు. అనేక సంపన్న దేశాల ప్రభుత్వాలు బిటి పంటలను పూర్తిగా నిషేధించి ఉన్నాయి. మరికొన్ని దేశాలలో పాక్షికంగా కొన్ని రకాల బిటి పంటలను నిషేధించి ఉన్నారు. ఇలా సంపన్న దేశాలలో నిషేధానికి గురి అయి ఉన్న జిఎమ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ వంటి ప్రవర్ధమాన దేశాలలోని రైతులకు అంటగట్టడం బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు-మల్టీ నేనల్ కంపెనీలు కొనసాగిస్తున్న ఆర్థిక దురాక్రమణ వ్యూహంలో భాగం! మొన్‌సాంటో అన్నది ఇలాంటి బహుళ జాతీయ వాణిజ్య సంస్థ! బిటి పత్తివిత్తనాల తయారీ కోసం ఈ సంస్థ మన రైతులకు సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చింది. ఇలా సమకూర్చినందుకు భారీగా రాయల్టీని దండుకుంది. విత్తనం ఉత్పత్తి దారులైన భారతీయ కర్షకులకు కిలోకు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే గిట్టుబాటు అవుతోంది. వినియోదారులైన రైతులు మాత్రం కిలోకు దాదాపు రెండు వేల రెండు వందల రూపాయలు చెల్లిస్తున్నారు. మిగిలిన పద్దెనిమిది వందలను మొన్‌సాంటో దాని భారతీయ రూపమైన మహీకో మొన్‌సాంటో సంస్థలు వాటి దళారీలు దిగమింగుతున్నారన్నది తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్ధారణ! ఈ నిర్ధారణను తెలంగాణ ప్రభుత్వం హైకోర్టునకు నివేదించింది!
ముద్రల చట్టం ప్రకారం బిటి పత్తి విత్తనాలపై నిర్ణీత కాల వ్యవధిలో మాత్రమే ముద్రాధికారుల-పేటెంట్ హోల్డర్స్-కు రాయల్టీ లభిస్తుంది! కానీ ఈ కాల వ్యవధి ముగిసిన తరవాత కూడ మొన్‌సాంటో వారు మన దేశంలో రాయల్టీని దండుకుంటున్నారు. చట్టంలోని నిబంధనలను వమ్ము చేయడానికై అదే విత్తనాలను బిటి రెండవ రకం పేరుతో మొన్‌సాంటో వారు పంపిణీ చేస్తున్నారన్నది భారతీయ వ్యాపారులు చేసిన ఆరోపణ! కొత్తరకం విత్తనాలన్న పేరుతో పాతరకం విత్తనాలను అమ్మడం ద్వారా మొన్‌సాంటో అతి తెలివిగా రాయల్టీని పొందగల కాలవ్యవధిని పెంచుకుంది! ఇప్పుడు మూడవరకం బిటి పత్తివిత్తనాలను సైతం మొన్‌సాంటో వారు రూపొందిస్తున్నట్టు ప్రచారమైంది! ప్రపంచీకరణ వ్యవస్థ వర్ధమాన దేశాల ప్రజలను సంపన్నదేశాల వాణిజ్య సంస్థలు దోచుకొనడానికి మాత్రమే దోహదం చేస్తోందన్న వాస్తవానికి మొన్‌సాంటో సంస్థ దోపిడీకి వ్యతిరేకంగా అనేక దేశాలలో ఉద్యమాలు కూడ జరిగాయి! అయినప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం మన దేశంనుండి వెళ్లగొట్టకపోవడం జాతీయ వైపరీత్యం! ఎలాంటి అక్రమాలకూ పాల్పడక పోయినప్పటికీ మన వాణిజ్య సంస్థలను మాల్‌దీవుల వంటి చిన్నదేశం కూడ వెళ్లగొట్టగలుగుతోంది! మొన్‌సాంటో వంటి సంస్థలను మన ప్రభుత్వం వెళ్లగొట్టకపోవడం ప్రపంచీకరణ పట్ల మనకు గల భావదాస్య నిబద్ధతకు నిదర్శనం!
జిఎమ్ ప్రక్రియ ద్వారా తయారయ్యే విత్తనాలలోను వంగడాలలోను బిటి అన్న జీవరసాయనం ఉత్పత్తి అవుతుంది. ఈ రసాయనం పంట ఎదిగే కొలదీ విస్తరించి దిగుబడిని పెంచడానికి దోహదం చేస్తుందట! కానీ ఈ బిటి రసాయనం, మానవుల ఆరోగ్యాన్ని మాత్రమే కాక జంతువుల ఆరోగ్యాన్ని సైతం పాడుచేస్తోంది! వరంగల్ జిల్లాలో బిటి పత్తి ఆకులను మేసిన పశువులు మరణించడం పదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఆందోళనను సృష్టించింది! పత్తిని మానవులు భుజించరు. అందువల్ల బిటి పత్తి వ్యతిరేక ప్రభావం తక్కువ. కానీ బిటి వంకాయలు, బిటి ఆవాలు వంటి ఆహారాలను తిన్నవారికి చిత్ర విచిత్ర వ్యాధులు సంక్రమిస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది! బిటి పత్తిని పండిస్తున్న భూములు కొన్ని ఏళ్ల తరువాత ఇతర పంటలను పండించడానికి పనికిరాకుండా పోతున్నాయన్నది రైతుల అనుభవం! బిటి పత్తి పంటలలో చిత్రవిచిత్రమైన క్రిమి కీటకాలు ఉత్పన్నమై పంటలను భోంచేస్తున్నాయి! పంజాబ్‌లో గత అక్టోబర్‌లో పనె్నండులక్షల ఎకరాలలోని బిటి పత్తిని తెల్ల ఈగలు ధ్వంసం చేసాయి! అందువల్ల విత్తనాల ధర సమస్య కాదు! బిటి పంటలను పండించాలా వద్దా అన్నది వౌలిక సమస్య.