సంపాదకీయం

పట్టణ ప్రస్థానం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లెటూళ్లు ప్రగతికి పట్టుకొమ్మలన్నది పాతబడిన సాంఘికశాస్త్ర పాఠం. పట్టణీకరణ వేగవంతవౌతున్న దృశ్యాన్ని ప్రభుత్వ నిర్వాహకుల ప్రగతిశీల స్వభావులు ప్రశంసా దృక్కులతో వీక్షిస్తూ ఉండడం వర్తమాన వాస్తవం. ఒకప్పుడు మూడు దశాబ్దుల క్రితం మనదేశపు జనాభాలో ఎనబయి శాతం పల్లెల్లో నివసిస్తున్నారని, అందువల్ల గ్రామీణ ప్రగతి, వ్యవసాయ విలాసం దేశ ప్రగతికి సూచిక అని నోరున్న ప్రతి ప్రముఖుడూ హోరెత్తించిన మహా విషయం. ప్రస్తుతం మూడవ వంతుకు పైగా జనం పట్టణాలలోను, నగరాలలోను చేరిపోయి ఉన్నారు. అందువల్ల గ్రామీణ జనాభా శాతం మొత్తం జనసంఖ్యలో అరవై ఐదుశాతానికి పడిపోయింది. ఇరవై ఏళ్లలో వ్యవసాయదారుల సంఖ్య సగానికి తగ్గిపోవడం పట్టణీకరణ ప్రాధాన్యానికి మరో సంకేతం. వ్యవసాయ భూస్వాముల సంఖ్యకూడ ఇలా సగానికి తగ్గిపోయిందట. పరిశ్రమలను స్థాపించడం కోసం, వ్యాపారం చేయడం కోసం, సినిమాలు తీయడంకోసం చిత్ర విచిత్ర విన్యాసాలను చేయడం కోసం ఘరానా భూస్వాములు పొలాలను అమ్ముకొని గ్రామాల నుండి నగరాలకు చేరడం, 1960వ దశకం వరకు కొనసాగిన ప్రహసనం. ఒళ్లు వంచి పనిచేయలేనివారు పొలాలను అమ్ముకొని పట్టణాలకు వెళ్లిపోవడం అప్పటి మాట! అ ప్రవృత్తిని నిరసించడం అప్పటి ప్రగతిశీల మేధావుల రీతి. ఇప్పుడు పొలాలను అమ్ముకొని పల్లెలను వదిలి పట్టణాలకు వెడతుతున్నవారు చిన్నకారు, సన్నకారు రైతులు. వీరంతా నగరాలలో ఆటోలను నడుపుకుంటున్నారు, మట్టిపని చేస్తున్నారు, నిర్మాణ కార్మికులుగా నెలకొంటున్నారు. మహిళలు ఉద్యోగస్థుల, వ్యాపారుల ఇళ్లలో పనికత్తెలుగా కుదిరిపోయారు. ‘‘ఊరికిపోతే తినడానికి తిండి లేదు, చేయడానికి పనిలేదు..’’ అని అంటున్న సామాన్య జనాలు పట్టణాలలో కోకొల్లలు. ఈ వలసల ఫలితంగానే ప్రస్తుతం నలబయికోట్ల మంది పట్టణాలలో నగరాలలో నివసిస్తున్నారని ఇటీవల ఒక ప్రభుత్వేతర సంస్థవారి ఆధ్వర్యంలో వెల్లడైందట. మరో ముప్పయి ఐదేళ్లలో-2050 నాటికి- పట్టణాలలోను, నగరాలలోను ఎనబయి కోట్లమంది నివసిస్తుంటారట. పట్టణీకరణ, పల్లెల నిర్మూలన ఇలాగే కొనసాగినట్టయితే దాపురించనున్న పరిస్థితి ఇది! గ్రామీణ ప్రాంతాలకు నగర వాసులు తిరిగి వెళ్లాలన్నది ప్రభుత్వ నిర్వాహకులకు నిన్నమొన్నటి నినాదం. అంటే గ్రామాలలో జనాభా పెరగాలని, పట్టణాలలోను, నగరాలలోను రద్దీ తగ్గాలని రాజకీయ వేత్తలు ఆకాంక్షించారు. కనీసం ఆకాంక్షిస్తున్నట్టు అభినయించారు. కానీ అదంతా పాతబడిపోయింది. గ్రామాలనుంచి పట్టణాలకు నగరాలకు జనం నిరంతరం వలసరావడం అనివార్యమైన పరిణామ ప్రక్రియ అన్నది ప్రభుత్వ నిర్వాహకుల దృఢవిశ్వాసం. అందువల్ల పట్టణాలలోను నగరాలలోను ఇబ్బడిముబ్బడిగా పదింతలుగా స్థిర పడిపోతున్న గ్రామవాసుల జీవన ప్రమాణాలను పెంచడానికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను వేస్తున్నాయి. లావణ్య నగరాలు-స్మార్ట్ సిటీస్- అమృత పట్టణాలు విస్తరించడమే ప్రగతికి సాకారమన్నది అమలు జరుగుతున్న అధికార వ్యూహం...
వాణిజ్య ప్రపంచీకరణకు పూర్వం, వాణిజ్య ప్రపంచీకరణ వ్యవస్థ స్థిరపడిన తరువాత మన జాతీయ దృక్పథంలోకి చొరబడిన అంతరం ఇది. నరక కూపాల వలె కాలుష్య కేంద్రాలుగా మారిన నగరాలు లావణ్య స్వరూపాన్ని సంతరించుకొనడానికి కేంద్ర ప్రభుత్వం పథకాలను రూపొందించడం ప్రశంసనీయం. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్‌మేషన్-అమృత్-పథకం కింద పట్టణాలను కూడ అభివృద్ధి చేస్తున్నారట. అందువల్ల కాలుష్యం లేని నగరాలు అందమైన నగరాలు ఎప్పటికో అప్పటికి ఏర్పడడం ఖాయం. మురికి దోమలు లేని బస్తీలు నల్లాలో నీళ్లు వచ్చే ఇళ్లు, రద్దీ లేని వీధులు, స్తంభించని రాకపోకలు, పచ్చదనపు పరిమళాలను పంచిపెట్టే చెట్లు ఏర్పడడం లావణ్య నగరాల స్వరూప స్వభావాలు కావచ్చు. అలాగే అమృత పట్టణాలు కూడ జనజీవన వికాసానికి ఆరోగ్యవంతమైన ఆవాసాలు కానున్నాయి. ఈ ఆదర్శస్థితి ఏర్పడిన తరువాత ఇప్పటికే పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు వచ్చి స్థిరపడిన మాజీ గ్రామీణులు మళ్లీ పల్లెలకు వెళ్లడం కల్ల! నరకం వంటి నగరంలోనే జీవించగలుగుతున్న వలస జీవులు, నరకాలు, లావణ్య నగరాలుగా అమృత పట్టణ వాటికలుగా మారిన తరువాత మళ్లీ పల్లెపట్టులకు ఎందుకు పోతారు? వెళ్లరు! ఏమయినప్పటికీ ఇప్పటికే పట్టణాలలో నగరాలలో చేరి ఉన్న జనాభా సుఖమయ జీవనం గడపడం అభిలషణీయం. కానీ దీనివల్ల నగరాలలోను, పట్టణాలలోను జనాభా మరింతగా ఎందుకు పెరగాలి? 2050 నాటికి యాబయి శాతం కంటె ఎక్కువ జనాభా పట్టణాల్లో చేరిపోవడం వల్ల అమృత స్ఫూర్తికి విఘాతం కలుగదా? నగరాల నాజూకుతనం, లావణ్యం-స్మార్ట్‌నెస్-దెబ్బతిని పోదా?
అందువల్ల పట్టణాలలోను, నగరాలలోను నందన వనాలను స్వర్గ్ధామాలను నెలకొల్పడంతోపాటు పల్లెలనుంచి పట్టణాలకు నగరాలకు తరలి వస్తున్న వారి వలసలను నిరోధించడం కూడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకుల ప్రగతిశీల స్వభావానికి ప్రతీక కాగలదు. గొడ్లూ గడ్డివాము లు, రామ భజనలూ, రచ్చపట్లూ, వీధినాటకాలు, తోలుబొమ్మలాటలు, కనుమరుగైపోయినా గ్రామాలు భారతీయతకు క్రమంగా దూరమైపోతున్నాయి. ప్రగతి అంటే సిమెంటు కట్టడాలు, సెల్‌ఫోన్లు, బ్రేక్ డ్యాన్సులు, రాక్ మ్యూజిక్‌లు అన్నది ప్రపంచీకరణ నేర్పుతున్న పాఠం. ప్రపంచీకరణకు భారతీయతకు మధ్య జరుగుతున్న సంఘర్షణలో నగరం,గ్రామం భిన్న ధ్రువాలుగా ఏర్పడిన పరిస్థితి నిన్నటిమాట..నగరాలకు వలసలు వెల్లువెత్తడానికి ఇదీ కారణం. కానీ నేడు గ్రామాలు సైతం నగరీకరణ విష కాలుష్యాలకు గురి అవుతున్నాయి. ఈ కాలుష్యం భౌతికమైనది, బౌద్ధికమైనది కూడ! ఎండో సల్ఫాన్ వంటి పురుగుల మందులు, కృత్రిమమైన రసాయనపు ఎరువులు, జన్యుపరివర్తక ప్రక్రియ ద్వారా రూపొందిన మహా సంకర జాతుల పంటలు, ప్లాస్టిక్ సంచులు పల్లెపట్టులను భౌతిక కాలుష్యంతో ముంచెత్తుతున్నాయి. ఈ కాలుష్యం జనజీవనాన్ని కాటువేసింది. చికిత్సకోసం పట్టణాలకు పరుగులు తీస్తున్నవారు పట్టణాలలో జనసాంద్రతను కాలుష్య సాంద్రతను పెంచారు. స్వయంగా కాలుష్యగ్రస్తులైపోయారు. దేవాలయం శిథిలమైపోవడం, పురోహితులు అదృశ్యమైపోవడం, గోమాత హననమైపోవడం, వికేంద్రీకరణకు ప్రతీకలైన గ్రామీణ వృత్తికళాకారులు అంతరించిపోవడం బౌద్ధిక కాలుష్యం పెంచిన పరిణామం.
పిచ్చుకలకు పిడికెడు గింజలు పెట్టడం భారతీయతలోని వౌలిక నియమం. హరిదాసును, గిరివాసినీ ఆదరించడం సనాతన స్వభావం. పిచ్చుకలకు పిడికెడు గింజలు లేని పల్లెల్లో బిటి పత్తి పండుతోంది. ఆ పత్తిని చిత్రవిచిత్ర క్రిమి కీటకాలు భోంచేసి రైతుల ఆకలిని మరింతగా రగిలిస్తున్నాయి. గ్రామంలో కాని, నగరంలోకాని ప్రగతికి పరాకాష్ట భారతీయుడుగా జీవించగలగడం. ఇలా జీవించడానికి అనువైన పరిస్థితులు ఇప్పుడు పల్లెలలో లేవు...పసుపు, కుంకుమలు గడపలకు లేవు. పెయింట్ కొడుతున్నారు. ప్రగతిశీల ప్రభుత్వ నిర్వాహకులు పల్లెలను నిలబెట్టగలరా?