సబ్ ఫీచర్

దేశం కాని దేశంలో ధీర వనిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఆయుధాలు సముద్ర మార్గం ద్వారా వస్తున్నాయి. ఒక్క ఆయుధం కూడ చేతిలో లేదు.. అదే సమయంలో అల్లరి మూకలు ఆయుధాలతో దాడులు చేయడానికి వస్తున్నాయి.. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండమని ఐక్యరాజ్యసమితి కమాండర్ నుంచి ఆదేశాలు. మరుసటి రోజు అల్లరిమూకలు రాళ్ళు, పెట్రోల్ బాంబులు విసురుతూ హింసకు పాల్పడటం ప్రారంభించాయి. అయినప్పటికీ, ఒక మహిళా బెటాలియన్ ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా అల్లరిమూకలను తరిమికొట్టింది. ఈ ఘటన తరువాతనుంచి లైబీరియా ప్రజలు మహిళా బెటాలియన్‌ను ఇండియన్ సిస్టర్‌గా పిలవడం ప్రారంభించారు. ఈ బెటాలియన్‌కు నాయకత్వం వహించిన ధీర వనితే సీమా దుండియా. ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దడంలో సిద్ధహస్తురాలైన ఆమె ప్రస్తుతం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లో డిప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఉన్నారు.
సీమా తండ్రి సైన్యంలో అధికారిగా పనిచేసేవారు. అందువలన, ఆమె కోల్‌కత్తా, లక్నోలలో చదువుకొన్నారు. హర్యానాలోని రోహ్‌తక్‌లోగల ఎం.డి.యు. విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి.బయోటెక్నాలజీ చదువుతున్న సమయంలో సి.ఆర్.పి.ఎఫ్.లో చేరేందుకు ప్రకటన వెలువడింది. ఆమె తండ్రి ఆర్మీ ఆఫీసర్, ఒక సోదరుడు భారత నౌకాదళంలో పైలెట్‌గా ఉన్నారు. దీంతో పాఠశాల దశనుంచే ఆమెకు ఖాకీడ్రస్ పట్ల మక్కువ పెరిగింది. స్కూల్‌లో ఎన్.సి.సి.క్యాడెట్‌గా, క్రీడాకారిణిగా పలువురి మన్ననలను పొందింది. సి.ఆర్.పి.ఎఫ్.లో చేరేందుకు అవసరమైన పరీక్షలన్నింటిని ఆమె మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణురాలైంది. 1987లో శిక్షణకు వెళ్ళింది. 1991-’92లో జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో టెర్రరిస్టులు చెలరేగిపోతున్నారు. ఆ సమయంలో సీమా అక్కడ సమర్థవంతంగా పనిచేశారు.
పశ్చిమ ఆఫ్రికాలో లైబీరియా ఒక దేశం. స్వాతంత్య్రంకోసం అక్కడ సుదీర్ఘకాలంగా ఉద్యమం జరుగుతున్నది. 2003లో లైబీరియాకు స్వాతంత్య్రం వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా అక్కడ అంతర్యుద్ధం (సివిల్‌వార్) మాత్రం ముగియలేదు. కొన్ని అరాచక శక్తులు దాడులకు, హింసాత్మక ఘటనలకు పాల్పడటం ప్రారంభించాయి. లైబీరియా అధ్యక్షురాలు ఎల్లెన్ జాన్సన్ సిర్లిఫ్ అరాచక శక్తులను అణచివేయడానికి ఐక్యరాజ్యసమితి సహాయాన్ని అర్ధించారు. మహిళల అభ్యున్నతికోసం ఆమెచేస్తున్న ప్రయత్నాలకు గాను 2011లో సిర్లిఫ్ నోబుల్ శాంతి బహుమతి కూడా లభించింది.
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి విన్నపంమేరకు భారతదేశ ప్రభుత్వం ఒక మహిళా బెటాలియన్‌కు లైబీరియా పంపటానికి అంగీరించింది. మొట్టమొదటిసారిగా ఒక మహిళా బెటాలియన్ విదేశాలకు వెళుతుండటంతో, అందరి కళ్ళు ఆ బెటాలియన్ మీద పడ్డాయి. కఠినమైన శారీరక, మానసిక పరీక్షలు నిర్వహించి బెటాలియన్ సభ్యులను ఎంపిక చేసి, బెటాలియన్ నాయకత్వంను సీమా దుండియాకు అప్పగించారు. సీమా నాయకత్వంలో మహిళా బెటాలియన్ లైబీరియా రాజధాని మొన్రోవియా చేరింది. బెటాలియన్‌ను విమానమార్గంలో వారి ఆయుధాలను సముద్ర మార్గంద్వారా పంపారు. వీరు వెళ్ళిన మరసటిరోజు యు.ఎన్. ఆపరేషన్ కమాండర్‌నుంచి సీమాకు ఒక సందేశం వచ్చింది. అల్లరిమూకలు దాడులు చేయడానికి సిద్ధం అవుతున్నాయి. వాటిని నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. అయితే, వీరివద్ద కనీసం ఒక బుల్లెట్ కూడ లేదు. అల్లరిమూకలు హింసాకాండకు దిగాయి. అయినప్పటికీ సీమా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తమ బెటాలియన్‌ను ముందుకు నడిపించారు. టియర్ గ్యాస్, వాటర్ కానన్స్‌ను వినియోగించి, అల్లరిమూకలను తరిమికొట్టారు. దీంతో సీమా నాయకత్వంలోని బెటాలియన్ లైబీరియా ప్రజల హృదయాలను గెల్చుకుంది. అప్పటినుంచి వారు ఈ బెటాలియన్‌ను ఇండియన్ సిస్టర్స్ అని పిలిచేవారు.
సీమా బెటాలియన్‌లో మొత్తం 120 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది 35 సంవత్సరాల వయస్సులోపు వారే. బెటాలియన్‌లోని సభ్యులలో 90శాతం మందికి పిల్లలు ఉన్నారు. ఒకవైపు లైబీరియాలో శాంతిభద్రతలు కాపాడటంతోపాటు, ఇంటిమీద బెంగ పెట్టుకొన్న వారిని మోటివేట్ చేయడంలో సీమా సఫలీకృతులయ్యారు.
లైబీరియా దేశంలో మొత్తం 70నుంచి 80 మాత్రమే పోలీసుశాఖలో ఉండేవారు. దీంతో సీమా లైబీరియాలోని విద్యాసంస్థలకు వెళ్ళి పోలీసుశాఖలో చేరాలంటూ బాలికలకు ప్రేరణ కల్పించారు. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసుశాఖలో చేరిన యువతులకు సీమా శిక్షణ ఇచ్చారు. కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా ఈ మహిళా బెటాలియన్ ఒక అనాథ శరణాలయాన్ని దత్తత తీసుకోవడంతోపాటు, బెటాలియన్‌తోపాటు వచ్చిన వైద్యుల సహాయంతో ఉచిత వైద్యశిబిరాలను నిర్వహించారు. గృహహింస, లైంగిక అత్యాచారాలు లైబీరియాలో నిత్యకృత్యం. అయినప్పటికీ మహిళలు ఎవరూ వీటిపై ఫిర్యాదుచేసే వారు కాదు. సీమా నాయకత్వంలో బెటాలియన్ సభ్యులు స్థానిక మహిళలతో మమేకమై వారిని జాగృతపరిచారు. దీంతో మహిళలు తమపై జరుగుతున్న దాడుల గురించి పోలీసులకు ఫిర్యాదుచేయడం ప్రారంభించారు. మహిళలు చైతన్యం అవ్వడంతో వారిపై జరిగే దాడులు కూడా తగ్గుముఖం పట్టాయి.

- పి.హైమావతి