సంపాదకీయం

‘ఉడుత’కు ఉచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిచ్చుకల మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగింది..తపాలా కార్యాలయంలోను సార్వజనిక భవిష్య నిధి-పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-పిపిఎఫ్-లోను చిన్నమొత్తాలను దాచుకునే వారికి చెల్లిస్తున్న వడ్డీని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం కొండను తవ్వి ఎలుకను పట్టాలన్న మహదాకాంక్షకు అద్దం! ఇలా తపాలా పొదుపు పథకంలోను, పిపిఎఫ్‌లోను చిన్న మొత్తాలను దాచుకునేవారు ప్రధానంగా అసంఘటిత రంగంలోని వారు, భారీ ఆదాయం రానివారు, ప్రభుత్వ ప్రభుత్వేతర ఉద్యోగ నివృత్తులైన వృద్ధులు తదితరులు. ఇలాంటి వారికిస్తున్న వడ్డీ శాతాన్ని తగ్గించడం ద్వారా కేంద్రప్రభుత్వం చెల్లించే వడ్డీ తగ్గుతుంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగి, ద్రవ్య లోటు తగ్గుతుందట! పిపిఎఫ్‌లో చిన్న మొత్తాలను జమ చేసేవారికి ఇంతవరకు లక్ష రూపాయలకు సాలీనా ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు వడ్డీ లభించగా ఏప్రిల్‌నుంచి ఎనిమిది వేల వంద రూపాయల వడ్డీ మాత్రమే దక్కనుంది! పిపిఎఫ్‌లో జమ చేసే మొత్తాలపైన ఉపసంహరించుకునే మొత్తంపైన ఒక గరిష్ఠ పరిమితి వరకు పన్నులేదు. అందువల్ల పన్ను మినహాయింపును పొందడానికై ఉద్యోగులు తమ ఆదాయంలో కొంత శాతం పిపిఎఫ్‌లో జమ చేస్తున్నారు. దశాబ్దుల క్రితం ఈ జమలపై పదకొండు శాతం వరకు వడ్డీ లభించేది. క్రమంగా వడ్డీ శాతం తగ్గింది. ఉద్యోగుల భవిష్య నిధిలో జమ చేసే మొత్తాలపై కూడా క్రమంగా తగ్గిపోయింది! వేల లక్షల కోట్లు రూపాయల నల్లడబ్బును దేశ విదేశాలలో దాచిపెడుతున్నవారు దేశానికి తీరని నష్టం కలిగిస్తున్నారు. ఆ నష్టం తీరదు. అందువల్ల ప్రభుత్వం నష్టాన్ని తీర్చుకునేందుకు ఇలా సామాన్యులను ఎంపిక చేసుకుంది. సుకన్య సమృద్ధి వంటి పథకాలలో డబ్బు దాచేవారు ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం దాన్ని వాడుకోవాలన్నది నిబంధన. దీనిపై కూడ ప్రభుత్వం వడ్డీని తగ్గించింది. కిసాన్ వికాస్ పత్రం, పొదుపు పత్రం, నెలసరి ఆదాయం పథకం, ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం, రికరింగ్-వాయిదాల పద్ధతిలో జమ పథకం వంటి అన్ని ప్రభుత్వ పథకాల మీద చెల్లిస్తున్న వడ్డీలను ఇలా తగ్గించి వేశారు! లక్షలాదిమంది చిన్న మొత్తాల ఖాతాదారులకు లభించే ఆదాయంలో నెలకు వంద రూపాయలు తగ్గినప్పటికీ వారి జీవన వ్యవహారం కొరతలకు గురికాగలదు. దీనివల్ల దొరతనం వారికి కొన్నివేల కోట్ల రూపాయలు అదనంగా లభించవచ్చు. దానివల్ల ఇరవై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పరిమాణంలో వచ్చే విప్లవాత్మకమైన పరివర్తన ఏమిటన్నది సామాన్యులకు బోధపడని మహా విషయం. ప్రభుత్వ నిర్వాహకులైన మాన్యులు మాత్రమే చెప్పగలగాలి!
ఆచరించి బోధించాలన్నది ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విధాన విశ్వాసమన్నది ఇలా ఋజువు కావడం అభివృద్ధి ప్రహసనంలో అపహాస్య ఘట్టం.. చిన్న మొత్తాలను పొదుపు చేయమని ప్రజలకు ప్రబోధించడానికి ముందుగా ప్రభుత్వమే చిన్న మొత్తాలను పొదుపు చేయాలన్నది అమాత్యవర్యుడు ఆవిష్కరించిన ఆచరణ చమత్కృతి-ప్రాక్టికల్ జోక్! ఈ ప్రాక్టికల్ జోక్‌ను ఆయన సామాన్య ప్రజలపై సంధించడం కొండను తవ్వడం...ఎలుకను పట్టుకుంటాడా? తోకను మాత్రమే తెంపుకుంటాడా అన్నది వేచి చూడదగిన మహా విషయం! వడ్డీలను తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో చెలామణి అయ్యే ద్రవ్య రాసిని పెంచాలన్నది ప్రభుత్వం 2014 మే 26నుంచి అమలు చేస్తున్న విధానం. ఈ విధానం అంతకు పూర్వం పదేళ్లపాటు పాలించిన అంతర్జాతీయ స్థాయి ఆర్థిక వేత్త మన్‌మోహన్‌సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని ఐక్య ప్రగతి కూటమి ప్రభుత్వ వారసత్వం! ఇలా ద్రవ్యరాసి పెరగడం వల్ల పెట్టుబడులు పెరిగి ఉత్పత్తులు వృద్ధయి స్థూల జాతీయ ఉత్పత్తి-గ్రాస్ డొమస్టిక్ ప్రోడక్ట్-జిడిపి-పెరుగుదల వేగం పుంజుకుంటుందన్నది సిద్ధాంతం! ఈ సిద్ధాంతాన్ని పదేళ్లపాటు మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం ఆచరించింది. ఈ ఆచరణను మరింత నిష్ఠతో కొనసాగించడం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం మన్‌మోహన్ సింగ్ విధానానికి గౌరవం ఘటిస్తుండడం జనం విస్మయదృక్కులతో వీక్షిస్తున్న దృశ్యం...
అయ్యవారు ఏమి చేస్తున్నారంటే అబద్ధాలను వ్రాసి దిద్దుకుంటున్నారు అని అన్నట్టుగా ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలనుంచి ఉపసంహరించుకునే మొత్తాలపై ఆదాయం పన్ను వేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. పార్లమెంటులోను బయటా గగ్గోలు చెలరేగిన తరువాత ఈ ప్రతిపాదనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది! రాజ్యసభలో ఇంగ్లీషులో ప్రసంగించినా, లోక్‌సభలో హిందీలో ఉపన్యసించినా తన అనర్గళ గళం ద్వారా తరచు హాస్య రసం ఒలికించడం అరుణ్ జైట్లీ విలక్షణత..ఎవరినో ఎత్తిపొడుస్తున్న భావం ఆయన ముఖంమీద దృశ్యమానమవుతు ఉంటుంది! భవిష్య నిధి ఉపసంహరణలపై పన్నును విధించాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకొనడం ద్వారా ఆయనే ఎత్తిపొడుపునకు గురి అయ్యారు! అందువల్ల ప్రతీకారం తీర్చుకొనడానికా అన్నట్టుగా సామాన్యుల పొదుపు ఖాతాకు చిల్లులు పొడిచాడు! త్రేతాయుగంలో రఘురాముడు సముద్రంపై సేతువును నిర్మించాడు! ఆ మహా కార్యక్రమ విజయానికై చిట్టి ఉడుతలు కూడ స్వచ్ఛంద సేవ చేసాయి. వీపుపై ఇసుక రేణువులను మోసుకుని వచ్చి వారధిని ర్మాణానికి దోహదం చేసాయి. ఇప్పుడు ప్రగతి వారధిని నిర్మిస్తున్న ప్రభుత్వం చిట్టి ఉడుతుల నెత్తికి బలవంతంగా బరువులనెత్తుతోంది! ఉడుతలు పారిపోకుండా ఉచ్చులు బిగించి వాటిని జిడిపిని పెంచడమనే మహా యజ్ఞంవైపు నడిపిస్తోంది! అందువల్లనే వడ్డీ శాతాన్ని తగ్గించడం! వడ్డీ తగ్గితే తగ్గింది...ఒకపూట కాఫీ మానేయవచ్చు. కందిపచ్చడి మానేసి చింతపచ్చడితో మెతుకులను మింగవచ్చు! కానీ స్థూల జాతీయ ఉత్పత్తి-జిడిపి-ని వాపునకు గురి చేయడానికై పెట్టుబడులను పెంచడంలో తాము కూడ భాగస్వాములన్న అభిమానాన్ని ఉడుతల వంటి చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులలో బలవంతంగా రగిలించడం ప్రభుత్వం వారి వ్రతం!
ప్రభుత్వం ఇలా చిన్న మొత్తాలను పొదుపు చేస్తున్న వారి భరతం పడుతున్న సమయంలోనే ఆదాయం పన్ను చెల్లించవలసిన లక్షలాది మంది ఘరానాలు తమకు వ్యవసాయం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు లెక్కలు చెబుతున్నారట! ఆర్థిక మంత్రిపై వారు సంధిస్తున్న ఆచరణ చమత్కృతి-ప్రాక్టికల్ జోక్-ఇదీ! వ్యవసాయ ఆదాయంపై పన్ను లేదు మరి...అందువల్ల నల్లడబ్బును ఇలా కృషిఫలంగా చూపించడం ద్వారా ఈ కోటీశ్వరులు ఆ నల్లడబ్బుకు తెల్లరంగును అద్దుతున్నారు! తెల్లముఖం వేసుకోవలసింది ప్రభుత్వం. మొసళ్లను పట్టుకోలేక చిట్టి చేపలను వేటాడినట్టుగా చిన్న మొత్తాలపై వడ్డీని తగ్గించారు! ఆలస్యంగానైనా మళ్లీ విజ్ఞత వికసించి ప్రభుత్వం ఈ చర్యలను రద్దు చేసుకుంటే సామాన్యులు మెచ్చుకుంటారు!