సంపాదకీయం

దిగుతున్న మత్తు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిహార్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించడం హర్షణీయమైన పరిణామం! సామాజిక రుగ్మతలపై పోరాడుతున్న జాతీయతా నిష్ఠకల వారికి ఇది నైతిక బలాన్ని పెంపొందించగలదన్నది నిరాకరించలేని నిజం. ఇంతవరకూ గుజరాత్ రాష్ట్రంలో మాత్రమే సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అందువల్ల సామాజిక వికృతులకు వ్యతిరేకంగా జరుగుతున్న సమరంలో గుజరాత్ ఇలా స్ఫూర్తిప్రదాయకం అయింది. గుజరాత్ స్ఫూర్తితో ఇప్పుడు బిహార్ కూడ మద్యంపై నిషేధాస్త్రాన్ని సంధించడం సామాజిక స్వస్థతకు దోహదకరం. మద్యపానం మన దేశపు సంస్కృతికి సంస్కారాలకు విరుద్ధమైన భయంకర జాడ్యం! ఈ జాడ్యాన్ని తరతరాలుగా భారతీయులు నిరసిస్తూనే ఉన్నారు. కానీ స్వతంత్ర భారత దేశంలో విదేశీయుల దురాక్రమణ నాటి సామాజిక దురాచారాలు వ్యవస్థీకృతం కావడం గొప్ప విషాదం. కొన్ని సంవత్సరాలపాటు మద్యపానాన్ని నిషేధించడం మరికొన్ని ఏళ్లపాటు మద్యపానం చట్టబద్ధం కావడం పునరావృత్తికి గురి అవుతున్న ఘటనా క్రమం! వందశాతం ప్రజలు మద్యపానం చేయకపోవడం, మద్యాన్ని అసహ్యించుకొనడం వేల ఏళ్ల చరిత్రలో సైతం సాధ్యం కాలేదు. కానీ కల్లు, సారా, హాల, మాధ్వీకం, వారుణి వంటి మద్యాలను సేవించడం సామాజిక దురాచారమన్నది గతంలో అందరూ గుర్తించిన వాస్తవం. మద్యం సేవించే వారు సైతం మద్యపానం మానవ సంస్కార విఘాతకరమైన చర్యగా గుర్తించడం చరిత్ర! అందువల్ల తాగుబోతులు రహస్యంగా మద్యాన్ని సేవించే వారు! మద్యం మత్తు దిగేవరకు నాగరికమైన వ్యవహారాలకు దూరంగా ఉండేవారు, అపరాధ భావానికి గురి అయ్యేవారు, దేవాలయానికి వెళ్లేవారు కాదు, ధార్మిక ఉత్సవాలకు హాజరయ్యే వారు కాదు. మత్తు దిగి శరీరం మనస్సు శుభ్రపడిన తరవాత మాత్రమే మళ్లీ సాధారణ వ్యవహారాలలో కలసిపోయేవారు! కానీ క్రమంగా ఈ అపరాధ భావం తొలగిపోయింది. వారానికో పదిరోజులకో మాత్రమే మద్యం తాగినవారు ప్రతిరోజు ఈ మత్తును స్వీకరించడం ఫ్యాషనైపోయింది..పెద్దలు ప్రసిద్ధులు మాత్రమే కాదు విద్యార్థులు యువజనులు తర తమ బేధాలు లేకుండా తాగి బహిరంగంగా తూగుతుండడం, విచ్చలవిడిగా ఊరేగుతుండడం ఫ్యాషనైపోయింది! అపరాధ భావం మచ్చుకైనా కనబడడం లేదు. ఆడపిల్లలు రాత్రిపూట మద్యం తాగి వాహనాలను వేగంగా నడిపి పట్టుబడిన ఘటనలు మన తెలుగు రాజధానిలోనే సంభవించాయి. మగపిల్లలు తాగి రాత్రిపూట వాహనాలను నడుపుతున్నప్పుడు ఆడపిల్లలు మాత్రం ఆ పనులు ఎందుకు చేయరాదు? అని నిలదీస్తున్న సమానతా సిద్ధాంతకర్తలు కూడ ఉన్నారు, వారు కూడ బహిరంగంగానే మద్యం తాగుతున్నారు... గతానికీ వర్తమానానికీ ఇదీ తేడా!
ఈ తేడాకు కారణం ప్రభుత్వాల విధానం. కొన్నాళ్లపాటు మద్యపానం నిషిద్ధం. ఒక రాష్ట్రంలో నిషిద్ధమైన మద్యపానం పక్క రాష్ట్రంలో చట్టబద్ధం! అందువల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1990వ దశకంలో మద్యపానం నేరం, కానీ సరిహద్దు దాటి కర్నాటకలోని కోలార్ చిత్రదుర్గ బళ్లారి బీదర్ జిల్లాలలోకి పోగానే తాగినవాడు నేరస్థుడు కాలేదు...దేశమంతటా మద్యపానాన్ని సర్వసమగ్రంగా నిషేధించాలని రాజ్యాంగంలోని నలబయి ఏడవ అధికరణంలో స్పష్టంగా నిర్దేశించి ఉన్నారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని అందువల్ల అన్నిరకాల మద్యాలను మాదక పదార్ధాలను నిషేధించడం ద్వారా ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఈ అధికరణం స్పష్టం చేస్తోంది. స్వచ్ఛ్భారత్ ఏర్పడడానికి స్వస్థ భారత్ ఏర్పడడం మొదటి దశ! శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం దెబ్బతినిపోతుండడం మద్యపానానికి దశాబ్దుల ఫలితం! మత్తు ప్రభావంతో శరీరం విషమెక్కి భౌతికమైన అనారోగ్యం దాపురిస్తోంది. కానీ మద్యం తాగడం నేరం కాదన్న భావం మానసిక అనారోగ్యానికి చిహ్నం! ఈ మానసిక అనారోగ్యం అధికాధిక విద్యావంతులను ఆవహించి ఉంది! ఓ ఇంటి యజమాని తన ఇంటిలోని ఒక భాగంలో అద్దెకుండిన వారిని బలవంతంగా ఖాళీ చేయించిన ఘటన మూడేళ్ల క్రితం ఢిల్లీ శివారులో జరిగింది. బలవంతంగా ఖాళీ చేయించడం నేరం. కానీ కిరాయికున్నవారిని ఆ యజమాని వెళ్లగొట్టడానికి ఆయన చెప్పిన కారణం మద్యపానం! పురుషులు, మహిళలు మద్యం సేవించి అర్ధరాత్రి వరకు డాన్సులు చేసారట! ప్రచార మాధ్యమాలకు చెందిన ప్రతినిధులు-మహిళలు తాగడం నేరమా? స్ర్తి పురుషులు కలిసి తాగడం తప్పా? తాగి రాత్రిపూట డాన్సులు చేయడం నేరమా? అందువల్ల వారిని ఖాళీ చేయిస్తారా?- అని ఇంటి యజమానిని నిలదీసిన దృశ్యం ప్రముఖంగా ఆవిష్కృతమైంది! దీనికంతటికీ కారణం మద్యపానం తప్పుకాదన్న భావం, అదో గొప్ప భోగమన్న భావం దశాబ్దుల తరబడి వ్యవస్థీకృతం కావడం. మద్యపాన నిషేధాన్ని విధించి ఆ తరువాత తొలగించిన ప్రభుత్వాల చర్యలు ఇందుకు కారణం...
ఈ వైపరీత్యాన్ని సరిదిద్దే దిశగా వివిధ రాష్ట్రాలలోని ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుండడం ఇటీవలి పరిణామం! మరోవైపు మరికొన్ని రాష్ట్రాలలో మద్యం ఇరవై నాలుగు గంటలు నిర్నిరోధంగా వరదలెత్తడానికి సైతం ప్రభుత్వాల విధానాలు దోహదం చేస్తున్నాయి. ఐదు నక్షత్రాల హోటళ్లలో తప్ప మిగిలిన హోటళ్లలో కాని, రెస్టారెంట్-్భజనశాల-లలో కాని, బార్లలో కాని, క్లబ్బులలో కాని, పబ్బులలో కాని మద్యం సరఫరా చేయరాదని కేరళ ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిర్దేశించింది! మద్యం కొన్నవారు ఇళ్లకు వెళ్లి తాగి పడుకోవలసిందే తప్ప బహిరంగ స్థలాలలో తాగి అల్లరి చేయరాదన్నది, నేరాలకు పాల్పడరాదన్నది కేరళ ప్రభుత్వం వారి ఉద్దేశం. ఐదు నక్షత్రాల హోటళ్లలో విదేశీయులకు మాత్రమే మద్యం సరఫరా చేస్తారట! ఈ ఉత్తరువును మద్యం వర్తకులు దళారీలు న్యాయస్థానాలలో సవాలు చేసారు. కానీ కేరళ ప్రభుత్వం చర్యను సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది! ఇది జరుగుతుండిన సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం అర్ధరాత్రి వరకు బార్లలోను పబ్బులలోను మద్యం సరఫరా చేయడానికి అనుమతినిచ్చింది. అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారు రాష్ట్రంలో ప్రతి ముప్పయి వేలమందికి ఒక బార్ చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించింది!
ఈ పరస్పర విరుద్ధ పరిణామాల నేపథ్యంలో సంపూర్ణ మద్యపానం విధించిన బిహార్ ప్రభుత్వం చర్య అభినందనీయం. మద్యం మత్తుకు బానిసలైన వారికి విరక్తి కలిగించడానికై రాష్టమ్రంతటా చికిత్సా కేంద్రాల-డిఅడిక్షన్ సెంటర్స్- నుకూడ బిహార్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందట! రాజ్యాంగంలోని 47వ అధికరణం మార్గదర్శక సూత్రం...అందువల్లనే ప్రభుత్వాలు పాటించడం లేదు. మహాత్మాగాంధీ పుట్టిన గుజరాత్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్నప్పుడు, గాంధీ పుట్టిన దేశంలో మాత్రం ఎందుకు అమలు చేయరాదు. కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా నిషేధపు చట్టాన్ని ఎందుకు చేయరాదు?