ఉత్తరాయణం

ఇద్దరు చంద్రుల తీరు ఒక్కటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణాలో కె.సి.ఆర్, ఆంధ్రలో చంద్రబాబు ఆకర్ష్ విధానంలో తీరు ఒక్కటేనని చెప్పవచ్చు. నిన్న మొన్నటివరకు తెలంగాణా టిడిపి నాయకులు టి.ఆర్.ఎస్‌లో చేరినపుడు విమర్శలు గుప్పించిన టి.డి.పి నేతలు ఆంధ్రాలో చంద్రబాబు చేస్తున్న దానిపై సమాధానం చెబుతారా? ఆకర్ష్ పథకం పేర వై.ఎస్.ఆర్. పార్టీ నాయకులను టిడిపి పదవుల పేరుతో ఆశచూపటం సిగ్గుచేటు. భవిష్యత్తులో ఏ పార్టీలో అధికారంలోకి వస్తే ఆ పార్టీల్లో వలసలు వెళ్ళి, తదనంతరం వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఇలా వలసలు పోతుంటే ప్రజాస్వామ్యానికి విలువేముంటుంది? చర్య లు తీసుకోమని గవర్నర్‌కు స్పీకర్‌కు వినతులు ఇచ్చిన నాయకులే అధికార పక్షంలోకి పోతుంటే అర్ధమేంటి? వలసలను నిరోధించటానికి రాజ్యాంగపరమైన చట్టాలు అమలుపరచాలి. నమ్మి ఓటు వేసిన ఓటరు పరిస్థితి ఏమిటి?
- అయనం రఘురామారావు, ఖమ్మం
రిజర్వేషన్లకు పేదరికమే ప్రమాణం
దేశంలో రిజర్వేషన్ల ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. మొన్న గుజరాత్, నిన్న ఆంధ్ర, నేడు హర్యానాలో రిజర్వేషన్లు కోసం చేపట్టిన ఉద్యమాలు హింసాత్మకంగా మారి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. అసలు రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడిన వారికోసం నిర్దేశించబడినవి. గతంలో 70-80 శాతం వెనుకబడిన వర్గాలవారు ఆర్థికంగా వెనుకబడిన కారణంగా వారిని అభివృద్ధిపధంలో నడిపించేందుకు అంబేద్కర్ వంటి సంఘ సంస్కర్తలు రిజర్వేషన్ల వెసులుబాటు కల్పించారు. ఇప్పు డు పరిస్థితులు మారాయి. అగ్రకులాల వారు కూడా కొంతమంది ఆర్థికంగా వెనుకబడిన వర్గంలో చేరారు. వీరికి రిజర్వేషన్లు కల్పించేందుకు ఎటువంటి ప్రతిపాదనా లేదు. ఆర్థికంగా పురోగమించిన వారికి రిజర్వేషన్లు కల్పించడం బూడిదలో పన్నీరు పోయడంతో సమానం. వార్షిక ఆదాయం ప్రాతిపదికపై కుల, మత, వర్ణ, వర్గ, బేధాలకు అతీతంగా రిజర్వేషన్లు కల్పిస్తే సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగుతాయి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
హరిత తెలంగాణకు కృషి చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల విస్తరణ పేరిట గతంలో వందలాది చెట్లను విచక్షణ రహితంగా కొట్టి వేసారు. ఆ స్థానంలో 1:50 నిష్పత్తిలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తామని ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలికి హామీ యిచ్చింది. అంతేకాక క్రొత్త రాష్ట్రం ఏర్పడ్డాక హరిత తెలంగాణ పేరిట రాష్టమ్రంతటా యాభై లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో ప్రభుత్వం మొక్కల పంపిణీతో పాటు వాటి సంరక్షణను ప్రోత్సహించే కార్యక్రమాలను తొలుత విస్తృతంగా చేపట్టినా తర్వాత పనుల్లో మందకొడితనం చోటుచేసుకుంది. వృక్షాలు నరికేయడంలో చూపించిన అత్యుత్సాహం ఆ స్థానంలో మొక్కలు నాటడం పట్ల ఒక శాతమైనా కనబరచకపోవడం బాధాకరం. ఇప్పటికి తెలంగాణ రాష్ట్రం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు చోటుచేసుకొని కరువు పరిస్థితులు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని హరిత నిలయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి.
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ
ప్రక్షాళన అవసరం
పంచాయతీరాజ్ శాఖ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు రావాలని 2008వ సంవత్సరంలో 11 రోజులు సమ్మె చేయడం జరిగింది. అన్ని డిమాండ్లు పరిష్కారం చేస్తామని అప్పట్లో హామీ యివ్వగా, చాలా డిమాండ్లు పరిష్కారం కాకుండా మూలనపడ్డాయి. దేశ అభివృద్ధిలో ఎంతో కీలకం అయిన పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలాంటి అధికారాలు లేకుండా అచేతనంగా మారిపోయంది. పంచాయతీరాజ్ వ్యవస్థకు నూతన జవసత్వాలు తీసుకుని రావాలి. ఈ వ్యవస్థకు నిధులు విధులు ఎక్కువగా వుంటే సంతోషించదగ్గ విషయం అవుతుంది.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్
గుదిబండగా ప్రజాపంపిణీ
పేదలకు సబ్సిడీ సరుకులు అందించే ప్రజాపంపిణీ వ్యవస్థ గుంటూరు జిల్లాలో ప్రజలకు గుదిబండగా మారింది. ఇటీవల క్రొత్తగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ మెషిన్లు తరచుగా మొరాయిస్తున్నాయి. వేలిముద్రలు సరిపోల్చడంలో ఏర్పడుతున్న అవరోధాల కారణంగా రేషన్ షాపుల చుట్టూ పదే పదే చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. ఇటీవల క్రొత్తగా మంజూరైన రేషన్ కార్డుల డేటా తప్పుల తడకగా వుండడంతో తిరిగి మండల కార్యాలయాలలో దరఖాస్తులు చేసుకోమని అధికారులు ఆదేశిస్తున్నారు. టెక్నికల్ సమస్యల కారణంగా సంక్రాంతి సమయంలో సగం మంది లబ్దిదారులకు సరుకులు అందించడంలో రేషన్ డీలర్లు విఫలమవగా ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. పౌరసరఫరాల ఉన్నతాధికారులు తక్షణం జోక్యం చేసుకొని ప్రజల ఇబ్బందులు నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
- ఎం.కనకదుర్గ, తెనాలి
వీధికుక్కల బెడద
జివిఎంసి వారు చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండటం లేదు. కుక్కలు విజృంభిస్తున్నా వాటిని నిరోధించేవారు లేకపోవడం శోచనీయం. గతంలో అనేకసార్లు చిన్నపిల్లలు వీధికుక్కల బారిన పడిన సందర్భాలున్నాయి. జివిఎంసి వారు కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం