సంపాదకీయం

మన ‘కుబేరుల’ మాట..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనామా పత్రాలుగా ప్రసిద్ధిని గడిస్తున్న నల్లడబ్బు దస్త్రాలు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ పదవీచ్యుతికి దోహదం చేయగలదన్న ప్రచారం ఊపందుకుంది. కానీ కామెరాన్‌తోపాటు ఆరోపణలకు గురి అయిన ఇతర దేశాల ప్రభుత్వాధినేతలు వ్యూహాత్మక వౌనాన్ని పాటిస్తున్నారు. పనామా పత్రాలు బయటపడిన నాటినుంచి కామరాన్ వివరణలను ఇచ్చుకుంటూనే ఉన్నాడు. ఏ విదేశీయ సంస్థలోను తనకు వాటా లు లేవన్నది బ్రిటన్ కన్సర్వేటివ్ పార్టీకి చెందిన ఈ రాజకీయ వేత్త చేసిన సరికొత్త స్పష్టీకరణ! కానీ వివిధ దేశాల ప్రభుత్వాధినేతలెవ్వరూ ఇంతవరకు ఎలాంటి స్పష్టీకరణలను ఇవ్వలేదు. ఇలా ఇవ్వకపోవడానికి ఆయా దేశాలలోని అంతర్గత రాజకీయ పరిస్థితులు కూడ కారణం! చైనా అధ్యక్షుడు ఝీ జింగ్‌పింగ్ బంధువులకు కూడ విదేశాలలోని నకిలీ కంపెనీలలో వాటాలున్నట్టు మొదట ప్రచారమైంది. ఆ తరువాత ప్రతిస్పందన గురించి కాని, ప్రతి క్రియల గురించి కాని వార్తలు లేవు! రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ తన సహజ ధోరణిలో నిమ్మకు నీరెత్తినట్టు నిశ్చలంగా ఉండడం విచిత్రం కాదు. ఎందుకంటే పాశ్చాత్య దేశాలలో వెల్లడయ్యే సత్యాల గురించి ఐరోపా దేశాల విమర్శల గురించి పట్టించుకోకపోవడం పుతిన్ సహజ స్వభావం! ఐస్‌లాండ్ ప్రధానమంత్రి సిగ్ ముందర్ డేవిడ్ గుణ్‌లాగ్‌సన్ మొదట బుకాయించినప్పటికీ ఆ తరువాత రాజీనామా చేయవలసి వచ్చింది. అంతర్జాతీయ సమాజంలో మాత్రమే కాదు ఐరోపా సమాజంలో సైతం ఐస్‌లాండ్‌కు పెద్ద ప్రాధాన్యం లేదు. ప్రాధాన్యం ఉన్న అర్జెంటీనా, ఉక్రెయిన్ ప్రభుత్వాధినేతలు తమకు కాని తమ బంధువులకు కాని విదేశీయ నకిలీ సంస్థలలో నిధులు నిక్షిప్తమై ఉన్నాయా లేదా అన్న విషయం స్పష్టం చేయలేదు. నిరంకుశ మత రాజ్య వ్యవస్థ ఉన్న సౌదీ అరేబియాలో పాలకుల సంపద ఎంత ఉన్న విషయం అడిగేవారు కాని ఆరా తీసే వ్యవస్థ కానీ లేదు, అయినప్పటికీ సౌదీ అరేబియా అధినేత సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్ రెహిమాన్ అల్‌సౌద్ కూడ తమ దేశంలోకాక పనామా నకిలీ కంపెనీలలోను, ఇతర దేశాలలోను డబ్బు దాచినట్టు న్యాయ వ్యవహారాల వాణిజ్య సంస్థ మొసాక్‌ఫోన్‌సేకా వెల్లడి చేసిన కోటి పదిహేను లక్షల దస్త్రాలలో దాగి ఉందట! కానీ వీళ్లెవ్వరూ ఇవ్వని వివరణను కామెరాన్ ఇచ్చుకోవడం ఆయన వ్యక్తిగత వ్యవహారంలోని పారదర్శకతకు చిహ్నం! నాలుగవ తేదీన పనామా పత్రాలు ఆవిష్కరణ జరిగిన తరువాత ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రభుత్వాధినేతల,రాజకీయ వేత్తల పీఠాలు కదలిపోతాయని ఆర్భాటంగా ప్రచారమైంది. ఐస్‌లాండ్ ప్రధాని పీఠం తప్ప ఇతరుల పీఠాలు కదలుతున్న జాడ లేదు. పనామా పత్రాలద్వారా వెల్లడైన అక్రమ ధనం గురించి ఆయా దేశాలలో ప్రయత్నాలు జరుగుతున్నాయా? లేక ఆర్భాటం జరుగుతున్న స్థాయిలో అవినీతి పెట్టుబడుల పరిమాణం లేదా?
కామెరాన్ గోడకట్టినట్టు అబద్దాలు చెప్పగల వ్యూహకర్త అయినట్టయితే ఆయన ఇచ్చిన స్పష్టీకరణలో అవినీతి నక్కి ఉండవచ్చు! కానీ ఆయన చెప్పిన మాటలు తార్కికంగానే ఉన్నాయి. ఆయన తండ్రి విదేశీయ వాణిజ్య సంస్థలలో పెట్టుబడులు పెట్టాడట! ఈ పెట్టుబడులను తాను 2010లో ప్రధాని కావడానికి పూర్వమే వదిలించుకున్నట్టు కామెరాన్ చెప్పాడు. తన తండ్రికి చెందిన విదేశీయ సంస్థలలోని ఐదు వేల వాటాలను కామెరాన్ ముప్పయి రెండు వేల పౌండ్ల-దాదాపు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకు 2010 జనవరిలోనే అమ్మేశాడట! ఈ ఆదాయంపై తాను పన్నుకూడ చెల్లించానన్నది కామెరాన్ చెప్పిన మాట! తన తండ్రినుంచి మూడు లక్షల పౌండ్ల-దాదాపు రెండు కోట్ల డెబ్బయి లక్షల-ఆస్తిని వారసత్వ సంపదగా పొందినట్టు కూడ కామెరాన్ చెప్పాడు! ఈ విషయాలను బ్రిటన్‌లోని ప్రతిపక్షాలుకూడ నిరాకరించడంలేదు. బ్రిటన్ మూడు నాలుగు శతాబ్దులపాటు ప్రపంచ దేశాలను దారుణంగా కొట్టిన ఆర్థిక దురాక్రమణ శక్తి...కానీ బ్రిటన్ అంతర్గత ప్రజాస్వామ్య వ్యవస్థలో మిగిలిన ప్రజాస్వామ్య దేశాలలో కంటె పారదర్శకత ఎక్కువగానే ఉంది. ఈ సంగతి కామెరాన్ వెల్లడి వల్ల మరోసారి స్పష్టమైంది!
మన దేశంలోని అనేక మంది రాజకీయ వేత్తలకు కామెరాన్ కంటె ఎక్కువగానే ఆస్తులు ఆదాయం ఉన్నట్టు ఇలా స్పష్టమైంది! ఆయన అబద్ధాలు చెబుతుండవచ్చునన్న అనుమానాన్ని పక్కన పెడితే రాజకీయవేత్తలకు ఇతర ప్రయోజనాలను కలిగించే కార్యాక్రమాలు ఉండరాదని ఆయన చెప్పిన మాట మాత్రం ఒక మార్గదర్శక సూత్రం. ప్రధానంగా మన దేశంలోని రాజకీయ వేత్తలలో ఎక్కువమందికి పెద్ద పెద్దవ్యాపారాలున్నాయి, బ్రిటన్‌లోని రాజకీయ వేత్తలకు కూడ ఉన్నాయి. తనకు అలాంటి వ్యాపారాలు లేవని కామెరాన్ చెప్పడం బాగుంది! కామెరాన్‌కు ఇలా విదేశాలలో వాటాలు పెట్టుబడులు ఉన్నాయన్న ఆరోపణను ఆయన నిరాకరించిన తరువాత ఫోన్‌సేకా సంస్థవారు కూడ వౌనం వహించారు! అంటే ఈ సంస్థవారి పత్రాల ప్రామాణికత గురించి చర్చకు ఆస్కారమేర్పడింది. కామెరాన్‌కు గతంలో విదేశాలలో పెట్టుబడులున్నాయన్న వాస్తవాన్ని ప్రస్తుతం కూడ ఆయనకు విదేశాలలో నిధులున్నట్టుగా వక్రీకరించినట్టయింది! ఇది ప్రచారమైన తరువాత సంబంధం లేని రాజకీయ అంశాలతో ఈ వ్యవహారాన్ని ముడిపెడుతున్నారు. ఐరోపా సమాఖ్యనుండి బ్రిటన్ వైదొలగాలా వద్దా అన్న వివాద పరిష్కారం కోసం జూన్ 23న జనవాక్య సేకరణ-రెఫరెండం-జరుగనుంది. ఈ జనవాక్య సేకరణకు పనామా పత్రాలకు మధ్య సంబంధం లేదు. కామెరాన్ ఐరోపా సమాఖ్యలో బ్రిటన్ కొనసాగాలని కోరుతున్నాడు. సమాఖ్యకు అనుకూలంగా వోట్లు వేయాలని కోరుతూ ఇరవై ఐదు లక్షల ఇళ్లకు ఆయన కరపత్రాలను పంపించాడట! ఇందుకోసం ఎనబయి కోట్ల రూపాయలకుపైగా ఖర్చయిందట! ఈ ఖర్చునకు పనామా పత్రాలకు సంబంధం లేదు. కానీ ఆయన రాజీనామా కోరుతున్న వారు ఈ ఖర్చును ప్రచారం చేస్తున్నారు. ఈ ఖర్చు ప్రభుత్వం పెట్టిన ఖర్చు! ఆయన భార్య సామంతా కామెరాన్ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్నది మరో ప్రచారం. ఇది నిజమైతే నిబంధనల ప్రకారం ఆమెపై చర్యలను తీసుకోవాలని కోరవచ్చు. కానీ ఎప్పటినుంచో జరుగుతున్న ఈ దుబారాను పనమా పత్రాలతో ముడిపెడుతున్నారు.
కామెరాన్ వాటాల వివాదం వల్ల మన దేశంలోని వివాదగ్రస్తుల వ్యవహారం చర్చకువస్తోంది. పనామా పత్రాలు బయటపడిన తరువాత నిబంధనల మేరకు విదేశాలలో పెట్టుబడులు పెట్టినట్టు చెబుతున్న సినిమా తారలు, ఇతర వ్యాపారులు ఈ సొమ్మును స్వదేశంలో ఎందుకని వినియోగించలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పడంలేదు! ఐరోపావారు అమెరికా వారు చైనావారు కొరియా మదుపరులు తెగబలిసి ఉన్నారు కాబట్టి తమ దేశపు అవసరాల కంటె మించిన పెట్టుబడులను ఇతర దేశాలకు తరలిస్తున్నారు. కానీ మన దేశం తీవ్రమైన పెట్టుబడుల కొరత ఉన్నట్టు మన ప్రభుత్వాలు ప్రపంచీకరణ మొదలైన నాటి నుంచి చాటింపు వేస్తున్నాయ. బయటదేశాల వారి పెట్టుబడులను కోరుతున్నాయ. అందువల్ల ఈ సినీ జీవులు, వ్యాపారులు తమ నిధులను మన దేశంలోనే పెట్టుబడులు పెట్టి ఉండవచ్చు! మాతృదేశానికీ విదేశాలకు మధ్యగల అంతరం గురించి ధ్యాస నశించడం ప్రపంచీకరణ వైపరీత్యం.