మెయన్ ఫీచర్
మహాకూటమికి నితీశ్ గ్రీన్ సిగ్నల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పలువురు ఊహిస్తున్నది చివరకు జరగనే జరిగింది. బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ 2019 ఎన్నికలకోసం జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నించనున్నట్టు బహిరంగంగా ప్రకటించారు. భాజపా తిరిగి అధికారంలోకి రాకుండా నిలువరించడం తమ ఉద్దేశమని, అందుకోసం కాంగ్రెస్,వామపక్షాలతో సహా వీలైనన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. చివరకు ఎంత పెద్ద కూటమి తయారవుతుందో, వారి లక్ష్యం నెరవేరుతుందో లేదో ఈ దశలో ఎవరైనా తమకు తోచిన ఉహాగానాలు చేయగలరు తప్ప, నిర్థారణగా చెప్పగలగడం అసాధ్యమైన పని. వచ్చే సాధారణ ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల వ్యవధి ఉన్నది. ఈలోగా ఏమేమి పరిణామాలు చోటు చేసుకునేదీ తెలియదు. అందువల్ల, చివరకు ఏమయ్యేదీ కాలానికి వదలివేసినా, ఈలోగా నితీశ్ ప్రకటన ఆసక్తిగా గమనించవలసిన పరిణామమవుతున్నది.
నితీశ్ కుమార్ ఈనెల 11వ తేదీన ఈ ప్రకటన చేయడానికి మూడు రోజులలో రెండు గమనార్హమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకరోజు ముందు 10వ తేదీన ఆయన జెడి(యు) జాతీయ అధ్యక్షునిగా శరద్ యాదవ్ స్థానంలో ఎన్నికయ్యారు. అంతకు ముందు వారంలో ఉత్తర ప్రదేశ్‌లో, ఇతరత్రా గల వెనుకటి జనతా పరివార్ పార్టీలను తిరిగి విలీనం చేసే చర్చలు ఒక విడత జరిగాయి. జనతా పరివార్ విలీనం చర్చలకు, తక్షణ సందర్భం యుపిలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు. అక్కడ బిజెపికి ప్రత్యామ్నాయంగా ఎస్‌పి, బిఎస్‌పిలు ఉన్నాయి. వాటిలో ఎస్‌పి లోగడ జనతా పరివార్‌లో భాగమైనా, జనతా చీలికల తర్వాత స్వయంగా బలపడి స్వతంత్ర వైఖరిని అవలంబిస్తూ వస్తున్నది. ఇతర ప్రతిపక్షాలతో చెలిమి మాటలు లోగడ కూడా జరిగాయి కాని, ములాయం సింగ్ వైఖరిలో ప్రతిసారి అవకాశవాదం తప్ప స్థిరత్వం ఎప్పుడూ కనిపించలేదు. ఆయనది సోషలిస్టు నేపథ్యం అయినా, సైద్ధాంతికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడో ఆగిపోయింది. ఏ కూటమి అయినా రాష్ట్ర స్థాయిలో అధికారం కోసం తమకు ఎంత ఉపయోగపడుతుందన్నది ఆయన మొదటి అంచనా. ప్రతిపక్షాలకు ప్రధానమంత్రి అవకాశం వచ్చినట్లయితే అది తనకు లభించగలదా లేదా అన్నది రెండవ అంచనా. కనుక, యుపి జనతా పరివార్ సమావేశానికి తన పార్టీ ప్రతినిధి హాజరు కాకపోవడానికి ఈ నేపథ్యంలో చూడాలి. ఎస్‌పికి, భవిష్యత్తు మహా కూటమికి మధ్య రాగల కాలంలో సంబంధాలకు ఇది ఒక సూచిక అయినా కావచ్చు కూడా. రాజకీయాలలో ఏదీ శాశ్వతం కాదు. కాని ఇది ఒక సూచిక అనడాన్ని కొట్టిపారేయలేం.
దేశంలోకెల్లా అత్యధిక లోక్‌సభ స్థానాలు గల యుపిలో మహాకూటమి విజయం మొత్తం రాజకీయానికి కీలకమవుతుంది. ఆని అందుకు అక్కడనే తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే పరిస్థితులున్నాయి. పైన పేర్కొన్నది ఒకటి కాగా, ఎస్‌పితో సమానమైన బలం గల బిఎస్‌పి జాతీయ కూటమిలో భాగం కాగల అవకాశం లేదు. ఎన్నికల అనంతర పరిస్థితులను బట్టి మహాకూటమికి బయటినుంచి మద్దతు నివ్వడం లేదా తటస్థంగా ఉండటం వంటిదేమైనా చేయవచ్చు. ఈ రెండు పార్టీలను మినహాయిస్తే ఉత్తర ప్రదేశ్‌లోజనతా పరివార్ పార్టీలకు గల స్వంత బలం చాలా తక్కువ. మహాకూటమిలో భాగమయ్యే అవకాశమున్న కాంగ్రెస్, కమ్యూనిస్టుల పరిస్థితి కూడా అదే. ఈ విషయాలన్నీ చెప్పుకున్నప్పుడు మహాకూటమికి దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో అంతా నిరాశాజనకంగా కనిపిస్తుంది. కాని ఇది రాజకీయంలోని ఒక పార్శ్వం. దీనికి రెండవది ఒకటుంది. మహా కూటమి ప్రాథమిక లక్ష్యం భాజపాను నిలువరించడం. యుపిలో తమ పరిమితులు ఏమిటో వారికి తెలుసు. కనుక కావలసింది ములాయం, మాయావతి పార్టీలు అధిక భాగం స్థానాలు గెలిచి, భాజపాకి పోయిన సారి కళ్లు మిరుమిట్లు గొలిపేట్లు వచ్చిన సీట్ల సంఖ్య వీలైనంత పడిపోవడం ఆ రాష్ట్రానికి సంబంధించినంతవరకు అదే పరిమిత లక్ష్యమవుతుంది. అయితే ఎన్‌డిఎను ఓడించేందుకు అందరూ ఒకటవుతున్న వాతావరణం ప్రతిపక్ష శిబిరానికి క్షేత్ర స్థాయిలో కలిసివచ్చే అంశం.
ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన జనతా పార్టీ, జనతాదళ్, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రయోగం వైఫల్యం దరిమిలా ఉత్తర భారత, మధ్య భారత ప్రజలకు కూటమి రాజకీయాల పట్ల నమ్మకం దెబ్బతిన్నది. కాని మనం గ్రహించవలసిన రాజకీయ సూక్ష్మం ఏమంటే, నమ్మకం దెబ్బతినడం కూటమి రాజకీయాల పట్ల తప్ప, ప్రత్యామ్నాయ రాజకీయాల పట్ల కాదు. గంగానదీ పరీవాహక ప్రాతంలో దశాబ్దాల పాటు సాగిన రైతు రాజకీయాలు, సోషలిస్టు రాజకీయాలు, కమ్యూనిస్టు రాజకీయాలు, కుల రాజకీయాల ప్రభావంతో అక్కడ అస్తిత్వ స్పృహలు బాగా పెరిగాయి. ప్రస్తుతం కుల రాజకీయ రూపంలో అస్తిత్వ రాజకీయం పనిచేస్తున్నది. ఏదైనా అసాధరణత ఏర్పడినప్పుడు గాని అందుకు భంగం కలగదు. కనుక, కూటమి రాజకీయంపై విశ్వాసం తగ్గినా అస్తిత్వ రాజకీయం కొనసాగుతున్నది కనుక అది మహా కూటమికి కలిసివచ్చే అంశం.
యుపి, బిహార్‌లలో ఎన్‌డిఎ 2014లో 120కి 104 స్థానాలు గెలిచింది. ఆ విజయం అంతటి స్థాయిలో లేనట్లయితే మొత్తం మీద ఆధిక్యత వీలయ్యేది కాదు. కనుక ఆ రెండు రాష్ట్రాలలో భాజపాని నియంత్రించగలిగితే మహా కూటమి లక్ష్యం చాలావరకు నెరవేరినట్లే. మహాకూటమి బలం విషయమై బిహార్‌కు సంబంధించినంతవరకు సందేహం లేదు. అక్కడ వారిది ప్రత్యక్ష బలం అవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో జెడి(యు), ఆర్‌జెడి, కాంగ్రెస్‌తో లేని వామపక్షాలు ఈసారి వారితో చేరే అవకాశం ఉంది కూడా. ఇక యుపిలో అప్పటి పరిస్థితిని బట్టి ఎస్‌పితో ప్రత్యక్ష లేదా పరోక్ష కూటమి కావచ్చు. బిఎస్‌పిది ఒంటరి పోరు అవుతుంది కాని భాజపాతో కలిసే అవకాశం లేదు. మహా కూటమి ఇటువంటి కలయికలపై ఎంత ఆశపెట్టుకుంటున్నదో, ఎన్‌డిఎ ప్రభుత్వం పట్ల ప్రజాదరణ తగ్గుతున్నదనే అంచనాపై అంతకు మించిన ఆశ పెట్టుకుంది. అందువల్ల మహా కూటమి లక్ష్య సాధనకు ఈ రెండవ అంశం కీలకం కానున్నది.
దీనినట్లుంచితే మహాకూటమి పరిస్థితి బిహార్, యుపికి బయట ఏమిటి? అది అర్థమయేది కూటమిలో ఎవరెవరు ప్రత్యక్షంగా చేరుతారు, ఎవరు పరోక్షంగా వారి వెంట ఉంటారు, ఎవరు ఎన్నికల తర్వాత మద్దతివ్వవచ్చు అనే మూడు ప్రశ్నలపై ఆధారపడి ఉంటుంది. కూటమి ఏర్పాటుకోసం స్వయంగా చొరవ తీసుకుంటున్న జనతా పరివార్ పార్టీలకు బిహార్, యుపికి బయట అక్కడక్కడ కొంత ఉనికి ఉన్నది కాని, దాని ఆధారంగా ఎన్నో కొన్ని సీట్లు గెలవగలది కర్ణాటక, ఝార్ఖండ్‌లలో మాత్రమే. కనుక ఇంతపెద్ద దేశంలో వారికి పునాది వంటి బలమయ్యేది యుపి, బిహార్‌లు. వాస్తవానికి గత ప్రయోగాలు కూడా ఈ పునాది పైనే వౌలికంగా ఆధారపడ్డాయి. ఈ రెండు రాష్ట్రాలు గాక అప్పుడు పశ్చిమ, మధ్య భారత రాష్ట్రాలు కూడా కలిసి వచ్చాయి. అవి ఇపుడా పరిధిలో లేవు. కనుక ఇతర పార్టీలపై ఆధారపడాలి. తాము ఆలోచిస్తున్న కూటమి స్వరూపం గురించి 11వ తేదీనాటి మీడియా సమావేశంలో నితీశ్ కూడా స్పష్టంగానే సూచించారు. అన్ని పార్టీలు విలీనం కావలసిన అవసరం లేదని, కూటమి, ఫ్రంట్ వంటి ఇతర రూపాలు కూడా ఉన్నాయని అన్నారు. అది ఎట్లున్నా అందరి మధ్య ‘‘ఆలోచనలు, కార్యక్రమాలు, ఒకటి కావడం’’ ప్రధానమని ప్రకటించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలలో గల పార్టీలో కాంగ్రెస్, వామపక్షాల వంటి జాతీయ పార్టీలను అట్లుంచుదాం. అవి కూటమిలో భాగం కావడం గురించి సందేహం ఉండనక్కర లేదు. కాంగ్రెస్‌కు గత్యంతరం లేదు కూడా. ఒకప్పటి ఏకఛత్రాధిపత్యాలు, అహంభావాల స్థితి నుంచి వారు చాలా ముందుకు వచ్చారు. ఇటీవలి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ భాగస్వామి కావడమే అందుకు నిదర్శనం. ఇక వామపక్షాలు 2014 ఎన్నికల అనంతరం ఒంటరిపోరు అటూ కఠోరమైన తీర్మానాలు అయితే చేసాయి, అదే ప్రకారం బిహార్‌లో ఒంటరిగా పోటీ చేసాయి గాని ఇప్పుడు స్థితి మారిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన గల భాజపాని నిలువరించాలంటే మహాకూటమిలో చేరక తప్పదన్న అభిప్రాయానికి వారు అంతర్గతంగా వచ్చారన్నది మనం వింటున్న మాట. తార్కింగా చూసినా ఇది నిజమయ్యే అవకాశమే ఉంది.
నిజానికి కాంగ్రెస్‌దే జాతీయ స్థాయలో ప్రధాన బలమవుతుంది. వారికి అన్ని రాష్ట్రాల్లో పునాది ఉంది. వామపక్షాలు పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపురలలో బలం, కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఉనికి ఉంది. కాని ముఖ్యం కాగలదీ వివిధ ప్రాంతీయ పార్టీల వైఖరి. గంగా పరీవాహక ప్రాంతంలో, కాంగ్రెస్,వామపక్ష రాష్ట్రాలలో, వివిధ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం (అధికారపక్షాలుగానైనా, ప్రతిపక్షాలుగానైనా) గల రాష్ట్రాలలో కూటమికి ఎంత కలిసివస్తుందనేదానికి సైద్ధాంతికను బట్టి కూటమి లక్ష్యం నెరవేరడం, నెరవేరకపోవడం ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోక తప్పనిది ఒకటుంది. ప్రాంతీయ పార్టీలు జాతీయ కూటాలలో ఎవరి పక్షం వహించగలవన్నది చెప్పడం కష్టం. పరిస్థితి ఒకప్పటివలె సిద్ధాంతం అనే దానిపై ఆధారపడి ఉండటం లేదు. ఇపుడు వారికి కావలసింది తమ అధికారం నిలబడడం, లేదా అధికారంలోకి రావడం, తమ ప్రయోజనాలు నెరవేరడం మాత్రమే. అంతకు మించిన మేనిఫేస్టో లేకుండా పోయింది. ఇందుకు మినహాయింపు అయే పార్టీ ఏదైనా ఉందా అంటే కష్టపడి వెతకవలసిందే. మరొక మాటలో చెప్పాలంటే దీన్ని వాస్తవవాదం (ప్రాగ్మటిజం) అనైనా అనవచ్చు. అవకాశవాదం (అపర్చునిజం) అనైనా అనవచ్చు. అందుకు వారిని నిందించలసింది కూడా లేదేమో. దేశ రాజకీయాలు, జాతీయ పార్టీల స్వభావం, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రాలు అవసరాలు మారుతున్నప్పుడు నిజానికి వారిని అవకాశవాదాలు అనటం కన్నా వాస్తవ వాదులు అనడమే సరైనదవుతుంది.
ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలకు ఎన్‌డిఎ, యుపిఎ, మహాకూటములలో ఎవరిని బలపరచేందుకైనా అభ్యంతరం ఉండదు. ఎవరు అధికారానికి దగ్గరగా కనిపించి, ఎవరు తమ షరతులకు అంగీకరిస్తే వారిని బలపరుస్తారు. అందువల్ల, అధికారానికి, భాజపాను దూరంగా ఉంచగలగటం అనే లక్ష్యం ఈ విధంగా, ఎన్నికలలో ఏ కూటమికి ఎన్ని స్థానాలు లభించగలవనే దానిపై అంతిమంగా ఆధారపడుతుంది. ప్రాంతీయ పార్టీల మద్దతు అందుకు తోడవుతుంది. ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కొద్ది రాష్ట్రాలలో భిన్న స్థితి ఉంది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలో రెండేసి బలమైన పార్టీలున్నాయి. కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలున్నప్పుడు తృణమూల్ చేరగల వీలుండదు. కాంగ్రెస్ ఉన్నట్లయితే టిఆర్‌ఎస్‌కు సరిపడని స్థితి. ఇటువంటివి చిక్కుముళ్లు. వీటన్నింటి మధ్య చివరకు, నిర్ణాయక పాత్ర వహించేవి ముఖ్యంగామూడు. ఒకటి, మహాకూటమి ఎంత విశాల ప్రాతిపదికగా ఏర్పడుతుంది, రెండు ప్రాంతీయ పార్టీలలో ఏవి ఏ వైఖరి తీసుకుంటాయి, మూడు ఎన్‌డిఎ పాలన రాగల మూడేళ్లు ఎంత ప్రజాదరణ పొందుతుందన్నవి.