సంపాదకీయం

ముందుకా.. వెనక్కా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెలల తరబడి యావత్ ప్రపంచానికి కొత్త ఆశల చిగుళ్లనందించిన పారిస్ పర్యావరణ శిఖరాగ్ర సదస్సు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పర్యావరణ పరిరక్షణ అన్నది కేవలం మాటల్లోనేనా..లేక చేతల్లో నిబద్ధత రుజువవుతుందా అన్నది నేడు తేలబోతోంది. ధనిక, పేద అన్న తేడా లేకుండా అపరిమితమైన పరిమాణంలో దశాబ్దాల పాటు సాగించిన కాలుష్య ఉద్కారాల విసర్జన ఇప్పుడు మానవాళి సహా భూగోళంలోని సమస్త జీవ, జంతు, వృక్ష జాతుల మనుగడకు పెను శాపంగా మారింది. 90దశకం తొలి నాళ్లలో రియోడి జనీరోలో జరిగిన తొలి పర్యావరణ శిఖరాగ్ర సదస్సు నుంచి నేటి ప్యారిస్ భేటీ వరకూ వాతావరణ మార్పుల నిరోధన అన్నది ‘మాటల్లో ఎక్కువ..చేతల్లో తక్కువ..’అన్న చందంగానే సాగింది. సంపన్న దేశాలు ఇప్పటి వరకూ ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుని ఉంటే.. భారత్, చైనా సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు బాసటగా నిలిచి ఉంటే పరిస్థితి ఇంత ఆందోళనకర స్థాయికి చేరుకుని ఉండేది కాదన్నది వాస్తవం. నానాటికీ తీవ్రమవుతున్న భూతాపాన్ని తక్షణ ప్రాతిపదికన నిరోధించక పోతే నేటి తరానికే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా నిలువనీడలేని పరిస్థితి దాపురిస్తుందంటూ ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అధ్యయన నివేదికలు హెచ్చరించాయి. అయినా వాటన్నింటినీ పెడచెవిన పెట్టిన ధోరణే సర్వత్రా కనిపించడంతో పారిస్ శిఖరాగ్ర సదస్సు ప్రాధాన్యత అనంతంగా పెరిగింది. తమకు జీవనాన్ని, జీవితాన్ని, మనుగడ అవకాశాన్ని ఇస్తున్న భూగోళాన్ని మానవాళి రక్షించుకుంటుందా లేక అర్థంలేని చర్యలతో, అభివృద్ధి యావతో నిర్జీవంగా మారుస్తుందా అన్నది మరి కొన్ని గంటల్లోనే తేలబోతోంది. దాదాపు 186 దేశాల నేతలు, ప్రతినిధులు గత రెండు వారాలుగా పర్యావరణ మార్పుల నిరోధనపై మల్లగుల్లాలు పడుతున్నారు. భూతాపాన్ని 1.5డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించడమన్నది ఓ అమెరికా వల్లో లేదా భారత్ వల్లో సాధ్యమయ్యేది కాదు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా భూమి అగ్నిగుండంగా మారడం వెనుక ప్రతి ఒక్కరి ప్రమేయం ఉంది. అయితే ధనిక దేశాలది ఎక్కువ పాపం, వర్ధమాన, పేద దేశాలది తక్కువ పాపం అన్న తేడానే..!
వాతావరణ మార్పుల విషయంలో ఎవరి బాధ్యత ఎంత అన్నది ఇప్పుడు ముఖ్యం కాదు. వర్తమాన తరం మనుగడను కాపాడుకోవడంతో పాటు భవిష్యత్ తరాలకు అందమైన, నిర్మలమైన అవనిని అందించడమే లక్ష్యంగా ప్రతి దేశం పారిస్ స్ఫూర్తితో ముందుకు సాగడం అనివార్యం. ఇంత వరకూ పర్యావరణ చర్చలు అనుకున్న ఫలితాలు ఇవ్వక పోవడానికి కారణం..కాలుష్యానికి కారణమైంది ధనిక దేశాలైతే..నివారణ భారాన్ని, వాటాను ఇతర దేశాలపై రుద్దాలన్న ఆలోచనే. సంపన్న దేశాల గురివింద ధోరణిని భారత్ ఇప్పటికే ఎండ గట్టింది. మన పర్యావరణ మంత్రి జవడేకర్ కూడా ఇదే విషయాన్ని సభ్య ప్రపంచం చెవికెక్కేలా చాటి చెప్పారు. ‘కాలుష్య కారకుల్ని, బాధితుల్ని ఒకే గాటన కట్టడం ఎంత మాత్రం సమంజసం’కాదంటూ ఆయన బలంగా వినిపించిన వాణి ధనిక దేశాల కళ్లు తెరిపించాలి. శుక్రవారం ఆమోదం పొందనున్న తుది ఒప్పంద ముసాయిదాను లోతుగా పరిశీలిస్తే..పారిస్ చర్చలు అనుకున్న రీతిలో సాగలేదన్న వాదనకు బలం చేకూరుతోంది. వాతావరణ మార్పుల నిరోధన, పర్యావరణ సమతూక పరిరక్షణ దిశగా ఇప్పటికే భారత్ చేపట్టిన చర్యలు, అన్ని దేశాలను ఒకే తాటిపైకి తీసుకు వచ్చి పారిస్ శిఖరాగ్ర భేటీని విజయవంతం చేసేందుకు చేసిన కృషి సర్వత్రా ప్రశంసలందుకుంది. అయితే తుది ముసాయిదాలో మాత్రం భారత్ వాదనకు చోటు లభించక పోవడం విడ్డూరం! పర్యావరణ సమతూక పరిరక్షణ, వాతావరణ మార్పుల్ని అరికట్టే విషయంలో అన్ని దేశాలు తాము చేపట్టబోయే చర్యల్ని వివరించాలని, అందుకు సంబంధించి బలమైన, నిర్దుష్టమైన వాగ్దానం కూడా చేయాలని భారత్ పట్టుబట్టింది. కానీ దీనితో పాటు ఇతర అనేక ఆందోళనలకు కూడా ఈ ముసాయిదాలో చోటు లభించక పోవడం ప్యారిస్ చర్చల సాఫల్యతపైనే అనుమానాలు రేకెత్తిస్తోంది. ముందుగా రూపొందించిన 43పేజీల ముసాయిదాను తదుపరి మల్లగుల్లాల అనంతరం 23పేజీలకు కుదించడాన్ని బట్టి చూస్తే వర్తమాన దేశాల డిమాండ్లకు, ఆందోళనలకు ఆస్కారం లేకుండా పోయిందన్న ఆందోళన కలుగుతోంది. చారిత్రక బాధ్యతలను విస్మరించడం వల్ల ధనిక దేశాలు సాధించగలిగేది ఏమీ లేదు. వాతావరణ మార్పులకు ప్రధాన బాధ్యత తమదేనన్న చేదు నిజాన్ని ఈ దేశాలు అంగీకరించినప్పుడు ఎలాంటి చర్చలైనా సఫలమవుతాయి. సమన్యాయ ప్రాతిపదికను ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు నిర్బంధంగా అనుసరించే అంతర్జాతీయ ఒప్పందం సాకారం కావడానికి దోహదం చేస్తాయి. కానీ, గత రెండు వారాలుగా ఎడతెరపి లేని విధంగా ప్యారిస్ చర్చలు జరిగినా..అంతిమంగా ఆవిష్కృతం కాబోయే ఒప్పందం ఎలా ఉంటుంది..దాని స్వరూప స్వభావాలు అవని వేడిని తగ్గించి పచ్చదానికి, సమస్త జీవజాతుల మనుగడకు ఊతాన్నిచ్చేవిగా ఉంటాయా అన్నది సంకేత ప్రాయంగానైనా తేటతెల్లం కావడం లేదు. వాతావరణ మార్పులను అరికట్టేందుకు అవసరమైన ఆర్థిక దన్నును వర్తమాన, పేద దేశాలకు అందిస్తామని ఇప్పటి వరకూ ఇచ్చిన హామీలను సంపన్న దేశాలు నిలబెట్టుకోలేదన్న ఆగ్రహం కళ్లకు కడుతోంది. పాపం ఒకరిది..్భరం ఒకరిది అన్నట్టుగా పరిస్థితి ఉంటే ఎంత ఉన్నత ఒప్పందమైనా ఆశించిన రీతిలో అమలయ్యే అవకాశం ఉండదు. రియోడి జనీరో నుంచి కోపెన్ హగన్ వరకూ జరిగిన ఎన్నో శిఖరాగ్ర భేటీలు విఫలం కావడానికి కారణం ఇదే. ఏక పక్షంగా కాకుండా అన్ని పక్షాలను కలుపుని ముందుకు తీసుకెళ్లే విధంగానే కార్యాచరణ కార్యక్రమం ఉండాలి. అంతిమ ఒప్పందం కుదిరిన తర్వాత చేసేది, చేయగలిగేదీ ఏమీ ఉండదు కాబట్టి రూపకల్పన దశలోనే ఆచితూచి వ్యవహరించాలి. అన్ని దేశాలకు న్యాయం జరిగేలా..పుడమి వేడిమిని తగ్గించే విషయంలో ప్రతి దేశం క్రియాశీలకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించేలా తుది ఒప్పందాన్ని తెరపైకి తేవాలి. సదస్సు ప్రారంభం రోజున భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలు ఇదే అంశాన్ని కళ్లకు కట్టారు. ఇప్పటికే కాలుష్య ఉద్కారాల విసర్జన విషయంలో భారత్ సహా అనేక దేశాలు తమతమ వ్యక్తిగత లక్ష్యాలను ప్రకటించాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాకారం చేస్తామనీ హామీ ఇచ్చాయి. ఇదే స్ఫూర్తిని సంపన్న దేశాలూ ఉదార రీతిలో నిధులను సమకూర్చడం ద్వారా కనబరాలి. ఇప్పటి వరకూ కుదిరిన ఒప్పందాలు, ఇచ్చిన హామీల అమలు మాట ఎలా ఉన్నా..పారిస్ శిఖరాగ్ర సాక్షిగా తీసుకునే నిర్ణయాలు త్రికరణ శుద్ధిగా అమలుకు నోచుకోవాలి. సమావేశం ముగిసింది కాబట్టి ఎవరిదారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తే పరిస్థితి అనూహ్య రీతిలో విషమిస్తుందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. దశాబ్దాల అనుభవాన్ని, చవి చూసిన కష్ట నష్టాలను పరిగణనలోకి తీసుకుని పారిస్ ఒప్పందం భూతలానికి తలమానికం కావాలి. ఆ స్ఫూర్తి, ఉదాత్త ఆలోచనా ధోరణి తుది ఒప్పందంలో ప్రస్ఫుటం కావాలి. పుడమి వేడిని తగ్గించి జీవజాతుల మనుగడకు దివిటీ కావాలి!