సబ్ ఫీచర్

మరీ ఇంత కాఠిన్య ప్రదర్శనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమర్జెన్సీ రూపంలో చుట్టూ కమ్ముకొచ్చిన కారుచీకటిలో బతికే హక్కుకోసం కనీసం సుప్రీంకోర్టు గుమ్మం కూడా తొక్కడానికి వీల్లేదని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానమే చారిత్రక తప్పిదానికి పాల్పడిన దుర్దినానికి నేటితో సరిగ్గా నలబై ఏళ్లు నిండాయి. హెబియస్ కార్పస్ పిటిషన్‌గా ప్రసిద్ధి చెందిన జబల్పూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఈ ధోరణిలో 1976 ఏప్రిల్ 28న వెలువడిం ది. రాష్టప్రతి ఉత్తర్వుల ప్రకారం పౌరహక్కులన్నీ రద్దవడమే గాక న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు కూడా లేదని, ఒకవేళ ప్రభుత్వం పౌరుని ప్రాణాలు తీసినా అడిగే హక్కు లేదని అటార్నీ జనరల్ ‘నిరేన్ డే’ వాదించడం ఆనాటి నియంతృత్వపు పోకడను ప్రతిబింబిస్తుంది. ఈ వాదనను ధర్మాసనంలోని నలుగురు న్యాయమూర్తులు సమర్థించగా ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. ఫలితంగా ఎమర్జెన్సీ ఎత్తేసి తిరిగి రాజ్యాంగ సవరణ జరిగే వరకు ఈ దేశ పౌరులు బతికే హక్కు కూడా లేకుండా చచ్చి బతికినట్లే బతుకు వెళ్లదీశారు.
సెన్సార్‌షిప్ ఎత్తివేయాలని కోరుతూ సంతకాల సేకరణకు పూనుకున్న ప్రముఖ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్‌ను ప్రభుత్వం 1975 జూలై 24న మీసా చట్టం కింద అరెస్టు చేసింది. అయితే రాజ్యాంగంలోని 226 అధికరణం కింద విచారణ చేపట్టి న్యాయం చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి, ఆయనపై ఉన్న మీసా కేసును అదే ఏడాది అక్టోబర్ 15న కొట్టివేసింది. ఎమర్జెన్సీ ప్రకటన వెలువడిన వెంటనే అలహాబాద్, ఆంధ్రప్రదేశ్, బొంబాయి, ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మద్రాస్, రాజస్థాన్, పంజాబ్ హైకోర్టులు, తమకు న్యాయమనిపించిన కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పాయి. అయితే చాలా సందర్భాల్లో ప్రభు త్వం వాటిని అమలు జరపకపోగా, న్యాయమూర్తులపై కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ప్రధాన న్యాయమూర్తి ఎస్. ఓబుల రెడ్డి, న్యాయమూర్తులు చిన్నప్పరెడ్టి, చల్లా కొండయ్యలను యితర హైర్టులకు బదిలీ చేసింది. కులదీప్ నయ్యర్ కేసులో తీర్పు చెప్పిన ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరైన ఎస్. రంగరాజన్‌ను అస్సాం హైకోర్టుకు బదిలీ చేసి, మరొకరైన అదనపు న్యాయమూర్తి ఆర్.ఎన్. అగర్వాల్ హోదాను డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి స్థాయికి తగ్గించింది. ఆవిధంగా ఇందిరాగాంధీ మొత్తం 18 మంది న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులపై కక్ష సాధించింది.
1950లో జరిగిన తొలి రాజ్యాంగ సవరణతోనే ఆరంభమైన ప్రాథమిక హక్కుల హరణ శాంకరీ ప్రసాద్ దేవ్ కేసు ద్వారా చర్చకు వచ్చింది. ప్రజా ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం తప్పుకాదని అప్పటి తొలితరం ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జేకిసన్ దాస్ కానియా అధ్యక్షతన ఏర్పాటైన ధర్మాసనం అభిప్రాయపడింది. ఇందులో న్యాయమూర్తులు ఎం.పతంజలి శాస్ర్తీ, బిజన్‌కుమార్ ముఖర్జీ, సుదీరంజన్ దాస్, ఎన్.చంద్రశేఖర అయ్యర్ సభ్యులు. అయితే రాబోయేకాలంలో నియంతృత్వ ధోరణి గల నేతలు అధికారంలోకి వస్తారని వారు కలలో కూడా ఊహించి ఉండరు.
పౌర హక్కులను హరించడం రాజ్యాంగ వౌలిక స్వరూపాన్ని మార్చడమే అవుతుందేమో పరిశీలించాలని 1964లో వచ్చిన సజ్జన్ సింగ్ కేసులో జస్టిస్ జనార్థన్ రఘునాథ్ ముదోల్కర్ చేసిన హెచ్చరిక, రాజ్యాంగ సవరణల నేపథ్యంలో విస్తరిల్లుతున్న నియంతృత్వ ధోరణులపై నిఘా అవసరాన్ని గుర్తు చేసింది. 1967లో వచ్చిన గోలక్‌నాథ్ కేసులో రాజ్యాంగ సవరణల ద్వారా పౌరహక్కులను కుదించే అధికారం పార్లమెంట్‌కు లేదని జస్టిస్ కోకా సుబ్బారావు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేయగా, ఇందిరాగాంధీ మాత్రం 24వ రాజ్యాంగ సవరణతో ముందుకెళ్లింది.
రాజ్యాంగ వౌలిక స్వభావాన్ని మార్చే హక్కు పార్లమెంట్‌కు లేదని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ తీర్పును జీర్ణించుకోలేని ఇందిరాగాంధీ, ధర్మాసనంలోని ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను విస్మరించి, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పిన జూనియర్ న్యాయమూర్తి అజిత్ నాథ్ రేను 1973, ఏప్రిల్ 26న ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. అయితే తన పదోన్నతి నిలిచిపోతుందని తెలిసి కూడా ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగ స్ఫూర్తిని ప్రస్ఫుటంగా నిర్వచించి, ధైర్యంగా మెజారిటీ న్యాయమూర్తులకు భిన్నమైన తీర్పునివ్వడం ద్వారా పౌరహక్కుల పరిరక్షకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి జస్టిస్ హన్స్ రాజ్ ఖన్నా ఒక్కరే. ఆయన అనుమానించినట్లే అజిత్ నాథ్ రే తర్వాత తనకు దక్కవలసిన ప్రధాన న్యాయమూర్తి పదవి తనకంటే జూనియర్ మీర్జా హమీదుల్లా బేగ్‌కు దక్కడంతో, తక్షణమే తన పదవికి రాజీనామా చేశారు. ఇందిరాగాంధీ హరించిన హక్కులను పునరుద్ధరిస్తూ జనతా ప్రభుత్వం 43, 44 రాజ్యాంగ సవరణలను చేపట్టే వరకు జనం భయానక పరిస్థితినే ఎదుర్కొన్నారు.
ఎమర్జెన్సీ మరోసారి రాదనే గ్యారంటీ లేదంటూ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ చేసిన హెచ్చరికను పూర్తిగా కొట్టివేయలేం. నేతల ప్రవృత్తిని బట్టే ప్రజాస్వామ్య ఫలితాలుంటాయి. అందుకే రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 1949, నవంబర్ 25న జరిగిన రాజ్యాంగ నిర్మాణ ముగింపు సమావేశంలో చేసిన హెచ్చరికను ఎప్పుడూ గుర్తుంచుకోవలసిందే. ‘‘రాజ్యాంగం ఎంత ఉత్తమమైనదైనప్పటికీ దానితో పనిచేయాల్సిన వ్యక్తులు చెడ్డవారైతే రాజ్యాంగం కూడా చెడ్డదిగానే మారుతుంది. ఒకవేళ ఎంత చెడ్డ రాజ్యాంగమైనా దాంతో పనిచేసేవాళ్లు మంచివాళ్లైతే రాజ్యాంగం కూడా మంచిదిగా మారుతుంది. రాజ్యాంగం పనితీరు పూర్తిగా దాని స్వభావంపై ఆధారపడి ఉండదు. రాజ్యాంగం పాలనకు అవసరమైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను ఏర్పాటు చేస్తుంది. ప్రజలు ఈ వ్యవస్థల ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఆశించి వాటి నిర్వహణకు బాధ్యులుగా ఎలాంటి నాయకులను,రాజకీయ పార్టీలను ఎన్నుకుంటారో వారి స్వభావాన్నిబట్టే ఫలితాలుంటాయి’’ అని అంబేద్కర్ హెచ్చరించారు. ఇందిరాగాంధీని ఎన్నుకున్నప్పుడు ప్రజలు నియంతృత్వాన్ని, రాజీవ్‌గాంధీని ఎన్నుకున్నప్పుడు సాంకేతికాభివృద్ధినీ, పీవీ నరసింహారావును ఎన్నుకున్నప్పుడు సంస్కరణలను తెచ్చుకున్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో అభివృద్ధి జరిగినా అవినీతికి హద్దులు లేకుండా పోయిందన్న విమర్శలు వచ్చాయి. అలాగే ఇప్పుడు నరేంద్ర మోదీ భారత రాజ్యాంగాన్ని ఏమేరకు సద్వినియోం చేసుకొని ప్రజల ఆశయాలను ఏవిధంగా నెరవేరుస్తారో వేచి చూడాల్సి ఉంది.

-కె.బి.రామ్మోహన్ సెల్: 09346235072