తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఆశయాల సాధనకోసం ‘సందర్భం’ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో మిత్రునికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి చూడటానికి వెళ్లాం.
చిన్ననాటి, పెద్దనాటి, ఈనాటి ముచ్చట్లను మాట్లాడుకున్నాం. అనారోగ్యం మరిచి మా మిత్రుడు ఒకింత జీవిత తత్వం గురించి మాట్లాడాడు. ఎన్నడూ ఎక్కువగా నోరు తెరవనివాడు అలా మాట్లాడ్డం మాకు కొంత ఆనందం కలిగించింది. కాసేపాగి జీవితంలో సాధించాలనుకున్నవి ఏమిటి? ఏం సాధించగలిగాం? అసలు సాధించినవి ఏమైనా ఉన్నాయా? వాటికీ, సమాజానికి సంబంధం ఏ మేరకు ఉంది? అనే అంశాలు చర్చకు వచ్చాయి. సాధించిన విషయాలలో సమాజగతమైనవి, రాజకీయపరమైవి ఏమిటి? ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి? అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం.
ఒక్కోతరం ఒక్కో కాలస్థలంలో ఒక్కోరీతిగా జీవించడం జరుగుతుంది. దాని ప్రకారమే మనిషి జీవితాదర్శాలు, ఆశయాలు, లక్ష్యాలు, గమ్యాలు, ధ్యేయాలు, ప్రణాళికలు ఉంటాయి. నిజానికి తెలుగులో ఈ పదాలకు అర్థం, నిర్వచనం, నిర్దిష్టంగా కనుపించవు. కాని అలాంటివి వ్యక్తులకు, సంస్థలకు, సమాజాలకు, ప్రభుత్వాలకు విడివిడిగా ఉంటాయి. ఒక్కోసారి అవి పరస్పరాధారితాలు. అవిభాజ్యాలు.
ఒక జీవితంలోనే ఎన్నో ఆశయాలు ఉంటాయి. ప్రతి మానవుడి ప్రతి దశలో ఇవి మారుతుంటాయి. ఐతే చాలాసార్లు వీటికి ఒక లింకు ఉంటుంది. పెను మార్పులకు లోనైన బతుకులలో ఈ లింకు తెగిపోతుంది. కొంతమంది జీవితాలలో ఆ ఆశయం మార్పులకి లోనవుతుంది. మార్పుకి లోనుగాని ఆశయం యాంత్రికతకి బలి అవుతుంది. ఆ యంత్రికతను దృఢ నిర్ణయంగా భావించి దానిని గుణంగా చెప్పుకుంటారు కొందరు. ఆశయంలోని యాంత్రిక స్వభావం దాని సాధనకు విఘాతం అవుతుంది. ఆశయం గొప్పదే. అది అలాగే మిగిలిపోయే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే ఆశయం దానికదే గొప్పది అని భావించే పరిస్థితి ఏర్పడుతుంది. సదా సత్యమునే పలకవలెను వంటి నీతివాక్యాలు ఆదర్శాలుగా ఉండకూడదు. కాని సామాజికంగా, రాజకీయంగా అలాంటి స్థిర ఆదర్శాలను పట్టుకొని వేలాడ్డం సరైంది కాదు.
ఆచరణలో సాధ్యంకాని ఆదర్శాలను నిత్యం వల్లెవేయడం ద్వంద్వనీతి. పాటించని వాటిని బోధించడం ఒక రకంగా మోసమే. పోరాటం, విప్లవం, మొత్తం సమాజాన్ని ఆలోచనలతో మారుస్తామని చెప్పడం బుకాయించడమే. ఎంటువంటి రాజకీయాలలోనైనా ఎందుకోగాని అరచేతిలో స్వర్గాల్ని చూపిస్తామని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడింది.
ఆశయం, ఆదర్శం, దానికది గొప్పదని తమకు తాము భావించే మేధావుల సంతతి రోజురోజుకి పెరిగిపోతున్నది. వాటికోసం తాము చేసే ప్రత్యేక కృషి లేకపోయినా, త్యాగం కానరాకపోయినా సిగ్గుపడే పరిస్థితి లేదీనాడు. బలహీనతల వల్ల, మరోరకంగా చెప్పాలంటే చేతగానితనం వల్ల ఆశయం అరంగుళం కూడా కదలకపోయినా సిగ్గుపడడంలేదు. అలాంటి వీరు తమ గొప్పదనాన్ని కాపాడుకోవడం కోసం ఇతరులపై ద్వేషం, పగ, కోపం ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఉండే ప్రగతిశీల రంగంలో ఇలాంటి శిష్ట సామాజిక వర్గాల మేధావులు పెరిగిపోవడం గమనించాలి.
రాజకీయ ఆశయం సామాజికం. వ్యక్తిగత జీవితంలోని నిబద్ధత, దానిని సాధించడానికి, గౌరవం తేవడానికి ఉపయోగపడాలి. అంతేకాని ఆశయం ఒకపక్కన, నిబద్ధత మరోపక్కన వ్యతిరేక మార్గాలలో ఉండే పరిస్థితి ప్రజలు గుర్తిస్తున్నారు. ఇలాంటివారి ఆశయాల పట్ల విముఖత చూపిస్తున్నారు. అందుకే3‘చెప్పేదొకటి చేసేదొకటి’2 అనే నానుడి ఏర్పడింది. 3‘చెప్పేవి నీతులు-సొచ్చేవి గుడిసెలు’2 అనే సామెత ఏర్పడింది. ఐనా ఇలాంటి నానుడి మాటలకు మేధావులు విలువ, గౌరవం ఇవ్వడం లేదు. అసలు వాటిని పట్టించుకోవడం లేదు. అలా రాజకీయాలను ఆశయాన్ని కొందరు పేరుపొందిన మేధావులు పలచన చేసి, విలువను తీసి, దానిని పనికిమాలిన అంశంగా మార్చేస్తున్నారు.
జీవితంలో అర్థంలేని, ఆచరణయోగ్యం కాని ఆశయాల పట్ల, ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాలి. దానికన్నా చిన్నచిన్న ఆశయాలు ఏర్పరచుకొని వాటిని సాధించడానికి కృషి చేయడం ఇవ్వాల్టి కర్తవ్యం కావాలి.
మనదేశంలో పెద్దపెద్ద ఆశయాలు కలిగి ఉండడం కొందరికి ఫేషన్. మరికొందరికి జబ్బు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినా డాక్టర్ కోర్సులో సీటు దొరకదని తెలిసినా, పెద్ద పెరిగాక డాక్టర్‌ని అవుతానని చెప్పే చిన్న పిల్లవాడిని చూసి అబ్బురపడిపోతాం. ఇంజనీర్ నవుతానని అనే పిల్లవాడిని చూసి, లక్షలాది మంది ఇంజనీరింగ్ కోర్సు చేసి, రోడ్లమీద పనికిరాకుండా నిరుద్యోగులుగా బతుకుతున్నారని తెలసినా మనం మన పిల్లల్ని ఇంజనీర్లు కావొద్దని వారించం. వాస్తవాలు చెప్పడం మన సంస్కృతిలో లేదని అనిపిస్తుంది. అలవికాని మాటలు చెప్పడం ఒక గొప్ప. అలాంటి ఆశయాలను కలిగి ఉండడమే స్టేటస్ . కాని, అలాంటి ఆశయాలవల్ల భవిష్యత్తులో కలనిజం కాక ఓటమి పాలవుతామని చెప్పగలగాలి. ఆ ఆశయం సాధించడానికి ఎలా కష్టపడాలని వాస్తవిక దృక్కోణంలోంచి విప్పి చెప్పాలి. ఆశయాలు కలిగినవారు, వారికి సంబంధించిన కుటుంబ, సామాజిక సభ్యులు అందరూ నిరాశ చెందుతారు.
మన సంస్కృతిలోనే ఆదర్శం శిఖరప్రాయం. ఆచరణ అథమస్థానం. ఆచరణయోగ్యమయ్యే ఆశయం కోసం ఆలోచించాలి. అధ్యయనం చేయాలి. అలాంటి ఆశయాల చరిత్ర తెలుసుకోవాలి. వాటిని ఆలోచించే క్రమంలో ఎదురయ్యే సమస్యలను వూహించాలి. అప్పుడు వాటిని తమ ఆశయంగా ప్రకటించాలి. వాటికోసం చేసే పోరాటం ఏమిటో తెలియజేయాలి. అందులో ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు బహిరంగ పరచాలి.
రహస్యం అనేది సమాజం వేదికగా పని చేసే వారికి శత్రువు. రహస్యాలతో ఆశయాలు నెరవేరవు. ఒకవైపు రహస్యం, మరోవైపు బహిరంగం. ఈ రెంటిని ఏకకాలంలో పాటించేవాడు ఒక దొంగ. వాడిది ఒక ముసుగు. ముసుగు వీరులు చేసే విప్లవాలు రాణించవు. అవి వ్యక్తిగతం. పైకి సామాజికం అని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు వారు. కానీ వాటి అసలు సారం ప్రజలు గ్రహిస్తారు. ఇదే లక్షణం మన సమాజంలో అంతటా కనిపిస్తున్నది. రాజకీయ వ్యవస్థలన్నీ ఇలాంటి వారితో నిండిపోయింది. బహిరంగంగా మానిఫెస్టోలు, భారీగా ప్రకటిస్తారు. వాటికి వ్యతిరేకంగా ఆచరణ ఉంటుంది. స్విస్‌బ్యాంకుల్లోంచి నల్లడబ్బు తెస్తామని ప్రకటిస్తారు. తాము చెప్పిన దానికి వ్యతిరేకంగా దేశం నుండి మరింత నల్లడబ్బు పనామా వంటి ఇతర దేశాలకు తరలిపోతుంటే మాట్లాడరు. పత్రికలలో పేర్లు బయట పడినా చర్య తీసుకోరు. రైతుల చావులు లేని రాష్ట్రాలు మా ధ్యేయం అంటారు. వారి చావుని సమాజం గుర్తించకుండా ప్రయత్నిస్తారు.
నిజానికి-
దీర్ఘకాలిక ఆశయాలకు ఇది కాలం కాదు. ఆశయాలు నెరవేరాలి. తప్పదు. తద్వారా విజయం చేకూరాలి. ఇప్పుడు ఎంత చిన్నవైనా కొన్ని విజయాలు నమోదు కావాలి. ప్రజలను ఉద్యమాల పట్ల ప్రేరేపితులను చేయడం లక్ష్యం కావాలి. చాలా అపజయాలను చవిచూసిన ప్రజలలో కొత్త శక్తిని నింపడానికి కొన్ని విజయాలు కావాలిప్పుడు.
వీరస్వర్గం పొందకపోయినా వీరత్వ ప్రదర్శన చూపాలి. అది సంఘటిత శక్తిగా ఉంటే మరీ మంచిది. విజయం మంచి సమాజాన్ని నిర్మిస్తుంది. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ప్రజలు ఒక హామీ కోరుతున్నారు. తమ త్యాగాలకు గుర్తింపు అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజారాజకీయ రంగంలో కొందరు మాత్రమే పేరు ప్రతిష్టలు తెచ్చుకునే కుతంత్రాలను వ్యతిరేకిస్తున్నారు. జనచైతన్యం పేరుతో వ్యక్తిగత ప్రతిష్టకోసం వెపరలాడే తత్వాన్ని నిరసిస్తున్నారు.
స్వయం నిర్ణయ ఆశయాలను రూపొందించుకునే దిశగా సమాజం ఆలోచనలు చేయగలగాలి. ప్రజల నెత్తిన ఆశయాలు రుద్దడం సరికాదు. అది కులమత ఆర్థిక రాజకీయ ఆధిపత్యమే.
రాజకీయ ప్రణాళికలు, ఆశయాలు వ్యక్తిని విస్మరించకూడదు. వ్యక్తిని గుంపుగా మార్చే సత్తా కావాలి. వ్యక్తి ఆత్మచైతన్యం, గౌరవంలోంచి సమష్టి ఆశయసాధన దిశగా అడుగులు వేయాలి.
ఇప్పుడు దేశాల ఆశయాలను, తుంగలో తొక్కడానికి అగ్రదేశాల పెద్దన్నలు చేసే కుటిల ప్రయత్నాలను అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఆ ప్రయత్నాలలో మంచి ఉన్నదని భ్రమపడకూడదు. మతతీవ్రవాదం పేరుతో మరో తీవ్రవాదం తలెత్తకూడదు. ఏ దేశం దానికదే స్వయంశక్తితో శత్రువుని ఎదుర్కొనే విధంగా తయారు కావాలి. అంతేగాని ఇతర దేశాల సహాయం కోసం అర్రులు చాచకూడదు. అది ఒకరకంగా లొంగుబాటుతనం, బానిసత్వానికే దారితీస్తుంది. రేపు అదే దేశం మనకు వ్యతిరేకంగా చర్యలు చేపడితే ఏం చేస్తామని ఆలోచించడం విజ్ఞత. దేశ ప్రజలలో సమానత అనివార్యం. అది లేకుండా దేశ ప్రయోజనాలను సాధించలేం. ఉమ్మడి శత్రువుని భవిష్యత్తులో ఎదిరించలేం.
ఆశయ సాధనలో సృజనాత్మక శక్తులు వికసిస్తాయి. ఆ పోరాటంలోంచే కొత్త చైతన్యం వెల్లివిరుస్తుంది.
నినాదాలు కాదు. ఉద్యమ విధానాలను రూపొందించుకోవాలి.
ఆదర్శాలు, ఆశయాలు, లక్ష్యాలు, రూపొందించుకోవడంకోసం ఒక కొత్త 3‘సందర్భం’2 వెతుక్కోవాలి.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242