మెయన్ ఫీచర్

పరిణతి లేని జగన్ వ్యవహారశైలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారం లభించే అవకాశాన్ని 2014లో కొద్దిలో కోల్పోయిన వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి, ఒకవేళ జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే 2019లో అవకాశం లభించవచ్చునని ఒక దశలో అనిపించింది. కాని ఇటీవలి పరిణామాలను గమనించిన మీదట, అటువంటి అవకాశం సందేహాస్పదమవుతున్నది. అందుకు ఆయన ప్రత్యర్థి అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేర్పరితనం కన్నా, జగన్ అపరిపక్వ ధోరణులు కారణమవుతున్నాయని చెప్పాలి. ఈ విధంగా ఆయన తన అవకాశాలను తానే దెబ్బతీసుకుంటున్నారు.
2014లో చివరకు చంద్రబాబు గెలిచినప్పటికీ, దాదాపు అఖరిదశ వరకు జగన్మోహన్ రెడ్డిదే పైచేయిగా ఉంది. కొత్త రాష్ట్రానికి ఎదురయ్యే సమస్యలను అధిగమించాలన్నా, అభివృద్ధి మార్గంలో ముందుకు పోవాలన్నా రాష్ట్రానికి అనుభవజ్ఞుడు, సమర్థుడు, కష్టించి పనిచేసే వాడు అవసరమన్న ప్రచారం ఎన్నికల చివరి దశలో ముమ్మరంగా సాగడం, అది తటస్థ ఓటర్లకు సరైనదిగా తోచడంతో పరిస్థితి మారింది. అప్పటి పరిస్థితులలో ప్రజలకు అటువంటి ఆలోచనలు కలగడం సహజం. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటివరకు సీమాంధ్ర ప్రాంతానికి కలిగిన లాభనష్టాలు ఏవైనప్పటికీ, విభజన అన్నది తప్పకుండా పెద్ద సమస్యే. చక్కబెట్టుకోవలిసినవి అనేకం ఉంటాయి. విభజనకు సంబంధించిన కుస్తీలు కొన్ని ఉంటా యి. రాజధాని నిర్మాణం జరగాలి. కేంద్రంపై వత్తిడి తెచ్చి సాధించుకోవలసినవి అనేకం. భారీ రెవెన్యూ లోటు ఉన్నది. రాగల సంవత్సరాలలో ఖర్చుకు తగిన ఆదాయం కనిపించదు. ఆర్థిక సంస్కరణల మోడల్ అభివృద్ధిని అనుసరించి పెట్టుబడులను హైదరాబాద్‌లో కేంద్రీకరిస్తూ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిన దానికి పరిహారంగా ఇప్పుడు ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా ఎటు చూసినా సమస్యలే. ఈ ఆలోచనలు ఓటర్లకు ముం చుకు రావడంతో వాటిని ఎదుర్కొనేందుకు ఒక అనుభవజ్ఞుడు, సమర్థుడు, కష్టపడి పనిచేసేవాడు తప్పనిసరి అనే అభిప్రాయం బలపడింది. ఉమ్మడి రాష్ట్రాన్ని ఆయన తొమ్మిదేళ్లు పాలించిన కాలంలోని అనుభవాల పట్ల సదభిప్రాయం లేనివారు కూడా, ఈ కొత్త పరిస్థితిలో ఉత్పన్నమైన అవసరాల దృష్ట్యా, ఇష్టం లేకపోయినా ఆయనను ఎంచుకున్నారు. లేని పక్షంలో జగన్ గెలిచి ఉండేవారు.
దాని అర్థం ఆ దశలో వారందరికీ ఆయన పట్ల పాజిటివ్ దృక్పథం ఉందని కాదు. తన తండ్రి రాజశేఖర రెడ్డి వారసత్వంగా వదలిపోయిన ఓటుబ్యాంకు, తమ కుల సమీకరణాలు, చంద్రబాబుకు వ్యతిరేకులైన సంప్రదాయిక వర్గాలు వంటివి అందుకు కలిసివచ్చాయి. జగన్ యువకుడైనందున ఆ వయస్సువారిలో కలిసివచ్చినవారు తగినంతమంది ఉన్నారు. రాయలసీమ తగినంత ఓటుబ్యాంకు అయిం ది. ఇవన్నీ (చివరిది తప్ప) జగన్ వ్యక్తిత్వంతో నిమిత్తం లేని అతిరిక్త అంశాలు. ఒక వ్యక్తిగా తనను ప్రజలు అంచనా వేసి ఏర్పరచుకున్న అభిప్రాయాలు, అనుకూలతలు కావు. విషయాలు అప్పటికట్లా కలిసివచ్చాయి అంతే. అందువల్లనే, ఎన్నికల్లో ఆధిక్యత రాకపోయినా ఓట్లు, సీట్లు గణనీయంగానే లభించాయి.
ఆ విధానంగా బలమైన ప్రతిపక్షంగా వైఎస్‌ఆర్‌సిపి అవతరించిన తర్వాత, జగన్ కూడా ఒక బలమైన నాయకుడిగానే అభిప్రాయమూ కలిగిన వెనుకటి నుంచి ఏమి జరిగిందన్నది ప్రశ్న అవుతుంది. తర్వాత సుమారు 23 మాసాల కాలంలో జగన్మోహన రెడ్డి తనపట్ల ప్రజలలో సానుకూలన పెంచుకున్నారా లేక వ్యతిరేకతనా? దీన్ని కొన్ని విధాలుగా విచారించాలి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు కొంతకాలం పాటు ఆయన ఒకటి చేస్తున్నట్లే కనిపించింది కాని, ఆ మొదటి దశ గడిచేసరికికొన్ని అసంతృప్తులు మొదలయ్యాయి. ఒకటి, మాటలకు తగినట్టు చేతలు లేవన్నది. రెండవది, ప్రత్యేక హోదాతో సహా కేంద్రంనుంచి సాధించగలమని ప్రకటించినవి అనేకం జరగకపోవడం. మూడు, ఉమ్మడి రాష్ట్రంలోని తన పరిపాలనా మోడల్ తరహాలోనే ‘తనవారికి ’లాభం కలిగే వాటిపై దృష్టి పెడుతూ సామాన్యులను నిర్లక్ష్యం చేస్తున్నారనేది. నాలుగు, స్వంత రాష్ట్రానికి పరిపాలనను మార్చివేయకుండా పరాయి హైదరాబాద్‌లో ఉండి అక్కడి వ్యవహారాలపై దృష్టి పెట్టడం నాయకుల ప్రయోజనాల కోసం (అందులో ఆస్తులు ఒకభాగం, తెలంగాణలో టిడిపి రాజకీయం మరొక భాగం) అన్నది. అయిదు, అమరావతి భూముల వ్యవహారం. ఆరు, రాయలసీమలో యథావిధిగా తలెత్తడం మొదలైన సంప్రదాయిక అసంతృప్తి. ఏడు, రైతులు, డ్వాక్రా గ్రూపులు వగైరా మాఫీ అసంతృప్తులు. ఎనిమిది, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదంటూ ఇతర భిన్న తరగతుల ఆగ్రహాలు. ఇవన్నీ కలిసి మొదటి దశ గడిచే సరికి అసంతృప్తి విస్తృతం కావడం మొదలైంది.
వాస్తవానికి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వీటిల్లో కొన్ని మాత్రమే చంద్రబాబు వైఫల్యాలు కాగా, కొన్ని తన ఆధీనంలో లేనివి. ఉదాహరణకు ప్రత్యేక హోదా. ఒక విధంగా ఆవిషయమై కేంద్రంతో సహా ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే ఈ హోదా వచ్చి తీరగలదని, అది సర్వరోగ నివారిణి కాగలదని ప్రజలలో ఆశలు బలంగా కలిగించిన దోషం మాత్రం చంద్రబాబుదే. స్వయంగా చంద్రబాబు వైఫల్యాలకు ఒక ఉదాహరణను చెప్పాలంటే మేనిఫెస్టో అంశాలు అమలు విషయమై ఆయన ప్రజలతో వాస్తవాలను చెబుతూ వారిని విశ్వాసంలోకి తీసుకోకపోవడమే కాక, తన అభివృద్ధి నమూనా ఉమ్మడి రాష్ట్ర కాలపు వాటివేనన్న అనుమానం వారికి కలిగేట్లు వ్యవహరించారు.
మొత్తంమీద మొదటి దశలోని ఈ విధమైన పరిస్థితులు చంద్రబాబుకు ప్రతికూలమవుతూ వచ్చాయి. తార్కికంగా చూసినట్లయితే అది జగన్‌కు అనుకూల పరిణామం అయి ఉండాలి. అట్లా అనుకూలం కావడానికి మరో కారణం కూడా ఉంది. చంద్రబాబు వైఫల్యాలను, ప్రజల ఆశాభంగాలను, వారి సమస్యలను జగన్ అసెంబ్లీ లోపల, బయట గట్టిగానే చేపట్టారు. వాస్తవాలతో కూడిన ఆయన వాదనా పటిమ, స్వరంలోని దృఢత్వం, వ్యక్తిత్వ శైలి, ఆంధ్రప్రదేశ్‌లోని సామాన్యులు, వివిధ వర్గాల దృష్టిని ఆకర్షించ సాగాయి. ఆవిధంగా చూసినప్పుడు ఒకవైపు చంద్రబాబు పట్ల తలెత్తుతుండిన అసంతృప్తి, మరొకవైపు జగన్‌లోని ఆకర్షణీయత కలిసి పరిస్థితులను కొత్త మలుపు తిప్పవలసింది. కానీ అట్లా జరగలేదు. ఎందుకన్నది జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం. జగన్‌కు పైన పేర్కొన్న అనుకూలాంశాలు కొన్ని ఎన్నికలకు ముందునుంచే ఉన్నాయి. అదే సమయంలో, చంద్రబాబుకు గల అనుకూలాంశాలు (అనుభవం వగైరా) కొన్ని తనకు లేవనే భావన ప్రజలలో ఉన్నట్లు పైన చెప్పుకున్నాము. ఈ కొరతలు సమస్య ఈ మొదటి దశలో కొనసాగింది. చంద్రబాబు పట్ల అసంతృప్తి, జగన్ శైలి కొంత ఆకర్షణీయం కావడం నిజమే అయినా, అది ఆయన పట్ల ‘విశ్వాసం’గా మారే మలుపు ఇంకా తీసుకోలేదు. చంద్రబాబు గ్రాఫ్ అదే పద్ధతిలో పడిపోతూ, జగన్ కార్యశైలి అదేవిధంగా కొనసాగడం కొంతకాలం కొనసాగి ఉన్నట్లయితే ఏమి జరిగేదో చెప్పలేం. బహుశా ఆ మలుపు తీసుకుని ఉండేదేమో.
కాని తర్వాత మరొక దశ మొదలైంది. ఇది చంద్రబాబుకు సానుకూలం కావడం, జగన్‌కు ప్రతికూలమవటమన్నది గమనించవలసిన విషయాలు. చంద్రబాబుకు సానుకూలత పూర్తి స్థాయికి చేరి స్థిరపడటం జరగలేదు. కాని గ్రాఫ్‌లోని కర్వ్ అనేది మాత్రం ఆ దిశకు తిరిగింది. తన అనుభవానకి, కష్టానికి ఫలితాలు కనిపిస్తున్నానే భావన కొన్ని వర్గాలలో ఏర్పడుతున్నది. తన అభివృద్ధి మోడల్ పాతదేనన్న అసంతృప్తిలో గల సాధారణ ప్రజావర్గాలు మాత్రం ఇంకా అదే అసంతృప్తిలో ఉన్నాయి. ఈ సంతృప్తి-అసంతృప్తి వర్గాలు మునుముందు ఏవిధంగా పరిణమించగలవన్నది పూర్తిగా ముఖ్యమంత్రిపైన ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి, సామాన్యుల అభివృద్ధి, అన్ని ప్రాంతాల సమతులన అభివృద్ధి అన్నవి కీలకమైన మూడు పదాలు. అవినీతి విచ్చలవిడిగా సాగుతున్నదనే అభిప్రాయం ఒకటి అంతటా వినవస్తున్నది గాని, పై మూడు సవ్యంగా సాగినట్లయితే ఈ విమర్శ కేంద్రస్థానంలోకి రాదు. లేనట్లయితే చెప్పుకోనక్కరలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో తన అభివృద్ధి నమూనా వల్ల వరుసగా రెండు పరాజయాలు ఎదురైన తర్వాత చంద్రబాబు, ఆ నమూనా సరైనదేగాని పేదలకు కూడా కొన్ని ఫలితాలు లభించే ట్రికిల్ డౌన్ పద్ధతిని తాను సరిగా అనుసరించనందువల్ల సమస్య వచ్చిందని, ఇకముందు ఆ లోపాన్ని దిద్దుకుంటామని చెప్పారు. కాని అటువంటి ఆశలు ఈ రెండేళ్లలో ఆంధ్ర ప్రజలకు కలగలేదు. ‘‘అంతా వాళ్ల వోళ్లకే’’ అనే మాటే అంతటా వినవస్తున్నది. పైన అన్నట్లు, ఒకవైపు ఇది ఉండగానే మరొకవైపు, పనులు మొదలయ్యాయంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ రెండు స్రవంతులు ఒక క్రమం వంటివి. అవి విస్తరించడానికి, నిర్దిష్ట రూపాలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాని మొదటి దశతో పోలిస్తే ఈ రెండవ దశలో ఏదో ఒక స్థాయిలో చిన్న కర్వ్ ఒకటి చంద్రబాబుకు అనుకూలంగా మొదలైందన్నది మాత్రం గమనించదగ్గది. ఇది ఇదే పద్ధతిలో ముందుకు సాగుతుందా లేక తిరిగి ఇందులో మార్పులుంటాయా అన్నది వేచి చూడవలసిన విషయం.
ఈ రెండవ దశలో జగన్మోహన రెడ్డి పరిస్థితి ఏమిటి? ఎన్నికల నాటి పరిస్థితులతో, ఎన్నికల అనంతరపు మొదటి దశ పరిస్థితిలో పోల్చి చూసినట్లయితే ప్రస్తుత దశలో ఆయన ప్రతిష్ఠ స్పష్టంగా తగ్గింది. మొదటి దశలో వలె అసెంబ్లీలో కాని, బయట గాని ప్రజల సమస్యలను ఆ స్థాయిలో చేపట్టడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతున్నది. ఈ సమస్యలు చాలా ఉన్నాయి, పెరుగుతున్నాయి. వాటిలో కొన్నింటిని రాజకీయ కారణాల వల్లనో, లేక ఆర్థిక వర్గాల కారణాల వల్లనో చేపట్టడం లేదన్న అభిప్రాయముంది. పార్టీ ఎమ్మెల్యే రోజా వివాదం, సభ్యుల ఫిరాయింపులు, ప్రాధాన్యతలేని అంశాలపై యాగీలు, ప్రజల సమస్యలకు అభివృద్ధి సమస్యలకు ప్రజలు ఆశించే ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఈ విషయాలన్నింటిలో జగన్ పరిణితి లేని విధంగా వ్యవహరించడం వంటివి తనకు ప్రతికూలమవుతున్నాయి. రెండవ దశలో చంద్రబాబుకు అనుకూలంగా ఒక చిన్న కర్వ్ కనీసం కొన్ని వర్గాలలో మొదలైనదనుకుంటే, జగన్‌కు వ్యతిరేకంగా అంతకన్నా పెద్ద కర్వ్ అన్ని వర్గాలలో కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో కనీసస్థాయి గల ప్రతిపక్షమైనా ఏదీ లేక మైదానమంతా తనతే అయిన స్థితిని జగన్ సద్వినియోగ పరచుకోవడానికి బదులు, చేజేతులారా పోగొట్టుకొంటున్నట్టు కనిపిస్తున్నది.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)