సంపాదకీయం

మృత్యు గవాక్షాలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో మే నెల ఒకటవ తేదీన ఇద్దరు శ్రమజీవులు పారిశుద్ధ్య గవాక్షంలో చిక్కుకుని అకాల మృత్యువు పాలు కావడం పాలనా యంత్రాంగం వారి నిర్లక్ష్యానికి మరో ఉదాహరణ! ఇది విస్తృత హైదరాబాద్ మహానగర పాలిక-జిహెచ్‌ఎంసి-వారి నిర్లక్ష్యం. హైదరాబాద్ నగర నీటి సరఫరా, పారిశుద్ధ్య మండలి-హెచ్‌ఎమ్‌డబ్ల్యుఎస్ అండ్ ఎస్‌బి-వారి నిర్లక్ష్యం...పోలీసుల నిర్లక్ష్యం, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం...దుర్ఘటన సంభవించిన రామ్‌కోటి ప్రాంతంలోని స్థానికుల నిర్లక్ష్యం! కలసి వెరసి ఈ మహా క్రూరమైన నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ముప్పయి ఐదేళ్ల కోటయ్య, వెంకటస్వామి అనే వలస కార్మికులు బతకడం కోసం మహానగరానికి వచ్చి చేరారు. ప్రాణాలను పోగొట్టుకున్నారు. బతకాలనే ఆశ వారిని పారిశుద్ధ్య బిలంలోకి దించింది! తెరచి వుంచిన పారిశుద్ధ్య గవాక్షాలు-మాన్ హోల్స్-మృత్యు గహ్వారాలుగా మారిన కథలు జంటనగరాలలో దశాబ్దుల తరబడి ప్రచారమయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రచారమవుతున్నాయి. ప్రధానంగా వర్షం కురిసి జంటనగరాలలోని వీధులు వాగులుగా మారి పొంగిపొరలిన సందర్భాలలో తెరచి ఉన్న పారిశుద్ధ్య గవాక్షాలలోకి వీధులలో నడిచిన వారు పడిపోవడం జలసమాధి కావడం మామూలైపోయింది. ఇలా ఎంతమంది బలి అయినప్పటికీ కూడ నగర పాలక పారిశుద్ధ్య విభాగాల వారికి బుద్ధిరాకపోవడం జంటనగరాలకు మాత్రమే కాదు, దేశమంతటికీ వర్తిస్తున్న వైపరీత్యం. మురుగు కాలువలను శుద్ధి చేయడానికై పారిశుద్ధ్య బిలాలను తెరిచి పగలంతా పనిచేసినవారు సాయంత్రం ఆ మహా రంధ్రాలను మూయడానికి బద్ధకించడం ఫ్యాషనైపోయింది. అందువల్ల రహదారుల మీద ఈ పారిశుద్ధ్య గవాక్షాలు నోళ్లు తెరుచుకుని రాత్రంతా నిరీక్షిస్తూ ఉంటా యి. పరుగులు తీసే వాహనాలు ఈ తెరిచిన కన్నాలలో పడి ప్రమాదాలు జరగవచ్చు. లేదా నడుస్తున్నవారు నిలువునా మురికి నీటి మహా ప్రవాహాలలోకి పడిపోవచ్చు! ఈ పారిశుద్ధ్య గవాక్షాలలోను, మురుగునీటి గొట్టాల పైనుండి పడినవారు గాయపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం నిరంతరం పొంచి ఉండడం నాగరికతలో భాగమైపోయింది. ఈ నిర్లక్ష్యపు నాగరికతను నిరోధించడానికి ఎవ్వరూ పూనుకోవడం లేదన్నది ప్రమాదాలు ఆగకపోవడం వల్ల ధ్రువపడింది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు కార్మికుల ప్రాణాలు పోవడం వారు పొరపాటున మాన్‌హోల్‌లో పడిపోవడం వల్ల కాదు, వారు వారంతట వారే ఈ బిలంలోకి దిగారు. దించినవారు ఎవరు...? వారిని ఎవరు పసికట్టి శిక్షిస్తారు?
మే ఒకటవ తేదీన సెలవు కాబట్టి ప్రభుత్వ పారిశుద్ధ్య కార్మికులకు సెలవు. అందువల్ల కార్మికులు ఎవరూ అందుబాటులో లేరు. పారిశుద్ధ్య కార్యాలయమే పని చేయదు. అలాంటప్పుడు మాన్‌హోల్‌లోకి దిగి ఎవరు చెత్తను తొలగిస్తారు. పనికోసం వేచి ఉండిన ఈ ఇద్దరు కార్మికులను స్థానికులెవరో పురికొల్పారు. కూలి లభిస్తుందన్న ఆశతో వారిద్దరూ ఆ పనికి పూనుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నగర పాలికా పారిశుద్ధ్య మండలి వారికి సంబంధం లేదన్నది ఆధికారిక వాదం. అందువల్ల ఈ కార్మికులను గవాక్షంలోకి దింపిన నాగరికులదే క్రూరమైన నిర్లక్ష్యం. మాన్‌హోల్‌లలోను, మురికి గొట్టాలలోను నిరంతరం కార్బన్ మోనో ఆక్సయిడ్ అనే విష వాయువు వెలువడుతూ ఉంటుంది. శిక్షణ పొందిన పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే ఈ విషవాయువు ప్రభావాన్ని నిరోధించుకోగలరు. అందు తగిన పరికరాలు వారివద్ద ఉంటాయి. పోలీసులు సైతం మ్యాన్‌హోల్‌లోనికి దిగి స్పృహ తప్పిన కార్మికులను బయటికి తీయడానికి భయపడ్డారట! అందువల్ల గంటలపాటు చోద్యం చూసిన పోలీసులు వైద్య సేవల కోసం కబురు పంపారు. ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో మొదటి కార్మికుడు మురుగు కన్నంలోకి దిగాడు. అతగాడు అస్వస్థుడై స్పృహ కోల్పోవడంతో రెండవ కార్మికుడు కూడ దిగి తాను కూడ స్పృహ కోల్పోయాడు. పోలీసులు మాత్రం తమ ప్రాణాలు అత్యంత విలువైనవి కనుక మాన్‌హోల్‌లోనికి దిగలేదు. వైద్య సిబ్బంది కూడ సాహసించలేదు. ఇంతటి ప్రమాదకర పారిశుద్ధ్య బిలంలోకి డబ్బు ఎరచూపి ఆ అభాగ్యులిద్దరినీ దించేసిన మానవత్వం లేని స్థానిక నాగరికులను ఎవరు శిక్షించాలి...బహుశా వారు బయటపడరు!
మధ్యాహ్నం మూడు గంటల వరకు స్పృహ తప్పిన కార్మికులు బిలంలో వుండిపోవడం వల్లనే వారు మరణించారు. పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య మండలివారు తక్షణ చర్యలు చేపట్టి ఉండినట్టయితే వారు బతికి ఉండేవారు. అందువల్ల స్థానికులతో పాటు ఈ మూడు విభాగాల ప్రభుత్వ అధికారులు ఈ దుర్మరణాలకు సమాన బాధ్యులు. వీరందరినీ విచారించి శిక్షించడం ఉన్నత అధికారుల బాధ్యత! చివరికి మృతుల బంధువులు స్నేహితులు మాత్రమే సాహసించి మురికి కన్నంలోకి చొరబడి వారిద్దరినీ బయటికి చేర్చారు. వైద్య శాలకు తరలించేసరికి వారు మరణించి ఉన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలలోని ఉద్యోగులలోను అధికారులలోను అత్యధికులను రాక్షస ప్రవృత్తి పైశాచిక స్వభావం ఆవహించి ఉండడం నిర్లక్ష్యం వ్యవస్థీకృతం కావడానికి కారణం. పారిశుద్ధ్య అధికారులు, పర్యవేక్షకులు, కార్మికులు ఎప్పటికప్పుడు బిలాలను శుభ్రం చేసి మురుగు నీరు ముందుకు వెళ్లిపోవడానికి దోహదం చేయాలి. అది వారి విధి. ఈ విధి నిర్వహణ కోసమే ప్రజలు వారికి జీతాలు ఇస్తున్నారు. చేయవలసిన విధులను నిర్వర్తించకపోవడం, న్యాయంగా లభించే వేతనంతో సంతృప్తి చెందక పోవడం పైనుండి కింది వరకూ కల ప్రభుత్వ ఉద్యోగులలో అత్యధికుల స్వభావం. అందువల్లనే జంటనగరాలలో మాత్రమేకాదు, దేశమంతటా కూడ పారిశుద్ధ్య వ్యవస్థ కంపుకొడుతునే ఉంది, మురుగునీరు రోడ్ల మీదికి వరదలెత్తుతునే ఉంది..ఈ కంపును భరించలేకపోవడం వల్లనే నగర ప్రజలు ఎక్కడికక్కడ తమ ఖర్చులతో కూలీలను వినియోగించి పారిశుద్ధ్య గవాక్షాలను శుద్ధి చేయిస్తున్నారు. కోటయ్య, వెంకటస్వామి ప్రాణాలను కోల్పోవడానికి ఇదంతా నేపథ్య వైపరీత్యం!
ఇలా పారిశుద్ధ్య బిలాలను నైపుణ్యం లేని వారు శుభ్రం చేయడం ప్రమాదకరమని నగర పాలిక అధికారులకు పారిశుద్ధ్య అధికారులకు తెలుసు. కానీ నిరోధించరు, తమకు పని తప్పినందుకు సంతోషిస్తున్నారు. రామ్‌కోటి ప్రాంతంలో మాత్రమే కాదు జంటనగరాలలోని అనేకానేక ప్రాంతాలలో కూడ స్థానికులు కూలీలను కుదుర్చుకుని పారిశుద్ధ్య గవాక్షాలను శుభ్రం చేసుకుంటున్నారు. డబ్బుకోసం పొట్ట గడవడం కోసం ఈ బిలాలలోకి దిగి శుభ్రం చేస్తున్న ప్రభుత్వేతర కార్మికులు క్షేమంగా బయటపడడానికి కారణం భగవంతుని కృప మాత్రమే! జంటనగరాలలో దాదాపు లక్షా డెబ్బయి ఐదు వేల పారిశుద్ధ్య గవాక్షాలున్నాయట! వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షకులు తనిఖీలు చేస్తున్నారని అధికారులు చెపుతున్నారు. కానీ తనిఖీ చేయరు. ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోరు!