సంపాదకీయం

‘పరిణత’ ప్రజాస్వామ్యం..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల సమయంలో ‘వోటుకింత’ అని ముట్టచెప్పడం దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులందరూ పాటిస్తున్న ‘ప్రజాస్వామ్య’ సంప్రదాయం. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల శాసన సభలను ఎన్నుకొనడానికి జరిగిన జరుగుతున్న ప్రచార ప్రహసనంలోకూడ ఈ ‘సంప్రదాయాన్ని’ అధికాధిక అభ్యర్థులు చిత్తశుద్ధితో నిలబెట్టినట్టు వినికిడి. పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిపోయింది. మే 16న తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాం తాల్లో పోలింగ్ జరుగుతోంది. అందువల్ల తమిళనాడులో అభ్యర్థి మహాశేయులు ఎంతడబ్బు పంచి ఉంటారన్నది ఊపందుకున్న ఊహాగానం. ఎందుకంటె ఈ మూడింటిలో తమిళనాడు పెద్ద రాష్ట్రం. తమిళనాడులో ‘‘వోటర్లకు పంచడానికి అభ్యర్ధులు భద్రంగా నిలువ చేసిన’’ నల్లధనంలో దాదాపు వందకోట్ల రూపాయలను ఎన్నికల నిర్వహణ అధికారులు స్వాధీనం చేసుకున్నారట. ఒక ఎన్నికల సమయంలో ఒకే రాష్ట్రంలో ఇంతపెద్ద మొత్తంలో అక్రమధనం ‘ఆవిష్కరణ’కు గురికావడం ఇదే మొదటిసారన్న ప్రచారం జరిగింది. అయితే 2014 నాటి లోక్‌సభ శాసనసభల ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో నూటనలబయి కోట్ల రూపాయల ‘పంపిణీ ద్రవ్యం’ అధికారులకు దొరికిపోయింది. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణగాను, అవశేష ఆంధ్రప్రదేశ్‌గాను రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. అంతేకాక 2014లో శాసనసభ, లోక్‌సభల ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అందువల్ల ఆ నూటనలబయి కోట్ల రూపాయల అక్రమద్రవ్యం చరిత్రలో అతిపెద్ద ‘పంపిణీ’ మొత్తం కాజాలదని కూడ ప్రచారం జరిగింది. అందువల్ల తమిళనాడులో తాజాగా పట్టుబడిన వందకోట్ల రూపాయలే ఒక రాష్ట్రంలో ఒక ఎన్నిక సందర్భంగా బయటపడిన అతిపెద్ద మొత్తమని నిర్ధారణ జరిగిపోయింది. అన్నాడిఎంకె పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ వారు ఓటర్లకు పంపిణీ చేసిన విక్రయధనం విలువ కూడా మిగిలిన పార్టీలు వెచ్చించిన అక్రమధనం కంటె ఎక్కువే ఉండడం సహజమని కూడ ఆరోపణలు వచ్చాయి. అన్నాడిఎంకెకు చెందిన ఒక మంత్రిగారి అతి సన్నిహితుడైన ఒక వాణిజ్య ప్రముఖుని ప్రాంగణంలో దాదాపు ఐదుకోట్ల రూపాయల నల్లడబ్బు వెల్లడికావడం ఈ ఆరోపణలకు ప్రాతిపదిక. ఒకేచోట ఒకేసారి పట్టుబడిన అతిపెద్ద మొత్తం ఇదేనట. ప్రతిపక్షమైన ద్రవిడ మునే్నత్ర కజగానికి చెందిన ఒక మాజీ మంత్రి మద్యం బట్టీలో దాదాపు మూడున్నర కోట్ల రూపాయల లెక్కలలో చూపని డబ్బు బయటపడిందట...
ఈ మద్యం బట్టీలో ఉత్పత్తి బాగా పెరిగి ఉండవచ్చు. ఇతర చోట్ల మద్యం ఉత్పత్తి పరిణామం విస్తరించి ఉండవచ్చు. ఎందుకంటె మండుటెండలో పోలింగ్ కేంద్రాలకు వచ్చే వోటర్లలో అధికులు మద్యపాన ప్రియులన్నది బహిరంగ రహస్యం. ఈ ‘రసజ్ఞుల’కు దాహార్తి తీర్చి వేడిమి నుంచి వారిని రక్షించే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకున్న అభ్యర్థులు భారీగా మద్యాన్ని ప్రధానంగా బీరును డబ్బాలలో, సీసాలలో, పీపాలలో లారీలలో నిలువచేసి ఉంచారట. అవశేష ఆంధ్రప్రదేశ్ చల్లటి బీరు తగినంత దొరకక జనం అల్లాడిపోతున్నారని ఈ మధ్య మాధ్యమాలలో కథనాలు వెలువడినాయి. వేసవిలో నీరు దొరకక నిరుపేదల నోళ్లు ఎండిపోతుంటే, చల్లని బీరు దొరకక డబ్బెక్కువైనవారి గొంతులు దాహంతో అలమటిస్తున్నాయట. ‘‘మానవీయ శ్రద్ధ’’- హ్యూమన్ ఇంటరెస్ట్- నిండిన మనస్సుల వారు ఇలాంటి ‘బీరు కొరత’ కథనాలను గొప్పగా ప్రచారం చేశారు. తెలంగాణ నుంచి ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి తగినంత బీరు తరలిరాకపోవడం వల్లనే అవశేష ఆంధ్రప్రదేశ్‌లో ఈ మద్య విశేషానికి కొరత ఏర్పడినట్టు ప్రచారమైంది. పొరుగు తెలుగు రాష్ట్రం వారి బాధను గుర్తించి కాబోలు..హైదరాబాద్ మహానగర పాలకుకు బీరు బట్టీలలో ఉత్పత్తి పెరగడానికి వీలుగా వాటికి అదనంగా మంచినీటిని సరఫరా చేయాలని నిర్ణయించారట. నల్లాలో నీరు రాకపోవడం, పాత పైపులు పగిలిపోయి లక్షల లీటర్ల మంచినీరు మట్టిపాలు కావడం వేరే సంగతి...కానీ చల్లని బీరు ఉత్పత్తికావడం ప్రధానం. కానీ అవశేషాంధ్రప్రదేశ్‌లో బీరు కొరత ఏర్పడడానికి అసలు కారణం తమిళనాడు ఎన్నికలన్న మహా విషయం ప్రచారం కాని రహస్యం. డెబ్బయికోట్ల విలువైన అక్రమ మద్యాలను ఇతర వస్తువులను తమిళనాడులో ఎన్నికల అధికారులు పట్టివేశారట. వోటర్లకు పంచి పెట్టడానికి మాత్రమే కాక ఎండలలో తిరిగి ప్రచారం చేసే కార్యకర్తల దప్పిక తీరడానికి కూడా శీతల మధ్యం అవసరం మరి. మద్యపానం ఆధునిక నాగరికతా లక్షణాలలో ఒకటయిపోవడం స్వతంత్ర భారతంలో ప్రభుత్వాల కృషి ఫలితం. వందకోట్ల రూపాయల డబ్బు మాత్రమే బయటపడింది. బయటపడకుండా వివిధ పోలింగ్ కేంద్రాల పరిధిలోని నాయకులకు కార్యకర్తలకు ఓటర్లకు చేరిపోయిన అక్రమ ధనం విలువ ఎంత? దీని విలువ పట్టుబడిన డబ్బు విలువకంటె కనీసం పదిరెట్లు ఎక్కువ ఉండవచ్చు. అలాగే పట్టుబడిన డెబ్బయికోట్ల రూపాయల విలువైన మద్యం కంటె, కార్యకర్తలు, వోటర్లు ఉచితంగా జుర్రేస్తున్న మద్యం పరిమాణం ఎన్నిరెట్లో మరి! ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులలో అధికాధికులు పరిమితిని మించి వ్యయం చేస్తుండడం సామాన్యులకు సైతం తెలిసిపోయిన వైపరీత్యం. ఈ సామాన్యులలో ఎక్కువమంది కూడ అభ్యర్థుల వద్ద అంతో ఇంతో పుచ్చుకోకుండా వోటు వేయికపోయడం బహిరంగ రహస్యం. కొంతమంది వోటర్లకు దాదాపు అన్ని పార్టీల వారు ఎంతోకొంత ముట్ట చెప్పడం మడుస్తున్న చరిత్ర. ‘మా ప్రత్యర్థులు డబ్బిస్తే తీసుకోండి...కానీ వోటు మాత్రం మాకే వేయండి’ అని అభ్యర్థులు ఓటర్లను బహిరంగంగానే కోరడం ప్రచార ప్రహసనంలో భాగమైపోయింది. నామాంకన పత్రాలను దాఖలు చేసే సమయంలో అభ్యర్థుల వెంట ఊరేగింపుగా వెళ్లేవారు, ప్రచార సభలలో పాల్గొనేవారు, ఇంటింటికీ వెళ్లి అభ్యర్థుల గొప్పతనం గురించి చెప్పేవారు. వోటువేసే వారు. వీరందరిలోను అత్యధికులకు దిన వేతనం అభ్యర్థుల నుంచి లభిస్తోందన్నది కఠోర వాస్తవం. ప్రజాస్వామ్యం పరిణతి చెందుతున్న కొద్దీ నల్లడబ్బు, నకిలీ డబ్బు ప్రభావం కూడ విస్తరించిపోతోంది..
తమిళనాడులో ప్రధాన పక్షాలు చేస్తున్న వాగ్దానాలు కూడ ప్రతి ఎన్నికలోను గతం కంటె మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఎన్నికలలో గెలిచినట్లయితే తెల్లకార్డు ఉన్నవారికి స్మార్ట్ఫోన్‌లు ఉచితంగా ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి ఎమ్.కరుణానిధి నాయకత్వంలో ‘ద్రవిడ మునే్నత్ర కజగం’ వారు వాగ్దానం చేశారు. తెల్లకార్డులున్న మహిళలకు సగం ధరకు మోపెడ్లను, స్కూటర్లను ఇప్పిస్తామని, తెల్లకార్డులున్నవారందరికీ ఉచితంగా సెల్‌ఫోన్లు పంపిణీ చేస్తామని, సహకార ఋణాలను రద్దుచేస్తామని ముఖ్యమంత్రి జె. జయలలిత నాయకత్వంలోని అన్నాడిఎంకె ప్రచారం చేసింది. మద్యపానాన్ని దశలవారీగా నిషేధిస్తామన్న జయలలిత వాగ్దానం మాత్రమే నడుస్తున్న కథకు భిన్నమైనది...