మెయన్ ఫీచర్

సాంస్కృతిక దౌత్యం...మైత్రికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమయానుకూలమైన రీతిలో సాంస్కృతిక దౌత్యాన్ని ప్రయోగించటంలో ప్రధాని నరేంద్రమోదీ దిట్ట. గత రెండేళ్ల కాలంలో హిందూమతం, బౌద్ధమతం, ఇస్లాముల మధ్య ఉన్న అంతర్లీన బంధాన్ని ఉపయోగించుకుని, విదేశీ సంబంధాలను బలోపేతం చేయగలిగారు. ఇందుకు తాజా ఉదాహరణ, ఉజ్జయినిలో జరిగిన సింహస్థ కుంభమేళాలో అనుసరించిన వ్యూహమే. ఆ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో పాటు, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు. ఈ నెల 14న జరిగిన ఈ సమున్నత సాంస్కృతిక మేళాలో దక్షిణాసియాకు చెందిన ప్రముఖులనందరినీ ఒకే వేదికపైకి తీసుకురావటంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన ఉద్దేశం విశ్వజనీన విలువలు, నైతిక వర్తన, సాధారణ జీవనం వంటి వాటి మధ్య ఉన్న ఉమ్మడి బంధాన్ని బలోపేతం చేయటమే. అంతేకాదు.. ఉత్తమమైన జీవనానికి ఉదాత్త జీవన సరళికి భారత దేశం సమున్నత వేదిక అన్న భావనను బలోపేతం చేయటమే.
ఇప్పటి వరకు భారత విదేశాంగ విధానంలో కేవలం మాటలకే పరిమితమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక అంశాలను ప్రధాని వెలుగులోకి తేగలిగారు. వాటి ప్రాధాన్యతను, విదేశాంగ సంబంధాల్లో మరింత ప్రస్ఫుటీకరించగలిగారు. తరచు ప్రధాని మోదీ భారతీయతలో మేళవించిన వసుధైక కుటుంబ భావనను త్యాగంలోనూ, త్యజించటంలోనూ ఉన్న ఆనందాన్ని సంబంధించి తేన, త్యెక్‌తేన భుంజితా వంటి భావనలను అనేక సందర్భాల్లో ఆయన సాధువులతోనూ, ఇతర మతాలకు చెందిన వారితోనూ జరిపిన సంభాషణల్లోనూ వెలుగులోకి తెచ్చారు. ఉజ్జయినిలో కూడా ప్రతి ఒక్కరి సంక్షేమం, ప్రతి ఒక్కరి క్షేమమే భారతీయ తత్వమన్న భావనను చాటి చెప్పారు. ఈ రకమైన అన్వయింపులు, వివేచనాయుతమైన వివరణలు భారత దేశానికి సంబంధించిన ఎన్నో రకాల కుత్సిత నిర్వచనాలకు భావార్థాలకు తెరదించుతాయి. భారత దేశం తానే సర్వమన్న దేశంగా పరిగణించుకుంటోందని, అలాగే పొరుగున ఉన్న చిన్న చిన్న దేశాలపై ఆధిపత్యం చెలాయించటమే దీని ఉద్దేశమన్న తప్పుడు భావనలను దీనివల్ల తొలగించినట్లయింది.
ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఎన్నోరకాల సంక్షోభాలకు భారత దేశం తరతరాలుగా సంపాదించుకున్న నాగరికత, విజ్ఞానమే సరైన పరిష్కారమని కూడా మోదీ చాటి చెప్పారు. ఆర్థికపరమైన అంశాలతో పాటు వ్యూహాత్మకమైన లెక్కలకు కూడా భారత దేశ విజ్ఞానమే, నాగరిక జీవన విధానమే సరైన పరిష్కారం అందిస్తుందన్న భావనను ఆయన తెరపైకి తెచ్చారు. అలాగే మొత్తం ప్రపంచం అంతా భారత దేశంలో ఉందని పేర్కొన్న ఆయన, భారతావనిని బహుముఖ సాంస్కృతిక విస్తృత వేదికగా కూడా అభివర్ణించారు. అంతేకాదు, విలువలకు, నైతిక వర్తనకు కూడా దీన్ని తలమానికంగా పేర్కొంటూ, స్వామి వివేకానంద మొదలుకొని ఎందరి ప్రవచనాలనో ఉదహరించారు. 19వ శతాబ్దంలో వివేకానందుడు ప్రవచించిన భావనలను అనేక సందర్భాలలో ప్రస్తుతించటం ద్వారా, భారత దేశ సాంస్కృతిక, నాగరిక వైభవాన్ని కూడా మోదీ కళ్లకు కట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన చేసిన వ్యాఖ్యల్లో బౌద్ధమతం పట్ల ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న అచంచల విశ్వాసాన్ని, గౌరవనీయ భావనను ప్రస్తావించారు. ‘‘మైనారిటీ బౌద్ధ మతస్థుల దేశానికి చెందిన నేను ఎంతో ఆనందంగా ఉండటానికి బలమైన కారణముంది. బౌద్ధమతం పట్ల తనకున్న గౌరవనీయ భావనను మోదీ అనేక కోణాల్లో చాటి చెప్పారు. ’’ అని సిరిసేన పేర్కొన్నారు. ఇది కూడా అనేక రకాలుగా నరేంద్రమోదీ అనుసరిస్తున్న సాంస్కృతిక దౌత్య విధానం అనుకున్న ఫలితాలను ఇస్తుందని చెప్పటానికి ప్రబల నిదర్శనమే.
చైనాతో ఆర్థికపరమైన బంధాన్ని తెంచుకుంటూ దానికి చేరువవుతున్న శ్రీలంక ఎన్నో రకాలుగా ఆ దేశానికి ఆశ్రయమిస్తోంది. చైనా సబ్‌మరైన్లను శ్రీలంకలోకి అనుమతిస్తోంది. అయినప్పటికీ కూడా చైనాలో బౌద్ధమతానికి ఏ కోశానా తావులేదు. ముఖ్యంగా దలైలామాను అణచివేయటం, టిబెట్‌లో చైనా అనుసరిస్తున్న సాంస్కృతిక విధ్వంసంతో పోలిస్తే భారత దేశం ఈ విషయంలో సమున్నతంగా నిలుస్తున్నది. బౌద్ధ మతాన్ని ఆదరించటమే కాకుండా, ఆరాధిస్తోంది. ఇందుకు నిదర్శనం శ్రీలంక అధ్యక్షుడు స్వయంగా భారత్‌కు వచ్చి, బౌద్ధ మత పునరుజ్జీవన గురువుల్లో ఒకరైన అణగారిక ధర్మపాల విగ్రహాన్ని ఆవిష్కరించటమే.
మహా కుంభమేళాలో ముఖ్యఅతిథిగా హాజరు కావటమే కాకుండా ఈ సారి సిరిసేన భారత్‌కు రావటానికి మరోరకమైన ప్రాధాన్యత, చిరస్మరణీయత కూడా ఉంది. బౌద్ధమత పునరుద్ధరణ గురువు ధర్మపాల, హిందూ మత గురువులను వ్యతిరేకించారు. 19వ శతాబ్దం ద్వితీయార్థంలో భారత్‌లో బౌద్ధమతాన్ని మళ్లీ బలంగా ప్రతిష్ఠించే ప్రయత్నం చేశారు. శ్రీలంకకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సింహళీయుల జాతీయ వాదం బౌద్ధమతానికి సంబంధించిన అతివాద ధోరణులు అనేకరకాలుగా హిందూ తమిళ మైనార్టీలకు వ్యతిరేకంగానే పనిచేశాయి. ఈ నేపథ్యంలో లంకలో జరిగిన దశాబ్దాల రక్తపాతాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ప్రస్తుతం అక్కడ ఉన్న అన్ని వర్గాల మధ్య సామరస్య పూర్వక భావనను పాదుకొల్పాల్సిన అగత్యం మరింతగా కనిపిస్తోంది. శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనతో పాటు, ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు తమిళ జాతీయ అలయన్స్ సారధి అయిన ఆర్.సంపతన్‌ను కూడా ఉజ్జయినికి ప్రధాని మోదీ ఆహ్వానించటం, హిందూ బౌద్ధమతాలను సమ్మిళితం చేసే ప్రయత్నం చేయటమే. మోదీ తెరపైకి తెచ్చిన ఈ ఆలోచన ఆయన సాంస్కృతిక దౌత్యంలో అంతర్లీనంగా ఉన్న మానవీయ, రాజకీయ ఉద్దేశాలను స్పష్టీకరించేవే. కుంభమేళాలో జరిగిన సింహస్థ విశ్వజనీన సందేశ కార్యక్రమంలో కూడా ప్రధానిమోదీ భారత దేశ దౌత్యరీతుల్ని అలాగే ఎలాంటి సంక్లిష్ట సమస్యలనైనా పరిష్కరించటంలో దానికి ఉన్న నిర్వహణా నైపుణ్యాన్ని ప్రస్తావించారు. ‘‘్భరత దేశం సహజీవన సమున్నత భావనల నుంచి ప్రోది చేసుకున్న దూరదృష్టితోనే మనుగడ సాగిస్తోంది. దీనికి ఏ విధమైన అహంకార పూరిత ధోరణులు లేవు. పట్టిందే పట్టుగా వ్యవహరించే తత్వమూ లేవు’’ అని స్పష్టం చేశారు. మోదీ చేసిన ఆ ప్రకటన శాంతి, సమాఖ్య భావన రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలన్న తపన, ప్రజాస్వామ్యం ప్రాతిపదికగా రూపొందించుకున్న బహుళజాతి వ్యవస్థే భారత దేశమని చాటి చెప్పింది. ఆ ప్రసంగం ద్వారా ఆయన అనాదిగా వస్తున్న భారతీయ సంప్రదాయాలను, సహజీవనంతో పెనవేసుకున్న దాని అనుబంధాన్ని కూడా విశేషంగా విశే్లషించారు. చాలా శక్తివంతంగానే భారతీయత సమగ్రత రూపాన్ని ఆవిష్కరించగలిగారు.
ఓ పక్క సుదీర్ఘ యుద్ధం నుంచి బయట పడినా, దాని సెగలు ఇంకా శ్రీలంకను కమ్ముకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింహళీయులు, తమిళుల మధ్య జరుగుతున్న ఘర్షణల నుంచి బయటపడాలంటే భారత్‌వైపు చూడటం తప్ప శ్రీలంకకు మరో మార్గం లేదు. అలాగే దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల ప్రజల మధ్య సంబంధాలను టూరిజాన్ని పెంపొందించటాన్ని కూడా, ఇటు రామాయణాన్ని, అటు బౌద్ధమతాన్ని ప్రస్తావిస్తూ తన సాంస్కృతిక దౌత్యాన్ని మోదీ మరింతగా బలోపేతం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆసియాలో భారత దేశం అత్యంత ప్రధానమే కాకుండా, అన్ని అంశాలకు కేంద్రకమన్న భావనను మోదీ చాలా బలంగానే స్థాపించారు. అందుకు సాంస్కృతిక దౌత్యాన్ని ప్రబలమైన అస్త్రంగానే వినియోగించారు. నిరుడు జరిగిన హిందూ, బౌద్ధ సదస్సులో కూడా మోదీ చేసిన ప్రసంగాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ‘‘్భరత దేశంలో బౌద్ధమతాన్ని పెంపొందించడానికి మా ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతోంది.’’ అని మోదీ ఆ సందర్భంగా వెల్లడించారు. అలా చెప్పటంలో మోదీ ఉద్దేశం బుద్ధుడు సర్వాంతర్యామి అని, ఆయన లేని ప్రదేశాన్ని, ప్రాంతాన్ని ఊహించలేమన్న వాస్తవాన్ని చాటిచెప్పారు. అంతటి ప్రభావశీలమైన బౌద్ధమత ప్రవచనాలను అనుసరించటం ద్వారానే అన్ని రకాల సంఘర్షణల నుంచి బయటపడగలుగుతామన్నారు. ఆ ప్రసంగం కూడా అన్ని మతాలను, అన్ని భావాలను సమీకృత రీతిలో ఆస్వాదించగలిగే భారతీయ ఔన్నత్యాన్ని మరింత శక్తివంతంగానే వెల్లడించారు.
బౌద్ధమతంతో పాటు ఇస్లాం మతాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తన సాంస్కృతిక దౌత్యాన్ని చాలా బలంగానే చాటి చెప్పారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రపంచ సూఫీ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగమే ఇందుకు నిదర్శనం. ‘‘్భరత దేశం నుంచే సూఫీ ప్రపంచం అంతా విస్తరించింది. భారత దేశంలో మొగ్గ తొడిగిన ఈ సంప్రదాయం మొత్తం దక్షిణాసియా అంతటికీ చెందుతుంది.’’ అని మోదీ పేర్కొన్నారు. అంతే కాదు, సూఫీయిజాన్ని.. ఉగ్రవాదానికి, తీవ్రవాదానికి విరుగుడుగా పేర్కొంటూ మోదీ ప్రవచించిన ఆలోచనలు మొత్తం ముస్లిం ప్రపంచాన్ని, ముఖ్యంగా పశ్చిమాసియాను విశేషంగా ఆకర్షించాయి. 2015లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షేక్ జాయద్ గ్రాండ్ మసీదును మోదీ సందర్శించటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అబూదాబీ పాలకులతో ఆయన దిగిన సెల్ఫీలు కూడా సాంస్కృతిక దౌత్యాన్ని చాటి చెప్పేవే. అన్ని మతాల భావనలకు నరేంద్రమోదీ పెద్ద పీట వేయటమే, వాటిని సమాదరించటమే ప్రపంచ వ్యాప్తంగా హిందూయేతర దేశాలు, వర్గాలు ఆయన్ను అక్కున జేర్చుకోవటానికి కారణం. అన్ని మతాలతోనూ ఆయన మమేకమయ్యారు. ఎలాంటి దాపరికాలకు తావు లేకుండా వ్యవహరిస్తూ వచ్చారు. వివిధ మతాల్లో ఉన్న సానుకూల లక్షణాలను తెరపైకి తేవటమే కాకుండా ఆయా మతాలు చేసిన సేవలను ప్రస్తుతించారు. ఓ హిందువుగా మరింత విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందించుకుంటున్న నరేంద్రమోదీ హయాంలో భారత సునిశిత ఆధ్యాత్మిక శక్తి మరింత ఉన్నతంగా మారుతోంది. సమానత్వమే ప్రాతిపదికగా శక్తివంతవౌతోంది. భారత దేశ సంప్రదాయిక వైభవాన్ని చాటేందుకు కుంభమేళా తరహాలో మరిన్ని బహుముఖ అజెండాలు తెరపైకి రావాలని ఆశిద్దాం.

- శ్రీరామ్ చౌలియా