సంపాదకీయం

‘పుట్టని’ బిడ్డకు పేరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాఖ్య కూటమి-ఫెడరల్ ఫ్రంట్- గురించి ప్రాంతీయ రాజకీయ అధినేతలకు మరోసారి స్ఫురించడం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల వల్ల సంభవించిన ప్రధాన పరిణామం. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు లభించిన ఘనవిజయం పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే అపూర్వమైంది. అందువల్ల సమాఖ్య కూటమి ప్రతిపాదన మరోసారి ప్రాణం పోసుకునే అవకాశం లేకపోలేదు. సమాఖ్య లేదా ఫెడరేషన్ అన్న మాటతో ప్రాంతాలు లేదా రాష్ట్రాలకు ఉన్న ప్రాధాన్యం ధ్వనిస్తోంది. ‘‘రాజ్యాంగ వ్యవస్థలో సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించాలన్న’’ వాదాలు తరచుగా వినిపిస్తుండడం ప్రాంతీయ ప్రాధాన్యాలకు చిహ్నం. రాజకీయ పరిణామక్రమంలో కూడ ఈ సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించడం ప్రాంతీయ పక్షాలు అధినేతల అభీష్టం. కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న భారతీయ జనతాపార్టీకి జాతీయ ప్రత్యామ్నాయంగా ఒకే రాజకీయ పార్టీ అవతరించే వీలు సమీప భవిష్యత్తులో లేదన్నది సమాఖ్య కూటమిని పునరుద్ధరించలేదనడానికి యత్నిస్తున్న వారి అభిప్రాయం. కేంద్ర ఆర్థిక మంత్రి భాజపా నాయకుడు అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించినట్టు ఈ సమాఖ్య కూటమి గతంలో కూడ ఏర్పడి, పోరాడి విఫలమైంది. ఇందుకు ప్రధానకారణం, సమాఖ్య పక్షాలలో సైద్ధాంతిక సామ్యం లేకపోవడం, సమైక్య కార్యాచరణ కుదరకపోవడం..అయితే ఇప్పుడు ఏర్పడడానికి అవకాశం ఉన్న ఫెడరల్ ఫ్రంట్ గతంలో జరిగిన ప్రయోగాల కంటె భిన్నమైంది. ఈ విభిన్నత్వానికి మొదటి కారణం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాని, ఏదో ఒక కమ్యూనిస్టు పార్టీ కాని ఈ కొత్తసమాఖ్య కూటమిలో చేరడానికి వీల్లేదు. ఎందుకంటె కొత్త సమాఖ్యకు కేంద్ర బిందువు మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్‌లో భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోని వామకూటమి ప్రాబల్య వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెళ్లగించి వేయగలిగిన మహా ప్రభంజనం మమతా బెనర్జీ నిర్వహించిన ‘తృణమూల’-గ్రాస్‌రూట్- ఉద్యమం. మమతా బెనర్జీ కేంద్ర బిందువుగా అవతరించనున్న ఫ్రంట్‌లో కమ్యూనిస్టులు చేరిపోయి ‘చక్రం’ తిప్పే అవకాశం మృగ్యం. మమతా బెనర్జీ స్పష్టమైన ఆర్థిక సిద్ధాంతానికి ప్రాతినిధ్యం వహిస్తోండడం నిరాకరించలేని నిజం.
ప్రపంచీకరణకూ, వ్యవసాయ భూమి పరిరక్షణకు మధ్య జరుగుతున్న సంఘర్షణతో మమతా బెనర్జీ పదిహేను ఏళ్లకు పైగా వ్యవసాయ భూమి పరిరక్షణకు ప్రధాన ప్రతినిధిగా ఏర్పడివుంది. ప్రపంచీకరణపై భారతీయ వ్యవసాయం సాధించిన విజయం 2011 నాటి బెంగాల్ శాసనసభ ఎన్నికలు...ప్రపంచీకరణను నెత్తికెత్తుకొని గ్రామీణ ప్రాంతంలో భయంకర బీభత్సకాండను సృష్టించిన ‘వామకూటమి’ ఆ ఎన్నికలలో ఓడిపోయింది. 1977 నుంచి బెంగాల్‌లో ఆధికారాన్ని చెలాయించిన ఈ కూటమిని మమతా బెనర్జీ తొలగించగలిగింది. వ్యవసాయ భూమి పరిరక్షణకు మమతా బెనర్జీ మరోరూపమైంది. సింగూర్, నందిగ్రామ్ ప్రాంత ఉద్యమాలు ఇందుకు చారిత్రక సాక్ష్యాలు. పరిశ్రమలను నెలకొల్ప దలచిన దేశ విదేశాల కామందులు తమకు కావలసిన భూమిని కొనుగోలు చేసుకోవాలిన ఒక్క సెంటు భూమిని కూడ తమ ప్రభుత్వం వారికి సేకరించి ఇవ్వబోదని 2011లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేసింది. దేశమంతటా విశృంఖల విహారం చేస్తున్న వాణిజ్య ప్రపంచీకరణ బెంగాల్‌లో మాత్రమే చొరబడలేదు. చిల్లర వ్యాపారంలోకి విదేశీయ సంస్థలను అనుమతించినందుకు నిరసనగా 2012లో మమతా బెనర్జీ అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకోవడం ఆమె సైద్ధాంతిక నిష్ఠకు నిదర్శనం...అందువల్ల కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీలు సమానంగా నెత్తికెత్తుకొని మోస్తున్న ప్రపంచీకరణకు భారతీయ ఆర్థిక ప్రత్యామ్నాయం మమతా బెనర్జీ ప్రాంతీయ విజయం..అందువల్ల గతంలో లేని విధంగా మమతా బెనర్జీ నాయకత్వంలోని ఫెడరల్ ఫ్రంట్‌కు సైద్ధాంతిక భూమిక కూడ ఏర్పడనుంది..
అయితే రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ అత్యుత్సాహంగా శుక్రవారం కలకత్తాలో ఆవిష్కరించిన ఫెడరల్ ఫ్రంట్‌లో అనేక వైరుధ్యాలున్నాయి. మమతా బెనర్జీ నాయకత్వాన్ని ఐక్య జనతాదళ్ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ కాని, సమాజ్‌వాది పార్టీ అధినేత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ కాని అంగీకరిస్తారన్న హామీ లేదు. ఎందుకంటె వీరిద్దరూ కూడా ప్రధానమంత్రి పదవి అధిష్ఠించాలన్న కలలను కంటున్నారు. నితీశ్ కుమార్ కలకంటె ములాయంసింగ్ పగటి కలకు ప్రాచీనత ఎక్కువ. నితిశ్ కుమార్‌కు ములాయంసింగ్‌కు మద్య కొనసాగుతున్న ప్రాబల్య స్పర్థ కారణగానే బిహార్ శాసనసభ ఎన్నికలకోసం ఎర్పడి ఉండిన మహాకూటమి-గ్రాండ్ అలయెన్స్- నుండి గత సెప్టెంబర్‌లో సమాజ్ వాదీ పార్టీ వైదొలగిపోయింది. ములాయం సింగ్ మద్దతు లేకపోయినప్పటికీ ఈ మహాకూటమి బిహార్ శాసనసభ ఎన్నికలలో ఘన విజయం సాధించింది. వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఆ తరువాత గుజరాత్ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో భాజపా, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, కాంగ్రెస్‌లకు మధ్య చతుర్ముఖ పోటీ నెలకొననుంది. అక్కడ నితీశ్ కుమార్‌కు కాని, లాలూప్రసాద్‌కు కాని పనిలేదు. మమతా బెనర్జీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ తరపున ప్రచారం చేసే అవకాశం లేదు. మరి ఇంత ముందుగా లాలూ ప్రసాద్ వంటి వారు ఎందుకని ఫెడరల్ ఫ్రంట్ గురించి ప్రస్తావిస్తున్నారు? ఈ ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వాములు కాగల ప్రాంతీయ పక్షాలకు గుజరాత్‌లో నిలువనీడ లేదు. మమతా బెనర్జీకి విజయం చేకూర్చిన, విజయాన్ని పునరావృత్తం చేసిన విధానాన్ని ఏర్పడనున్న ఫెడరల్ ఫ్రంట్‌లో ఇతర పార్టీలు అంగీకరిస్తాయా? ఎందుకంటె రాష్ట్రాలలో ప్రభుత్వాలను నిర్వహిస్తున్న ప్రాంతీయ పక్షాలలో అత్యధికం ప్రపంచీకరణ విధానాలను కాంగ్రెస్ కంటె భాజపా కంటె గట్టిగా సమర్థిస్తున్నాయి. అందువల్ల మమతా బెనర్జీ ఫెడరల్ ఫ్రంట్‌నకు నాయకత్వం వహించిన వెంటనే ఈ విధానం వైరుధ్యాలు స్పష్టమైపోతాయి. ఒడిషాలోని, బిజూ జనతాదళ్ ప్రభుత్వం వారు గత పదిహేను ఏళ్లుగా లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని, అటవీ భూమిని బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు కట్టబెట్టింది. ఇది విధాన వైరుధ్యాలకు ఒక ఉదాహరణ మాత్రమే. తమిళనాడులో ఏ ప్రాంతీయ పార్టీని ఈ ఫెడరల్ ఫ్రంట్‌లో చేర్చుకుంటారు? తెలంగాణలోని అధికారపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాని, ఆంధ్రలో ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కాని ఈ ఫ్రంట్‌లో చేరతాయా? ఈ ప్రశ్నలు లలూప్రసాద్‌ను ఎవ్వరూ అడగలేదు. ఈ ఫ్రంట్‌ను మమతా బెనర్జీ స్పష్టంగా ఆమోదించలేదు. ‘‘వారు కోరితే సహాయం చేస్తాను’’ అని మాత్రమే ఆమె చెప్పిందట. లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇక ముఖ్యమంత్రి పదవి దక్కదు. అందువల్ల ప్రసార మాధ్యమాలలో తనపేరును నిలబెట్టుకొనడం లాలూయాదవ్ తక్షణ కర్తవ్యం...బహుశా అందువల్లనే ఆయన ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే కర్తవ్యాన్ని భుజాలకు ఎత్తుకున్నాడు!