సంపాదకీయం

సవాళ్లకు దీటుగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించి సరిగ్గా రెండేళ్లు గడిచిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఏదో అయిపోతుందనే అనుమానాలు కనుమరుగయ్యాయి. పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ ఒక్కో రంగంలో పురోగామిగా ముందుకు వెళ్తోంది. ఒక్కో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తూ మూడో సంవత్సరంలోకి ప్రవేశించింది. రాష్ట్రం ఏర్పడిన మరుక్షణం విద్యుత్తు సంక్షోభం తలెత్తుతుందని అనుమానాలు వ్యక్తమయితే, కేవలం ఆరు మాసాల వ్యవధిలో కరెంటు కోతలు లేకుండా పోయాయి. ఒకటి రెండు ఘటనలు మినహా నక్సలైట్ల సమస్య రానేలేదు. రాజధాని హైదరాబాద్ నుంచి ఉన్న పరిశ్రమలు ఊరొదిలి వెళ్లటం మాట దేవుడెరుగు..ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు తరువాత స్థానంలో నిలిచి అద్భుతాలు సృష్టించింది. రాజధానిలో ఉంటున్న అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజాసమాజం ప్రభుత్వాన్ని తనదిగా చేసుకుని ఆదరించింది. అన్నింటినీ మించి 14 ఏళ్ల సుదీర్ఘకాలం శ్రమించి, ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించి ఏలుబడిలోకి తెచ్చుకున్న నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమర్థ ముఖ్యమంత్రిగా దేశంలో పేరు తెచ్చుకున్నారు. గుజరాత్ తరువాత ధనిక రాష్ట్రంగా తెలంగాణ మిగులు బడ్జెట్‌తో రెండోస్థానంలో నిలిచింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణ రూపమే సమగ్రంగా మారిపోతోంది. పారిశ్రామికంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానం టి-ఐపాస్‌తో రెండేళ్లలో 1623 పరిశ్రమలకు అనుమతి లభించింది. యాపిల్, గూగుల్, అమెజాన్ వంటి పెద్ద ఐటి వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను ఇప్పటికే ప్రారంభించాయి. తెలంగాణ ఉద్యమం రావడానికి నీళ్లు, నిధులు, నియామకాల్లో తీవ్రస్థాయిలో అన్యాయం జరిగిందన్న వాదనే. ఈ మూడింటిలోనూ మాకూ సమాన హక్కన్న నినాదంతోనే కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం మహోధృతమైంది. తెలంగాణ ఏర్పడిన తరువాత కెసిఆర్ ప్రభుత్వం ఈ మూడింటిపైనా ప్రధానంగా దృష్టి సారించింది. వీటిలో మొట్టమొదటగా దృష్టి సారించిన అంశం సాగు నీరు, తాగు నీటి సమస్యల పరిష్కారమే.
తెలంగాణ పీఠభూమి ప్రాంతం కావటంతో గతంలో కొనసాగిన చెరువుల ద్వారా నీటి నిర్వహణను పునరుద్ధరించటానికి మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టి రెండేళ్లలో రెండు దశలను పూర్తి చేశారు. సుమారు 49వేల చెరువులలో పూడిక తీయటం, వాటిలోని మట్టిని పొలాల్లోకి ఎరువుగా మళ్లించే ఈ మిషన్ కాకతీయ స్కీం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను ఆకర్షించటమే కాకుండా అమెరికాలోని షికాగో నుంచి ఒక బృందం ఈ పథకం అమలు తీరును పరీక్షించటానికి రావటం దీని ప్రత్యేకతకు నిదర్శనం. లక్షల కోట్ల ఖర్చు పెట్టి దశాబ్దాలు గడిచినా పూర్తికాని భారీ ప్రాజెక్టుల కంటే ముందు ప్రతి గ్రామంలో చెరువులను పునరుద్ధరించటం, చిన్న చిన్న కాలువల ద్వారా నీటిని చెరువులకు మళ్లించటం.. వర్షపు నీటిని ఒడిసి పట్టడం..తద్వారా భూగర్భ జలాల మట్టాల్ని పెంచటం మిషన్ కాకతీయ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోందనటంలో సందేహం లేదు. ఈ పథకంపై తొలినాళ్లలో అవినీతి ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం. మిషన్ కాకతీయ, కమిషన్ కాకతీయగా మారిందంటూ విపక్షాలూ ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. కొన్ని గ్రామాల్లో చెరువుల పూడిక పూర్తిగా జరగలేదని వార్తలు వచ్చాయి. అయినా స్థూలంగా ఈ పథకం సక్సెస్ రేట్ ఎక్కువే. దీంతో పాటు ఇతర భారీ ప్రాజెక్టులను పక్కన పెట్టకుండా, కొన్నింటిని కొనసాగిస్తూ, మరి కొన్నింటిని రీడిజైనింగ్ చేసి మొదలుపెట్టారు. ఎగువ రాష్ట్రాలతో ఉన్న వివాదాలపై ఆ రాష్ట్రాలకు వెళ్లి సామరస్యపూర్వకంగా చర్చలు జరిపి పరిష్కారాలను అనే్వషించారు. తాగునీటి కోసం మిషన్ భగీరథ పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలుకు సిద్ధమవుతోంది. రాజకీయంగా తెలంగాణలో కెసిఆర్ తిరుగులేని నేతగా ఎదిగారనటంలో సందేహం లేదు. తెలంగాణ ఏర్పడిన ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలకు చోటే లేకుండా చేయటంలో కెసిఆర్ విజయం సాధించారు. అన్ని ఎన్నికల్లోనూ అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఘన విజయాలనే నమోదు చేసింది. 2014కు ముందు వరకూ అత్యంత బలహీనంగా ఉన్న హైదరాబాద్‌లోనూ బలమైన శక్తిగా అవతరించింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అస్తిత్వమే లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. 2014లో ఆ పార్టీ 15 స్థానాలు గెల్చుకుంటే ఇప్పుడు మిగిలింది ముగ్గురు మాత్రమే. ఉన్న ఒక్క లోక్‌సభ సభ్యుడూ ‘కారె’క్కేశాడు. కాంగ్రెస్ పార్టీని నడిపించే నాథుడే లేకుండా పోయాడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గంపగుత్తగా టిఆర్‌ఎస్‌లో విలీనమైపోయింది. ప్రస్తుతానికైతే తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభంజనానికి అడ్డు లేదు.
అభివృద్ధి దిశలో ఎంత దూకుడుగా వ్యవహరించినా.. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ అతి ఉదార ప్రకటనలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం వంటి కెసిఆర్ తొలినాటి హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ప్రారంభమే కాలేదు. రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అన్ని జిల్లాలకు సంఖ్యాపరంగా మంజూరులు అయ్యాయే తప్ప ఒక్క పునాది రాయి కూడా పడలేదు. మొదటి రెండేళ్లలోనే 2.60లక్షల ఇళ్లను నిర్మించి ఇస్తానన్నది కెసిఆర్ వాగ్దానం. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ అయినా, రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ పూర్తి కాకపోవటం ఒక అడ్డంకి కాగా, ఖాళీలపై ఇప్పటికీ పూర్తి స్పష్టత రాకపోవటం మరో అడ్డంకిగా మారింది. దీనికి తోడు రానున్న మూడేళ్లలో లక్ష ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ కూడా ఆగిపోయింది. కేజీ టు పీజీ విద్య హామీకే పరిమితమైపోయింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం, ఫార్మాసిటీ, ఫిలింసిటీ, కొత్త సచివాలయాల నిర్మాణాలు, అన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు వంటివి రాబోయే కాలంలో ప్రభుత్వం ముందున్న సవాళ్లు. దేన్నయినా సాధించే దూరదృష్టి కలిగిన ఉన్నత నాయకుడి నేతృత్వంలో తెలంగాణ పయనం కోటి ఆశల బాట.