ఉత్తరాయణం

రుణమాఫీ వర్తింపజేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెనొక సన్నకారు, సామాన్య రైతును. నాకు ఉన్న కొద్ది పొలంపై (2ఎకరాల 60 సెంట్లు) అంబాజీపేట ఎస్‌బిఐలో9-12-2013న, రూ.97,000 పంటరుణాన్ని అరటి పంట నిమిత్తం తీసుకున్నాను. అప్పటి ప్రభుత్వం వారు ఉద్యావన పంటలకు రైతులకు రుణమాఫీ వర్తించదని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వారు ఉద్యానవన పంటలకు కూడా రుణమాఫీ వర్తింపజేశారు. కానీ అర్హుడనైనప్పటికీ నాకు పంట రుణమాఫీ వర్తించలేదు. ఆంధ్రాబ్యాంకు, సహకార పరపతి సంఘం వారు కూడా అర్హులైన ఉద్యానవన పంట రైతులకు రుణమాఫీ వర్తింపజేశారు. కానీ అంబాజీపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియావారు అర్హుల జాబితాను పంపలేదో ఏమో, ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ వర్తించలేదు. సకాలంలో పంటరుణాన్ని రెన్యువల్ చేసినవారికి రూ.1,00,000లోపు వారికి పూర్తిగా వడ్డీ రాయితీ ఇస్తుండగా, ఎస్‌బిఐ శాఖ వారు 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? రుణమాఫీ, పూర్తి వడ్డీ రాయితీ ఇవ్వాలని కోరుతున్నాను.
-కొండ్రెడ్డి రామమోహన రావు, పుల్లేటికుర్రు, తూ.గో.జిల్లా
గ్రూప్-1 పోస్టులకు ఇంటర్వ్యూలు వద్దు
నవ్యాంధ్ర ప్రదేశ్‌లో గ్రూప్-1 పోస్టులకు కూడా ఇంటర్వ్యూలను తొలగించాలి. ఇంటర్వ్యూవల్ల, ఏ నిరుద్యోగికి సరియైన న్యాయం జరగదని, పూర్వపు నియమాలను బట్టి తెలుస్తూనే వుంది. ఇంటర్వ్యూలు అనేవి స్థిరమైనవి కావు. నిమిషాల్లో నిరుద్యోగుల జీవితాలను, ఎడాపెడా తేల్చేసేవి. ఇంకా ఇంటర్వ్యూకు బదులు సరిసమానమైన రాత పరీక్షను నిర్వహించవచ్చు. కాబట్టి, గ్రూప్-1కి కూడ ఇంటర్వూలు తీసివేయాలి.
- ముగ్గలి కవిత, గుంతకల్
ఉద్యోగుల తరలింపు తగదు
ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాదు నగరాన్ని పది సంవత్సరాల పాటు రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వాడుకోవచ్చు. కానీ సరైన వసతులు, కార్యాలయాలు లేకుండా ఎంతోమంది ఉద్యోగులను అమరావతికి తరలించాలని చూడడం గురివింద తత్వం లాంటిది. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే లాభమేంటో తెలియజేయాలి. ఆవిధంగా హడావిడిగా ఉద్యోగులను కార్యాలయాలను మారిస్తే పాలన కుంటుపడుతుంది. అందువల్ల అన్ని వసతులు సమకూరిన తర్వాతనే ఉద్యోగుల తరలింపు సమంజసం.
-ఎన్.కె.వి. శర్మ, హైదరాబాదు
ఇస్రో మరో ఘనత
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించడం అభినందనీయం. నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని సతీష్‌ధావన్ అతరిక్ష కేంద్రం నుంచి పునర్వినియోగ అంతరిక్ష వాహకనౌకని విజయవంతంగా ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ విజయంతో అంతరిక్ష ప్రయోగాల వ్యయం దాదాపు పదింతలు తగ్గడం విశేషం.
- కామిడి సతీష్ రెడ్డి, పరకాల
అనర్హత విషయం తేలాకే...
సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ విషయంలో అనర్హులైన శాసనసభ్యుల విషయం తేల్చకుండా బలపరీక్ష నిర్వహించింది. ఒకవేళ వేసవి సెలవుల తర్వాత స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే అప్పటివరకు ముఖ్యమంత్రి పదవి నిర్వహించడం అక్రమం కాదా? (రావత్) కొంత ఆలస్యం జరిగింది కాబట్టి అనర్హత విషయం తేల్చాకే బలపరీక్ష నిర్వహిస్తే బాగుండేది.
- కాకుటూరి సుబ్రహ్మణ్యం, కావలి
విద్యార్థుల సంఖ్య పెంచాలి
నానాటికీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతూ పాఠశాలలు మూతపడటం శోచనీయం. భవిష్యత్‌లో పేదలకు విద్య గగనకుసుమం కానుందా అనిపించకమానదు. పల్లెటూళ్ళలో ఉన్న సామాన్య జనానికి కూడా ఇంగ్లీష్ మీడియంపై మోజు పెరిగి స్కూల్ బస్సులు ఎక్కించి పిల్లలను ఎంత దూరమైనా సరే ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు పంపుతున్నారు. అయితే 1 నుండి 10వ తరగతి వరకు మన మాతృభాషలోనే విద్య నేర్చిన వారికి ఎక్కువ విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని గ్రహించాలి. ఆ తర్వాత కళాశాల విద్యకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా అర్ధం చేసుకునే వయసు, స్థాయి పెంపొందుతుంది. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషలో విద్యనభ్యసించిన వారు ఎంతోమంది అత్యున్నత ఉద్యోగాలు సంపాదించారు. తెలుగు మీడియం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్