ఉత్తరాయణం

మాటలే.. చేతలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పులపాలై బక్కచిక్కి ఆత్మహత్య చేసుకునే రైతులంటే కవులకు ప్రేమ. ఆవురావురని కవితాక్షరాల పోగులు పెడతారు. ప్రభుత్వానికి ప్రేమ. బావురు బావురు మంటూ సానుభూతి ఎక్స్‌గ్రేషియా కుప్పలు పోస్తారు. ప్రతిపక్షాలకూ ప్రేమే. బోదురు బోదురని ప్రభుత్వంపై విమర్శల రాశులు పోస్తారు. అందరివీ మాటల గ్యాసే. చేతలు నిల్. స్వచ్ఛంద సంస్థలు చేయగలిగింది ఎంతో ఉంది. కాని చేయరు. ఈ సంస్థలు రైతుల వద్దకు వెళ్లి సాంత్వన కలిగించవచ్చు. భూమి పరీక్షలు జరిపించి ఏ పంటలు ఎప్పుడు వేయాలో చెప్పొచ్చు. ఒక్క దేశవాళి ఆవుతో అతి తక్కువ ఖర్చుతో 30 ఎకరాలు సాగుచేయడం నేర్పవచ్చు. భూమి దున్ని విత్తనాలు వెదజల్లి శ్రమ, ఖర్చు తగ్గించుకొని పంటలు పండించే విధం నేర్పవచ్చు. కాని ఆ సంస్థలు పట్టణాలకే పరిమితం!
- శాంతి చంద్రిక, సామర్లకోట
బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలి
అవినీతిలో కూరుకుపోయే ప్రజాప్రతినిధులను నిలదీయడానికి చట్టాలు చేయాలని ఒక పాఠకుడు ఉత్తరాయణంలో వాపోయారు. చట్టాలు చేసేది ప్రజాప్రతినిధులే కదా. తమ కొంప కూల్చే చట్టాలు వాళ్లెందుకు చేస్తారు? నిజానికి నిలదీయడానికి చట్టాలు అక్కరలేదు. నిలదీసే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. నిలదీయకపోయినా ఎన్నికల వరకు ఓపిక పట్టి అవినీతిపరులకు ఓటు వేయకుంటే చాలు. తమాషా ఏమంటే నేరాలు చేసి జైలుపాలై బెయిల్ మీద బయటకొచ్చి ప్రజలకు నీతులు బోధించే వారిని, వారి పార్టీలను ప్రజలు మళ్లీ మళ్లీ ఎన్నుకుంటూ ఉండడం వల్లనే ఈ దుర్గతి. ప్రజల చేతిలో బ్రహ్మాస్తమ్రే ఉంది. వాళ్లు దాన్ని సక్రమంగా ఉపయోగించడం లేదంతే!
- ప్రసాద్, గొడారిగుంట
గొలుసు దొంగలు
ఉద్యోగ గండాలున్న బద్ధకస్తులు, విలాసాలకు అలవాటుపడ్డవారు, కాయకష్టం చేయకుండా ఏదో విధంగా ఈజీమని సంపాదిద్దామనుకునే మనస్తత్వం గలవారు, ముఖాలకు హెల్మెట్లు అడ్డం పెట్టుకుని దొంగిలించిన బైట్‌లపై వచ్చి, పనుల మీద వీధులలోకొచ్చిన మహిళల మెడలలోని బంగారు గొలుసులను బలవంతంగా తెంపుకెళ్ళిపోతున్నారు. దానివల్ల వస్తువులు పోవడమే గాకుండా మెడలు కోసుకుపోతున్నాయి. ఈ గొలుసు దొంగలు ఈమధ్య పట్టుబడ్డా, ఈ అరాచక కిరాతక చర్యలు మరికొంతమంది కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించకపోతే అర్ధరాత్రి కాదుగదా పట్టపగలే మహిళలకు ఇంటా బయటా రక్షణ లేకుండాపోతుంది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఏమిటీ అపరిశుభ్రత..!
మంగళగిరి పట్టణంలోని పాత బస్‌స్టేషన్ ఆవరణలో కాలుపెట్టేందుకు వీలులేని అపరిశుభ్ర పరిస్థితులు వున్నాయి. ఇక్కడినుండి తెనాలి, విజయవాడ, అమరావతి, ఇతర గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులు బయలుదేరుతాయి. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా వుండే బస్‌స్టేషన్ ఆవరణ అంతా చెత్తతో నిండిపోయి డంపింగ్ యార్డును తలపింపజేస్తోంది. ప్రయాణికులు కూర్చునే ప్రాంగణంలోనే మురుగునీటి వల్ల దుర్గంధం వెదజల్లుతూ దోమలతో వుంది. కాస్తంత వర్షం వస్తే చాలు వర్షపు నీటి నిల్వలతో ఆవరణలో బస్సులు నిలపలేని పరిస్థితి వుంది. ప్రయాణికులకు అనువుగా స్టేషన్ శుచి, శుభ్రతలతో తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి.
- ఎం.కనకదుర్గ, తెనాలి
గాడిన పడినట్లేనా..
ఇటీవల వరస పరాజయాలకి పేరెన్నికగన్న భారత జట్టు దక్షిణాఫ్రికా జట్టుతో టెస్టు సిరీస్‌లో నెగ్గి గాడిన పడింది అనుకొంటే శుద్ధ పొరపాటే. మన క్రికెట్టులో మేచ్ ఫిక్సింగుకు, కుహనా రాజకీయాలకు పెద్దపీట వేస్తోంది. ఇంట్లో పులి, వీధిలో పిల్లి అన్నది మన క్రికెట్టుకు పూర్వపు మాట. ఇంట్లో కూడా పిల్లేనని ఇటీవల మ్యాచుల్లో తేలిపోయింది. కేవలం దక్షిణాఫ్రికాను ఎదుర్కోలేక స్పిన్ పిచ్‌లు తయారుపర్చి వాటిలో నెగ్గడం మన ప్రతిభ కాదు. మన బలహీనత. ఇది గుర్తెరిగి సరైన ఫాస్ట్‌బౌలర్లను సమకూర్చుకొని, పై దేశపు ఫాస్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొనేలా మన క్రికెటర్లను తీర్చిదిద్దాలి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం
అందరం పాటిద్దాం
ప్రస్తుతం భారతదేశం మొత్తం బాగా ప్రాచుర్యం పొందిన కార్యక్రమం ‘స్వచ్ఛ్భారత్’. అయితే ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సర కాలంలో పూర్తయ్యేది కాదు. నిరంతర ప్రక్రియ. అంతేకాకుండా దేశ పాలకులు, నాయకులు వచ్చి చెప్పి చేసేది మాత్రమే కాదు. దేశంలోని ప్రతి భారతీయుడు తన సాధారణ బాధ్యతగా ‘స్వచ్ఛ్భారత్’ను స్వీకరించి కృషిచేయాలి. ప్రతీ పౌరుడు తన వ్యక్తిగత పరిశుభ్రతతోపాటుగా, మా ఇల్లు, మా ఊరు, మా రాష్ట్రం, మా దేశం అని భావించి పరిశుభ్రత బాధ్యతను నిర్వసించుకుంటూ ముందుకు సాగాలి. మన పరిసరాలు బాగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుందనే విషయ స్ఫూర్తి చాలు. ఆ తరువాత నుండి ఆచరణ అనేది అనుకోకుండా ప్రారంభమవుతుంది. మన దేశం కూడా ‘స్వచ్ఛ భారత్’తోపాటుగా ‘ఆరోగ్య భారత్’గా మారుతుంది. కావున మనమందరం కలిసి స్వచ్ఛందంగా దేశ పరిశుభ్రత బాధ్యతను భుజస్కంధాలపై వేసుకొని కృషిచేయడం (పనిచేయడం) ప్రారంభిద్దాం.
- పెయ్యల శ్రీనివాసరావు, అలికాం