మెయన్ ఫీచర్

ఆఫ్రికా.. కొన్ని అపోహలు, వాస్తవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం వలెనే ఆఫ్రికా ఖండం కూడా సుదీర్ఘకాలంపాటు యూరోపియన్ వలస పాలనకు, దోపిడీకి గురైంది. భారతీయులవలెనే ఆఫ్రికన్లు కూడా అనేక త్యాగాలతో మహత్తర పోరాటాలు జరిపి స్వాతంత్య్రం సాధించుకున్నారు. ఆ విధంగా ఉభయుల మధ్య గొప్ప అవగాహనలు, సంఘీభావాలు ఉండాలి. తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు సాగుతున్న కృషిలో ఇరువురి మధ్య గణనీయమైన సహకారం కన్పించాలి. కాని దురదృష్టవశాత్తు ఇవేమీ జరగనట్లు ఆఫ్రికాను కొన్ని రోజులపాటు సందర్శించిన వారికి విచారం కలుగుతుంది. సందర్శించటమన్నది కేవలం టూరిస్టులవలె అక్కడి నగరాలను, ఇతర ఆకర్షణీయ ప్రదేశాలను చూడటం కాదు. లేదా వ్యాపారాలు, పరిశ్రమలకోసం అవసరార్థ కార్యకలాపాలు జరపటం కాదు. నగరాల నుంచి చిన్న పట్టణాల మీదుగా గ్రామాలు, అడవుల వరకు చూసి ప్రతిచోటా వీలైనంత మందితో సంభాషించాలి. జర్నలిస్టుల వలె ప్రశ్నాపత్రాలు తయారుచేసుకుని ఇంటర్వ్యూలు చేయటం కాదు. వారిని ఇష్టాగోష్టి సంభాషణలతో కదిలించి జీవితపు వివిధ పార్శ్వాలను తడమాలి.
నిజమైన పరిస్థితి అపుడు గాని కనీసం ఒక మేరకు అవగతం కాదు. మనకుగల అభిప్రాయాలలో ఏవి అపోహలో, వాస్తవాలేమిటో బోధపడటం మొదలుకాదు. ఆఫ్రికన్లు అన్నీ చెప్పగలరు. తమ వలస పాలనకు ముందటి పరిస్థితులు, అప్పటి తమ సమాజాలూ సంస్కృతులు, వలస దోపిడీలు, వలస వ్యతిరేక పోరాటాలు, వలసల అనంతరపు పరిణామాలు అన్నీ తెలుసు వారికి. పాశ్చాత్యులు ఇంకా చేస్తున్నదేమిటో, భారతీయులు- చైనీయులు- అరబ్బుల కార్యకలాపాలేమిటో, వీటన్నింటివల్ల తమకు కలుగుతున్న ప్రయోజనాలేవో, నష్టాలేవో అన్నీ గ్రహించినవారు మనకదంతా స్పష్టంగానే చెప్పగలరు. మనకు కావలసింది వాస్తవాలను తెలుసుకునే దృష్టి. మంచిని మంచిగా, చెడును చెడుగా స్వీకరించే ఓపెన్ మైండ్. పైన అన్నట్లు, వారుకూడా మనవలెనే వలస పాలనలో మగ్గి, పోరాడి, విముక్తులై, అభివృద్ధికోసం ఆరాటపడుతున్నవారేనన్న అవగాహన, సానుభూతి. కాని భారతీయులలో ఈ గుర్తింపుకలవారు తక్కువగా కనిపిస్తున్నారు. మనవన్నీ తృతీయ ప్రపంచపు వర్ధమాన దేశాలని, మనది అలీనోద్యమమని, మనందరి సమస్యలు- అవసరాలు ఒకటైనందున పరస్పర సహకారం తప్పనిసరి అని కొన్ని దశాబ్దాలపాటు హోరెత్తించిన కాలంలో ఈ దిశలో ఆచరణాత్మకంగా జరిగింది దాదాపు శూన్యం. కనీసం భావపరమైన పరస్పర అవగాహనలు ఏర్పడి, అపోహలన్నవి లేకుండా చూసేందుకైనా కృషి జరగలేదు. దాని ఫలితంగా ఆఫ్రికన్లు వలసల నుంచి బయటపడిన అయిదారు దశాబ్దాల తర్వాత కూడా మన దృష్టిలో వారింకా నాగరికతలు లేనివారు, సోదరులు, నేర స్వభావాలు కలవారే. కాని ఇదేదీ వాస్తవం కాదని, పైన అన్నట్లు, నగరాలనూ టూరిస్టు కేంద్రాలను గడిచి అక్కడి ప్రజలవద్దకు మనస్సులను తెరచుకుని వెళితే, ఎక్కువ ప్రయత్నించకుండానే అర్థమైపోతుంది.
ఆఫ్రికా ఖండంలోని ఉత్తర భాగానగల అరబ్బు దేశాలను అట్లుంచినా, తక్కిన సుమారు 50 నల్ల ఆఫ్రికన్ దేశాలను కలిపి చూసినట్లయితే, అక్కడ ఉన్నన్ని సహజ వనరులు వైవిధ్యతలో గాని, పరిమాణంలోగాని ప్రపంచంలో మరెక్కడా లేవు. అక్కడ జరిగినంత భయంకరమైన దోపిడీ, అణచివేతతో ఒక మేరకు లాటిన్ అమెరికా తప్ప మరే ప్రాంతమూ సరిపోలదు. ఇంత జరిగినప్పటికీ ఇప్పటికైనా అక్కడి ప్రజలంతా సుఖంగా జీవించగల వివిధ వనరులు ఇంకా అక్కడున్నాయి. కాని అది జరగటం లేదు. అక్కడి ప్రభుత్వాలకు కావలసిన ఆర్థిక వనరులు, టెక్నాలజీ లేకపోవటం ఒక లోపమైతే, నాయకులలో అత్యధికులు స్వార్థపరులు, దార్శనికత లేనివారు కావటం ఒక సమస్యగా మారి ప్రజలను అభివృద్ధిపరంగా యథాతథ స్థితిలో ఉంచుతున్నాయి. వలస వాద శకం ముగిసిన తర్వాత, యూరోపియన్ల ఉనికి, పాత్ర అంతర్థానం కాకపోయినా తగినంత తగ్గింది. ఒకవైపు ఆ శూన్యాన్ని పూరించుకుంటూ, మరొకవైపు కొత్త అవకాశాలను సృష్టించుకోవటమన్నది ఇపుడు ఆఫ్రికా అవసరం. కాని ప్రకృతి వనరులు ఉన్నా తమ స్వంత ఆర్థిక వనరులు, టెక్నాలజీ కొరతల దృష్ట్యా ఆ పని చేయగల స్థితిలో వారు లేరు. అటువంటి స్థితిలో ఇండియా, చైనా తదితర పాశ్చాత్యేతర దేశాల సహకారంతో అందుకు మార్గాలు వేసుకునే అవకాశాలున్నాయి. వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నపుడు అదే సరైన పద్ధతి అవుతుంది కూడా. కాని ఇది, వౌలికంగా ఆఫ్రికన్ ప్రజల సర్వతోముఖాభివృద్ధి అనే దృక్కోణంనుంచి ప్రణాళికాబద్ధంగా జరగటం లేదు.
అక్కడివారు అనాగరికులు, సోమరులు, నేర స్వభావం కలవారని ఆర్థికంగా, సాంస్కృతికగా, సామాజికంగా ఆఫ్రికన్లను మనం ఒక నిమ్నస్థాయిలో మిగిల్చి, అదే పరిధిలో వ్యవహరణలు జరిపినపుడు, దూరాలన్నవి ఉంటాయి. దూరాలు సమాచార లోపానికి, పరస్పర అవగాహనా లేమికి, దాని ఫలితంగా అపోహలకు దారితీస్తాయి. పరస్పర సంబంధాల దృక్పథాలు, ప్రాతిపదికలు వలస పాలనా కాలంనాటివలె గాక అందుకు భిన్నంగా, ప్రజాస్వామికంగా, మనమే ఎలుగెత్తి దశాబ్దాలపాటు చాటినట్లు వర్ధమాన ప్రపంచపు సంఘీభావ లక్షణాలను ఎంతగా పుణికిపుచ్చుకుంటే, పరిస్థితి అంత ఆరోగ్యకరంగా మారుతుంది. అందులోని ప్రయోజనాలు కూడా ఉభయ తారకమవుతాయి. అపోహలకు, ఆఫ్రికన్ల పట్ల చిన్నచూపునకు తావే ఉండదు.
ఉదాహరణకు ఆఫ్రికన్లు సోమరులనే మాటను తీసుకుందాము. ఈమాట ఇక్కడ ఇండియాలో, అక్కడ ఆఫ్రికాలో గల భారతీయులనుంచి తరచు వినవస్తుంది. కాని అక్కడి సామాన్యులను గమనించటం, వారి పరిస్థితులను అర్థంచేసుకోవటం అనే రెండు పనులను ఓపెన్‌మైండ్‌తో చేసినపుడు ఈ వ్యాఖ్యలో నిజం లేదని వెంటనే అర్థమవుతుంది. ఇది జరగాలంటే ముందుగా ‘‘కష్టపడి పనిచేయటం, సోమరితనం’’అనే మాటలకు మనవద్ద సరైన నిర్వచనాలుండాలి. ఒక పరిస్థితిని చూద్దాం. ఆఫ్రికాలో జనసాంద్రత తక్కువైనందున విస్తారమైన భూములు ఖాళీగా ఉన్నాయి. అవి మహాసారవంతమైనవి. వర్షపాతానికి, జల వనరులకు ఎంతమాత్రం కొరత లేదు. కాని పెద్ద మొత్తాలు ఖర్చుచేసి అడవులను తొలగించి, వనరులను డబ్బుపెట్టి సమకూర్చుకుని వ్యవసాయాలు చేయగల స్తోమత వారికి లేదు. ప్రభుత్వం, బ్యాంకులు సహాయాలు చేయవు. కనుక వందెకరాలు గల కుటుంబం రెండెకరాలు మాత్రమే సాగుచేయగలదు. కుటుంబానికి సరిపోను కాస్త ధాన్యం పండించి, డబ్బు అవసరాలకోసం కొన్ని పళ్ల చెట్లు పెంచుతారు. ఈ రెండో, నాలుగో ఎకరాల మేర ఆ కుటుంబం మొత్తం ఏ యంత్రాలూ లేక ఎంత కష్టించి పనిచేసేదీ కళ్లారాచూస్తే తప్ప మనకు అర్థంకాని విషయం.
వారు మనకన్నా ఎక్కువ పని చేస్తున్నారు. మరి వారు మన దృష్టి ప్రకారం ‘‘కష్టించి’’ ఆ వందెకరాలూ సాగుచేయకపోవటంలో సమస్య ఎక్కడుంది? వారి ‘‘సోమరితనం’’లోనూ, లేక వ్యవస్థాపరమైన కొరతలలోనా?
ఇందుకు భిన్నంగా మరొక పరిస్థితిని గమనించండి. కొన్ని సందర్భాలలో పరిస్థితులు అనుకూలించి వ్యవసాయం తగినంత జరుగుతున్నది. అక్కడ ఆ భూమి స్వంతదారులు గాని (ఒకటినుంచి నాలుగైదు ఎకరాల వరకు), వాటిలో కూలీలుగా పనిచేసేవారు గాని చేసే కష్టం ఎవరికీ తీసిపోదు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయముంది. వంద ఎకరాలు గల ఒక కుటుంబ సభ్యులకు అందులో రెండెకరాలకు మించి సాగుచేసే స్వంత వనరులు లేనప్పుడు, ఆ వనరులున్న నాలుగెకరాల రైతు పొలంలో కూలీగా బండచాకిరీ చేస్తాడు. కొద్దిపాటి డబ్బుకోసం. సమస్య ఎక్కడుంది? ‘‘సోమరితనం’’లోనా, లేక వ్యవస్థాపరమైన కొరతలలోనా? వాస్తవానికి కష్టపడటం, సోమరితనం అనేవి సర్వసాధారణంగా ఆయా వ్యక్తులను, కుటుంబాలను, సమాజాలను ఆవరించి ఉండే ఆర్థిక కార్యకలాపాలతో ముడిపడి ఉంటాయి. అడవులలో గిరిజనులమై ఉండి ఉంటే మనంకూడా ఒక కుందేలును చంపి కాల్చుకుని తిని నిద్రపోతాము తప్ప వంద ఎకరాలు సాగుచేయము, అందుకోసం రాత్రింబగళ్లు నానా యాతనలూ పడము. కనుక ఆర్థిక ప్రాతిపదిక అనేది శ్రమపడే తీరుతెన్నులను నిర్ణయిస్తుంది. కుందేలును పట్టేందుకు అయినా శ్రమపడవలసి ఉంటుంది గాని సోమరితనంతో దొరకదన్నది వేరే విషయం. అందువల్ల, సరైన దృష్టి, అవగాహన లేక ఆఫ్రికన్లను సోమరులుగా భావించటం భారతీయులకు గల ఒక పెద్ద అపోహ. ఇటువంటి అపోహలకు మూలం ఏమిటో పైననే చెప్పుకున్నాము.
వారిది ‘నేర స్వభావం’అనే అభిప్రాయం కూడా ఇటువంటిదే. ఇవన్నీ ఈ రచయిత కొద్దిమంది మిత్రులతోపాటు ఇటీవల యుగాండా, కెన్యా వెళ్లినపుడు కనిపించిన విషయాలు. అక్కడ నేరాలు జరగవని కాదు. చిన్నవి, పెద్దవి అనేకం ఉన్నాయి. అవి ప్రధానంగా ధనిక-పేద తారతమ్యాలు, ఉద్యోగ-నిరుద్యోగ సమస్యలుగల పట్టణ ప్రాంతాలలో ఉండటం మొదట గుర్తించవలసిన విషయం. పోతే, ఇందులో ఆఫ్రికా పరిస్థితికి, భారతదేశపు పరిస్థితికి తేడా అనదగ్గది ఏమైనా ఉందా? నిజం చెప్పాలంటే హైదరాబాద్ అనబడే ‘‘నాగరిక’’ సమాజంలో జరిగే రకరకాల నేరాలకన్న కంపాలా, నైరోబీలలో జరుగుతున్నవి తక్కువే కావచ్చు కూడా. మనం నేరాన్నంతా ‘‘నల్లవారి నేరం’’అనే కోణంనుంచి చూడటం అపోహలకు తావిస్తున్నట్లు తోస్తుంది. హైదరాబాద్ నేరాలన్నింటిపై దృష్టిపెడితే ఎవరు చేస్తున్నారనగలం? ఆఫ్రికాలో ఒక ‘నల్ల విలన్’ సిద్ధంగా ఉన్నాడు. హైదరాబాద్‌లో అది జెఫ్యూజ్డ్‌గా మారుతుంది. కాని నేరాలు రెండుచోట్లా ఉన్నాయి. ఒకచోటనే ఎక్కువ కాదు. నేరాలకు కారణాలు బహురూపాలలో రెండుచోట్లా కనిపిస్తాయి. వాటి పోలికలు, తేడాలు ఏవైనప్పటికీ. పోతే, నేరాలు జరగటం వేరు, ఒక జాతికి జాతిదే ‘నేర స్వభావం అనుకునే అపోహవేరు. పొరపాటు ఇక్కడుంది. ఇతర విషయాలలోగల అపోహలు ఈ అపోహను మరింత పెంచుతున్నాయి. వారి పట్ల మన దృష్టే వౌలికంగా ఆ విధంగా మారుతుంది గనుక.
ఇక ఆఫ్రికన్లు అనాగరికులన్న మాటకన్నా హాస్యాస్పదమైనది ఉండబోదు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే పల్లెటూరివరకు, అడవివరకు కూడా వారి వ్యక్తిగత వ్యవహరణల నుంచి, కుటుంబ సంబంధాలు, ‘కమ్యూనిటీ’ వ్యవస్థనుంచి మనం నేర్చుకోవలసిన విలువలు, నాగరికత, మనం పోగొట్టుకుంటున్నవి చాలా ఉన్నాయి.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)