సంపాదకీయం

తరలింపు తతంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ నుంచి తాత్కాలిక అమరావతికి అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలిపోనున్న మహాపథం పొడవునా గందరగోళం కొలువుతీరి ఉంది. ఈ గందరగోళం రాజాధాని ప్రస్థాన ప్రహసనాన్ని అడుగడుగునా నిలదీస్తోంది. తాత్కాలిక రాజధాని నిర్మాణం వాయువేగ మనోవేగాలతో జరిగిపోతోందన్నది జరిగిన ప్రచారం. తాత్కాలిక రాజధానికి తరలిపోవడం ఎందుకన్నది ప్రధానమైన ప్రశ్న. పదేళ్లపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉండగల ఘనత హైదరాబాద్ మహానగరానికి ఏర్పడి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పాటు చేసిన పునర్ వ్యవస్థీకరణ చట్టం భాగ్యనగరానికి ఈ సౌభాగ్యాన్ని సంతరించి పెట్టింది. పదేళ్ల ఈ ఘనతను రెండు మూడేళ్లకే కుదించి వేయాలని నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎందుకని దాదాపు పద్ధెనిమిది నెలలుగా భావిస్తున్నారన్నది రకరకాల సమాధానాలకు వ్యాఖ్యలకు నోచుకున్న ప్రశ్న. అందువల్ల అసలు కారణం ఏమిటన్నది ఇతమిత్ధంగా ఇప్పటికీ తేలలేదు. రాజధాని, సచివాలయం, శాసనసభ హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం అత్యధిక సమయాన్ని రాష్ట్రం సరిహద్దుల పరిధిలోనే గడుపుతుండడం రెండేళ్ల చరిత్ర. అందు వారు, వారి మంత్రివర్గ సహచరులు హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా పరకాయ ప్రవేశం చేసినట్టు విచిత్రానుభూతికి గురవుతున్నారు. తాత్కాలిక రాజధానికి ‘తక్షణం’ తరలిపోవాలన్న ప్రకటనలు రేండేళ్లుగా పదేపదే వినబడుతుండడానికి బహుశా ఇది ప్రధాన కారణం కావచ్చు, కాకపోవచ్చు-ఉద్యోగులందరూ రాష్టస్థ్రాయి కార్యాలయాలలోను సచివాలయంలోను పనిచేస్తున్నవారు- రాజధానిలోను ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు రాష్ట్రంలోను ఉండవలసి వస్తుండడం కూడ విచిత్రమైన స్థితి...అందువల్ల ఉద్యోగులను ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు ప్రత్యక్షంగా పర్యవేక్షించగల అవకాశం, అనుభూతి బాగా తగ్గిపోయాయి. ముఖ్యమంత్రి నివాస కార్యాలయాల సంఖ్య కూడ పెరిగిపోయి వారు అక్కడ, ఇక్కడ, మరోచోట, ప్రతిచోట అనుక్షణ ఉండవలసి రావడం కూడ మిక్కిలి కష్టసాధ్యం అయిపోయి ఉండవచ్చు. అందువల్ల రాజధానిని రాష్ట్రానికి తరలించుకొని రావాలన్న తక్షణ సంకల్పం ప్రతిక్షణం దృఢపడుతూనే ఉంది. అలాంటప్పుడు ఈ రెండేళ్లలో శాసనసభకు, మంత్రుల నివాసాలకు, సచివాలయానికి, ఉద్యోగుల నివాసాలకు సొంత భవనాలను, సమీప ప్రాంతంలో అద్దె భవనాలను సమకూర్చుకొని ఉండవచ్చు. అదేమీ జరగలేదని ఇప్పుడు స్పష్టమైపోయింది...
జూన్ 27వ తేదీ నాటికి హైదరాబాద్‌లోని అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం తాత్కాలిక అమరావతికి తరలిరావలసిందేనని పదేపదే స్పష్టం చేసిన ప్రభుత్వం ఇప్పుడు హఠాత్తుగా తరలింపు గడువును పొడిగించేసింది. ప్రభుత్వ అధినేతల ఆదేశాలను శిరసావహించిన చిత్తశుద్ధిగల ఉద్యోగులు తాత్కాలిక రాజధాని సమీపంలో ఇళ్లను అద్దెకు తీసుకున్నారట. ముందస్తు అద్దె చెల్లించి తట్టబుట్ట తపేలాలలను సర్దుకొని తాత్కాలిక రాజధానికి తరలి రానున్న వీరికి గడువు పొడిగింపు ఆశనిపాతం. ఆగస్టు 31 వరకు తరలింపు గడువును పెంచిన ప్రభుత్వం, ఉద్యోగులు ఆ సమయంకంటె ముందుగా అక్కడికి తరలిపోవచ్చునన్నది మాత్రం స్పష్టం చేయలేదు. వారం రోజుల ముందు వరకు హైదరాబాద్‌లో పనిచేసి వారం సెలవు పుచ్చుకొని అందరూ ఆగస్టు 31 నాటికి తాత్కాలిక రాజధానిలో విధులకు హాజరు కావాలన్న భావం ఉద్యోగులకు ఏర్పడి ఉందట. అందువల్ల ఈ విద్యాసంవత్సరంలో తమపిల్లలను తాత్కాలిక రాజధాని ప్రాంతంలో చదివించదలచిన వారు అయోమయ స్థితికి గురయిపోతున్నారు. జూన్ 27లోగా చేరాలన్న నిబంధన మేరకు ముందుగానే కుటుంబాలను తరలించిన ఉద్యోగులు ఆగస్టు వరకు రెండు నెలలపాటు అమరావతి ప్రాంగణంలోను, హైదరాబాద్‌లోను అద్దెలను చెల్లించాలి. అందువల్ల తరలిపోదలచిన వారు జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఎప్పుడైనా తరలిపోవచ్చునని ప్రభుత్వం నియమావళిని సడలించాలని ఉద్యోగులు కోరుతున్నాట.
ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర 1953 ఆక్టోబర్ ఒకటవ తేదీన విడిపోయినప్పుడు కొత్త రాజధాని కర్నూలుకు కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఎలా తరలివచ్చిందో? ఈ సంగతిని, ఈ చరితను ప్రస్తుతం అవశేషాంధ్ర ప్రభుత్వం అధ్యయనం చేసినట్టు లేదు. చేసి ఉండినట్టయితే తరలింపు ఇంత ఆర్భాటానికి, ఆయోమయత్వానికి గురయి ఉండేది కాదు. తాత్కాలిక రాజధాని కావచ్చు, శాశ్వత రాజధాని కావచ్చు ప్రభుత్వం చేయవలసిన పని నిజానికి పరిమితమైనది. రాజధానిలో సచివాలయ నిర్మాణం, చట్టసభల ప్రాంగణాల నిర్మాణం మంత్రులకు ఉద్యోగులకు వసతిని కల్పించడం, హైకోర్టును నెలకొల్పడానికి తగిన భవనాలను సమకూర్చుకొనడం ఈ వ్యవస్థలను రహదారులతో అనుసంధానం చేయడం, ఈ పనులను ప్రభుత్వం నిర్వహిస్తే చాలు. మిగిలిన రాజధాని నగరాన్ని ప్రభుత్వేతర సంస్థలు, ప్రజలు నిర్మించుకుంటారు. కానీ ప్రభు త్వం ఒక కొత్త దేశాన్ని నిర్మించినంత హడావుడి ఆర్భాటం చేస్తోంది. ఈ వినూతన సృష్టి చేయగల విశ్వామిత్రులు మనదేశంలో లేరట. అందువల్ల నిర్మాతలను సింగపూర్ నుండి, మలేసియానుండి, చైనానుండి, జపాన్ నుండి పిలిపిస్తోంది. భారత్‌లోని ఒక కొత్త నగరంలో ఇళ్లను, భవనాలను, కట్టడాలను రహదారులను నిర్మించగల స్థపతులు-ఇంజినీర్స్-తాపీ మేస్ర్తిలు దేశంలో లేరట, అందువల్ల విదేశాలనుంచి రప్పిస్తున్నారు-అన్న ‘టాంటాం’ ప్రపంచమంతంటా మారుమ్రోగిపోతోంది. భారతీయులు ఇళ్లు నిర్మించడానికి సైతం అసమర్థులు అన్న ఆవమానకరమైన భూమికపై అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిజానికి ఇప్పుడు నిర్మించిన తాత్కాలిక రాజధానికి రెండింతలుగానో మూడింతలుగానో విస్తరింపజేసినట్లయితే, ఉద్యోగులకు నివాస వసతులను నిర్మించినట్టయితే ఇదే శాశ్వత రాజధానిగా వ్యవస్థీకృతం కావచ్చు. సింగపూర్ నుంచి విమానాలలో తాపీలు పట్టుకున్న మేస్ర్తిలు తరలి రానక్కరలేదు. ఎవరు విజ్ఞతను వికసింపజేయగలరు? అలా జరిగినట్టయితే వేలాది ఎకరాల రాజధాని పరిసరాలలో కాలుష్య పారిశ్రామిక వాటికలను కాక స్వచ్ఛమైన పరిమళ పవనాలను పంచగల హరిత వాటికలను ఏర్పాటు చేయవచ్చు.
ఆగస్టు 31న నూతన రాజధాని ఆరంభం కావడం వల్ల ఉద్యోగుల కుటుంబాలలోని విద్యార్థులు త్రిశంకు స్థితికి గురికానున్నారు. విద్యా సంవత్సరం మొదలై మూడు నెలలు గడిచిపోతుంది. విశ్వనగరపు నిర్మాణ ఊహాగగనంలో విహరిస్తున్న ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు తాత్కాలిక రాజధాని నేలపై దిగి నిలబడడానికి ఎందుకు ప్రయత్నించరు? వచ్చే జూన్ వరకు తరలింపు గడువును ఎందుకని పొడిగించరు? అప్పటికి ‘వ్యవస్థ’ పదిలం కావచ్చు కదా!