సంపాదకీయం

పట్టి పరిమార్చలేమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోడేళ్లు విశ్రమించడం లేదు, ఆవులు అప్రమత్తం కావడం లేదు. ప్రమత్తత ఆవహించిన భద్రతాదళాలపై జిహాదీ తీవ్రవాదులు నిరంతరం దాడులు చేస్తుండడం జమ్మూకశ్మీర్‌లో వ్యవస్థీకృతమైపోయిన వైపరీత్యం. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కు పధ్నాలుగు కిలోమీటర్ల దూరంలోని పంపురా వద్ద కేంద్ర ప్రత్యేక పోలీసుదళం-సిఆర్‌పిఎఫ్-ప్రయాణిస్తుండిన బస్సుపై ఇద్దరు, ముగ్గురు జిహాదీ ఉగ్రవాదులు కాల్పులు జరపడం, ఎనిమిది మంది పోలీసులను హత్యచేయగలగడం భద్రతను ఆవహించిన ప్రమత్తత ఫలితం. ఆ ఇద్దరు బీభత్సకారులు జరిపిన కాల్పుల ఫలితంగా దాదాపు ఇరవైమంది జవానులు గాయపడ్డారట. శ్రీనగర్‌లోనే గత మేనెల 23వ తేదీన జిహాదీలు జరిపిన దాడులకు ముగ్గురు భద్రతాదళాలవారు బలైపోయారు. నెలరోజుల వ్యవధిలో టెర్రరిస్టులు మూడుసార్లు భద్రతాదళాలపై దాడులు చేయగలగడం జిహాదీలలో పెరుగతున్న విశ్వాసానికి చిహ్నం. ఈ టెర్రరిస్టులు లష్కర్‌ఏ తయ్యమా ముఠాకు చెందిన ముష్కరులని వెల్లడైంది. లష్కర్ ఏ తయ్యబా దుండగులు పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్ వైపు నుండి నిరంతరం చొరబడుతున్నారన్నది నిగ్గుతేలిన నిజం. భారత్‌ను బద్దలు కొట్టడమే తన ముఠాల లక్ష్యమని లష్కర్ ఏ తయ్యబా, జమాత్ ఉద్ దావా ముఠాలు ఆరంభించి నడిపిస్తున్న హపీజ్ సరుూద్ అనే నరరూప పిశాచి పదేపదే ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ జమ్మూ కశ్మీర్‌లోని లోయ ప్రాంతంలో భద్రతను మాత్రం మనం కట్టుదిట్టం చేయలేకపోతున్నాము. పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌కూ మనదేశంలో మిగిలిన కశ్మీర్‌కు మధ్య ఏర్పడి ఉన్న ఆధీన రేఖ -ఎల్‌ఒసి- పొడవునా మన ప్రభుత్వం ముళ్లకంచె నిర్మించి ఉంది. ఐనా ఈ ఉక్కుతీగెల భద్రతాకుడ్యంలో కన్నాలు పడి ఉన్నాయన్నది మన ప్రమత్తతకు సాక్ష్యం. అందుల్లనే లష్కర్లు యథేచ్ఛ గా కంచె దాటి రాగలుగుతున్నారు. పంపురా ప్రాంతంలోనే గతనెలలో భద్రతాదళాలపై దాడి జరిగింది. కశ్మీర్ లోయప్రాంతం నుండి జమ్మూ ప్రాంతానికి విస్తరించి వ్యస్థీకృతమైన పాకిస్తానీ ముష్కరులు దేవాలయాలపై దాడులు చేస్తున్నారు. దేశద్రోహులు పాకిస్తాన్ తొత్తులు, జిహాదీ సాయుధులు విశ్రమించలేదనడానికి ఇవన్నీ నిదర్శనాలు. జమ్మూకశ్మీర్‌లోని ఒక ప్రాచీన దేవాలయాన్ని ఇటీవల ధ్వంసం చేసి పాడుచేయడం, శ్రీనగర్ సమీపంలో ఒక జవాన్‌ను హత్యచేసి, మరో ఆరుగురిని గాయపరచడం జిహాదీ తోడేళ్ల నిరంతర సంచారానికి సాక్ష్యాలు. అయినప్పటికీ భద్రత అప్రమత్తం కావడంలేదు. కావడం లేదనడానికి గత 25వ తేదీన పంపురా వద్ద ఎనిమిది మంది జవానులు బలైపోవడమే నిదర్శనం..
జవానులు పయనిస్తుండిన బస్సు చక్రాల టైర్లకు గురిచూసి బీభత్సకారులు మొదట కాల్పులు జరిపారట. తూటాలు తగిలి చక్రాలు కూలబడ్డాయి. వెంటనే బస్సులోనుంచి జవానులు టెర్రరిస్టులపై కాల్పులు జరుపలేకపోయారు. అందువల్లనే కేవలం ఇద్దరు జిహాదీ రక్కసులు ఇంతమంది రక్షకులను పొట్టన పెట్టుకోగలిగారు. ఇది కూడ భద్రతాదళాల ప్రమత్తతకు మరోసాక్ష్యం. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి అనంతనాగ్ నియోజకవర్గం నుంచి శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించి, శ్రీనగర్‌లో సంబరాలు జరుపుకుంటుండిన శుభ సమయంలోనే సమీప ప్రాంతంలో జిహాదీలు విరుచుకుపడ్డారు. ఊహించని చోట దూకడం జిహాదీ తోడేళ్ల స్వభావం, వ్యూహం. కానీ శనివారం నాడు జిహాదీలు ఊహించిన సమయంలోనే, ఊహించిన చోటనే దాడి చేశారు. మెహబూబా ముఫ్తి విజయం తరువాత ఆమె అభిమానులు, ఆమె నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కార్యకర్తలు ఉత్సవం జరుపుకునే సమయంలో భద్రతపై బీభత్సం దాడి చేసే ప్రమాదం ఉన్నదన్నది ముందుగానే ఊహించిన అంశం. అందువల్ల శ్రీనగర్‌లో మాత్రమే కాక రాష్టమ్రంతటా భద్రతా దళాలు, అప్రమత్తమై ఉండాలి. కాని కాలేదని పంపురా దుర్ఘటన వల్ల ధ్రువపడింది. భద్రతాదళాలపై శనివారం నాడు టెర్రరిస్టులు దాడి చేయవచ్చునని ముందుగానే సమాచారం లభించినట్టు దాడి జరిగిపోయిన తర్వాత అధికారులు చెప్పుకొచ్చారు. గత కొద్ది రోజులుగా టెర్రరిస్టులు దాడులకు సిద్ధమవుతున్నట్టు వారిమధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణల ద్వారా వెల్లడైనట్టు ఆదివారం సిఆర్‌పిఎఫ్ ప్రధాన సంచాలకుడు కె. దుర్గాప్రసాద్ నూఢిల్లీలో వెల్లడించారు. సకాలంలో పోలీసులు, సైనికులు నిరోధక చర్యలను తీసుకోలేక పోయారు మరి..ముప్పయి సెకండ్ల వ్యవధిలోనే ఎనిమిదిమందిని ముష్కరులు పొట్టనపెట్టుకోగలిగారు. ఇంతమందిని గాయపరచగలిగారు.
పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం దారికి తెచ్చే వరకు జమ్మూ కశ్మీర్‌లో కాని దేశంలో కాని జిహాదీ ఉగ్రవాదులు విశ్రమించ బోరన్నది చరిత్ర నిరూపించిన వాస్తవం. దేశంలోను, దేశం వెలుపల మనదేశానికి వ్యతిరేకంగా చెలరేగుతున్న వివిధ ఉగ్రవాదపు జిహదీ తండాలను ఉసికొల్పుతున్నది పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రమే. హిజ్‌బుల్ ముజాహిద్దీన్, సిమి, హుజి, లష్కర్, జమాత్ వంటి ముఠాలకు తోడు అల్‌ఖాయిదా, తాలిబన్ తండాలు, రంగప్రవేశం చేశాయి. ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం-ఐఎస్‌ఐఎస్- హంతకులు రంగ ప్రవేశం చేయడంలో జిహాదీల బలం మరింతగా పెరిగిపోయింది. ఈ ముఠాలన్నింటినీ ఒకే వ్యవస్థగా అనుసంధానం చేయిస్తున్నది పాకిస్తాన్ ప్రభుత్వం. అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వాన్ని దారికి తేవడం ప్రధానం. పాకిస్తాన్ సైనిక దళాలకు అనుబంధంగా గూఢచర్య విభాగంగా చలామణి అవుతున్న ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్-ఐఎస్‌ఐ- నిజానికి భారత వ్యతిరేక జిహాదీ ఉగ్రవాద వ్యవస్థ. హంతక పాత్రధారులు లష్కర్‌లు కావచ్చు, ఐఎస్‌ఐఎస్ కావచ్చు. సూత్రధారి మాత్రం ఐఎస్‌ఐ..ఐఎస్‌ఐఎస్‌లు మాత్రమే కాదు, ఆఫ్రికాలోని బోకోహరాంతోను, పశ్చిమాసియాలోని హిజ్‌బొల్లా ముఠాతోను కూడా ఐఎస్‌ఐ అనుసంధానమై ఉంది. గత 18 నెలల్లో బంగ్లాదేశ్‌లో 48 మంది హిందువులను జిహాదీలు చంపేశారని ఇటీవల వెల్లడైంది. వీరిలో ఎక్కువమందిని ఐఎస్‌ఐఎస్ ముఠాకు చెందిన తోడేళ్లు పొట్టన పెట్టుకున్నాయి. ఇరాక్‌లోని 39 మంది భారతీయ కార్మికులు గత రెండేళ్లుగా ఐఎస్‌ఐఎస్ నిర్బంధంలో మగ్గుతున్నారు. వీరిని ఐఎస్‌ఐఎస్ హంతకులు మట్టుపెట్టారని ఒకసారి, బందీలు సజీవంగా ఉన్నట్టు మరోసారి వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం నడిపిస్తున్న భారత వ్యతిరేక విస్తృత జిహాద్‌లో పంపురా ఘటన భాగం..
పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో నక్కిన జిహాదీ దుండగులను పట్టి పరిమార్చే ప్రక్రియ-హాట్ పర్స్యూట్-ఇప్పుడైనా మన ప్రభుత్వం ఆరంభించాలి. ఈశాన్యంలో బీభత్సకాండను సృష్టించి పారిపోతున్న చైనా తొత్తులు బర్మాలో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. గత ఏడాది మన సైనికులు బర్మాలోకి చొచ్చుకొనిపోయి ఈ చైనా తొత్తుల స్థావరాలను ధ్వంసం చేసి వచ్చారు. ఇదే రీతిలో పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న జిహాదీలను కూడ పట్టి పరిమార్చడానికై మరోసారి మన దళాలు చొచ్చుకొని పోయే విధానాన్ని అమలు జరపాలి. పాక్ దురాక్రమిత కశ్మీర్‌లోని బీభత్సపు బట్టీలను బద్దలు కొట్టాలి..