సంపాదకీయం

‘సచివాలయ’ సమారంభం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెలగపూడిలో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక సచివాలయం ప్రారంభం కావడం తెలుగు ప్రజల జీవన ప్రస్థానంలో మరో చారిత్రక శుభ ఘట్టం...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014 జూన్ రెండున రెండుగా పునర్ వ్యవస్థీకరణ జరిగిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌లో రాజధాని లాంఛనం ప్రస్ఫుటించడం ఇది మొదటిసారి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు హైదరాబాద్ ఉమ్మడి రాజదానిగా కొనసాగడానికి మరో ఎనిమిదేళ్ల పాటు వీలున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని భాగ్యనగరంనుంచి అమరావతి వైపుగా ఇప్పుడే ప్రస్థానం ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం వారి వేగిరపాటు ప్రధాన కారణం. రాజధాని రాష్ట్రం సరిహద్దులలోనే నెలకొని ఉండడంవల్ల పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉంటుందన్నది ఈ వేగిరపాటునకు కారణం! వేగిరపాటు అన్నది ప్రచారవౌతున్న అంశం. కానీ ఒక నూతన రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి రెండేళ్ల సమయం ఏమంత తక్కువ వ్యవధి కాదు. స్వదేశీయ పరిజ్ఞానంతో, నిపుణుల నిర్మాతల సహకారంతో, స్వదేశీయ పరికరాలతో ఆంధ్రుల నూతన నిర్మాణం కావాలన్న సంకల్పం ప్రభుత్వం వారికి కలిగి ఉండినట్టయితే ఈ రెండేళ్లలో ప్రాచీన అమరావతి సమీపంలో వినూతన అమరావతి రూపు దిద్దుకుని ఉండేది. కానీ ప్రధానంగా విదేశీయ పరిజ్ఞానంతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగినట్టు పేరు తెచ్చుకున్న విదేశీయ వాణిజ్య సంస్థల ఆధ్వర్యంలో మరో సింగపూర్‌ను మరో టింబక్టూను రాజధాని ప్రాంతంలో వెలయింప చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం వారి దృఢ నిశ్చయం నిర్మాణ గతిని విచిత్రమైన మలుపులను తిప్పింది. రాష్ట్ర రాజధానిలో ప్రధానంగా ఉండవలసినవి రాజభవన్, ఉన్నత న్యాయస్థానం భవనాలు, శాసనసభ, సచివాలయం...వీటికి తోడు రాజధానిలో ఏర్పడగల రాష్టస్థ్రాయి కార్యాలయ సౌధాలు, న్యాయమూర్తులకు, ప్రతినిధులకు మంత్రులకు అధికారులకు ఉద్యోగులకు నివాసాలు! ఏ నూతన రాజధాని ప్రారంభంలోనైనా ప్రభుత్వం సమకూర్చవలసిన వౌలిక సదుపాయాలు ఇవి మాత్రమే! ఈ సదుపాయాలు అత్యధికం వెలగపూడి ప్రాంగణంలో అవతరించిన, బుధవారం ప్రారంభమైన తాత్కాలిక రాజధానిలో ఏర్పడినాయి. అందువల్ల ఈ తాత్కాలిక రాజధానిని శాశ్వత రాజధానిగా చేయవచ్చు. గవర్నర్ అధికార నివాసాన్ని, హైకోర్టును నిర్మిస్తే చాలు! మిగిలిన అసంఖ్యాక భవనాలను సదుపాయాలను ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజలు క్రమంగా నిర్మించుకుంటారు. ఈ ప్రక్రియ వ్యవస్థీకృతమైతే వేల ఎకరాల పంటపొలాలు, తోటలు, ఆకుపచ్చని అందాలు, ప్రాకృతిక పరిమళాలు యధావిధిగా కొనసాగి ఉండేవి...
ఇలా శాశ్వత రాజధానిగా ఈ వెలగపూడి తాత్కాలిక రాజధానినే మార్చుకోవాలని ప్రభుత్వం ఇప్పుడైనా నిర్ణయించవచ్చు. స్వపరిపాలనకు కాలసింది అవినీతి అంటని ప్రభుత్వ యంత్రాంగం, అంతేకాని ఆకాశాన్ని చుంబించే పదుల వందల అంతస్థుల భవనాలు కాదు. కాదు, కానే కాదు..రాజధానిలో నివసించే వారి జీవనాన్ని సుఖమయం చేయగలిగింది కాలుష్యం లేని పరిసరాలు, అంతేకాని కాలుష్యాన్ని కేంద్రీకృతం చేయగల సిమెంటు కట్టడాలు, కర్మాగారాల గొట్టాలు కాదు. రాజధానిలో పాలనా వ్యవస్థకు సంబంధించిన భవనాలు, ఉద్యోగులు, సదుపాయాలు, పరిజ్ఞానం ఉంటే చాలన్నది తరతరాలుగా భారతీయుల పద్ధతి. ఈ పద్ధతిని అనేక విదేశాలలో ఇప్పుడు పాటిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల-యుఎస్‌ఏ-లోని దాదాపు అన్ని రాష్ట్రాల రాజధానులు చిన్న పట్టణాలు మాత్రమేనన్నది ఈ భారతీయ పద్ధతికి ఒక ఉదాహరణ మాత్రమే! విద్యా కేంద్రాలు, వాణిజ్య కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలు, చలనచిత్ర నిర్మాణ విచిత్ర వ్యవస్థలు, బృహత్ వైద్య కేంద్రాలు, కాలుష్యానికి రూపాలైన మహా పారిశ్రామిక వాటికలు, సమాచార సాంకేతిక విప్లవ వాటికలు రాజధానిలో కేంద్రీకృతం కానక్కరలేదు, అవన్నీ కూడ ఇంకా ఎనె్నన్నో కూడ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఏర్పడవచ్చు! ఇలాంటి వికేంద్రీకరణ వల్ల ఒకే చోట వేల లక్షల ఎకరాల ఆకుపచ్చని శోభలు అంతరించిపోవు, కాలుష్యం కేంద్రీకృతం కాదు. పచ్చని పొలాల మధ్య ప్రాకృతిక శోభల మధ్య చిన్న రాజధాని నగరం, నగరం చుట్టూ నగరం మధ్యలో మళ్లీ ఆకుపచ్చని పొలాలు, తోటలు...ఇదీ నగర నిర్మాణాలకు ఆదర్శవంతమైన భారతీయుల నమూనా!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభృతులు సమర్పించిన పవిత్రమైన మట్టిని వివిధ నదీ జలాలతో తడిపి వెలగపూడి వద్దనే నిక్షేపించి ఉండవచ్చు. వెలగపూడి ప్రాంగణాన్ని శాశ్వత రాజధానిగా చేసి ఉండవచ్చు...లేదా చందన పరిమళాలు నిండిన ఆ శుభంకరమైన మట్టిని నిక్షేపించిన ఉద్దండరాయునిపాలెంలోనే ఈ తాత్కాలిక-శాశ్వత భవన సముదాయాలను నిర్మించి ఉండవచ్చు. అక్టోబర్ 22 ఉద్దండరాయుని పాలెంలో శంకుస్థాపన జరిగిన వెంటనే తాత్కాలిక సచివాలయ భవనాలు అక్కడనే నిర్మించి ఉండవచ్చు-్భవన నిర్మాణం సమగ్రంగా పూర్తయి ఉండేది. కానీ ఆ తరువాత కొన్ని నెలలకు హఠాత్తుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మస్తిష్కంలో ఈ నవ్యాంధ్ర తాత్కాలిక రాజధాని తళుక్కుమంది. అందువల్ల సింగపూర్ వారి సిమెంటు కట్టడాలకు, మలేసియా వారి మహా నిర్మాణాలకు, స్విస్ ఛాలెంజ్‌కీ, స్వీడన్ బస్సులకు ఈ తాత్కాలిక స్వదేశీయ నిరాడంబర భవనాలు అడ్డు వస్తాయని ముఖ్యమంత్రి మథన పడి ఉండవచ్చు! అందువల్లనే తాత్కాలిక పరిపాలనను వెలగపూడికి తరలించుకుని వచ్చారు. జూన్ 29వ తేదీన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ సమారంభ శోభన దృశ్యం ఆవిష్కృతమైనప్పటికీ 27వ తేదీన అనేక రాష్టస్థ్రాయి కార్యాలయాలు అమరావతి చుట్టుపట్ల ఆరంభమైపోయాయి. సచివాలయం ఆరంభం ప్రధాన కార్యక్రమం కనుక నూతన రాజధాని ఈ కలియుగం 5118వ సంవత్సరం శుభ దుర్ముఖి జ్యేష్ట బహుళ నవమి నాడు ప్రారంభమైనట్టు చరిత్ర ఏర్పడుతోంది. ప్రయాణాలకు, ప్రవేశాలకు నవమి పనికిరాదన్నది భారతీయుల అనాది సంప్రదాయం. బహుశా అందువల్లనే నవమి నిష్క్రమించి దశమి ప్రవేశించిన తరువాత ప్రారంభోత్సవం నిర్వహించారు.
త్రిలింగ భాషా ప్రజల సనాతన జీవన ప్రస్థాన పథంలో వెలగపూడి ఇలా మరో చారిత్రక ఘట్టం. మదరాసునుండి కర్నూలుకు తరలివచ్చిననప్పుడు మళ్లీ భాగ్యనగరి వైపు సాగిపోవలసి ఉంటుందని ఆ తెలుగు వారు బహుశా ఊహించి ఉండరు. అంతటితో ఆగలేదు, అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని మరోసారి సంచలనానికి గురి అయింది, వెలగపూడి ప్రస్తుత గమ్యం ద్రాక్షారామ, శ్రీశైల, కాళేశ్వర సనాతన క్షేత్రాల మధ్య వాటిని చుట్టుపక్కల అనాదిగా విస్తరించిన ఆంధ్ర భాష ఈ త్రిలింగ ప్రాంతీయులు తెలుగువారు కావడానికి ప్రాతిపదిక! ఆంధ్ర భాష, త్రిలింగ భాష, తెలుగు భాష ఉభయ తెలుగు రాష్ట్రాలవారి ఉమ్మడి వారసత్వం. శ్రీకాకుళం, ధాన్యకటకం, కోటి లింగాల, ఓరుగల్లు, హంపీ విజయనగరం, గోలకొండ, రాజమహేంద్రి ఉభయ రాష్ట్రాల తెలుగువారి ప్రాచీన నగరాలు. ఈ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం భాగ్యనగరంలోను, అమరావతిలోను కొనసాగనుంది. ఆ సేతు శీతనగం ఒకే జాతి...