సంపాదకీయం

ఆఫ్రికాతో స్నేహ బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆఫ్రికా దేశాల్లో పర్యటించటం ఇదే మొదటిసారి. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మోదీ తన విదేశాంగ విధానాన్ని వ్యూహాత్మకంగా అమలు పరుస్తూ వచ్చారు. ప్రమాణస్వీకారానికి సార్క్ సభ్యదేశాధినేతలందరినీ ఆహ్వానించటంతో ప్రారంభమైన మోదీ ప్రస్థానం వివిధ దేశాల్లో ఒకదాని వెంట ఒకటిగా చేసిన పర్యటనలు సత్ఫలితాలనే ఇచ్చాయి. భారత్‌పై వివిధ దేశాలకు ఉన్న వైఖరిలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. కేవలం ఆర్థిక సంబంధాల దృష్టి కోణంలో కాకుండా, సాంస్కృతిక దౌత్యాన్ని నెరపడం ద్వారా ఆయా దేశాలతో భారత్ అనుబంధాన్ని మోదీ బలోపేతం చేస్తూ వచ్చారు. ఏ దేశానికి వెళ్లినప్పటికీ.. అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మాతృభూమిపై వారిలో ఆదరాభిమానాలను పెంపొందిస్తూ వచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత్ అనుసరించిన విదేశాంగ విధానానికి, మోదీ గత రెండేళ్లుగా అమలు చేస్తున్న విదేశాంగ విధానానికి తేడా చాలా ఉంది. వివిధ అంశాల్లో అగ్రరాజ్యాలతో సహా అన్ని దేశాలనూ భారత్‌కు అనుకూలం చేయటంలో చాలావరకు కేంద్రప్రభుత్వం విజయం సాధించింది. ఆయా దేశాలతో కేవలం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలకే పరిమితం కాకుండా సాంస్కృతిక పరమైన దౌత్యాన్ని వ్యూహాత్మకంగా నెరపడం వల్ల వివిధ దేశాలతో మానసికంగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తొలిసారి ఆఫ్రికా దేశాల్లో పర్యటించటం కూడా భారత్ మైత్రీ బంధాన్ని బలోపేతం చేయటంలో భాగమే. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ ఆఫ్రికా దేశాల్లో పర్యటించిన కొద్ది వారాల గడువులోనే ప్రభుత్వంలో మరో ఉన్నతస్థాయి పర్యటనకు ప్రధాని శ్రీకారం చుట్టడం అత్యంత కీలక పరిణామం. గురువారం నుంచి అయిదు రోజుల పాటు మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యా దేశాల్లో మోదీ పర్యటన సాగుతుంది. ఈ నాలుగు దేశాల్లోనూ భారతీయ సంతతి వాళ్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మోదీ తన పర్యటనలో నాలుగు దేశాల్లోనూ ప్రవాస భారతీయుల సమావేశాల్లో ప్రసంగించనున్నారు. భారత్, ఆఫ్రికా ఫోరం సదస్సును ఇరు పక్షాల ప్రయోజనాలను సంఘటితం చేసుకోవాలన్న ధ్యేయంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆఫ్రికాతో భారత్ స్నేహ సంబంధాలు ఈనాటివి కావు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే భారత్ ఆఫ్రికాతో వాణిజ్య స్నేహ సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. వివిధ దేశాల్లో బ్యాంకులను ఏర్పాటు చేసింది. వ్యవసాయ రంగానికి సంబంధించి సహకారాన్ని అందించింది. దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై పోరాటం చేసిన యోధుడు నెల్సన్ మండేలాకు వెన్నుదన్నుగా నిలిచింది. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అందుకున్న తొలి విదేశీయుడు నెల్సన్ మండేలాయే. ఇరు ప్రాంతాలూ వలస పాలనలో మగ్గినవి కావటం, ఉగ్రవాదం, పేదరికం, ఆరోగ్యం వంటి ఒకే రకమైన సమస్యల మధ్య నలిగిపోయినవి కావటం వల్ల ఇరు ప్రాంతాల మధ్య అనేక అంశాల్లో సారూప్యత కనిపిస్తుంది. భారత స్వాతంత్య్రానంతరం తొలి మూడు దశాబ్దాలు ఆఫ్రికాతో సంబంధాలు బలంగానే కొనసాగాయి. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలు వేగంగా అమల్లోకి రావటం వల్ల భారత దృక్కోణంలో మార్పు వచ్చింది. ఆసియా, ఆఫ్రికాల కంటే అమెరికా, ఐరోపాల వైపు ఎక్కువగా దృష్టి సారించటం, వాణిజ్య సంబంధాలను కూడా ఆయా దేశాలతోనే ఎక్కువగా కొనసాగించటంతో ఆఫ్రికా దేశాలకు భారత్ క్రమంగా దూరమవుతూ వచ్చింది. ఇదే సమయంలో ఆఫ్రికా దేశాలన్నింటితోనూ చైనా తన మైత్రీబంధాన్ని పకడ్బందీ వ్యూహంతో బలపరచుకుంది. ఆఫ్రికా-చైనాల మధ్య వ్యాపారం అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో(2014-15)లో 20వేల కోట్ల డాలర్లకు పైగా వ్యాపారాన్ని ఆఫ్రికా దేశాలతో చైనా చేసింది. ఇదే సంవత్సరం భారత్- ఆఫ్రికాల మధ్య వ్యాపారం మొత్తం కూడా ఏడువేల కోట్ల డాలర్లు దాటలేదు. అంతే కాదు చైనా ఆఫ్రికాలో పెట్టిన పెట్టుబడులు 18వేల కోట్ల డాలర్లయితే, భారత భాగస్వామ్యం 3వేల కోట్ల డాలర్లు మాత్రమే. ఆఫ్రికా నుంచే భారత్ భారీ ఎత్తున పప్పు్ధన్యాలను దిగుమతి చేసుకుంటోంది. ఏటా లక్ష టన్నుల మేర పప్పు్ధన్యాల దిగుమతి చేసుకునేందుకు మోదీ పర్యటనలో ఒప్పందం జరిగే అవకాశాలున్నాయంటున్నారు. అదే సమయంలో మొజాంబిక్ రైతులందరికీ విత్తన టెక్నాలజీని అందిస్తుంది. ఈ ఒప్పందాలు భారత్ ఆఫ్రికాలకు పరస్పర ప్రయోజనకారులవుతాయనటంలో సందేహం లేదు. హైడ్రోకార్బన్ రంగానికి సంబంధించి ఆస్ట్రేలియా, ఖతార్‌ల తరువాత మొజాంబిక్ మూడో అతిపెద్ద ఎగుమతి దేశం. భారత ప్రభుత్వరంగసంస్థ ఓఎన్‌జీసీ వంటివి ఇప్పటికే ఈ రంగంలో మొజాంబిక్‌లో పెట్టుబడులు పెట్టింది. దీనికి సంబంధించి కూడా మోదీ మొజాంబిక్‌తో ఒప్పందం చేసుకుంటారు. తీరప్రాంత పరిరక్షణ, వ్యవసాయ రంగాలకు సంబంధించి కూడా ఒప్పందాలు కుదరటం మైత్రీబంధంలో అత్యంత ముఖ్యమైన పరిణామం.
ఆఫ్రికాను ఒకప్పుడు చీకటి ఖండం అన్నారు. పేదరికం, ఆకలిచావులు, అంటురోగాలు, ఉగ్రవాదం, దోపిడీ ముఠాలు వంటి వాటికి కేరాఫ్‌గా చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత దశాబ్ద కాలంగా మారుతున్న పరిణామాలను గమనిస్తే ఇప్పుడు ఆఫ్రికా దేశాలను తక్కువ అంచనా వేయటానికి వీల్లేదని స్పష్టమవుతోంది. ఆర్థిక వృద్ధిలో, ఎగుమతుల్లో ఆ దేశాలు దూసుకుపోతున్నాయి. గత పదేళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో సింహభాగం ఆఫ్రికా దేశాలవే ఉండటం సత్యదూరం కాదు. అలాంటి ఆఫ్రికాతో అర్థవంతమైన భాగస్వామ్యాన్ని పెంచుకునే దిశగానే మోదీ పర్యటన సాగుతుందనటంలో సందేహం లేదు. ఆఫ్రికాలోని భారతీయ కంపెనీలు, సంస్థలు ఆ ఖండాన్ని ఆర్థిక పరిపుష్టిగా తీర్చిదిద్దడంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. అక్కడి ప్రజా ప్రభుత్వాలతో భారత్‌కు మొదట్నుంచీ మంచి అనుబంధం కొనసాగుతోంది. చైనా సహా ఇతర దేశాలతో కేవలం వ్యాపారపరమైన సంబంధాలు తప్ప నైతికపరమైన అనుబంధం ఆఫ్రికాకు లేదు. భారత్‌పై ఈస్టిండియా కంపెనీ వ్యాపారం పేరుతో చేసిన అక్రమాల మాదిరిగానే, తమ దగ్గరున్న ముడిసరుకులను తరలించుకుని పోయి వాటితో తయారైన వస్తువులను తిరిగి తమకే ఎక్కువ ధరలకు అంటగడుతున్నారన్న అసంతృప్తీ ఆఫ్రికా ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ఈ దశలో మనకు అనుకూలంగా ఉన్న అవకాశాల్ని వినియోగించుకొని ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్లలో ఒకటైన ఆఫ్రికా దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవటం భారత్‌కు అత్యంత ఆవశ్యకం. కొద్ది మాసాల క్రితం ఢిల్లీలో జరిగిన ఇండో- ఆఫ్రికన్ సదస్సు ఈ దిశగా కీలకమైన ముందడుగు వేసింది. ఆ తరువాత రాష్టప్రతి, ఉపరాష్టప్రతి ఆఫ్రికా దేశాల్లో పర్యటించి బాట పరిచి వచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ పర్యటన ఆఫ్రికా దేశాలతో భారత వాణిజ్య, సాంస్కృతిక బంధాన్ని పటిష్ఠం చేస్తుందని ఆశించాలి.