సబ్ ఫీచర్

నైతిక విలువలు పెంచని విద్యావిధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో మోన్‌శాంటో విత్తనాలు బి.టి.విత్తనాలు వలె విద్యారంగంలో కూడా పాశ్చాత్య దేశాల దిగుమతి విద్యావిధానాన్ని ప్రభుత్వాలు విద్యాహక్కు చట్టం ద్వారా నెత్తికెత్తుకున్నారు. అప్పటి మానవ వనరుల అభివృద్ధిశాఖామాత్యులు అమాంతం విదేశీ విద్యావిధానాన్ని, భారతీయ విద్యావిధానంపై రుద్దటానికి చేసిన ప్రయత్నమే ఈ వికృతమైన చట్ట రూపం. ఈ చట్టంలో లోపాలు గురించిన చర్చించిన నాధుడే లేడు. పార్లమెంటులో గందరగోళం గొడవలు వాయిదాల మధ్య లో గరళ రూపంగా ఈ చట్టం తయారైంది. ఇందులో చాలా అంశాలు ఉపాధ్యాయులకి విద్యార్థులకు ప్రాణసంకటంగా ఉన్నాయనటంలో ఎంతమాత్రమూ సందేహం లేదు.
పాఠశాలల పనిగంటలు అధికం చేశారు. సిలబస్ ఎలా ఉండాలో నిర్ధారించే ఫ్రేంవర్క్ చేయలేదు. ఉపాధ్యాయుడికి వారానికి 48 గంటలు పనిగంటలు చట్టంలో పెట్టారు. 48 గంటలు పనిచేయాలంటే బోధన అంటే ఉపాధ్యాయుడికి రోదనగానే ఉంటుంది. పిల్లల సంగతీ అంతే. ఉదయం 9 గంటలు లగాయితు సాయంత్రం 5 గంటల వరకూ స్కూలు పెడితే పిల్లలు తమతమ కుటుంబాలతో గడిపేదెప్పుడు? బంధువర్గంతో సంబంధ బాంధవ్యాలు అవగాహన ఉండేదెలా? బ్రిటీషువారి కాలంలో పాఠశాలలు చాలా ఆహ్లాదంగా ఉంటుండేవని మన పెద్దలంటుండేవారు. పెద్ద పెద్ద ఆంగ్ల పాఠాలు, సాహిత్యం వివిధ భాషలు గణితం అన్నీ నేర్పేవారు. అన్నిటితోబాటు సంగీ తం వాయిద్య పరికరాలు సంప్రదాయ విద్యలు వృత్తివిద్యలు అన్నీ నేర్చేవారు. మరి ఈనాటి పిల్లలు పరిస్థితి దేముడికే తెలియాలి. పాశ్చాత్య విద్యావిధానం అవలంభించటంలో కూడా మనకు చిత్తశుద్ధి లేదు. విదేశాల్లో డిగ్రీ ఇవ్వాలంటే తప్పనిసరిగా హెరిటేజ్-సంస్కృతి- సంగీతంలో రెండింటిలో కూడా తగిన పరిజ్ఞానం ఉంటేనే వారికి బాచిలర్ డిగ్రీ ఇస్తారని అందరికీ తెల్సిందే. అమెరికా వంటి దేశాల్లో అన్నీ గవర్నమెంటు పాఠశాలలే. ప్రైవేటు పాఠశాలలు అసలు ఉండవు. ప్రాంతాన్నిబట్టి స్థాయినిబట్టి పాఠశాలలు ఏర్పాటై ప్రభుత్వమే తన విధి విధానాల ప్రకారం చదువులు పాఠశాలలు నిర్వహిస్తుంది. రాజకీయాలకి, ప్రభుత్వం మారగానే విద్యావిధానాలు మారటం వంటివి చేయరు. కొత్త కొత్త ప్రయోగాలు చేయటానికి వారు అనుమతించరు.
మన ప్రభుత్వ పాలకులు తమ వికృత చేష్టలను విద్యావిధానంలో ప్రతిబింబిస్తుంటారు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుండీ మన దేశంలో ఇతమిత్థంగా ఈ విధానం అనుసరించాలని ఎవరూ ఇంతవరకూ నిర్ధారించలేదు. విద్యావిధానంలో భారతీయ సామాజిక విలువలు పరస్పర అవగాహన, జాతీయ సమైక్యత, భాషలు వాటి పరిరక్షణ, సంస్కృతి వాటి వారసత్వపు విలువలు, నైతిక విలువలు, సహనం, తోటి మానవుల యెడ ప్రేమ ఆప్యాయత కరుణ జాలి దయ సానుభూతి వంటి కనీస మానవతా విలువలు బోధించే విద్యావిధానం రూపొందించక పోవటంవల్ల ప్రస్తుత మనం జాతీయ వైపరీత్యాలను ఎదుర్కొ నవలసి వస్తున్నది. మన సమాజంలో తల్లిదండ్రుల యెడ పిల్లలకు ఉండవలసిన ప్రేమ ఆదరణ విద్యావిధాన లోపాలవల్ల కూడా ఉంటాయి. బాధ్యతాయుతమైన పౌరులని తయారుచేయటంలో మన విద్యావిధానం వెనుకబడి పోయింది. వాస్తవంగా విద్యార్థులకి ఏమి నేర్పించాలో ఎలా నేర్పించాలో ఇంతవరకూ కరికులం ఫ్రేంవర్క్ అనేది స్పష్టమైన విధి విధానాలు రూపొందించే ప్రయత్నం ఎవరూ చేయటం లేదు.
బాల్యం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ అటలు, అమ్మనాన్నలు ఇటు గురువులు పాఠశాలలు విద్యాలయా ల మధ్య అవినాభావ సంబంధం, నవ సమాజ నిర్మాణానికి అవసరమైన అనువైన వాతావరణాలు ఏర్పరచవలసిన అవసరం చాలా వుంది. ప్రస్తుతం మన సమాజం ఎదుర్కొంటున్న అనేక అవకతవకలు వివాదాలు, ఘర్షణలు వైషమ్యాలు వీటన్నిటికినీ మూల కారణం అస్తవ్యస్త విద్యావిధానపు అవశేషాలే. ముఖ్యంగా బాలలకి బాల్యం లో వేయవలసిన జీవన నిర్మాణ సౌధానికి పునాదులు సక్రమంగా పడటం లేదనే చెప్పాలి. అందువల్ల బాలలు విద్యకి దూరమై పాఠశాలలకి దూరమై సక్రమమైన, క్రమశిక్షణాయుతమైన జీవనశైలికి దూరమై చదువుల్లో రాణించలేక చదివిన చదువులు నిస్సారంగా భావించి, నైతిక స్థైర్యం కోల్పోయి ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయి చివరకు జీవిత ప్రారంభ దశయందే ఆత్మహత్యలపాలయిపవటం జరుగుతున్నది. ఇటువంటి వాటిలో పాత్ర కేవలం ఏ ఒక్కరిదో అని నిందించినా ఫలితం లేదు. అందరి పాత్ర అంతో ఇంతో ఉంటుంది. బాగా ధనవంతులైన మధ్యతరగతివారు అంతో ఇంతో చదివించగల స్థోమతగల వారు ప్రైవేటు విద్యాసంస్థలపైనే మొగ్గు చూపి తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందనే అపోహతో ఆయా పాఠశాలల్లో చేరుస్తున్నారు. విద్యావ్యాపారంలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వారందరూ చేరిపోతున్నారు. అవసరానికి మించిన హంగు ఆర్భాటాలతో అటు తల్లిదండ్రులని, సమాజాన్ని భ్రాంతిలోకి దింపి, వారివద్ద నుండి లక్షలాది రూపాయలు ఫీజులు వసూలుచేసి, అర్హతలేని ఉపాధ్యాయులను నియమించి తక్కువ వేతనాలతో పాఠశాలలు నిర్వహిస్తున్నారు.
ఇక్కడ మరొక పార్శ్వం ఉంది. నిరుద్యోగ ఉపాధ్యాయుల శ్రమని దోపిడీ చేస్తూ యాజమాన్యాలు తమ అవసరాలను తీర్చుకుంటున్నాయ. నిరుద్యోగికి ఉపాధి అవసరం. యజమానికి సేవలు అవసరం. పనికి తగ్గ వేతనం అన్న సంగతి పాత సామెత అయిపోయింది. ప్రస్తుత ఆర్థిక అవసరాలు వెంటాడుతుంటే ఎంత మెరిట్ గల నిరుద్యోగి అయినా తక్కువ వేతనానికే పనికి ఒప్పుకుంటున్నారు. పోటీతత్వం లాభార్జనే లక్ష్యంగా పనిచేసే ప్రైవేటు పాఠశాలలు, తమ కు నచ్చిన పబ్లిషర్లు ప్రచురించే పుస్తకాలను మాత్రమే వాడుతూ, ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను నిర్లక్ష్యం చేస్తున్నాయ. దీన్ని ఎవరూ పట్టించుకోకపోవడం మన దౌర్భాగ్యం.

- ఎన్.నాగ గాయత్రి