ఉత్తరాయణం

అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్టవ్య్రాప్తంగా నగరాలన్నిటినీ హరిత నగరాలుగా మార్చే ఉద్దేశంతో ప్రభుత్వం లక్షలాది మొక్కలను నాటే కార్యక్రమం చేపడుతోంది. నాటడమేకాదు వాటి సంరక్షణకూ పూనుకోవాలి. ప్రజలందరూ మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలి. పట్టణ ప్రాంతాలనే కాదు. పల్లెలనూ పచ్చదనంతో నింపాలి. పాఠశాలలనూ, కళాశాలలనూ పచ్చని చెట్లతో అలంకరించాలి. ప్రతి ఒక్కరూ నిరంతరం ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం హాబీగా చేసుకోవాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
మానవాళికి దిశానిర్దేశం
మానవులు అశాంతి, ఆందోళన, కష్టనష్టాలకు గురైనప్పుడు ఎటువంటి కర్మలు చేస్తే విపత్కర పరిస్థితుల నుండి బయటపడతాడో, వాటి గురించి సోదాహరణంగా వివరించే సుప్రసిద్ధ సంపూర్ణ బోధనా గ్రంథం భగవద్గీత. ఇందులో ప్రతీమాట మానవాళికి దిశానిర్దేశం చేస్తుంది. హృదయంలో జన్మజన్మలుగా పేరుకొని వున్న అజ్ఞానాంధకారాలను పటాపంచలు చేసి నూతన దృక్పథం, ఆలోచనా ధోరణిని కలిగిస్తుంది. కులం, మతం, ప్రాంతం, వర్గం, లింగ బేధం లేకుండా ప్రపంచంలో ఎవరైనా అనుసరించదగ్గ ఆచరించదగిన అత్యద్భుత మేనేజ్‌మెంట్ గ్రంథం భగవద్గీత అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి భగవద్గీతను విద్యార్థులకు చిన్నతనం నుండి చదివించి ఆచరింపజెయ్యాలి. ధనార్జనే ధ్యేయంగా, విదేశీ సంస్కృతి మోజులో కొట్టుకుపోతున్న తల్లిదండ్రులు నిత్య పారాయణం చేయాలి. మానవతా విలువలను సంపూర్ణంగా బోధించే గ్రంథం భగవద్గీత ఒక్కటే!
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
దేవాలయాలను కాపాడుకోవాలి
దేశంలో పురాతన దేవాలయాలు, హిందు మతాన్ని కాపాడుకోవాల్సిన బృహత్తర బాధ్యత ప్రతీ హిందువుపై వుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కోట్ల రూపాయల విలువైన భూములు వున్నా కొన్ని దేవాలయాలలో అర్చకులకు నెల నెలా సక్రమంగా జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. మరి కొన్ని దేవాలయాలలో నిత్య ధూపదీప నైవేద్యాలను అర్చకులే సమకూర్చాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో వేలాది ఎకరాల దేవాలయ భూములు అన్యాక్రాంతమైపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్చకులకు కనీస వేతనాలు అమలుచేయడంతోపాటు అన్నసమారాధన నిర్వహించేందుకు నిధులు సమకూరుస్తానన్న హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. చాలీచాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్న అర్చకులకు ఎన్టీఆర్ వైద్య పథకం వర్తింపు, కృష్ణాష్టమి రోజున గోవుల దినోత్సవం, జనవరి 14ను హిందూ దేవాలయాల దినోత్సవంగా ప్రకటించడం వంటి చర్యలను ప్రభుత్వం తక్షణం చేపట్టాలి. గతంలో ప్రతీ దేవాలయానికి అనుబంధంగా ఆస్థాన కళాకారుడిని నియమించే విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలి! హిందూ సమాజంపై కుహనా సెక్యులరిస్టులు, అన్యమతస్థులు చేసే దాడిని ఎదుర్కొనేందుకు ప్రతీ హిందువు సమాయుత్తం కావాలి!
- ఎం.కనకదుర్గ, తెనాలి
గంటకు కాదు దూరానికి..
విమానయానం గంటకు 2500 రూపాయల చొప్పున చార్జీలు వసూలుచేయాలనే నిర్ణయం ఏమాత్రం సమంజసంగా లేదు. గంటపైన ఏ కారణంవల్లనో ఆలస్యమైతే ఎంత చార్జి చేస్తారు? అలా కాకుండా విమాన ప్రయాణం ఓ ప్రదేశాన్నుంచి మరో ప్రదేశానికి ఎంత టైమ్ పడుతుందో ముందుగా నిర్ణయించి అందుకు తగ్గ చార్జీలు వసూలు చేయాలి. రైలు - బస్సు టిక్కెట్ల మాదిరిగానన్నమాట. ఉదాహరణకు హైదరాబాద్‌నుంచి విశాఖపట్నానికి గంట పడుతుందనుకోండి టేకాఫ్‌లో గాని, జర్నీలో గాని, లాండింగ్‌లో గాని ఎంత ఆలస్యమయినా చార్జీ మారకూడదు. ఈ విషయంలో సమగ్ర చర్చ జరగలేదనిపిస్తోంది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా..
విద్యావంతులు కూడా దిగజారిపోయిన భాష మాట్లాడుతున్నారు. అలాగే ఆలోచిస్తున్నారు. ప్రపంచ దేశాలలో భారతదేశ గౌరవాన్ని చాటి చెప్పే విధంగా వారి నడవడిక ఉండాలి. రాయప్రోలు వారు- ‘యే దేశమేగినా ఎందు కాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని- నిలుపరా నీ జాతి నిండు గౌరవం’ అన్నారు. విదేశాల్లో ఉండే మేధావులు ఈ మాటను మరిచి ప్రాంతీయతను ప్రదర్శించడం, దేశాన్ని మరచినట్లుగా వుంటుంది. నేడు భారతదేశం, ప్రాంతీయ భావనలో ప్రాంతాలు కొట్టుమిట్టాడుతున్నాయి. జాతీయ భావన లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. భారత దేశాన్ని ముక్కలు చేయండి అనే దేశద్రోహులు నిర్మాణం అవుతున్నారు. మీరు చదువుకున్న పాఠశాలకు సహాయం చేయండి, ఊరుకు సహాయం చేయండి, మీ ప్రాంతానికి సహాయం చేయండి, జాతీయవాదంతోనో జాతీయ పదంతోనో ఓ పార్టీ పేరుతోనే సహాయం చేయకండి. ముఖ్యమంత్రి సహాయ నిధి అనండి, ప్రధానమంత్రి సహాయ నిధి అనండి. లేకుంటే ప్రపంచ దేశాలు నవ్వుకుంటాయ. భారతీయులకు జాతీయత లేదని.
- గుడ్ల జగదీశ్వర్, హైదరాబాద్
కేంద్రం అప్రమత్తంగా ఉండాలి
అధికారంలోకి వస్తే కాశ్మీరీ పండిట్ల పునరావానికి ప్రాధాన్యతనిస్తామని ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానానికి అనుగుణంగా కాశ్మీరీ పండిట్లను తిరిగి వారి స్వంత రాష్ట్రానికి రప్పించేందుకు 500 కోట్లరూపాయలను కేటాయించడం ముదావహం. 1990లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం తారస్థాయికి చేరాక ఒక పద్ధతి ప్రకారం జరిగిన విధ్వంసకాండలో దాదాపు 9 లక్షల మంది పండిట్లు లోయ విడిచి వెళ్లిపోయారు. గత పాలకుల పుణ్యమా అని సొంత దేశంలోనే శరణార్థుల్లా బతుకుతూ దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. కాశ్మీర్‌కు తిరిగి వచ్చేందుకు వారికి మోదీ ప్రభుత్వం భారీ నజరానాతోపాటు రక్షణకు కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం చారిత్రాత్మకం. అయితే కాశ్మీరీ పండిట్లను తిరిగి రానిచ్చేది లేదంటూ వేర్పాటువాదులు ఆందోళనలు ప్రారంభించడం, వారికి పొరుగు దేశాల ప్రభుత్వాలతోపాటు జమ్ముకాశ్మీర్‌కు చెందిన కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత వహించాలి.
- సి.సాయిమనస్విత, విజయవాడ