సంపాదకీయం

మారాకు తొడిగిన మైత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదకొండవ తేదీ వరకు నాలుగు ఆఫ్రికా దేశాలలో జరిపిన ఐదురోజుల పర్యటనకు విస్తరిస్తున్న ఉగ్రవాదం ప్రధాన నేపథ్యం. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాలలో నిరంతరం దాడులు జరుపుతున్న ఐఎస్‌ఐఎస్, బోకోహరామ్, లష్కర్ ఏ తయ్యబా, హక్కానీ, జమాత్ ఉద్‌దావా, హిజ్‌బుల్ ముజాహిద్దీన్ వంటి జిహాదీ బీభత్స సంస్థలను ప్రతిఘటించడానికి జరుపవలసిన సమష్టి కృషి గురించి నాలుగు దేశాలలో ధ్యాసను పెంచడం నరేంద్ర మోదీ పర్యటన ప్రధాన ఇతివృత్తం. మొజాంబిక్, దక్షిణ ఆఫ్రికా, టాంజానియా, కేన్యా దేశాలలో మన ప్రధాని తన ప్రసంగాల ద్వారా ప్రభుత్వ అధినేతలతో చర్చల ద్వారా బీభత్స వ్యతిరేక అంతర్జాతీయ సంఘటన ఆవశ్యకత గురించి మరోసారి ప్రపంచ దేశాలకు గుర్తు చేయగలిగారు. పైకి జిహాదీ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్టు అభినయిస్తున్నప్పటికీ, సౌదీ అరేబియా జిహాదీ హంతకులకు అవసరమైన సైద్ధాంతిక స్ఫూర్తికి దశాబ్దులుగా ఆలవాలమైంది. పాకిస్తాన్ జిహాదీలకు ఆయుధ సంపత్తిని సమకూర్చుతుండగా, సౌదీ అరేబియాలోని సంపన్నులు అంతర్జాతీయ జిహాద్‌కు వందల వేల కోట్ల రూపాయల నిధులను సమకూర్చుతుండడం జగమెరిగిన రహస్యం. చైనా ప్రభుత్వం తన విస్తృత వాణిజ్య ప్రయోజన పరిరక్షణలో భాగంగా ఆఫ్రికాలోని, ఆసియాలోని జిహాదీ సమర్థక ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. సూడాన్‌లో ప్రభుత్వ ప్రేరిత జిహాదీ బీభత్స కృత్యాలకు పదిహేనేళ్ల పాటు చైనాప్రభుత్వం మద్దతునివ్వడం చరిత్ర...అమెరికా, చైనాల మధ్య సూడాన్‌లో జరిగిన ఆధిపత్య సమరం 2011లో సూడాన్ విభజనకు దారితీసింది. అంతకు పూర్వం సూడాన్ ఇస్లాం మతోన్మాద ప్రభుత్వం దశాబ్దుల తరబడి దాదాపు ఇరవై లక్షల ఇస్లామేతరులను ఊచకోత కోసింది. ఇస్లాం అధిక సంఖ్యాకమైన ఉత్తర సూడాన్, సంప్రదాయిక వన మతాలు, క్రైస్తవం అధికంగా ఉన్న దక్షిణ సూడాన్ ఏర్పడిన తరువాత కూడ మతోన్మాద జ్వాలలు చల్లారలేదు. ప్రస్తుతం తరతరాల సంప్రదాయ వనమతాల వారిని మట్టుపెట్టడానికి దక్షిణ సూడాన్ ప్రభుత్వమే హత్యాకాండను కొనసాగిస్తోంది. నరేంద్ర మోదీ ఆఫ్రికాలో పర్యటిస్తున్న సమయంలోనే దక్షిణ సూడాన్‌లో మరోసారి మతోన్మాద బీభత్స జ్వాలలు చెలరేగాయి. దక్షిణ సూడాన్‌కు ఆగ్నేయంగా కేన్యా దేశం నెలకొని ఉంది. మిగిలిన మూడు దేశాలు కేన్యాకు దక్షిణంగా విస్తరించి ఉన్న ఇరుగుపొరుగు దేశాలు. దక్షిణ అమెరికా, మొజాంబిక్, టాంజానియా, కేన్యా దేశాలు ఆఫ్రికా తూర్పు భాగాన హిందూ మహాసాగరం తీరం పొడవునా దక్షిణం నుండి ఉత్తరంగా విస్తరించి ఉన్నాయి. హిందూ మహాసముద్రంలోని అపురూప సంపదను అనే్వషించే నెపంతో చైనా ఈ సముద్ర ప్రాంతమంతటా తన నౌకాదళం ఉనికిని పెంచుతోంది.
నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఈ నాలుగు దేశాలలోను మనకు సముద్ర తీర సహకార, రక్షణ సహకార అంగీకారాలు కుదరడానికి ఈ చైనా ఉనికి నేపథ్యం. ఇలా ఒప్పందాలు కుదరడం మన ప్రభుత్వం చైనాపై సాధించగలిగిన వ్యూహాత్మక విజయం. దశాబ్దుల తరబడి మన ప్రభుత్వాలు ఆఫ్రికాను పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా చైనా ప్రభుత్వం, చైనా వాణిజ్య సంస్థలు ఆఫ్రికా అంతటా విస్తరించిపోయాయి. సూడాన్ వంటి దేశాలలో చైనా సంస్థలు లక్షలాది ఎకరాల క్షేత్రాలలో హరిత ఇంధనం పంటలను పండిస్తున్నాయి. వాణిజ్య వ్యవసాయాన్ని పరిశ్రమలను నెలకొల్పాయి. ‘బ్రిక్స్’, ‘బేసిక్’ వంటి కూటములలో దక్షిణాఫ్రికా దేశంతోపాటు మనదేశం కూడా ఉన్నప్పటికీ చైనాకు కూడ వీటిలో సభ్యత్వం ఉన్నది. అందువల్ల చైనా ఆధిపత్యం వాణిజ్య విస్తరణముందు మన దేశం సంబంధాలు వెలవెల పోయి ఉండడం నిరాకరించజాలని నిజం. సోమాలియా తీరం కేంద్రంగా విస్తరించిన ఓడదొంగల స్థావరాలు హిందూ మహాసముద్రంలోను, అరేబియాలోను చైనా మరింతగా ఉనికిని పెంచడానికి దోహదం చేశాయి. ఓడదొంగలను బోకోహరాం, లష్కర్, ఐఎస్‌ఐఎస్, తాలిబన్, అల్‌ఖైదా, జిహాదీలను అనుసంధానం చేయడం ద్వారా పాకిస్తానీ ఐఎస్‌ఐ ఇటు మనదేశానికి అటు ఆఫ్రికా దేశాలకు బీభత్సకాండను విస్తరింపజేసింది. నరేంద్ర మోదీ పర్యటించిన నాలుగు దేశాలకు జిహాదీ ఉగ్రవాదం నిరంతరం పొంచి ఉంది. ఎందుకంటె ఈ నాలుగు దేశాలలో అనాది సంప్రదాయ వనమతాలకు చెందిన ప్రజలు పదిశాతం నుంచి నలబయి శాతం వరకు ఉన్నారు. టాంజానియాలో అత్యధికంగా నలబయిశాతం ప్రజలు వనవాసీ మతాలకు చెందినవారే. వీరిని క్రైస్తవులుగా మార్చడానికి మిషనరీలు, ఇస్లాంలోకి మార్చడానికి జిహాదీలు శతాబ్దులుగా యత్నించడం చరిత్ర. బొకోహరామ్ వంటి జిహాదీలు ప్రస్తుతం క్రైస్తవులను, వనమతాలవారిని సామూహికంగా హత్య చేస్తుండడం వర్తమానం. మనదేశంతోపాటు ఈ నాలుగు దేశాలు జిహాదీ ఉగ్రవాద ప్రమాదానికి గురవుతున్న సంగతిని నరేంద్ర మోదీ అందువల్లనే తన పర్యటన సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు.
నాలుగు దేశాలలోను అనేక వాణిజ్యపు ఒప్పందాలను కుదుర్చుకొనడం ద్వారా భారతీయ సంస్థలు ఆఫ్రికాలో వాణిజ్య పారిశ్రామిక ఉనికిని విస్తరింపచేయగలిగాయి. ఆఫ్రికా ఖండపు దేశాలతో అంటీముట్టనట్టు ఉండే మన విధానం 2014, మే 26 తరువాత మారిపోయిందనడానికి నరేంద్ర మోదీ పర్యటన మరో ఉదాహరణ. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన భారత- ఆఫ్రికా మండలి ప్రభుత్వాధినేతల సమావేశానికి దాదా పు నలబయి మంది ఆఫ్రికా దేశాల అధినేతలు హాజరయ్యారు. చైనాకు దీటుగా ఆఫ్రికా దేశాలతో మనదేశం స్నేహ సంబంధాలను మెరు గు పరచుకొనడం మనలాగ, ఆఫ్రికాకు కూడ ప్రయోజనకరం. ఈ వాస్తవాన్ని ఆఫ్రికా దేశాల వారు సైతం గుర్తిస్తుండడం కూడ మనకు లభించిన వ్యూహాత్మక విజయం. చైనా ప్రభుత్వం ఆఫ్రికాలో సాగిస్తున వాణిజ్య బీభత్సం గురించి కూడ ఆఫ్రికా దేశాల్లో ధ్యాస పెరుగుతోంది. ఆఫ్రికాలోని ఆనేక దేశాలలో ఏనుగులను చంపి దంతాలను తమ దేశానికి తరలించుకొని వచ్చే అక్రమ వ్యాపారాన్ని చైనా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆఫ్రికా దేశాల వారు గ్రహిస్తున్నారు. 2014, నవంబర్‌లో టాంజానియాకు వెళ్లిన చైనా అధ్యక్షుడు ఝీ జింగ్ పింగ్ తాను ప్రయాణించిన విమానంలోను వెంట వచ్చిన విమానం లోను భారీగా ఏనుగు దంతాలను రహస్యంగా తరలించుకొని వెళ్లినట్టు ప్రచారమైంది. అప్పటికి ఐదేళ్లలో చైనీయ ముఠాలు అధికారులు కుమ్మక్కయి టాంజానియాలోని మొత్తం ఏనుగులలో సగాన్ని చంపేసినట్టు కూడ ప్రచారమైంది. ఏనుగుల పరిరక్షణకు ఆయా దేశాల ప్రభుత్వాలు దీక్షను ప్రకటించాయి కూడ. ఇలా చైనా పట్ల ఆఫ్రికా దేశాలలో పెరుగుతున్న వైముఖ్యం నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యం.
మన ప్రధాని ఆఫ్రికా పర్యటన చైనాకు నచ్చకపోవడం అందువల్ల సహజం. చైనా పత్రికలు పరోక్షంగా ఈ పర్యటనను విమర్శించడం మరింత సహజం. గత మేనెలలో ఢిల్లీలో జరిగిన ‘ఆఫ్రికా దినోత్సవం’ ఆఫ్రికా ప్రజలతో మన ప్రజల సంబంధాలను మెరుగు పరచడానికి దోహదం చేసింది. మోదీ పర్యటించిన నాలుగు దేశాలలోను భారతీయ సంతతి వారు, ప్రవాస భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ప్రవాస భారతీయుల సమావేశాలలో ప్రసంగించడం ద్వారా నరేంద్ర మోదీ ఈ ద్వైపాక్షిక స్ఫూర్తిని మరింతగా పెంచారు. ఈ స్ఫూర్తి మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో సంఘర్షణ సాగించిన నాటిది...