సంపాదకీయం

జీవన చికిత్స...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన వైద్యులలో అధిక శాతానికి వైద్య వృత్తిని సాగించే అర్హతలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించడం ఆశ్చర్యకరం కాదు. నకిలీ వైద్యుల గుట్టు నిరంతరం రట్టు అవుతూనే ఉంది. ఈ రట్టవుతున్న వాస్తవాలను ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది. ఈ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం దేశంలో అల్లోపతి డాక్టర్లుగా సేవ చేస్తున్నవారిలో ముప్పయి ఒక్కశాతం కేవలం పాఠశాల విద్యను పూర్తిచేసి ఉన్నారట. ఎస్‌ఎస్‌సి లేదా పదవ, పదకొండవ తరగతి వరకు చదివినవారు అల్లోపతి డాక్టర్లుగా సేవ చేయడానికి వీలైన వ్యవస్థ దేశంలో నెలకొంది. ఇలాంటి అల్లోపతి డాక్టర్లలో యాబయి ఏడు శాతానికి ఎలాంటి వైద్య అర్హతలు లేవనికూడ ప్రపంచ ఆరోగ్య సంస్థ పసికట్టిందట. గ్రామీణ క్షేత్రాలలో మందులిచ్చి మందికి మేలు చేస్తున్న ఈ ఇంగ్లీషు వైద్యులలో నూటికి పంతొమ్మిది మంది మాత్రమే వైద్యులుగా పనిచేయడానికి అర్హులట. మిగిలిన ఎనబయి ఒక్కశాతం ఇంగ్లీషు వైద్యులు ఏళ్లతరబడి మందులిచ్చి మేలు చేస్తుండడం బ్రిటన్ వారి పాలనలో అనుసరించిన వైపరీత్యం. ఈ వైపరీత్యం ఇప్పుడు వేళ్లు దిగిన మహా విషవృక్షం. అర్హత లేని వారికి సర్ట్ఫికెట్ ను జారీ చేసే విధానం బ్రిటన్ దురాక్రమణ దారుల కాలంలోనే మననెత్తికెక్కింది. అల్లోపతి పేరుతో మొదలైన ఇంగ్లీషు వైద్యం ముందు నిరపాయకరమైన సంప్రదాయ వైద్యం వెలవెలబోయిన భ్రాంతి ఏర్పడింది. నకిలీ వైద్యులు, కల్తీ మందులు విస్తరించడానికి కారణం వైద్య సేవ స్థాయి నుండి వాణిజ్యం స్థాయికి ఎదిగిపోవడం. నకిలీల వ్యాప్తికి ఇదీ మూలం. ప్రస్తుతం దేశంలోని మొత్తం ఆరోగ్య కార్యకర్తలలో అర్హతలున్నవారు ఇరవై నాలుగు శాతం మాత్రమేనట. అల్లోపతి డాక్టర్లలో నలబయి మూడు శాతానికి మాత్రమే వైద్యవృత్తి చేయడానికి ఏదో ఒక అర్హత ఉన్నదని నిర్ధారణ. ఆయుర్వేద వైద్యులలో అరవైశాతం ఏదో ఒక అర్హతను కలిగి వున్నారట. హోమియోపతి, యునాని వైద్యులలో కూడ సరైన అర్హతలు లేనివారు అత్యధికులన్నది ఆరోగ్యసంస్థ నిర్ధారణ. చైనాతో పోల్చినప్పుడు మనదేశంలో సగటున జనాభాలో వైద్యుల నిష్పత్తి తక్కువ అన్నది ఆరోగ్య సంస్థవారి నిర్ధారణ. అర్హత లేనివారు వైద్యులుగా చెలామణి కావడం ఆందోళనకరం. కానీ జనాభా నిష్పత్తిలో వైద్యుల సంఖ్య తక్కువగా ఉండడం కూడ ఆరోగ్యసంస్థ వారికి ఆందోళనకరం కావడమే ఆశ్చర్యకరం. వైద్యుల సంఖ్య నిష్పత్తి తక్కువగా ఉండడం నిజానికి ఆరోగ్యవంతమైన తరతరాల భారతీయ జీవన విధానం ప్రధానమైన కారణం. మన తిండిలోను, ప్రవర్తనలోను, అలవాట్లలోను, జీవన విధానంలోను, వైద్యం నిహితమై ఉంది. ఇవన్నీ కల్తీ కావడం రోగం రావడానికి వౌలిక కారణం. బ్రిటన్ వారి దురాక్రమణ ఈ కల్తీకి కారణం.
ఇలా మనదేశంలో వైద్యులుగా చెలామణి అవుతున్న వారిలో అధికశాతం అర్హత లేని వారని ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యుహెచ్‌ఒ- నిర్ధారించినట్టు ప్రచారవౌతోంది. ఈ నిర్ధారణ జనమెరిగిన రహస్యానికి మరో నిర్ధారణ మాత్రమే. నకిలీ మందులు, నకిలీ వైద్యులు మనలకు దాపురించిన తరువాత దశాబ్దులు గడిచిపోవడం జనమెరిగిన రహస్యం. అసలు సిసలు వైద్యులు, అర్హత ఉన్న పేరుమోసిన వైద్యులలో సైతం అనేకమంది నకిలీ వైద్య విధానాలను అవలంబిస్తుండడం వ్యాధిగ్రస్తులకు నిత్యం ఎదురవుతున్న చేదైన నిజం. ఈ నకిలీ వైద్య విధానాలు ప్రాణం పోసే వైద్యులు, దోచుకునే అధమ వాణిజ్యవేత్తలుగా మారిన రీతికి నిదర్శనాలు. వాణిజ్య వైద్యం ప్రపంచీకరణలో ప్రధానమైన అంశం. నకిలీ మందులు వికటించి భయంకర వైపరీత్యాలు సృష్టిస్తున్న దృశ్యాలు దేశమంతటా ప్రతిరోజు ఆవిష్కృతమవుతున్నాయి. నకిలీ వైద్య ఉపకరణాల వల్ల వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూనే ఉన్నాయి. వీధుల పక్కన దుకాణాలు తెరిచిన వైద్యుల చికిత్సాశాలలో సరిగా కడుగని సిరంజీలతో ఇంజెక్షన్లు ఇచ్చేయడం పరిపాటి అయిపోయింది. వాడిపారేసే సిరంజీలు పనిముట్లుగా వచ్చిన తరువాత ఈ చికిత్సాశాలల్లో నీటిని వేడిచేసే వ్యవస్థ కూడ మూడపడింది. వాడిపారేసే ఉపకరణాలలో సైతం దగా జరుగుతోంది. ఒకే సూది-నీడిల్- వాడి అనేక మందికి మందులను ఎక్కించిన-ఇంజెక్షన్- నర్సులు, డాక్టర్లు ఇతర అభినయవేత్తల బండారం ఎక్కడో ఒకచోట బద్దలవుతూనే ఉంది. అవసరంలేని పరీక్షలు, అవసరంలేని శస్తచ్రికిత్సలు, అవసరంలేని మోతాదులలో మందులు వ్యాధిగ్రస్తులకు ఎదురవుతున్న నిరంతరమైన అనుభవాలు..
విద్య, వైద్య రంగాలు వాణిజ్యవంతం-కార్పొరేటైజేషన్- కావడం ప్రపంచీకరణ వల్ల సంభవించిన విపరిణామం. నకిలీ వైద్యులతో పాటు నకిలీ రోగులు కూడ నర్తిస్తుండడం నిరాకరించలేని నిజం. కార్పొరేట్ వైద్యశాలల వారు వెయ్యి ఖర్చయ్యేచోట లక్ష రూపాయల ఖర్చును సృష్టిస్తున్నారు. ప్రభుత్వ సహాయం పొందడానికి అర్హులు అయిన వ్యాధిగ్రస్తులు దీన్ని గురించి పట్టించుకోవడం లేదు. ఖర్చు ఎంతయితేనేమి? మన సొమ్ము కాదు. ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది..’’ అన్నది ధీమా. పెద్ద నగరాలలోకి కార్పొరేట్ వైద్యశాలల ఏజెంట్లు చిన్న పట్టణాలలోను గ్రామాలలోను ప్రచారం చేసి వ్యాధిగ్రస్తులను తరలించుకొని వస్తున్నారు. ఖర్చులను ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. కాటరాక్ట్ వంటి వైపరీత్యాలకు జిల్లా కేంద్రాలలోను, చిన్న పట్టణాలలోను కూడ శస్త్ర చికిత్స చేయవచ్చు. కాని కాటరాక్ట్ వ్యాధిగ్రస్తులను హైదరాబాద్‌కు, బెంగలూరుకు, మదరాసుకు, ముంబయికి తరలించుకొని పోయి చికిత్స పేరుతో లక్షలాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని బొక్కుతున్న కార్పొరేట్ వైద్యశాలలు దళారీలు ప్రబలడం కల్తీకి కారణం. ఈ కల్తీ అవినీతి. అర్హత లేని వారు వైద్యులుగా చెలామణి కావడం కంటె అర్హత ఉన్న స్పెషలిస్టులు సూపర్ స్పెషాలిటీస్ వైద్యశాలలో ఇలా వైద్యాన్ని అవినీతితో కల్తీ చేస్తుండడం మనదేశంలో ప్రధాన సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు పెద్దగా పట్టించుకోని సమస్య ఇది. ఈ కల్తీకి కారణం అర్హత ఉన్నవారిని నైతికత లేకపోవడం. నైతిక జీవనం గడపాలన్న నిష్ఠలేని మహావైద్యులను సృష్టిస్తున్న విద్యావిధానం. ప్రతి చిన్న వ్యాధిని నయం చేయడానికి కూడ విస్తృత పరీక్షలు..శస్త్ర చికిత్సలు. ఈ శస్త్ర చికిత్సలలో మూడింట రెండవ వంతు అనవసరమైనవన్న పరిశోధన నిర్ధారణలు కూడ జరిగాయి.
మన జీవనవిధానం మన ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధుల నివారణకు, వ్యాధులు సంక్రమించడానికి ప్రధాన కారణం. ఈ సంగతిని ప్రధానమంత్రి వంటి రాజకీయ ప్రముఖులు, ధర్మాచార్యులు, సామాజిక శాస్తవ్త్రేలు, ఇంకా ఎందరో కూడ నిర్ధారించి ఉన్నారు. తిండి, నిద్ర వంటివి జీవన విధానంలో భాగం. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం భారతీయ జీవన విధానంలోని వౌలికమైన అంశం. యువకులు విద్యార్థులు ఆరోగ్యవంతులు తెల్లవారు జామున నాలుగు గంటలకు నిద్ర లేవాలి. ఇలా నిద్ర లేవాలన్న జీవన విధానం నేడు తొంబయి శాతం మందికి తెలీదు. మన సమష్టి ఆరోగ్యం దెబ్బతినడానికి ఇదీ ప్రధాన కారణం. విలాసవంతమైన ఆహారపు అలవాట్ల పేరుతో మన పొట్టలలోకి, రక్తంలోకి అనవసరమైన పదార్ధాలను చేరవేస్తున్నాము. ఇలాంటి కొవ్వు భారతీయ జీవన పద్ధతికి దీర్ఘకాల వ్యాధి..దీన్ని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించలేదు...అసలు చికిత్స ఈ వ్యాధికి జరగాలి.