ఉత్తరాయణం

తాగునీరివ్వండి చాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగేళ్లలో విశాఖను స్మార్ట్ సిటీగా మార్చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. స్మార్ట్ సిటీ సంగతి దేవుడెరుగు ముందు తగినంత రక్షిత మంచినీరు సరఫరాచేస్తే చాలునని విశాఖనగర వాసులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రస్తుతం రోజుకు 40 ని.లు మాత్రమే అదీ ఒక నిర్ణీతమైన టైము అనేది లేకుండా నీరు సరఫరా చేస్తున్నారు. ఇక ఏడేళ్ల క్రితం జి.వి.యం.సి. అట్టహాసంగా ప్రారంభించిన సెంట్రల్ సిటీ, గోల్డ్‌సిటీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి. విపరీతమైన జాప్యంవలన కార్పొరేషన్‌పై 80 కోట్ల భారం పడనున్నదని, అందుకు ప్రభుత్వం సంసిద్ధంగా లేదన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజల అవసరాలను ఆధారం చేసుకొని ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు రేట్లు విపరీతంగా పెంచేసాయి. ఉచిత సరఫరాచేసే జి.వి.యం.సి. ట్యాంకర్ల జాడే లేదు!
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
బీదలకే రిజర్వేషన్లు ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కులాలే గాదు, రాజకీయవేత్తలు కూడ తమ కులానికి, లేదా మతానికి రిజర్వేషన్లు కావాలని కోరటం సర్వసాధారణమైంది. ధనిక కులాలు, మతాలు రిజర్వేషన్లు కోరుతుండటం విచారకరము. కులమేదైనా, మతమేదైనా బీద కుటుంబాలను పట్టించుకునే అధికారులు గాని, రాజకీయ వేత్తలు గాని ముందుకు రావాలి. కులాన్ని, మతాన్ని ప్రక్కనపెట్టి కేవలం ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలను గుర్తించి, అలాంటి వారికే రిజర్వేషన్లు కల్పించే ఏర్పాటుచేయటం న్యాయ సమ్మతము. అది కూడా ఒక్క మారు మాత్రమే రిజర్వేషన్ కల్పించాలి. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని రిజర్వేషన్ సౌకర్యం నుండి తీసివేయాలి. అదే న్యాయ సమ్మతము.
- జి.శ్రీనివాసులు, అనంతపురం
‘శ్రీమంతులు’ ముందుకు రావాలి
ప్రజల ఆలోచనలు చిత్రంగా ఉంటాయి. పన్నులు పెంచకూడదు. అన్నీ చవకగా దొరకాలి. జీతాలు పెంచాలి. సౌకర్యాలన్నీ ప్రభుత్వమే సమకూర్చాలి- అని మన ఆలోచన. కాని అరకొర ఆర్థిక పరిస్థితిలో ప్రభుత్వాలు కనీస సౌకర్యాలే సమకూర్చలేకపోతున్నాయి. ఈ సందర్భంలోనే దత్తత అనే ఐడియా పుట్టింది. డబ్బున్నవాళ్లు స్వగ్రామంలోనో, తాము పెరిగిన గ్రామంలోనో తమ సొంత ఖర్చుతో సౌకర్యాలు కల్పించడాన్ని తప్పుపట్టనక్కరలేదు. గ్రామాన్ని వారికి ధారపోసినట్టు కాదు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. దత్తత తీసుకున్న వారికి ఎలాంటి అధికారమూ ఉండదు. దత్తత అనే మాట వాడకపోయినా బిల్‌గేట్స్ లాంటి కోటీశ్వర్లు తమ సంపదను ప్రజలకోసం విరాళంగా ఇస్తున్నారు. సంపన్నులు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలన్నది ప్రపంచవ్యాప్త సూత్రమే.
- చైతన్య, వాకలపూడి
ఇదే నిజమయితే!
‘సుపరిపాలన శూన్యమేనా’ అడుసుమిల్లి జయప్రకాష్‌గారు రాసిన దాట్లో (2.11.15) ఒక మాట ఆకట్టుకుని భయం, ఆశ్చర్యం కలుగజేసాయి. పార్టీ ఫండ్స్‌ను పెద్ద మొత్తాలలో ఇచ్చిన వ్యాపారులు అందరూ- ఖర్చుచేసిన సొమ్మును తిరిగి రాబట్టుకోవడంకోసం నిత్యావసర సరుకుల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తున్నారన్నారు. ఇదే కనుక అక్షరాలా నిజమయితే, ఇంతకన్నా పచ్చిమోసం, దగా, కుట్ర మరొకటి ఉండదు. ఓట్ల బిక్ష యాచించి పదవిలో కొచ్చినవారు ప్రజలు సుభిక్షంగా ఉండేటట్టు సుపరిపాలన చేయకపోతే మరుసటి ఎన్నికలలో వారు క్షోభపడవలస వస్తుందనే వాస్తవాన్ని తెలుసుకోవాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఉక్కుపాదమెప్పుడు?
న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేత, ముంబయి బాంబు పేలుళ్ళు, రష్యా విమానం పేల్చివేత, పారిస్‌లో మారణ హోమం- ఇన్ని ఉగ్రవాద ఉపద్రవాలు జరిగిన తరువాత- ఇంకా ఇలాంటి ఘాతుకాలకు అవకాశమున్నదని తెలిసిన తరువాత, జి-20 మొదలైన సదస్సులలో తీవ్రంగా ఖండిస్తేనూ- ఉగ్రవాదం ఊపిరి ఆగిపోదు సరికదా ఉధృతమవవచ్చు. ఉక్కుపాదాల వాదనలు వట్టి ప్రగల్భాలని తేలిపోయింది. ఇంత దారుణ మారణ హోమానికి ఆజ్యంపోసేవారు కొందరు స్వదేశీయులే అవడం విషాదం. ప్రపంచ దేశాలకో కామన్ క్రిమినల్ కోడ్‌ను తయారుచేసి, ఉగ్రవాదుల ఉనికి ఎక్కడున్నా నిర్ధాక్షిణ్యంగా తుద ముట్టించే ప్రయత్నాలు చేయాలి. ఒక దేశానికి నష్టం కలిగించి మరో దేశంలోనున్నా వారిని ఉపేక్షించకూడదు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
అదీ మన రాజ్యాంగం
ఘోర నేరాలకు పాల్పడే కీచకులకు హెచ్చరికగా ఉరిశిక్షలు వేగవంతం చేయాలని, పశుప్రాయుల్ని వెలివేసి వారి తరఫున లాయర్లు వాదించరాదని ఒకరు రాశారు. ఉరితీయడం సరే కాని చట్టప్రకారం వెలివేయడం నేరం. రాజ్యాంగం ప్రకారం నిందితుని తరఫున వాదన వినకుండా తీర్పుచెప్పడం సాధ్యంకాదు. నిందితునికి లాయర్ని నియమించుకునే స్తోమత లేకుంటే ప్రభుత్వమే అతనికి లాయర్‌ని సమకూర్చాలి. హిందూ లాయర్ కొంతకాలం వాదించాక కసబ్ నాకీ లాయర్ వద్దు ముస్లిం లాయర్‌ని ఇవ్వండి అన్నాడు. ప్రభుత్వం ఇచ్చింది. జైలులో వాడు కోరిన సదుపాయాలన్నీ సమకూర్చారు. అదీ మన రాజ్యాంగం!!
- శాంతి చంద్రిక, సామర్లకోట