సంపాదకీయం

నిర్దోషులకా శిక్ష?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గందరగోళం మధ్య నిజాయతీ కూడ ప్రస్ఫుటిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వైద్య విధాన పరీక్ష -ఎమ్‌సెట్-2-కు హాజరైన వేలమంది విద్యార్థినీ విద్యార్థులలో అత్యధికులు కష్టపడి చదివి నిజాయతీగా పరీక్షలు వ్రాశారన్నది ఇప్పుడిలా ధ్రువపడింది. ఈ పరీక్షను రద్దుచేయరాదని రాష్టవ్య్రాప్తంగా పరీక్ష వ్రాసినవారు వారి తల్లిదండ్రులు ఆందోళన చేయడం ఇందుకు ప్రత్యక్ష ప్రమాణం. నైతిక నిష్ఠ నీరు కారిపోయిన వందలమంది తల్లిదండ్రులు చేసిన పాపానికి వేలమంది నైతిక నిష్ఠగల వారిని శిక్షించడం మరో మహాపాపం కాగలదు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ ప్రవేశ పరీక్షను రద్దు చేసినట్టు శుక్రవారం రాత్రి ప్రచారమైంది. రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం రద్దు చేసుకోవడం విజ్ఞత కాగలదు. ఎమ్‌సెట్-2 ప్రశ్న పత్రాలు పరీక్ష కంటె ముందు గానే కొంతమందికి వెల్లడి కావడానికి ప్రధాన కారణం నిర్వాహక వ్యవస్థలోని అవినీతి. షేక్ రమేశ్ లేదా షేక్ రహీమ్ అనే వాడు కావచ్చు, రాజగోపాలరెడ్డి అనేవాడు కావచ్చు, మరి కొందరితో కలిసి ముఠాగా ఏర్పడినట్టు పోలీసు శాఖ నేరపరిశోధక విభాగం-సిఐడి-వారు ఇప్పుడు కనిపెట్టారు. ఈ దళారీలు లక్షలాది రూపాయలను విద్యార్థుల తల్లిదండ్రులవద్ద వసూలు చేశారట. రహీమ్ అనేవాడు దాదాపు కోటి డెబ్బయి లక్షల రూపాయలు దండుకున్నట్టు సిఐడి అధికారులు కనుగొన్నారట. ఇందులో కోటి ఇరవై లక్షలు మరో ప్రధాన దళారీకి ఇచ్చాడట. రహీమ్ వద్ద స్వాధీనం చేసుకున్న ముప్పై ఐదు లక్షలు, మరొకడి ఖాతాలో పడిన పదిహేను లక్షలు ఇలా మొత్తం వెల్లడైన అక్రమ ధనం విలువ రెండు కోట్ల రూపాయలలోపే. దాదాపు యాబయికోట్ల రూపాయలు చేతులు మారినాయన్న ప్రచారానికి శుక్రవారం సిఐడి కనిపెట్టినట్టు పోలీసులు వెల్లడించిన దానికి పొంతన కుదరడంలేదు. పధ్నాలుగు మంది విద్యార్థులకు అక్రమంగా లాభం చేకూర్చడానికి షేక్ రహీమ్ లేదా షేక్ రమేశ్ ముఠా యత్నించినట్టు స్పష్టమైంది. అందువల్ల ఈ పదునాలుగు మంది ఎవరో నిర్ధారించి వారి పరీక్షను రద్దు చేయడం న్యాయం. ఈ పదునాలుగు మంది పరీక్షార్థుల తల్లిదండ్రులు నిజమైన దోషులు. ఆ దోషులను శిక్షించాలి. షేక్ రహీమ్ తదితరులను శిక్షించే కార్యక్రమం కొనసాగాలి. కానీ ప్రశ్న పత్రాలు పరీక్షకు ముందుగానే కొంతమందికి అందజేసిన వారు ప్రభుత్వ యంత్రాంగంలోని వారు. పరీక్షను నిర్వహించిన విశ్వవిద్యాలయాలలోని వారెవ్వరో మాత్రం ఇప్పటికీ వెల్లడి కాలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో, విశ్వవిద్యాలయ గదుల్లో, పరీక్షా కేంద్రాలలోని ఉక్కు డబ్బాలలో ఈ ప్రశ్న పత్రాలు నిక్షిప్తమై ఉంటాయి. పరీక్ష సమయానికి మాత్రమే అవి బయటకు వచ్చి ఉండాలి. ఈ రక్షణ వ్యవస్థను బద్దలు కొట్టి ప్రశ్న పత్రాలను బయటికి చేరవేసిన వారు లోపలివారు మాత్రమే. వారు ఎవరో కనిపెట్టడం రోగాన్ని నిర్మూలించడానికి శాశ్వతమైన చికిత్స. లోపలివారు సహకరించకుండా ఈ దళారీలు ప్రశ్న పత్రాలను ఎలా సంపాదించి ఉంటారు? దళారీలు దొంగలు కాదు..కన్నాలు వేసి ప్రశ్న పత్రాలను ఎత్తుకొని పోలేదు. అందువల్ల వేలాది విద్యార్థులకు ద్రోహం చేసి అతికొద్ది మందికి లాభం చేకూర్చడానికి పాలుపడిన లోపలి వారు ఎవరు?
బయటి దళారీలు, దళారీలకు దళారీలు ముఠాగా ఏర్పడి విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద వసూలు చేసిన సొమ్ములో ఈ లోపలి వారికి తప్పకుండా భాగం లభించి ఉంటుంది. ఆ లోపలివారు ఎవరన్నది సిఐడి వారు పసికట్టిన దాఖలా లేదు. యాబయి వేలకు పైగా విద్యార్థినీ విద్యార్థులు వైద్య ప్రవేశ పరీక్ష వ్రాశారు. కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా అక్రమంగా లాభం పొందినవారు పదునాలుగు మంది మాత్రమేనని ఇప్పటివరకు పరిశోధకులు తేల్చారు. ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు పరీక్షకంటె ముందుగానే ప్రశ్న పత్రాలు అందినట్టు తదుపరి దర్యాప్తులో బయటపడుతుందో ఏమో? ఏమయినప్పటికీ ఈ అక్రమం జరిగింది కాబట్టి మొత్తం పరీక్షను రద్దు చేస్తామనడం వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమే. సుప్రీంకోర్టు దేశమంతటా ఒకే జాతీయ అర్హతా ప్రవేశ పరీక్ష-నీట్-ద్వారా వైద్యకళాశాలల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పు ఫలితంగా తలెత్తిన గందరగోళం నేపథ్యంలో ఈ రెండవ ఎమ్‌సెట్‌ను నిర్వహించారు. ఫలితంగా విద్యాసంవత్సరం కొన్ని నెలలు ఇప్పటికే నష్టమైపోయాయి. ఇప్పుడీ ప్రశ్న పత్రం బహిర్గతం ప్రాతిపదికగా దీన్ని రద్దుచేసినట్టయితే మరి కొన్ని నెలల సమయం నష్టమైపోతుంది. మూడవసారి ప్రవేశ పరీక్షను నిర్వహించినట్టయితే ఆ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు మాత్రం ముందుగానే బయటపడవని హామీ ఏమిటి? అందువల్ల పిడికెడంత మంది నేరస్థులను శిక్షించే క్రమంలో నిజాయితీపరులైన ప్రతిభావంతులైన అహరహరం శ్రమించి పరీక్షను వ్రాసిన వేలాదిమంది బాలబాలికలను శిక్షించడం ఘోరమైన తప్పిదం కాగలదు. పరీక్షను రద్దు చేయడం తగదు. సోమవారం ఈ విషయమై నిర్ణయించనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం హడావుడిగా మనసు మార్చుకొని పరీక్ష రద్దు చేయడం దురదృష్టకర పరిణామం..
‘‘అంగవ్రాతమునందు చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు..’’ అన్నది న్యాయసూత్రం. వైద్య చికిత్సా ధర్మం. శరీరంలో వ్యాధి సంక్రమించినప్పుడు లేదా గా యం ఏర్పడినప్పుడు చెడిపోయిన భాగాలను తొలగించి మిగిలిన భాగాలను, శరీరాన్ని రక్షించడం వైద్యు ని ధర్మం. కానీ ఆరోగ్యవంతమైన మిగిలిన శరీర అవయవాలను తొలగించబూనడం వైపరీత్యం...ఘోరం. వైద్య పరీక్షలో అక్రమలాభం పొందినవారు కేవ లం వందల సంఖ్యలో ఉన్నట్టు అనధికార ప్రచారం. సిఐడి నిగ్గుతేల్చిన సంఖ్య పదునాలగు. వీరిని శిక్షించడంకోసం వేలమంది నిజాయతీ పరుల పరీక్షను పాడుపెట్టడం వారిని మళ్లీ పరీక్ష వ్రాయమని కోరడం సక్రమమైన చికిత్స కాదు, కాజాలదు. సెప్టెంబర్ చివరి నాటికి మూడవసారి జరిగే పరీక్ష ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు కూడ శుక్రవారం రాత్రి ప్రచారమైంది. అంటే మరో రెండు నెలలు ఈ విద్యాసంవత్సరంలో తుడిచిపెట్టుకొని పోతాయన్న మాట. వందమంది అపరాధులు శిక్షను తప్పించుకున్నప్పటికీ ఒక్క నిరపరాధికి శిక్షను విధించరాదన్నది న్యాయ సూత్రం. కానీ ఇప్పుడు వేలమంది నిరపరాధులను పరీక్ష రద్దు ద్వారా శిక్షించడం న్యాయానికే అన్యాయం. రద్దును విద్యార్థులు న్యాయస్థానంలో ప్రశ్నించే అవకాశం కూడ ఉంది. దానివల్ల మరింత జాప్యం కూడ జరుగవచ్చు...ఇదంతా ప్రతీక మాత్రమే. విద్యా వ్యవస్థ తీవ్రంగా వ్యాధిగ్రస్తం అయి ఉండటం అసలు సమస్య!
విద్యావంతులు వినయవంతులు కావాలన్నది సనాతన సత్సంప్రదాయం. ‘విద్య ఒసగును సవినయంబు..’. ఈ వినయం నైతిక నిష్ఠ! నైతిక నిష్ఠ లేని విద్య గూండా చేతిలోని కత్తివంటిది, గజదొంగ చేతిలోని తుపాకీ వంటిది. నైతిక నిష్ఠ లేని వారు కాపీ కొట్టించారు. డబ్బు తీసుకొని మార్కులు వేశారు. పరీక్షలు వ్రాయనివారికి ఉత్తీర్ణత పట్టాలను ప్రదానం చేశారు. వీరందరూ ఘరానా విద్యావంతులు. అందువల్లనే నైతికతను సౌశీల్యాన్ని స్వభావంగా కలిగిన విద్యావంతులను తయారుచేసే విద్యావిధానాన్ని పునరుద్ధరించడం సరైన చికిత్స. సౌశీల్యవంతుని విద్య సైనికుని చేతిలో కత్తి వంటిది. దేశమంతటా ఒకే సమాన వైద్య ప్రవేశ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు నిర్ధారించింది. విద్యార్థులకు నైతికత మప్పాలని ఎవరు నిర్ధారిస్తారు?