రచ్చ బండ

‘‘మల్ల(న్న)’’ యుద్ధం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రెండు ప్రధాన అంశాలతో భగభగమంటోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలో రెండేళ్ళ పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్విఘ్నంగా కొనసాగుతూ వచ్చింది. మూడవ ఏట అడుగు పెట్టినప్పటి నుంచి ఒకవైపు మల్లన్న సాగర్, రెండో వైపు ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజీతో ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, వివిధ సంఘాలు, విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈ సమస్యలతో ప్రభుత్వం బేజారెత్తుతోంది. ముఖ్యంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పెద్ద గుదిబండగా మారింది.
రెండేళ్ళ పాటు ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సమస్యలు, అవకాశాల కోసం ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్న విపక్షాల నేతలకు ‘మల్లన్న సాగర్’ బ్రహ్మాస్త్రంగా దొరికింది. ఇంకేముంది మల్లయుద్ధానికి దిగినంత పని చేశాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై విమర్శల దాడి చేసేందుకు ఎదురు చూస్తున్న అన్ని విపక్షాలకు, అసంతృప్తితో ఉన్న ప్రజాసంఘాలకు, సంస్థలకు, నాయకులకు మల్లన్న సాగర్‌తో పాటు అదనం (బోనస్)గా ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజీ దొరికింది. దీంతో మూకుమ్మడిగా లంఘించాయి. విపక్షాల నేతలు తొలుత మల్లన్న సాగర్‌ను భుజానికెత్తుకుని యుద్ధం ప్రారంభించారు. ఆందోళనలు, పోరాటాలు, బంద్‌లు, నిరసనలు, నిరాహార దీక్షలు, దిష్టిబొమ్మ దహనాలతో మల్లన్న సాగర్ నిర్మాణం చేపట్టనున్న మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం అట్టుడుకుతోంది. స్థానిక రైతులు జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తుండగా, విపక్షాలు ‘్ఛలో మల్లన్న సాగర్’ పేరిట యాత్రలు చేపడుతూనే ఉన్నారు. తాజాగా ఈ వారంలో సోమవారం బంద్‌కు అఖిలపక్షం పిలుపునివ్వగా, మంగళవారం ‘్ఛలో మల్లన్నసాగర్’కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇక బిజెపి మండలాల వారీగా ధర్నా కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. గాంధీ భవన్ నుంచి సుమారు 200 వాహనాల్లో మల్లన్న సాగర్‌కు వెళ్ళాలనుకున్న కాంగ్రెస్ నేతల వ్యూహం ఫలించలేదు. కాంగ్రెస్ నేతలు వ్యూహం లేకుండా గాంధీ భవన్‌కు చేరుకుని స్పెషల్ బస్సులో వెళ్ళాలనుకోగా, పోలీసులు మాటు వేసి అదుపులోకి తీసుకున్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించాలనుకున్న నాయకులు ఆలోచన లేకుండా ఒకే దగ్గరికి చేరుకుంటే పోలీసులు అరెస్టు చేయకుండా ఉంటారా? జిల్లాల వారీగా ఎక్కడికక్కడ గ్రూపులుగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే పోలీసులకు ముచ్చెమటలు పట్టేవి.
కానీ కాంగ్రెస్ నేతల వాదన అందుకు భిన్నంగా ఉంది. తాము మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రాంతాన్ని ముట్టడించేందుకో, ఆందోళనలు చేయడానికో కాదని, కేవలం బాధితులను పరామర్శించేందుకే వెళ్ళాలనుకున్నామని చెబుతున్నారు. ఏదైతేనేం ఆ రోజు ప్రయత్నం ఫలించలేదు. దీంతో మర్నాడు రాష్ట్ర డిజిపి ఆఫీసులో పోలీసు ఉన్నతాధికారిని పలువురు నేతలు కలిసి తాము నిజాయితీగా బాధితులనే కలిసేందుకు వెళ్ళాలనుకున్నామని, తమకు అనుమతి ఇవ్వాలని, అవసరమైతే రక్షణ కూడా కల్పించాలని కోరారు. అందుకు పోలీసులు సమ్మతించకపోవడంతో మూడో సారి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి, శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నాయకుడు మహ్మద్ షబ్బీర్ అలీ శుక్రవారం మల్లన్న సాగర్‌కు బయలుదేరగా మార్గమధ్యంలోనే పోలీసులు వారిని అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. క్యాబినెట్ ర్యాంక్ ఉన్న తమకు ప్రభుత్వం రక్షణ కల్పించకపోగా పోలీసులతో అరెస్టు చేయించిందని వారు మండిపడ్డారు. ఏదైతేనేం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు ‘మల్లన్న’ పని కల్పించినట్లయ్యింది.
ఇంకో వైపు మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద భూము లు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులను కలుపుకుని అన్ని పార్టీలూ పోరాటాలకు దిగుతున్నాయి. ఇదివరకే పలు దఫాలుగా పలువురు కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీల నేతలు మల్లన్న సాగర్ నిర్వాసితులను కలిసి వారికి మనోధైర్యం చెప్పారు. మల్లన్న సాగర్‌కు విపక్షాల నేతలు వచ్చి భూములు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్న రైతులను అనవసరంగా రెచ్చగొడుతున్నారని అధికారపక్షం నేతలు, రాష్ట్ర మంత్రి టి. హరీశ్ రావు ప్రభృతులు ఎదురు దాడి చేస్తున్నారు. అందుకే వారిని కట్టడి చేస్తున్నామని వారు చెబుతున్నారు.
టి.టి.డిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి 20 రోజుల క్రితం మల్లన్న సాగర్ ప్రతిపాదిత రిజర్వాయర్ వద్ద 48 గంటల పాటు దీక్ష నిర్వహించారు. బిజెపి రాష్ట్ర నాయకులు ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ రిజర్వాయర్ ప్రాంతాన్ని సందర్శించి, రైతులను పరామర్శించారు. కాంగ్రెస్సే కాదు బిజెపి నేతలనూ పోలీసులు అరెస్టు చేశారు. దీనిని నిరసిస్తూ బిజెపి నాయకులు మంగళవారం మండలాల వారీగా ధర్నాలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తన మామ, ముఖ్యమంత్రి కెసిఆర్ మెప్పు పొందడానికే ఈ రిజర్వాయర్ నిర్మించాలన్న ఆలోచన చేశారని మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ప్రభృతులు ఘాటైన విమర్శలు గుప్పిస్తున్నారు. భూములు ఇచ్చేందుకు రైతులు సానుకూలంగా ఉన్నట్లయితే విపక్షాల నేతలను రానీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని విపక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా విపక్షాలు రాజకీయ లబ్ది కోసమే ఆందోళనలు చేపట్టాయని మంత్రులు ఎదురు దాడి చేస్తున్నారు. భూసేకరణ కోసం రైతులతో పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాతే రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలనుకుంటే విపక్షాల ‘గోల’ ఎక్కువగా ఉందని ప్రభుత్వం ఎదురు దాడి చేస్తున్నది.
మల్లన్న గోల సమిసిపోక ముందే ప్రభుత్వానికి ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజి పెద్ద తలనొప్పిగా మారిం ది. మల్లన్న సాగర్ భూనిర్వాసితులు ఒక ప్రాంతానికి చెందిన వారైతే, ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహారం మొత్తం తెలంగాణలోని ఎంసెట్-2కు హాజరైన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది. ఇంకో వైపు వివిధ వర్సిటీలకు వైస్-్ఛన్సలర్లను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపి వేయడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించింది. ప్రభుత్వంతో ‘మల్ల(న్న)’ యుద్ధం, ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజీ, వర్సిటీల విసిల నియామకం వంటి సమస్యలపై పోరాటం చేసేందుకు మంచి ఆయుధాలు దొరికాయని విపక్షాల నేతలు విపరీతంగా సంబరపడిపోతున్నారు.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి