సంపాదకీయం

న్యాయమూర్తులపై విచారణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య మరోసారి అధికార, సంఘర్షణ మొదలు కావడానికి రంగం సిద్ధమైనట్టు ప్రచారవౌతోంది. సర్వోన్నత, ఉన్నత న్యాయమూర్తులకు వ్యతిరేకంగా దాఖలయ్యే ఫిర్యాదులను విచారించడానికి ఒక సమగ్ర వ్యవస్థను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొందన్నది ఈ సంఘర్షణకు ప్రాతిపదిక. ఈ వ్యవస్థను ఏర్పా టు చేయడానికి తలపెట్టడం మరోసారి వివాదాల కందిరీగల తుట్టెను కదిలించడంతో సమానమన్నది న్యాయవ్యవస్థ పక్షాన వినబడుతున్న వ్యాఖ్యల సారాంశం. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఈ నూతన వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకించారట. ఉన్నత, సర్వోన్నత న్యాయమూర్తుల ఎంపికను నిర్వహిస్తున్న వరణమండలి-కొలేజియం-లో సభ్యులుగా ఉన్న సర్వోన్నత న్యాయమూర్తులు కూడ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారట. కానీ ఉన్నత న్యాయమూర్తులకు సర్వోన్నత న్యాయమూర్తులకు వ్యతిరేకంగా దాఖలయ్యే అభియోగాలను నిర్వహించడానికి ఒక నూతన వ్యవస్థను, కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం గత డిసెంబర్‌లో సూచించడం వల్ల మాత్రమే ఈ నూతన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం భావిస్తోందట. అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఈ ఫిర్యాదులను విచారించడానికి సుప్రీంకోర్టులో కార్యాలయం-సెక్రటేరియట్- తరహాలోనే ఏర్పడనున్నదన్నది జరుగుతున్న ప్రచారం. దేశంలోని అన్ని హైకోర్టుల ప్రాంగణాలలో కూడ ఇలాంటి ఫిర్యాదుల కార్యాలయాలు ఏర్పడనున్నాయట. సుప్రీంకోర్టు ఫిర్యాదుల కార్యాలయం నిర్వహణ అధికారులుగా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తి నియమించాలన్న నియమావళిని కూడ కేం ద్ర ప్రభుత్వం రూపొందిస్తోందట. హైకోర్టు స్థాయి ఫిర్యాదుల కార్యాలయ నిర్వాహకులుగా మాజీ న్యాయమూర్తులను ఆయా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు నియమిస్తారట. ప్రధాన న్యాయమూర్తుల ప్రతిపాదన ప్రాతిపదికగా ఈ ఫిర్యాదులను విచారించే అధికారాలను ప్రభుత్వం నియమిస్తుందన్న ప్రచారం కూడ జరుగుతోంది. ఈ వ్యవస్థ ఏర్పడడం వల్ల ఉన్నత, సర్వోన్నత న్యాయమూర్తుల పనితీరునకు ఆటంకాలు సంభవిస్తాయని, న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి విఘాతం కలుగుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వానికి స్పష్టం చేశారట. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమావళి ప్రకారం ఉన్నత, సర్వోన్నత న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చే ఫిర్యాదులను పరిశీలించి తగిన రీతిగా దర్యాప్తు జరిపించే బాధ్యత, అధికారం భారత ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే ఉన్నాయి. అందువల్ల నూతన వ్యవస్థ సమాంతర అధికార వ్యవస్థగా పరిణమించే వైపరీత్యం పొంచి ఉంది. కానీ ఫిర్యాదుల కార్యాలయం న్యాయాధికారులను ప్రధాన న్యాయమూర్తుల అనుమతితోనే నియమిస్తున్నందువల్ల అలాంటి అవకాశం లేదన్నది ప్రభుత్వ వాదం. ఈ నూతన ఫిర్యాదుల వ్యవస్థ వల్ల రాజ్యాంగంలోని 124వ, 217వ అధికరణాల స్ఫూర్తికి విఘాతం కలుగుతుందా? కలుగదా? అన్నవి సమాధానం లభించవలసిన ప్రశ్నలు.
ఎందుకంటె సర్వోన్నత న్యాయస్థానానికి, ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తులుగా నియామకం పొందే అభ్యర్థుల గుణగణాలను అర్హతలను కూడ ఈ సెక్రటేరియట్లు సమీక్షిస్తాయట. దీనివల్ల నియామకాలలో పారదర్శకత పెరుగుతుందన్నది ప్రభుత్వం తరపున వినబడుతున్న వాదం. కాని ప్రస్తుతం ఈ నియామకాలను సిఫారసు చేస్తున్న వరణ మండలి సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశంలో పనిచేస్తోంది. ఈ మండలి పారదర్శకంగానే న్యాయమూర్తుల పదవులను అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. కొలేజియం చేసిన సిఫార్సులను రాష్టప్రతి యథాతథంగా ఆమోదించి నియామకాలు చేయవచ్చు, మార్పులు చేయవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ సుదీర్ఘకాలం పాటు జరుగుతోంది. రాష్టప్రతి ఆమోదించడమంటే కేంద్ర మంత్రివర్గం ఆమోదించడమే. అందువల్ల నియుక్తులయ్యే అభ్యర్థుల గురించి కొత్తగా ఏర్పడనున్న సెక్రటేరియట్లు మళ్లీ సమీక్ష చేయడం వల్ల జాప్యం జరగడం మాత్రమే కాదు, కొలేజియం అభిప్రాయాలకు,నూతన వ్యవస్థ నిర్వాహకులకు అభిప్రాయాలకు మధ్య విభేదాలు ఏర్పడడం ఖాయం. ఇలా న్యాయమూర్తులను నియమించే రెండు సమాంతర ప్రక్రియలు కొనసాగడంలో ఔచిత్యం లేదన్న వాదం కూడ ప్రచారమైంది..
రాజ్యాంగంలోని 124వ అధికరణ సర్వోన్నత న్యాయమూర్తుల నియామక ప్రక్రియను, అభిశంసనద్వారా ఉద్వాసన ప్రక్రియను నిర్దేశిస్తోంది. 217వ అధికరణ ఉన్నత న్యాయమూర్తుల నియామకం పద్ధతిని, తొలగించే ప్రక్రియను నిర్దేశిస్తోంది. పార్లమెంటు ఉభయ సభలు విడివిడిగా మూడింట రెండువంతుల సభ్యుల మద్దతు ప్రాతిపదికగా అభిశంసించినప్పుడు మాత్రమే అవినీతిపరులైన లేదా అసమర్ధతకు గురి అయిన సర్వోన్నత, ఉన్నత న్యాయమూర్తులను పదవులనుంచి తొలగించడానికి వీలుంది. ఇందుకు పూర్వరంగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించే న్యాయమూర్తుల దర్యాప్తు బృందాలు సంబంధిత ఆరోపణగ్రస్త న్యాయమూర్తులకు వ్యతిరేకంగా విచారణలు జరుపుతున్నాయి. అభిశంసన తీర్మానం పార్లమెంటు సభలలో సమర్పితమైన తరువాత కూడ సభాధ్యక్షులను నియమించే బృందం విచారణ జరిపి ఆరోపణలలో నిజానిజాలను నిగ్గు తేలుస్తోం ది. అందువల్ల ఉన్నత సర్వోన్నత న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులను పరిశీలించి విచారించి వాస్తవాలను వెల్లడించడం కోసం మరో కొత్త వ్యవస్థ అవసరమా? ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారమే అభిశంసన ప్రక్రియ ఏళ్లతరబడి కొనసాగుతోంది. ఇంకా జాప్యం జరగాలా అన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం ఉన్నట్టు లేదు. అభియోగ గ్రస్తుడైన న్యాయమూర్తికి వ్యతిరేకంగా విచారణ అభిశంసన ప్రక్రియ పూర్తయ్యేవరకు వారు యధావిధిగా పదవులలో కొనసాగుతున్నారు. వారికి పని అప్పగించకుండా న్యాయవిధులకు దూరం గా ఉంచడం మాత్రమే సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి తీసుకోగలిగిన చర్య. ఇలా విధులకు దూరంగా ఉన్న సమయంలో ఆరోపణగ్రస్తులు యధావిధిగా వేతనాలను ఇతర సదుపాయాలను ఏళ్లతరబడి పొందగలుగుతున్నారు. ఈ వైపరీత్యాన్ని నిరోధించడానికి మాత్రమే రాజ్యాంగ సవరణలు జరుగవలసి ఉంది. సౌమిత్రసేన్, పిడి దినకరన్ వంటి అవినీతి ఆరోపణలకు గురి అయిన ఉన్నత న్యాయమూర్తులు అనేక ఏళ్లపాటు యధావిధిగా పదవులలో కొనసాగారు. పార్లమెంటు అభిశంసన వాస్తవం కావడానకి కొద్ది రోజులు ముందుగా మాత్రమే వారు రాజీనామా చేశారు.
సౌమిత్రసేన్‌ను 2011 ఆగస్టులో రాజ్యసభ అభిశంసించింది. అయినప్పటికీ లోక్‌సభ నిర్ణయం కోసం ఆయన ఎదురుచూశారు. లోక్‌సభలో కూడ తనకు అభిశంసన తప్పదని తెలుసుకున్న తరువాత మాత్రమే 2011 సెప్టెంబరులో పదవికి రాజీనామా చేశారు. ఇలా తప్పుకున్న ఇద్దరు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వారిపై వచ్చిన అభియోగాల ప్రాతిపదికగా న్యాయస్థానాలలో కేసులు పెట్టారా? పదవులు పోవడంతో అభియోగాలు అంతమై పోతాయా? దీనికి సమాధానాలు లభించే విధంగా నియమావళిలో మార్పులు జరగాలి...అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి.