మెయన్ ఫీచర్

‘సమీకృతి’ లోపించిన చదువుల గతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జరిగిపోతున్న అక్రమ కలాపాల గురించి ఆక్రోశించడం వల్ల, పోటీ పడి ప్రచారం చేయడం వల్ల ఆయా దుష్ట పరిణామాలు ఆగవు. నిర్భయ చట్టం వచ్చిన తరువాత బాలికలపై లైంగిక అత్యాచారాలు ఆగిపోలేదు. దృశ్యమాధ్యమ స్రవంతుల- ఛానల్స్-వారు ‘‘ఈ దుర్వార్తను మేమే ముం దుగా ప్రసారం చేస్తున్నాము..’’ అని పోటీ పడినందువల్ల ఆయా సమాజ వ్యతిరేక ఘోరాలు ఆగిపోవడంలేదు. మూడు కుక్కపిల్లలను భాగ్యనగరం శివారులలో ఎవరో దుండగులు కాల్చి చంపారట. ‘‘కాల్చి చం పడం..’’ అని అంటే మంటలలో మాడ్చి చంపడం! ఇది ప్రచారం అవుతున్న సమయంలోనే మరో నాలుగు ముచ్చటైన కుక్కపిల్లలను మరికొందరు దుండగులు భాగ్యనగరంలోనే విషం పెట్టి పొడిచి చంపేశారట. ఈ దుండగులు అక్షరాస్యులు. అక్షరాస్యతను పెంపొందించడం గురించి దశాబ్దుల ఆర్భాటం జరిగిపోతోంది. అక్షరాలు రాని వారు, లేదా చదవనివారు మహాభారతం, రామాయణం, శతకాలు, నాటకాలు, ఇతర సాహిత్య రూపాలనుంచి వందలాది పద్యాలను కంఠస్తం చేసి జీవన పర్యంతం వినిపించిన సంప్రదాయం మనకుంది. ఈ విద్యా సంప్రదాయం ఇప్పుడు లుప్తమైంది. అడుగంటి పోయింది. ‘‘అలెగ్జాండర్ గ్రీకు వీరుడని తెలియకపోతే’’ అవమానంగా భావించే విశ్వవిద్యాలయ స్నాతకోత్తర విద్యార్థులకు మహాభారతంలోని జనమేజయుడు ఎవరో తెలియవలసిన పనిలేదు. ఇదీ నడుస్తున్న విద్యావిధానం. ఇలాంటి విద్యావిధానం వల్ల అన్ని రంగాలు ప్రభావితం అయినాయి, విద్యారంగం కూడ. డబ్బు తీసుకొని మార్కులు వేసిన ఆచార్యుల కథలు..పాతబడినాయి. ప్రశ్న పత్రా లు ముందే బయటపడుతున్నాయి. ‘ఎమ్‌సెట్-2’ అవినీతి పుట్ట పగలడం సరికొత్త ఘట్టం..మహాభారతంలో, కాలి బూడిద అయిన ‘కచుడు’, బృహస్పతి కుమారుడు. తన జాతి సమష్టి హితానికి అవసరమైన విద్యను సంపాదించుకొని వెళ్లగలిగాడు. ఈ కథను స్నాతకోత్తర వేదికలపైనుంచి పట్ట్భద్రులనుద్దేశించి ప్రసంగిస్తున్నవారు చెప్పడంలేదు. ఏ ఉద్యోగం, ఏదేశంలో వెలగబెడితే ఎన్ని లక్షల రూపాలయ జీతం వస్తుందన్నది మాత్రమే వివరిస్తున్నారు. ‘తినే సంస్కృతి’ మన జీవన స్వభావాన్ని తినేసింది. అందువల్లనే ధర్మరాజు వెంట స్వర్గారోహణకు బయలుదేరిన కుక్కపిల్ల గురించి విద్యాధికులు తెలుసుకోనక్కరలేదు. పంచతంత్రం కథలను మరచిపోవాలి..‘స్కాంప్’ గురించి ‘డిస్నీలాండ్’ గురించి తెలుసుకుంటే చాలు. హంసలకు కొంగబుద్ధులను దిద్దాలన్నది తపన. ఎమ్‌సెట్ అవినీతి ఒక ఉదాహరణ మాత్రమే.
అభినయం-నటన-అభినయ రంగం నుండి అన్ని రంగాలకు వ్యాపించడం మనదేశంలోని వౌలిక సమస్య. తెరమీద నాయకుడు జీవితంలో ఖలనాయకుడు. వీరు విద్యార్థులకు గొప్ప ఆదర్శ పురుషులుగా అవతరించారు. అందువల్ల అన్ని రకాల నియమ నిబంధనలను నీరు కార్చడం యువత నేర్చుకుంటున్న గొప్ప పాఠం. చూసి నేర్చుకోవడం అటే ఇదేమరి. ‘జింకలను చంపి’ తప్పించుకున్న సర్మాన్ ఖాన్ వెక్కిరిస్తున్నాడు. దుర్మార్గం చేసి తప్పింకోవడం గొప్ప అన్నది సంస్కారం! తెలుగు చలన చిత్రాల నాయకులు వారి తనయులు నియమ నిబంధనలను ఉల్లంఘించడం, దౌర్జన్యం చేయడం అభిమాన విద్యావంతులకు ఆదర్శం...యువజనులకు మన వ్యవస్థ మప్పుతున్న గొప్ప చదువులు ఇవే. తెరవెనుక కథలను చెప్పిన సుప్రసిద్ధ రచయిత డి. నరసరాజు ఒక ఘటనను వివరించి ఉన్నారు..‘‘ఇంతకూ ఈ సినిమా ద్వారా మనం చెప్పే నీతి ఏమిటి?’ అని క్రీస్తుశకం 1950వ దశకంలో చర్చలో పాల్గొన్న ఒక ప్రముఖుడు అడిగాడట. ‘‘నువ్వేమిటి నీతులు చెప్పేది..నీకే నీతిలేదు!’’ అని మరొక ప్రముఖుడు ముక్తాయించాడట. ఒక రంగం ‘ప్రతీక’ మాత్రమే. అన్ని రంగాలలోను ఆత్మ మథనం జరిగేది. ఇది గతమైంది. ఇప్పుడు ‘ఆత్మ’లే లేవు. మథనం ఎక్కడుంది? ముప్పయి యేళ్ల అమెరికా మహిళపై లైంగిక అత్యాచారం జరిపిన మహమూద్ ఫారూఖీ అనే చలనచిత్ర ప్రముఖుడు నేరస్థుడని జూలై 30న ఢిల్లీలోని ఒక న్యాయస్థానం నిర్ధారించిందట. ఈ వార్త ప్రచురితమైన చోటనే మరికొన్ని వార్తలు వికటంగా ఆవిష్కృతమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీపంలో జూలై 30వ తేదీన ఒక మాతృమూర్తిని, అమె కు మార్తెను దుండగులు సామూహిక లైంగిక అత్యాచారానికి గురి చేశారట. ఉత్తరఖండ్‌కు చెందిన ఒక రాజకీయవేత్త తనపై లైంగిక అత్యాచారం జరిపినట్టు మరో మహిళ ఫిర్యాదు దాఖలు చేసిందట. ఒక రంగం ఒక ప్రాంతం ప్రతీకలు మాత్రమే. ప్రచారం జరిగినంత తీవ్రంగా నిరోధించే శాశ్వత మార్గాలను సంబంధితులు ఆనే్వషించడం లేదు. అందువల్లనే వేలకోట్ల రూపాయలు బొక్కేసి విజయమాల్యాలు పారిపోతూనే ఉన్నారు. క్రీడాకారులు మాదక ద్రవ్యాలతో మత్తెక్కి పోతున్నారు. ఉన్నత న్యాయమూర్తులు సైతం అవినీతికి ఒడిగట్టిన దుస్థితి దాపురించడం మన విద్యల స్వభావానికి నిదర్శనం.
అమెరికాలో ఉద్యోగం కోసం ఇద్దరు భారతీయ యువకులు వెళ్లారట. క్రీస్తుశకం 1990 దశకం నాటి మాట ఇది. ఉద్యోగం ఇవ్వనున్న సంస్థవారు ఇద్దరు అభ్యర్థులలో మొదటి యువకుడిని లోపలికి పిలిచారు. ప్రశ్నించారు. అభ్యర్థి స్థాపత్యశాస్త్రం-ఇంజినీరింగ్-లో స్నాతకోత్తర పట్ట్భద్రుడు-పోస్ట్ గ్రాడ్యుయేట్- ‘అనుభవం ఎన్ని సంవత్సరాలు?’, ‘పదేళ్ల అనుభవం ఉంది..’, ‘మీ భారత దేశంలోని పదేళ్ల అనుభవం మాదేశపు సేవ-సర్వీస్-కు ఎలా అన్వయం కాగలదు..?’ అని నిర్వాహకులు నిలదీశారు. ‘పోనీ మా దేశంలోని పదేళ్ళ అనుభవాన్ని మీదేశపు ఐదేళ్ల అనుభవంగా పరిగణించండి..’ అని అభ్యర్థి ప్రాధేయపడ్డాడట. ‘బయట వేచి ఉండండి..’ అన్నది నిర్వాహకుల సమాధానం. రెండవ అభ్యర్థిని లోనికి పిలిచారు. అతను కూడ స్థాపత్య శాస్త్రంలో స్నాతకోత్తర పట్ట్భద్రుడు, పదేళ్లు మనదేశంలో వృత్తి అనుభవం గడించినవాడు. నిర్వాహకులవి అవే ప్రశ్నలు..’’ మాదేశంలో పదేళ్ల అనుభవం మీదేశంలోని ఇరవై ఏళ్లతో సమానం..’’ అన్నది రెండవ అభ్యర్థి విజ య విశ్వాసంతో చేసిన నిర్ధారణ. ‘ఎలా..?’ అని వాణిజ్య సంస్థ నిర్వాహకులు ఆశ్చర్య చకితులయారట. ‘‘మీది ఏకీకృత -కంపార్ట్‌మెంటల్- పాఠ్య ప్రణాళిక..ఏకీకృత వాణి జ్య కార్య పద్ధతి, మా భారతదేశంలో సమీకృత -ఇంటిగ్రేటెడ్- పాఠ్య ప్రణాళిక అమలులో ఉంది. ‘సమీకృత’ వాణిజ్య కార్య పద్ధతి వ్యవస్థీకృతమై ఉంది. ఒక విభాగంలో నిష్ణాతుడైన అమెరికా స్థపతికి మరో విభాగంలో పరిజ్ఞానం ఉండ దు..్భరతీయ స్థపతికి ఏ విభాగంలో నైపు ణ్యం ఉన్నప్పటికీ ఇతర విభాగాలలో ఎంతో కొంత పరిజ్ఞానం ఉంటుంది..’’ అని రెండవ అభ్యర్థి నిగ్గు తేల్చాడు. రెండవ అభ్యర్థి వివరణ అతనికి మాతృదేశ వ్యవస్థ పట్ల గల మమకారం అమెరికా వాణిజ్య సంస్థ వారికి నచ్చాయట. రెండవ అభ్యర్థిని ఎంపిక చేసుకున్నారు. ఆత్మన్యూనతకు గురై ఉండిన మొదటి అభ్యర్థికి ఉద్యోగం దక్కలేదు. మాతృదేశం పట్ల మమకారం జాతీయతా నిష్ఠకు ప్రాతిపదిక. ఈ జాతీయతా నిష్ఠ వల్ల మాతృభూమిపై వికసించిన సంస్కారాలు, సంస్కార సమాహారమైన సంస్కృతి దేశ ప్రజల సహజ స్వభావంగా మారుతోంది. ఈ స్వభావాన్ని రక్షించే విద్య వల్లనే, విద్యా పద్ధతి వల్లనే సమీకృత పాఠ్య ప్రణాళికల వల్లనే విద్యావంతులు సౌశీల్యవంతులుగా వికసిస్తున్నారు. ఈ సమీకృత విద్యకు బడి పిల్లలు కళాశాలల, విశ్వవిద్యాలయాల విద్యార్థులు దూరమైపోవడం క్రీస్తుశకం 1947 నుండి మొదలైన విపరిణామక్రమం. ఈ దూరమైనవారు సౌశీల్యంలేని విద్యావంతులుగా మారి వివిధ రంగాలను ఆవహించడం అసలు సమస్య. కలకత్తా హైకోర్టుకు చెందిన సౌమిత్రసేన్, కర్ణాటక ఉన్నత న్యాయమూర్తి అవినీతి ఆరోపణగ్రస్తులై పదవులను కోల్పోవడం ప్రతీకలకు పరాకాష్ఠ. అసంఖ్యాకులు అన్ని రంగాలను బొక్కేశారు. సౌశీల్యం మప్పలేని, మాతృభూమి పట్ల మమకారాన్ని విద్యావంతుల హృదయసీమలలో వికసింపజేయలేని విద్యలు-ఎకీకృత పాఠ్యాంశాలు, ఈ దేశం పాలిట గుదిబండలు.
అమెరికాకు వెళ్లిన ఆ రెండవ యువ స్థపతి తన స్థాపత్య విద్య-ఇంజినీరింగ్-కు సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమీకృతిని గురించి మాత్రమే వివరించి ఉండవచ్చు. కానీ వివిధ విద్యా వైజ్ఞానిక విభాగాల పరిజ్ఞాన అంశాల మధ్య సమీకృతి కావాలి. ఈ సమీకృతి ప్రధానంగా సాహిత్యం ద్వారా అనాదిగా సహజంగా కొనసాగుతోంది. ఈ సమీకృత విద్యవల్ల విద్యార్థిలో, విద్యావంతునిలో అత్యంత సహజంగా సౌశీల్యం వికసించింది. ‘‘ఇదిగో అవినీతి, ఇదీ నిజాయతీ, నేర్చుకో, నేర్పుతాను..’’అని చెప్పనక్కరలేదు. అలా చెప్పడం ఘోరమైన వైఫల్యం. రండి దేవుడి కథలే పదేపదే చెప్పాలి, కచుని కథ మప్పాలి, దిలీపుడు ఎవరో వివరించాలి. ఛత్రపతి శివాజీని ఆవిష్కరించాలి. ‘‘మహానందాంగనా ఢింభకుడు’’ మన బడి ప్రాంగణంలో దోగాడాలి. వైద్యుడు, స్థపతి, జిల్లా అధికారి, లోక్‌సభ సభ్యుడు, కర్రపని చేసే కర్మవీరుడు- వీరందరూ ఇలా తెలుసుకొనడం సమీకృత విద్యాబోధన పద్ధతిలో భాగం...ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం, పౌరశాస్త్రం-సివిక్స్- పాఠాలు వ్రాసిన అయ్యవారు రాజనీతి శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకొని ఉండవచ్చు. కానీ పౌరశాస్త్రంలో సామాజిక న్యాయం గురించి వ్రాసిన ఆచార్యుడు ‘‘అంగ వ్రాతమునన్ చికిత్సకుడు దుష్టాంగము ఖండించి శేషాం గ శ్రేణికి రక్ష సేయు..’’ అన్న నీతిని వివరించాడు. ఆయన విద్య రాజనీతి శాస్త్రానికి పరిమితం కాలేదు. ఏకీకృతం కాలేదు, సాహిత్యంలో ఇతర శాస్త్రాలతో సమీకృతమైంది. పాతికేళ్లకు పూర్వం నాటి పాఠ్యాంశాల మాట ఇది. ఈ సమీకృతి కారణంగానే..
‘‘రాజునకు ప్రజ శరీరము
రాజు ప్రజకు రక్ష కాన రాజున్ ప్రజయున్
రాజోత్తమ! అన్యోన్య వి
రాజితులై మెలగవలయు రక్షార్చనలన్’’
అన్న సముత్కర్ష ప్రజాస్వామ్య సూత్రా న్ని ఆ ఆచార్యుడు ఉటంకించగలిగాడు. ‘‘రామ రాజ్యం ఉపాసీత్వా..’’-‘‘రాముడు రాజ్యాన్ని పూజించి..’’-న పద్ధతిని వివరించిన మహాకవి వాల్మీకి ఈ సమీకృత బోధనకు తరతరాల విగ్రహరూపం. ఈ సమీకృత విద్యలు నేర్చినందువల్లనే వివేకానంద స్వామి అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే కొలంబో ఓడ రేవులో భారతమాత ఒడిలో పడి మట్టిలో దొర్లాడు. ఇలా మాతృభూమి మట్టిని జీవన పర్యంతం పులుముకొని పరిమళించే వారి సంఖ్య పెరగాలి. అవినీతి కలుపు అప్పుడు ఈ నేలపై అంకురించదు.

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 09951038352