మెయన్ ఫీచర్

రెండు నాల్కల రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానున్న పనిని గంధర్వులు చేశారన్న సామెతలాబాబు కార్యాన్ని కాంగ్రె స్ మీదేసుకొని తన నిజాయతీని నిరూపించుకునే నటనను ప్రారంభించింది. హోదా బిల్లు విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కెవిపి రామచంద్రరావు వైఎస్‌ఆర్ హయాంలో దేశ రాజకీయాల్లో బాగా తలపండిన వ్యక్తే. వైఎస్‌ఆర్ మరణం తర్వాత జగన్‌తో కలిసి అడుగులు వేస్తారని భావిస్తే, కాంగ్రెస్‌లోనే కొనసాగడం కించిత్ ఆశ్చర్యమే. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గొంతు కలిపిన కెవిపి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కావాలని జూలై 22న రాజ్యసభలో ఓ ప్రైవేటు బిల్లును పెట్టి కాంగ్రెస్‌తో పాటు భాజపా వ్యతిరేక కూటములను నిద్రలేపారు. ఈ నాటకంలో కెవిపి కేవలం పాత్రధారుడే అయినా, వెనుక ఆడిస్తున్నది జగన్ అనేది తెలిసిందే!
విభజన జరిగి రెండు సంవత్సరాలు గడిచింది. రెండు బడ్జెట్ సమావేశాలు, నాలుగుసార్లు పార్లమెంటు సమావేశాలు జరిగాయి. ఇంతకాలం వౌనం వహించిన కాంగ్రెస్ తాను ప్రతిపాదించిన ప్రత్యేక హోదా పం డోరా బాక్స్ నుంచి బయటకు తీసింది. ఇందుకు కెవిపిని ముందు నిలబెట్టడమే అసలైన రాజకీయం. ఈ మొత్తం నాటకం లో రాష్ట్రానికి హోదాని సాధించడం కన్నా, చంద్రబాబుకు నిద్రలేకుండా చేసి జనం ముందు దోషిగా నిలబెట్టాలన్న తాపత్రయమే ఎక్కువగా ఉంది. తెలంగాణలో తెదేపాను, కెసిఆర్ దెబ్బతీయగా, ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాను బాబు దెబ్బతీయడంతో ఆగ్రహంతో ఉన్న జగన్‌కు హోదా ఒక బ్రహ్మాస్త్రంలా దొరికింది. అన్ని రాష్ట్రాల్లో నూ, కేంద్రంలోనూ చతికిలపడ్డ ప్రతిపక్షాలకు పార్లమెంట్‌లో హోదా ఒక ఆయుధంగా మారింది.
2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజనపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అయిదు సంవత్సరాలపాటు అవశేష రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలనే ప్రతిపాదన చేయగా, కాదు, పది సంవత్సరాలపాటు కొనసాగించాలని వెంకయ్యనాయడు, ప్రత్యేక హోదా కు నాడు సమర్ధించిన జైట్లీ మాట మార్చ డం బాబుకు పుండుపై కారం చల్లిన విధం గా ఉంది. బహుశా ఇప్పుడు కేంద్రంలో యుపిఎ ప్రభుత్వమే కొనసాగితే, కాంగ్రెస్ కూడా ప్రత్యేక హోదాకు చట్టరూపం ఇచ్చే దా అనేది ప్రశ్న కాగా, ప్రతిపక్షంలో భాజ పా ఉంటే, హోదా వద్దని ప్రవచించేదా అనేది మరో ప్రశ్న. అందుకే పార్లమెంటరీ రాజకీయాలకు రెండు నాలుకలుంటాయనేది అక్షరసత్యం. పాలకపక్షంలో వుంటే ఒకతీరు, ప్రతిపక్షంలో ఉంటే మరోతీరు మాట్లాడటం ఎమర్జెన్సీ తరువాత స్పష్టంగా కనబడుతున్నది. విభజన చట్టంలోని 46(3) ప్రకారం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక కింద చేర్చి కేంద్రం బాధ్యత తీసుకుంటుందని రాయ డం జరిగింది. అప్పుడే మొత్తం రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని అదే సెక్షన్‌లో చేర్చి ఉంటే, చర్చ జరిగితే చట్టరూపం దాల్చేది. ఆనాడు ఏపార్టీకి ఈ స్పృహ లేదు.
ఇక విభజనను మనసా, వాచా వ్యతిరేకించి, రెండు కళ్ల సిద్ధాంతమంటూ, లేఖ ఇచ్చానంటూ, రెండు ప్రాంతాల్లో దాగుడుమూతలాడిన బాబు వివేచనతో, విచక్షణతో నాడు వ్యవహరించి, విభజనకు అడ్డుతగలకుండా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హో దా ఇస్తేనే, కోరుకున్న రాయితీలు ఇస్తే నే..అనే షరతును పెడితే ఈ కాంగ్రెస్‌తో సహా, భాజపా కిమ్మనకుండా తలూపేవి. ఇరు ప్రాంతాల్లో బాబు ఇమేజ్ బాగా పెరిగేది. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపడిన ఆనాటినుంచి ఆంధ్ర, సీమ ప్రాంతం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రజలకు విన్నవించి, విభజనతో రెండు ప్రాంతాలు లాభపడే విధానాన్ని విడమరిచి చెప్పే విదురనీతిని ప్రదర్శించి వుంటే, బాబు ఊహిస్తున్న విజన్-2029 విజయవంతంగా కొనసాగేది. ఇలా తలాపాపం తిలా పిడికెడులా ఆంధ్ర, సీమ ప్రాంత కాంగ్రెస్‌లు ఆ ప్రాంతాలలోనే శకుని పాత్ర పోషించి, ఇప్పుడు అవకావంశం కోసం ఎదురు చూడడం కుటిల రాజనీతే!
గత రెండు సంవత్సరాలుగా నిద్రావస్థలో ఉన్న కాంగ్రెస్ మేల్కొనడానికి గల కారణం రాజకీయం తప్ప మరోటి కాదు. అలాగే వైకాపాది కూడా. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్చుకుపోయిన కాంగ్రెస్ తిరిగి పునరుత్థానం కావలంటే ఈ ప్రాంత ప్రజల పక్షాన ఉన్నట్టు భ్రమింపజేయాల్సిదే. పార్టీ ఫిరాయింపుతో వైకాపాను దెబ్బతీస్తున్నందుకు బాబుపై కక్ష తీర్చుకోవాలంటే ‘హోదా’ వజ్రాయుధంగా జగన్‌కు తోచింది. విభజన తర్వాత ఏపార్టీ అధికారంలోకి వస్తుందో తెలియని అనిశ్చిత స్థితిలో మెజార్టీ పార్టీగా తెదెపా ఆవిర్భవించడం, కేంద్రంలో కాంగ్రెస్ ఓట మి చవిచూడడం, బాబుకు నిజంగానే కలిసివచ్చిన అదృష్టం. ఈ నేపథ్యంలోనే కడుపులో చల్లకదలకుండా, కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణినిని అవలంబిస్తూ, రాష్ట్రం లో, కేంద్రంలో పదవుల పంపకం చేసుకొని, కొంతమేరకు నిధుల్ని రాబట్టుకుం టూ పాలన సాగిస్తుంటే, బోనులోని సిం హాన్ని రెచ్చగొట్టినట్టుగా, హోదాపై ప్రత్యేక ప్రైవేటు బిల్లుతో రెచ్చగొట్టడం నిజంగా కౌటిల్యనీతే.
పిల్లి నల్లదా లేక తెల్లదా అనేది కాకుండా, ఎలుకల్ని పట్టడం ప్రధానమనే రాజకీయ సూత్రాన్ని నమ్ముకున్న బాబుకు కాంగ్రెస్ ఈవిధంగా మెడకు ఉచ్చు తగిలిస్తుందని ఊహించలేదు. తెరాసతో సహా మరో పది పార్టీలతో కలిసి హోదాపై గొంతు కలపాల్సి రావడం బాబుకు బాధాకరమే. బాబు తన వేలును తనకంట్లో పెట్టుకునేలా చేయడంలో కాంగ్రెస్, వైకాప విజయం సాధించాయి. ఒకపక్క స్నేహపూరిత వాతావరణంలో భాజపాతో సఖ్యతగా ఉం టూనే.. చంద్రబాబు స్వయంగా కేంద్ర మం త్రి సుజనా చౌదరిచేత హోదాపై కేంద్రాన్ని దుమ్మెత్తి పోయంచడం వెంకయ్యనాయుడికే కాదు, జైట్లీకి, మోదీకి, చివరికి రాజ్యసభ ఉపసభాపతి కురియన్‌కే తలవంపుగా తయారైంది. మంత్రిగా కొనసాగుతూ, తన ప్రభుత్వాన్ని నిందించడం పార్లమెంటరీ సంప్రదాయానికే విరుద్ధం కాదా అనేది వారి ఆవేదన! దాదాపు అన్ని రాష్ట్రాల్లో భాజపా పార్టీ నిర్మాణాల్ని కలిగివున్నా, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ఒక కమిటీని ఏర్పాటు చేయలేదు. తెలుగుదేశంతో సఖ్యతగా ఉన్న నేపథ్యం లోనే ఈవిధంగా కమిటీని ఏర్పాటు చేయ లేదన్న అంశాన్ని తెలుగు దేశం ఎంపిలు గుర్తించకపోవడం ఏపీ భాజపా నేతలను తీవ్రంగా బాధించింది. అందువల్ల తెలుగు దేశంతో తెగతెంపులే మేలని భావించినా, ఆమాట తమ నోటితో అనకుండా తెలంగాణ భాజపాతో అనిపించడం దాకా వ్యవహారం వెళ్లింది.
అన్నింటినీ మించి, ఎన్నికల సందర్భం గా 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని కోరి న చంద్రబాబు, తర్వాతి కాలంలో హోదా వల్ల ఒదిగేదేమీ లేదని, అది సంజీవని అంతకన్నా కాదని, వైకాపా హోదా గురిం చి కెలికినప్పుడల్లా అన్నది తెలిసిందే. దీనే్న భరోసాగా తీసుకున్న కేంద్రానికీ ప్రత్యేక హోదా కన్నా, ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని, సహకారాన్ని అందించాలని భావించింది. ఈ స్థితిలోనే జూలై 30న రాజ్యసభలో జైట్లీ మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ప్రసక్తే లేదని, 14వ ఆర్థిక సంఘంతో సహా గత ప్లానింగ్ కమిషన్, ప్రస్తుత నీతి ఆయోగ్ కూడా దీనే్న నొక్కి చెప్పాయని సెలవివ్వడంతో, బాబు పరిస్థితి కుడితిలో పడ్డ బల్లి లా తయారైంది. పార్లమెంట్‌లో చోటు చేసుకున్న పరిణామాలు ఎక్కడ చేజారిపో యో, కాంగ్రెస్, వైకాపాలు ఎక్కడ లబ్దిపొందుతాయోనన్న భయంతో తిరిగి హోదాను ఒక జీవన్మరణ సమస్యగా బాబు ప్రస్తావించడం గమనార్హం.
నిజానికి బాబు కోరుకున్నంత కాకున్నా, తగిన మోతాదులోనే కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని అందుకుంటూనే ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లా కేంద్ర నిధులు పొందినా, పోలవరం జాతీయ హోదాతోపాటు 805 కోట్ల రూపాయలను, అమరావతి నిర్మాణానికి 2050 కోట్ల రూపాయలను అదనంగా పొందారు. ఇలా ఇప్పటివరకు 6,403 కోట్ల రూపాయలు తీసుకున్నా పద్దులు చూప డం లేదని అమిత్ షా రాజమండ్రిలో ఆరోపించడం, బాబుకు ఇబ్బందిగా మారింది. అలాగే 13వ ఆర్థికసంఘం, ఆంధ్రప్రదేశ్‌కు 64,575 కోట్లను కేటాయిస్తే, 14వ ఆర్థిక సంఘం ఈ మొత్తాన్ని 2,06,910 కోట్లకు పెంచడం జరిగిందని స్వయానా జైట్లీ రాజ్యసభలో వెల్లడించారు. కోరుకున్నట్టు హోదా ఇస్తే, వివిధ పథకాలకు 90 శాతం నిధుల్ని ఇవ్వడం జరిగినా, మిగతా పదిశాతం రాష్ట్రం భరించడం గాని లేదా రుణాన్ని సమకూర్చుకోవడం గాని చేయాల్సి వస్తుందని హెచ్చరించారు కూడ.
అయినా ఈశాన్య రాష్ట్రాలకు, ఉత్తరాఖండ్‌కు, సిక్కిం లాంటి రాష్ట్రాలకు గల ప్రత్యేక హోదా రాబోయే ఆర్థిక సంవత్సరంలో ముగుస్తుందని, తిరిగి పొడిగించే అవకాశం లేదని చెప్పడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే, రాజస్థాన్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సి వస్తుందని, ఇవి కూడా చాలా కాలంగా అడుగుతున్నాయని ప్రస్తావించడం గమనార్హం. పైగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన కేంద్రం వాటా 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిన తర్వాత, ప్రత్యేక హోదా కింద పన్ను రాయితీలిస్తే, కేంద్రానికి రాబడి ఎక్కడిదనేది జైట్లీ ప్రశ్న. ఇలా చేస్తే పరిశ్రమలు తరలిపోతాయనేది జయలలిత ఆరోపణ.
హోదాతో సంబంధం లేకుండానే, రాష్ట్రానికి ఎయిమ్స్, ఐఐటి, ఐఐఎం లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను కేంద్రం మంజూరు చేసింది. అదనపు విమానాశ్రయాలకు తలూపింది. అన్నింటికి మించి, స్వతంత్ర దేశాధినేత మాదిరిగా బాబు విదేశీ పర్యటనలు చేస్తూ అప్పుల్ని తెస్తూ, పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నా కేంద్రం కిమ్మనలేదు. ఓటుకు నోటు విషయంగా అంటీ ముట్టకుండా ఉంటున్నది, ఇలాంటి సుహృద్భావ వాతావరణంలో హోదా అనే నెపంతో తేదేపా, భాజపాల మధ్యన స్నేహాన్ని చెడగొట్టే ఎత్తుగడనే అనేది బాబుకు తెలిసినా, కేంద్రంపై కనె్నర్ర చేయాల్సి రావడం, రాజకీయ నాటకంలో భాగమే. ఎన్నో గట్టి మొట్టికాయలు తిన్న బాబుకు దీనె్నదుర్కొనడం పెద్దగా కష్టం కాకపోవచ్చు.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162