రచ్చ బండ

తల‘పోట్లు’...‘పాట్లు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు తెలుగు రాష్ట్రాలు తలనొప్పులను ఎదుర్కొంటున్నాయి. రెండేళ్ళు సాఫీగా జరిగిందనుకుంటే మూడవ సంవత్సరం ఆరంభం నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికీ అదే పరిస్థితి ఎదురవుతోంది. రాష్ట్ర విభజన జరిగి తెలుగు దేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీని రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం వెంటాడుతూనే ఉన్నది. తాజాగా అది మరింత ఉధృతమైంది. ఈ నెల 2న రాష్ట్ర బంద్‌కు ఆంధ్రలోని విపక్షాలన్నీ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌ను ప్రజలు స్వచ్ఛందంగా పాటించడంతో విజయవంతమైంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మల్లన్న సాగర్ వివాదం, మరోవైపు ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంతో సతమతమవుతున్నది. మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ అధికార విపక్షాల మధ్య చిచ్చు రాజేసింది. రిజర్వాయర్‌కు విపక్షాలు అడ్డు పడుతున్నాయని రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారు. పైగా ఆ ప్రాంతాన్ని విపక్ష నేతలు సందర్శించి రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రాంతానికి విపక్ష నేతలు వెళ్ళకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులు చేయిస్తుండడంతో ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. దీంతో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కోర్టును ఆశ్రయించి ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనుమతించాల్సిందిగా కోరారు. అందుకు న్యాయమూర్తి పరిమిత అనుచరులతో వెళ్లేందుకు అనుమతించడంతో, ఈ మేరకు దామోదర రాజనర్సింహ, సునీతా లక్ష్మారెడ్డి కోర్టు ఆదేశం ప్రకారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఎం త కట్టడి ఉన్నా కోర్టు ఆదేశం ప్రకారం అక్కడికి వెళ్ళడం కాంగ్రెస్‌కు కొంత సంతోషాన్ని కలిగించింది. అయితే ఈ సమస్యను ఇక్కడితో వదిలి వేయకుండా రైతులను కలుపుకుని విజృంభించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరోవైపు ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ గజ్వేల్ నియోజకవర్గానికి రానున్నందున, అదే రోజున మీడియా దృష్టిని ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఛలో మల్లన్న సాగర్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. మల్లన్న సాగర్ పేరిట ప్రధాని సభ వరకూ వెళ్ళి, ప్రధాని మోదీకి వినతి పత్రం ఇవ్వాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. పోలీసులు ముందు జాగ్రత్తగా అరెస్టు చేసే అవకాశం ఉన్నందున, పోలీసుల కళ్ళు కప్పి వేర్వేరు బృందాలుగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
ఇలాఉండగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులు కొందరు కోర్టును ఆశ్రయించగా, కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. 2013 చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా జివో నెంబర్ 123 ప్రకారం పరిహారం చెల్లించడం వల్ల భారీగా నష్టపోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితుల, ప్రభు త్వ తరఫు న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి జివో 123ని కొట్టి వేశారు. దీంతో విపక్షాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. అన్ని పార్టీలూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఆక్షేపించాయి. తమను సంప్రదించకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని మండిపడ్డా యి. అయితే ప్రభుత్వం మాత్రం తాము రైతుల మేలు కోరే జివో 123ని తీసుకుని వచ్చామని చెబుతోంది. ఈ తీర్పుపై తాము డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహరం అతలాకుతలం చేసింది. మల్లన్న సాగర్ ఒక ప్రాం తానికి చెందిన అంశం కాగా ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజీ తెలంగాణలోని విద్యార్థులకు సంబంధించింది కావడంతో ఎక్కువ విమర్శలకు గురి చేసింది. ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిందనే చెప్పవచ్చు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. చివరకు ప్రభుత్వం ఎంసెట్-2ను రద్దు చేసి వచ్చే నెల 11వ తేదీన మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.
ఇక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశంతో బాగా ఇబ్బంది పడుతోంది. విపక్షాల విమర్శలే కాకుండా ప్రజల్లోనూ ప్రతిష్ఠ దెబ్బతింటున్నదన్న ఆందోళన టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో కనిపిస్తున్నది. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో బిజెపితో ఉన్న బంధాన్ని తెంచుకోవాలని, కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగాలని టిడిపిపై ఒత్తిడి పెరుగుతున్నది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకమాడుతున్నాయని, ప్రజలను మోసం చేస్తున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. కాగా చంద్రబాబు నాయు డు మాత్రం ప్రత్యేక హోదా విషయంలో వెనకడుగు వేసేది లేదని, ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తాడో-పేడో తేల్చుకోవాలన్న పట్టుదలతో ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం ప్యాకేజీ తీసుకోవాల్సిందిగా బాబుకు సూచించారు.
ఈ సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు కాంగ్రెస్‌కు, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం లభించింది. దీంతో ఆ రెండు పార్టీలూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ తలచుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ విధం గా వత్తిడి పెంచేందుకు విపక్షాలను కలుపుకుని ఢిల్లీకి తీసుకెళ్ళాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం విపక్షాలకు ఆ అవకాశం ఇవ్వకుండా తనే సాధించుకుని రావాలన్న పట్టుదలతో ఉన్నారు. లోగడ ప్రత్యేక హోదా సంజీవని ఏమీ కాదన్న చంద్రబాబులో ఇంత పట్టుదల పెరిగేందుకు కారణం లేకపోలేదు.
ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్ర రావు ప్రైవేటు బిల్లు పెట్టడంతోనే అన్ని పార్టీల్లోనూ కదలిక వచ్చింది. దీంతో రాజ్యసభ స్తంభించింది. ఇది రాజకీయంగా బాగా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తుండగా, తాము ఎక్కడ వెనుకబడిపోతామోనన్న బెంగతో వైకాపా కూడా వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. నాడు కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి విభజన చట్టంలో పెట్టకుండా ఇప్పుడు నాటకాలు ఆడుతున్నదన్న విమర్శనూ మిగతా పక్షాల నుంచి ఎదుర్కొంటోంది. ఇలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను ఎదుర్కొంటుండగా, విపక్షాలు ఆ సమస్యలనే రాజకీయ ఆయుధాలుగా మలచుకుని ప్రజల్లో ఎండగట్టేందుకు యత్నిస్తున్నాయి.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి