సంపాదకీయం

భగీరథ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గలగలా కదలిపోతున్న గోదావరీ నదీ జలాలు గ్రామీణ గృహ ప్రాంగణాలలో పరవళ్లు తొక్కడం చారిత్రక శుభపరిణామం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ అభినవ ‘్భగీరథ’ చరిత్ర ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సాకారమైంది... మెదక్ జిల్లా గజ్వేలు మండలంలోని కోమటిబండ వేదికగా వాస్తవరూపం దాల్చిన ఈ శుభసుజల స్వప్నం యుగాలకు పూర్వం పరమశివుని జటాజూటంలోకి దూకిన ఆకాశగంగ చిరుపాయలుగా మారి భూమాతను స్పృశించిన నాటి సుందర దృశ్యాన్ని స్ఫురింప చేసింది! ఈ ‘స్ఫురణ’ తెలంగాణ ప్రజల జలసాధన... తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హృదయంలో అంకురించిన తపన... ఈ ‘తపన’ తనను ముగ్ధుడిని చేసిందని ‘కోమటిబండ’ వద్ద ‘్భగీరథ ఉద్యమ’ మిషన్ భగీరథ-మధుర జలాలను అవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వ విధానాలకు, కార్యాచరణకు అత్యున్నత స్థాయి ప్రశంసాపత్రం! శివజటాజూట విముక్త గంగాజలం పాయలు పాయలుగా ప్రవహించినట్టుగా, గోదావరి నీరు ‘నల్లాలు’గా మారి ప్రతి ఇంటా నర్తించడం ఆధునిక భగీరథ ప్రయత్నానికి లక్ష్యం... ఈ లక్ష్యం వాస్తవంగా మారడం ‘కోమటిబండ’ వద్ద నరేంద్ర మోదీ జరిపిన సుజలా విష్కరణ ప్రతీక... 2019 నాటికి తెలంగాణలోని అన్ని ఇళ్ళకు ఇలా నీరు నిండిన నల్లాలు వ్యాపించడం ‘్భగీరథ’ ఉద్యమానికి సమగ్ర లక్ష్యం! కోమటిబండ కేంద్రంగా చుట్టూ నెలకొని ఉన్న అరవై ఎనిమిదివేల కుటుంబాలకు- అనేక గ్రామాల, జనావాసాల ఇళ్లకు -ఒకేరోజు ‘నల్లా’లు ప్రారం భం కావడం వినూత్న చరిత్రకు శ్రీకారం! ఈ చారిత్రక ఘట్టాన్ని సమావిష్కరించడానికి ప్రధానమంత్రి స్వయం గా తరలి రావడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘్భజం, భుజం నిలిపి’ ‘కదంకదం కలిపి’ ‘ప్రగతి పదం’ పాడాలన్న సమగ్ర జాతీయతా స్ఫూర్తికి, రాజకీయ వైవిధ్యాలకు అతీతమైన ప్రజాస్వామ్య రాజ్యాంగ దీప్తికి శిఖరతుల్యమైన సాక్ష్యం... ‘రెండేళ్ల తెలంగాణ సరికొత్త చరిత్ర సృష్టించగలగడం’ ప్రధానమంత్రి కోమటిబండ వేదికనుండి చేసిన ప్రసంగంలోని ప్రధా న ఇతివృత్తం... ఈ ఇతివృత్తం ఆదివారం సాయంత్రం భాగ్యనగరంలో జరిగిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మహాసమ్మేళనంలో నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలో పునరావృతం కావడం జాతీయ ప్రగతి విస్తృతికి నిదర్శనం... ‘తెలంగాణ’ సమగ్ర వికాసానికి విస్తృతి భారత సమగ్ర వికాసం... ప్రధానమంత్రి పదవిని స్వీకరించిన తరువాత, నూతన రాష్ట్రంగా ఏర్పడిన తరువాత తొలిసారిగా తెలంగాణ పర్యటనకు విచ్చేసిన నరేంద్ర మోదీ ఈ సమగ్ర వికాసగీతం వినిపించాడు!
ఈ సమగ్ర వికాసంతో భౌతిక ప్రగతి, సాంస్కృతిక ప్రగతి సమానంగా సమాంతరంగా నిబిడీకృతమై ఉన్నాయన్నది నరేంద్ర మోదీ ప్రసంగాల సారాంశం. అందరితో కలిసి - సబ్ కా సాథ్ - అందరి అభ్యుదయం - సబ్ కా వికాస్ - సాధించడమన్న లక్ష్యం, పునరుద్ఘాటితమైంది! కోమటిబండ వేదిక నుంచి రాష్ట్ర రాజధానిలోని లాల్‌బహదూర్ స్టేడియం వేదిక నుంచి మోదీ చేసిన ప్రసంగాలలో ఈ సమగ్ర సమైక్య జాతీయ జీవన వికాసయాత్ర పద సంచలన ధ్వనులు ప్రతిధ్వనించాయి! రాజకీయవేత్తవలె కాక జాతీయ జీవన పథ దర్శకుని వలె మోదీ మరోసారి తన వాణి వినిపించాడు! రాజకీయాలకు అతీతమైన జాతీయతా భావం చంద్రశేఖర్ రావు కోమటిబండ వద్ద చేసిన ప్రసంగంలో కూడ ప్రస్ఫుటించింది. కేంద్ర రాష్ట్రాలు పరస్పర సమన్వయ సహకార సమైక్య భావాలతో పనిచేసిన గత రెండేళ్ల చరిత్రకు 17 వేల కోట్ల ఖర్చుతో మరో ఐదు పథకాలు ఆకృతిదాల్చడం నిదర్శనం. ఈ పథకాలు తెలంగాణాను విద్యుత్ వెలుగులతో నింపడానికి సంబంధించినవి. దేశ ప్రగతికి జీవనాడుల వంటి రైలు మార్గాల విస్తరణకు సంబంధించినవి. వ్యవసాయానికి అనివార్యమైన ఎరువుల కొరతను తీర్చడానికి సంబంధించినవి. ఆరోగ్య ప్రవర్ధకమైన విశ్వవిద్యాలయ నిర్మాణానికి సంబంధించినవి! భూమాత ఆరోగ్యం పరిరక్షించడంవల్ల మాత్రమే వ్యవసాయ వికాసం, సమగ్ర వికాసం సాధ్యమన్నది రెండు చోట్ల నరేంద్ర మోదీ ప్రస్తావించిన మాట! భూమాత ఆరోగ్య పరిరక్షణ గోమాత జీవన పరిరక్షణలో ముడివడి ఉందన్న మోదీ మాట జాతీయ జీవన వాస్తవాల మాట! ఈ వికాసానికి వౌలికమైన ఆధారం అవినీతి అంటని పరిపాలన! నరేంద్ర మోదీ ప్రభుత్వం వారి అవినీతి అంటని పాలన గురించి చంద్రశేఖర్ రావు ప్రముఖంగా ప్రస్తావించడం రాజకీయ విభేదాలకు అతీతమైన ‘సమాఖ్య స్ఫూర్తి’కి అద్దం.
పార్టీ మహాసమ్మేళనంలో సైతం మోదీ రాజకీయ నాయకుని వలె కాక జాతీయ సమైక్య సాధక సమన్వయవాదిగా దృశ్యమానమయ్యాడు! తెలంగాణ రాష్ట్ర అధికార పక్షంపై కాని, ఇతర రాజకీయ పక్షాలపై కాని ఆయన ఎలాంటి విమర్శలు చేయకపోవడం ఇందుకు ప్రమాణం! మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్ర్తీ వారానికి ఒకపూట భోజనం మానేయవలసిందిగా దేశ ప్రజలకు 1960వ దశకంలో ఇచ్చిన పిలుపును మోదీ గుర్తు చేశాడు. ఇలా భోజనం మానడంవల్ల ‘మిగిలిన’ సొమ్మును దరిద్రనారాయణుల సేవకు వినియోగించాలన్నది నాటి లక్ష్యం. సంపన్నులు ‘గ్యాస్ బండ’- వంట ఇంధనం-పై లభిస్తున్న ‘సబ్సిడీ’ని వదులకోవాలని తాను పిలుపునివ్వడం ఈ ఆదర్శానికి పునరావృతి. కోటి పాతిక లక్షల కుటుంబాలు ‘సబ్సిడీ’ని వదలివేశాయ. ఈ ‘సబ్సిడీ’ సొమ్ముతో కోట్లాది నిరుపేదలకు ‘వంటగ్యాస్’ను సమకూర్చడం జరిగిందన్నది మోదీ వివరించిన ‘ప్రజల భాగస్వామ్యం’. దళితులపై దాడులను చేస్తున్నవారిని అవి తీవ్రంగా అభిశంసించడం ద్వారా నరేంద్ర మోదీ వివేకానంద స్వామి, మహాత్మాగాంధీల దళిత జనోద్ధరణ స్ఫూర్తిని తలపింపచేశాడు!! స్వాతంత్య్రం వచ్చిన తరువాత 70వ సంవత్సరం ఆరంభవౌతున్న సమయంలో నాలుగు రకాల విప్లవాలను సాధించాలన్న మోదీ పిలుపు సమగ్ర వికాసయాత్రలో మరో మలుపు!! సౌరశక్తిని విస్తృతంగా వినియోగించడానికి వీలు కల్పించే ‘అరుణ’-కాషాయ-విప్లవం, పాలను పత్తిని పంచదారను పెంపొందించే శే్వత విప్లవం, ఆహార ఉత్పత్తులను పెంచగల హరిత విప్లవం, కాలుష్య రహితమైన పరిసరాలను నీటిని, ఆకాశాన్ని అమరించగల నీలి విప్లవం-ఈ నాలుగు లక్ష్యాలు ప్రాతిపదికగా జాతీయ పతాకాన్ని ధరించి స్వాతంత్య్ర యాత్రలు జరపాలన్నది మోదీ చేసిన దిశా నిర్దేశనం.
ఇదంతా బాగుంది! కానీ తెలంగాణలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని ప్రకటించిన ‘్భజపా’ కార్యకర్తలకు మోదీ వినిపించిన ఈ జాతీయతా సమైక్య వాణి నిరుత్సాహాన్ని కలిగించి ఉండవచ్చు! సమావేశంలో తెలంగాణ అధికార పక్షాన్ని నరేంద్రమోదీ విమర్శిస్తాడని భావించిన వారికి ఈ ‘సమైక్యస్ఫూర్తి’ బహుశా కొరుకుడు పడడం లేదు! అధికార పార్టీ వైఫల్యాలను ఏకరువు పెట్టడం ఎన్నికల విజయ సాధనకు ప్రతిపక్షాలు అనుసరించే ప్రధాన వ్యూహం! తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్య్రం వచ్చింది. సర్దార్ పటేల్ కృషి ఫలితం ఈ స్వాతంత్య్రం. ఆ రోజు సెలవు ప్రకటించాలని అధికారికంగా ఉత్సవాన్ని నిర్వహించాలని మోదీ కోరి ఉండాలి. అది కూడా జరగలేదు.