మెయన్ ఫీచర్

హద్దు మీరుతున్న విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీరు చెప్పే ఒక్క అక్షరంతో కూడా నేను ఏకీభవించను కానీ అలా చెప్పే అధికారం మీకు ఉందని ఏకీభవిస్తాను’’ అని అన్నాడొక తత్వవేత్త. ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న వివిధ పరిణామాలు, రాజకీయ పార్టీల వ్యవహారశైలిని పరిశీలిస్తే సాత్విక రాజకీయాలకు తెరపడిందా? అన్న అనుమానం కలుగుతోంది. రాజకీయ పార్టీల నేతలు ప్రత్యర్థులను విమర్శించే సమయంలో సంస్కారవంతమైన భాషను ప్రయోగిం చడాన్ని ఎప్పుడో మరచిపోయారు. 1940వ దశకంలో తెనే్నటి విశ్వనాథం, ఆచార్య ఎన్.జి. రంగా వంటివారు చేసిన విమర్శలు, ప్రశంసల్లో వారు ప్రయోగించిన పదజాలం చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఎలాం టి ఉదాత్త నాయకత్వం! ఎలాంటి పరిపక్వమైన భాషను వాడారు వాళ్లు! ఒకవేళ ఏదైనా అంశం నచ్చకపోతే సున్నితంగా చమత్కారంగా చెప్పవచ్చు. సభ్యోక్తి ఎప్పుడూ మంచిదే. విజయనగర ప్రభువు ఆనందగజపతి దర్శనార్థం తిరుపతి వెంకటకవులు వెళ్లారు. కవి వృషభులారా రండి-అని లాన్స్‌లోకి ఆహావించారు. ప్రభువులవారు కామధేనువు వంటివారు అంటూ తిరుపతి కవులు చమత్కరించారు. ఇందులో ఎద్దు-ఆవుల చమత్కారం గమనించదగ్గది.
‘‘జాతీయత అనేది మూర్ఖుల అంతిమ ప్రస్థానం’’ అన్నాడు మనీష్ తివారి. ఈయన సోనియాగాంధీ వీర విధేయుడు. కానీ 20వ శతాబ్దంలో లోకమాన్యుడు, వివేకానందుడు వంటి వారివల్ల జాతీయభావం పునరుజ్జీవితమైంది. మరి సోనియాగాంధీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని (జూన్ 2) ఇటలీ అవతరణ దినోత్సవం రోజున చేసింది. మరి ఇటలీ కోసం మాజినీ అనే వ్యక్తి చరిత్రలో ప్రాణాలు అర్పించాడు. కాని ఆయన భారత్‌ను పాలిం చాలనుకోలేదు. గొప్ప దేశభక్తుడు 1930వ దశకంలో ఆయన నుండి వేలాది భారతీయు లు స్ఫూర్తి పొందారు. అందులో దామోదర వినాయక సావర్కార్ కూడా ఉన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రెండు పార్టీలు ప్రధానంగా ఉంటాయి. ప్రతిపక్షం అధికార పక్షంపై ఎప్పటికప్పుడు చెక్ పెడుతుండాలి. అపమార్గంలో పోకుండా చూడాలి. అట్లాగని ప్రభుత్వం చేసే మంచిపనులను అడ్డుకోకూడదు. కాని భారతదేశంలో ఎన్నికలు అంటే ఇది కౌరవ-పాండవ సంగ్రామంలా మార డమే విషాదం.
ముక్తార్ అన్సారీ ఉత్తరప్రదేశ్ ప్రజానీకానికి తెలుసు. ఆయనమీద పాతిక నేరాలున్నా యి. ‘క్వామ్ ఏక్తా’ పార్టీ వ్యవస్థాపకుడు. ఇటీవల ఈయన ఈ పార్టీని రద్దు చేసి ములాయంసింగ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీలో విలీనం చేయడం కేవలం ముస్లింల ఓట్లు చీలకుండా ఉండటం కోసం మాత్రమే. ఆవిధంగా భాజపాను ఓడించాలని యాదవ్ ప్రణాళికారచన చేశారు. ఇషత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసులో మోదీపై వీరు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు భిన్న దృక్పథాలను కలిగివుండటంలో తప్పులేదు. అయితే అందరికీ దేశ శ్రేయస్సే ప్రధానాంశంగా ఉండాలి. కానీ ఇక్కడ ఒక ఆత్మాహుతి బాంబర్ ఎన్‌కౌంటర్‌లో మరణిస్తే, దేశ శ్రేయస్సును కూడా మరచి విమర్శలకు పాల్పడటం ఎంతవరకు సబబు? కుమారి మాయావతిని ఎవరో తిడితే ఆమె పార్టీ కార్యకర్తలు కూడా అవే అశ్లీల పదజాలం ఉపయోగించారు. జూలై 7వ తేదీన హైదరాబాద్‌లో భార త ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ దళితులపై జరిగే దాడి వ్యక్తిగతంగా తనపై జరిగే దాడిగా అభివర్ణించారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మంచి పథకాలు. కాకతీయ గణపతిదేవుని స్ఫూర్తితో వీటిని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వాటిని విమర్శించడం తగదు. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి వంటి పథకాలను మనస్ఫూర్తిగా అభినందించాలి. అయుత చండీయాగానికి స్వయంగా శృంగేరీ జగద్గురువులే మం త్రాక్షతలు పంపడం అభినందనీయం. సంక్షే మ పథకాల్లో లోపాలు జరుగవచ్చు. ఒకవేళ అందులో లోపాలేమైనా ఉంటే ఎత్తి చూపి సరిదిద్దుకోవచ్చు. అంతేకాని కేసీఆర్ చేసే పనులను అడ్డుకోవడం తగదు. లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. దీన్ని అంతా ప్రోత్సహించాలి.
చాలా రోజుల క్రితం తెలంగాణలో ఒక సీనియర్ నాయకుడు మాట్లాడుతూ కాంగ్రెస్‌కు త్వరగా శస్తచ్రికిత్స చేయాలి లేకపోతే పోస్టుమార్టం చేయాల్సి వస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలను జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు, ఆయనపై అన్నివైపులనుంచి దుర్భాషాలాడారు. షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇక్కడ ఇంత ఆగ్రహం అవసరమా? తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ నిర్వహించిన పాత్ర మనందరికీ తెలుసు. కానీ ఆయన్ను ‘విషనాగు’ అంటూ ఆమధ్య తెరాసా వారు ఎందుకు తిట్టినట్టు? ఉత్తరప్రదేశ్‌లో కొన్ని అగ్రవర్ణాల లక్ష్యంగా మాయావతి తీవ్రస్థాయి పదజాలంతో విమర్శించారు. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అసెంబ్లీలో మైకు లు విరిచి, తలలు పగలగొట్టుకుంటున్నారు. ఈ నేరాలు అసెంబ్లీలోని కొన్ని ప్రత్యేక రక్షణ చట్టాల దృష్ట్యా కోర్టు పరిధిలోకి రావు. నేటి రాజకీయల్లో కొందరు మహిళామణులు ప్రయోగిస్తున్న భాషను, పూర్వం సచేతా కృపలానీ, దుర్గాబాయి దేశ్‌ముఖ్, సరోజినీ నాయుడు వంటి మహిళామణులు ఎప్పుడూ వాడి ఉండలేదు.
చంద్రబాబు నాయుడుకు కష్టించి పనిచేసే మనస్తత్వం ఉంది. కాని తలకు మించిన సమస్యలు ఒక్కసారి ముసురుకున్నాయి. రాష్ట్ర రాజధాని నిర్మాణం కాకపోవడం, ప్రత్యేక హోదా రాకపోవడం ప్రధాన సమస్యలు. అలాంటప్పుడు సానుభూతితో సహకరించవలసింది పోయి, విశాఖలో ఇంటింటికి తిరిగి బాబు వైఫల్యాలను ఎండగడతాను అని జగన్ అనడం తగదు. దీంతో కోపగించిన తెలుగుదేశం కార్యకర్తలు విశాఖ జగదంబ సెంటర్‌లో ఇంటింటికి గుమ్మడికాయలు, జగన్ దిష్టిబొమ్మలు కట్టారు. ఇది మరో ప్రహసనం. తెలుగు రాష్ట్రాల్లో ఆమధ్య వివిధ పా ర్టీల మధ్య చోటుచేసుకున్న విమర్శల్లో చెప్పు లు, చీపుర్లు, అన్ని రకాల పారిశుద్ధ్య ఉపకరణాలు ప్రవేశించాయి.
సిపిఎంలో సంక్షోభం ఏర్పడింది. క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి పోలిట్ బ్యూరోలో జరిగే చర్చలు పత్రికలకు ఎక్కవు. ఇప్పుడు అధినాయకత్వపు వైఫల్యాలను పార్టీ కార్యకర్తలు ఎత్తి చూపుతున్నారు. ఏచూరి సీతారాంపై అన్ని రాష్ట్రాలనుంచి విమర్శలు మొదలయ్యాయి. కేరళలోని అచ్యుతానందన్ వర్గం తిరుగుబాటు చేసింది. ఐక్యత చాటాలని పిలుపునిచ్చినా సిపిఐ అంగీకరించక పోవడం ఏమిటని ప్రశ్నించారు. విశాఖపట్టణంలో జరిగిన మహాసభలో కాంగ్రెస్‌తో ఎట్టిపరిస్థితుల్లో పొత్తుపెట్టుకోకూడదని తీర్మానించినవారు పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో ఏవిధంగా పొత్తు పెట్టుకున్నారంటూ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం వ్యూహాత్మకం అని సర్ది చెప్పినా వినని పరిస్థితి. అప్రతిహతంగా 34 సంవత్సరాలు బెంగాల్‌ను పాలించిన పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 24 సీట్లతో మూడో స్థానం రావడం ఏమిటని ప్రశ్నించారు. ఐతే సిపిఎం ప్రధాన కార్యదర్శి సురాజ్యకాంత్ మిశ్రా మాత్రం ఏచూరి నాయకత్వాన్ని సమర్థించారు. ‘‘ప్రధమ స్థానంలో టిఎంసి, ద్వితీయ స్థానంలో కాంగ్రెస్, తృతీయ స్థానంలో మనం ఉన్నాం. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా రెండో స్థానానికి భాజపా రాకుండా నిరోధించగలిగాం’ అంటూ వ్యాఖ్యానం చెప్పి దారుణమైన ఓటమికి సైద్ధాంతిక భూమికను సృష్టించారు.
ఢిల్లీ జెఎన్‌టియు వామపక్ష భావజాలానికి కేంద్రస్థానమైంది. సీతారాం ఏచూరి, కన్హయ్యకుమార్ వంటివారు అక్కడినుంచి ఉత్పత్తి అయినవారే. వామపక్షాల వారు నోరు తెరిస్తే నాగ్‌పూర్ సంత్రాపండును విమర్శిస్తుంటారు. ఆ పండు చాలా రుచికంగా ఉన్నప్పటికీ వీరికి ఇష్టం ఉండదు. ఆమధ్య తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక సీనియన్ కేంద్ర మంత్రిని, సిపిఐ నాయకుడు ఒకరు తీవ్ర పదజాలంలో విమర్శించారు. ఒక సీనియర్ దేశభక్తుడిని విమర్శించడం ఎంతవరకు సబబు? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సిపిఐ కార్యాలయాలు దాదాపు మూతపడే స్థితిలో ఉన్నా యి. సోడె రామయ్య, చంద్రావతి, నోముల నర్సయ్య, రవీంద్రనాయక్ వంటి వారు ఒకరితర్వాత మరొకరు జారుకున్నారు.
నిన్న ట్రంప్ మీద, హిల్లరీ క్లింటన్ మీద అమెరికా ఎన్నికల సందర్భంగా కార్యకర్తలు ఘాటుగా విమర్శించకపోవడం విశేషమే. అయతే ఇటీవలనే ఒకామె ట్రంప్ శీలహననం చేసేలా మాట్లాడింది. అదే లోగడ అమెరికాలో బిల్ క్లింటన్ ఎన్నికల్లో నిలబడినప్పుడు ఆయన కుటుంబం మీద రిపబ్లికన్లు దారుణ పదజాలాన్ని ప్రయోగించారు. దుష్ట పదప్రయోగాలు చేసి శీల హననం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే రోత పుట్టేలా వ్యవహరించారు. ఇదే పద్ధతిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా విమర్శలు ఆరోపణలు చోటుచేసుకున్నాయి. ప్రత్యర్థిని విమర్శించాలంటే అంత నీచస్థాయి పదప్రయోగాలు అవసరమా?
1952లో మామా అల్లుళ్ల సరసాలు చూడ ముచ్చటగా ఉండేవి. మామ అంటే నెహ్రూ, అల్లుడు అంటే ఫిరోజ్ గాంధీ. వాళ్లు పార్లమెంటును దేవాలయంలా భావించారు. చట్టసభలను చాకిరేవులు చేయలేదు. బిహార్‌లో ప్రభావతి అనే కాంగ్రెస్ నాయకురాలిని, లల్లూప్రసాద్ యావద్ భార్య రాబ్రీదేవి దూషించింది. వేణీ ప్రసాద్ వర్మ అనే తూర్పు ఉత్తర భారతీలోని నాయకుడు నరేంద్ర మోదీని ‘మ్యాన్ ఈటర్’ అంటూ విమర్శించాడు. బహుశా భారత్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తే తప్ప ఇలాంటి రాజకీయ భాష-పరిభాష ఆగదు అనిపిస్తుంది.
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రధానంగా బ్రిటీషు పార్లమెంటరీ విధానాన్ని ఆదర్శంగా చేసుకొన్నది. కాబట్టి వారి సత్సంప్రదాయాలతో బాటువారి దూషణ భూషణలు కూడా భారతదేశంలోకి దిగుమతి అయ్యా యి. విగ్గులు, టోపీలు ఉండే రెండు వర్గాల వారు బ్రిటన్‌లో కొట్టుకునేవారు. అంటే ‘పుల్ల మజ్జిగ’ లాంటి వాళ్లు అని ఎగతాళిగా పెట్టుకున్న పేర్లివి. మానవ గౌరవానికి భంగపరిచేటట్టు రాజకీయ వేత్తలు ప్రవర్తించకూడదు. లండన్‌లో హైడ్ పార్కు ఉంది. అక్కడ కొందరు యువకులు మార్కెరెట్ థాచర్‌ను నానా దుర్భాషాలు ఆడి నోటి దురద తీర్చుకునేవారు. ఇప్పుడు మన శాసనసభలు, పార్లమెంటు హైడ్ పార్కుమాదిరిగా మారడం మనం చేసుకున్న పాపం. 1950లో శంకర్స్ వీక్లీలో నెహ్రూ, వికె కృష్ణమీనన్ వంటి వారిమీద వ్యంగ్య చిత్రాలు వస్తుండేవి. వాటిని చూసి ఆ మహానాయకులు నవ్వుకొని ఆనందించేవారు. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు.

- ముదిగొండ శివప్రసాద్