సంపాదకీయం

తోడేలును పెంచిందెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విస్మయ చకితులైన వారు తేరుకోవడానికి మరింత సమ యం పట్టవచ్చు. ఈ విస్మయ తీవ్రతను వివరించే వాక్యా లు లేవు. ఆవిష్కరించడానికి అక్షరాలు చాలవు. దాదాపు ఇరవై ఏళ్లకు పైగా మొహమ్మద్ నరుూముద్దీన్ అనే నరరూప రాక్షసుడు ఇన్ని భయంకర బీభత్స కృత్యాలను ఇంత విస్తృత ప్రాంతంలో ఎలా కొనసాగించగలిగాడన్నది విచక్షణ ఉన్న వారికి విస్మయాన్ని కలిగించిన పరిణామం! పోలీసుల నిర్లక్ష్యం వల్ల నిఘా నిద్దుర పోవడంవల్ల నేరప్రపంచపు సరిహద్దులు నిరంతరం విస్తరించిపోతున్నాయ. ఈ నేరస్థులు మానవ రక్తం తాగడం మరిగిన దానవులు, సంఘ వ్యతిరేక శక్తులు, జాతి వ్యతిరేక శక్తులు, మతోన్మాద జిహాదీలు, మావోయిస్టులు, భౌతిక బౌద్ధిక బీభత్సకారులు...కానీ నరుూముద్దీన్ లేదా నరుూం అనే వాడి పైశాచిక సామ్రాజ్యం విస్తరించడానికి పోలీసుల నిర్లక్ష్యం కారణం కాదు, పోలీసుల అండదండలతోనే నరుూం ఇన్ని హత్యలు చేయగలిగాడు, ఇన్ని ఘోరాలు చేయగలిగాడు...అన్న ఆరోపణలు విచక్షణ ఉన్నవారిని విస్మయ బద్ధులను చేస్తున్నాయి. ఉన్నత పోలీసు అధికారి కె.ఎస్.వ్యాస్‌ను 1993లో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న లాల్ బహదూర్ స్టేడియంలో హత్య చేసిన ముఠాకు చెందిన నరుూంను ఆ తరువాత పోలీసులే వ్యూహాత్మకంగా పెంచి పెద్ద చేయడం విచక్షణకు విరుద్ధమైన విష పరిణామం. పీపుల్స్‌వార్ గ్రూప్-పిడబ్ల్యుజి-కు చెందిన నరుూంను కొందరు పోలీసు అధికారులు మచ్చిక చేసుకొనడం నక్సలైట్లను వారి వేలితో వారి కన్నును పొడిచే వ్యూహంలో భాగం కావచ్చు! కానీ పోలీసుల అండదండలతో నరుూం భయంకర బహుముఖ బీభత్సకారుడిగా రూపుదిద్దుకొనడం తరువాత నడచిన కథ. ఈ కథను ఆగస్టు ఎనిమిదవ తేదీన షాద్‌నగర్ సమీపంలో నరుూం హతమయ్యేవరకు పోలీసులలో కొందరు తిలకించలేదు, నడిపించారన్నది ప్రచారవౌతున్న ఆరోపణ! సాధు జంతువుల మధ్య ఆలమందల మధ్యలో తోడేళ్లు సంచరించినట్టుగా జనావాసాల మధ్య నరుూం, అతగాడి బంధువులు, ముఠా సభ్యులు, మద్దతుదారులు, అనుచరులు, దాదాపు పాతికేళ్లు సంచరించారు. పోలీసులు ఈ కదలికలను పసికట్టినప్పటికీ పట్టుకోకుండా మిన్నకుండడం వేరు. ఆరోపణలలో ఏమాత్రం నిజం ఉన్నప్పటికీ పోలీసులే జనావాసాల మధ్య నరుూం ముఠాను యథేచ్ఛగా సంచరించడానికి వీలు కల్పించారన్నది స్పష్టం. ఇనే్నళ్లపాటు ఇలా నరుూం ముఠాను జనం మీదికి ఉసిగొల్పిన పోలీసులు, అధికారులు ఎవరన్నది దర్యాప్తులలో కాని బయటపడదు...ఆ దర్యాప్తులు ఇప్పుడైనా మొదలు కావాలి.
నరుూం ఇళ్లలోను బంధువుల ఇళ్లలోను బయటపడుతున్న నగదు, బంగారం, ఆస్తుల వివరాలను తెలిపే పత్రాలు, ఆయుధాలు విచక్షణ ఉన్నవారికి విభ్రాంతిని కొలుపుతున్నాయి. అతగాడి ఆస్తుల విలువ వెయ్యికోట్ల రూపాయలని ఎనిమిదవ తేదీన ప్రచారమైంది. కాదు వేల కోట్ల రూపాయలని తొమ్మిదవ తేదీన ప్రకటనలు వెలువడుతున్నాయి. దర్యాప్తు చేస్తున్న పోలీసులు తవ్వుతున్న కొద్దీ ఇంకా ఎనె్నన్ని రక్తపంకిలమైన అవినీతి కంకాళాలు అతగాడి ఇళ్లనుంచి, డైరీలనుంచి, పత్రాలనుంచి బయటపడనున్నాయో! నల్లగొండ జిల్లాలోనే నాలుగు వందల ఎకరాల భూమిని నరుూం కబ్జా చేయడం విస్తరించిన హంతక సామ్రాజ్యానికి నిదర్శనం. నక్సలైట్లను అదుపు చేయడానికి పోలీసులు మచ్చిక చేసుకున్న ఈ మానవ మృగం లైంగిక బీభత్స పిశాచంగా, జనానికి భయోత్పాతం కలిగించే కోరల రక్కసునిగా రూపాంతరం చెందింది! బాలికలను యువతులను గ్రామాలనుంచి గూడాలనుంచి కొనుగోలు చేసి దేశ విదేశాలలోని వివిధ ప్రాంతాలకు విక్రయించడం మొదలుపెట్టిన ఇతగాడి చర్యలు పోలీసులకు తెలుసునన్నది స్పష్టం. అయినప్పటికీ పోలీసులు సాగనిచ్చారన్నది కూడా స్పష్టం. ఐదారు ఏళ్లలోపు చిన్న పిల్లలు కూడ అనేకమంది నరుూమ్ నియంత్రణలో ఉన్నట్టు కూడ ఇప్పుడు బయటపడింది. ఈ పిల్లలు ఎక్కడివారు, ఎవరి పిల్లలు, వారితో ఈ హంతక ముఠా వారికి ఏమి పని? అన్న వివరాలు ఇప్పుడైనా బయటపడాలి. పోలీసులు పరిశోధించి బయటపెట్టాలి! పీపుల్స్‌వార్ గ్రూప్ మావోయిస్టు పార్టీగా అవతరించింది. తెలుగు రాష్ట్రాలనుంచి దాదాపు ఐదారు ఏళ్లపాటు అదృశ్యమైంది. ఈ కాల వ్యవధిలో పోలీసులకు నరుూంవల్ల తెలిసిన నక్సలైట్ల సమాచారం దాదాపు సున్న. ఇదే సమయంలో నకిలీ నక్సలైట్ నరుూం హంతక ముఠాకు అధినేతగా మారాడు!
ఈసంగతిని పసిగట్టిన వెంటనే పోలీసులు అతగాడిని నిర్బంధించి ఉండవచ్చు. అలా నిర్బంధించకపోవడం వల్లనే నరుూం నరమేధం సాగించడానికి వీలు ఏర్పడింది! నక్సలైట్లను, సానుభూతిపరులను మాత్రమే కాక తన మాట వినని తనకు లక్షల కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వడానికి నిరాకరించిన వారిని, ఇవ్వలేని వారిని నరుూం చంపేశాడు. కనీసం పదేళ్ల క్రితమే నరుూంను పోలీసులు నిర్బంధించి ఉండినట్టయితే ఆ తరువాత అతగాడు సాగించిన అసాంఘిక కార్యకలాపాలను, బీభత్సకాండను నిరోధించగలిగి ఉండేవారు. ఇన్నాళ్లుగా నరుూం ఎక్కడో అడవులలో నక్కిలేడు. నగరంలోను పట్టణాలలో యథేచ్ఛగా సంచరించాడు! ఎదురు కాల్పులలో నరుూం హతమైన వెంటనే అతగాడి ఇంటిని అతని ముఠాలోని ఇతరుల ఇళ్లను బంధువుల ఇళ్లను పోలీసులు చుట్టుముట్టగలగడం సోదాలు జరపగలగడం ఇలా తెలుసునన్న వాస్తవానికి ఒక ఉదాహరణ మాత్రమే! జేబుదొంగలు, దొంగ వ్యాపారులు మొదలుకొని కరడుకట్టిన హంతకుల వరకు వివిధ స్థాయిల వివిధ రకాల నేరస్థులు విచ్చలవిడిగా విస్తరించిపోవడానికి రాజకీయ నాయకుల అండదండలు ప్రధాన కారణమన్నది దశాబ్దుల వైపరీత్యం. నరుూం ఇలా విస్తరించడానికి ఈ అండదండలు కూడ మెండుగా ఉన్నాయన్నది నిరాకరించలేని నిజం. పోలీసులు నరుూంను మొదట మచ్చిక చేసుకున్నప్పటికీ వందల ఎకరాల భూమిని నరుూం కబ్జా చేయడానికి కారణం రాజకీయ అండదండలే! రాజకీయ వాదులకు స్థిరాస్తి వ్యాపారులకు నరుూం ప్రమాదంగా ఎదిగిపోయిన తరువాత మాత్రమే పోలీసులు అతగాడిని పట్టుకొనడానికి రంగప్రవేశం చేసారు. నరుూం హతం కావడంతో అతగాడి ముఠాలకు చెందిన వారిలో అత్యధికులు కొనే్నళ్లు అణగి మణగి ఉండిపోవచ్చు. ఆ తరువాత ఈ హంతకులు మళ్లీ చెలరేగడం ఖాయం! హంతకులు, టెర్రరిస్టులు జనం మధ్యనే యథేచ్ఛగా విహరించగలుగుతున్నారన్నది నరుూం ఉదంతంవల్ల మరోసారి ధ్రువపడింది! క్రూర జంతువులున్న అడవులలో కుందేళ్లు, జింకలు బితుకు బితుకుమని జీవిస్తున్నట్టుగా నరుూంల మధ్య నరహంతకుల మధ్య నాగరికులం బతుకుతున్నాము...
పోలీసులు తమకు రహస్య సమాచార వాహకులను తయారు చేసుకోవడం విధానాన్ని సమీక్షించుకోవలసిన సమయం ఇది. నక్సలైట్లను కాని, టెర్రరిస్టులను కాని, సంఘ విద్రోహులను కాని పట్టుకుని న్యాయస్థానాల ముందు నిలబెట్టడం ప్రజాస్వామ్య రాజ్యాంగ సంప్రదాయం.కానీ న్యాయస్థానాలు నేరస్థులుగా నిర్ధారించిన వారిని నిర్బంధ శిక్షలను అనుభవిస్తున్న వారిని ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులు మధ్యలోనే జైళ్లనుండి విడుదల చేస్తున్నారు. ఇలా విడుదలయినవారు మళ్లీ ఘోర నేరాలకు పాల్పడుతున్నారు. గతంలో కృష్ణప్రసాద్ అన్న ఉన్నత పోలీసు అధికారిని హత్య చేసిన ముజిబ్ అనేవాడు, ఈ నరుూం అనేవాడు అలాంటి వారిలో కొందరు...