సంపాదకీయం

జల సయోధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సయోధ్య భావ సుగంధం వెల్లివిరుస్తోంది. సుగంధ జలభరితమైన స్రవంతులు పొంగులెత్తి పరుగులు తీస్తున్నాయి. వినూతన సమైక్య భావ పరిమళ పవనం ‘సహ్యాద్రి’ నుంచి ‘నల్లమల’ వరకు విస్తరిస్తోంది, పడమటి కనుమలకూ తూర్పు కనుమలకూ మధ్య స్నేహ సేతువుగా రూపొందుతోంది... ఈ స్నేహం మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మంగళవారం కుదిరిన చారిత్రకమైన ‘నీటి ఒప్పందం...’ ఉభయ రాష్ట్రాల జనమానస సీమలను పండించగల సేద్యపు నీటి ఒప్పందం, దాహార్తిని తీర్చగల మంచినీటి ఒప్పందం... గోదావరి నది నీటిని ‘చెలిమి చెలమల’ ద్వారా పరస్పరం ఉభయ రాష్ట్రాలు విందు చేసుకొనేందుకు వీలు కల్పిస్తున్న ఒప్పందం. అరవై ఏళ్ల పాటు కొనసాగిన వైరుధ్యాలు సాధించలేని ఒప్పందాన్ని రెండేళ్ల చర్యలు సాధించగలగడమే వినూతన చరిత్ర... గోదావరీ నదీ సుధలతో నిండనున్న జలాశయాలు ఈ సరికొత్త చెలిమి చెలమలు... కాళేశ్వరం, మేడిగడ్డ, తుమ్మిడిహట్టి, ఛనాఖా, కొరటా వంటి పేర్లు, అక్కడక్కడ నిర్మాణం కానున్న ఆనకట్టలు ‘తెలంగాణ, మహారాష్ట్ర జనమైత్రీ జలసాగరాలు... శుభంకర చరిత్రకు శ్రీకారాలు!! గోదావరి, దాని ఉపనదులైన ప్రాణహిత వైనగంగ తదితర స్రవంతుల సుజల మాలికలు ఉత్తర తెలంగాణ గృహ ప్రాంగణాలకు పసిడి పంటల తోరణాలుగా మారడానికి మంగళవారం నాడు ఉభయ ప్రాంతాల ద్వైపాక్షిక అంగీకారం దోహదం చేయనుంది. ‘మేడిగడ్డ’ జలాశయం వల్ల మాత్రమే పద్దెనిమిది లక్షల ఎకరాల భూమికి కొత్తగా సేద్యపు నీరు సమకూరనున్నదట, మరో పద్దెనిమిది లక్షల ఎకరాలకు అదనపు నీటి సౌకర్యం కలుగనున్నదట! ప్రాణహిత, పెన్‌గంగా నదులపై నిర్మించనున్న జలాశయాలవల్ల మరిన్ని లక్షల ఎకరాలకు నీరు లభించనుంది. సంబంధిత రాష్ట్రాల మధ్య దేశమంతటా నీటి యుద్ధాలు జరుగుతున్న సమయంలో తమ ఉభయ రాష్ట్రాల మధ్య కేవలం రెండేళ్లలో గోదావరి జలాల వివాదం పరిష్కారం కావడం గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సముఖంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అభివర్ణించిన తీరు అభినందనీయం.జల వివాదాలను సర్వోన్నత న్యాయస్థానం మాత్రమే పరిష్కరించగలగడం నడుస్తున్న చరిత్ర. కేంద్ర జలవనరుల నిర్వహణ మండలి కాని, ద్వైపాక్షిక జలవనరుల మండలి కాని వివధ రాష్ట్రాల మధ్య నీటి తగాదాలను పరిష్కరించ లేకపోవడం అవిష్కృతవౌతున్న నిరంతర దృశ్యం. తెలుగు ప్రజలకు ఉభయ రాష్ట్రాల మధ్య సాదర్య వాహిని అయిన కృష్ణలో వివాద జ్వాలలు రాజుకుంటూ ఉండడం పరాకాష్ఠ...
తెలంగాణ, మహారాష్టల్ర మధ్య కుదిరిన ఒప్పందం దేశంలోని మిగిలిన రాష్ట్రాల వారికి సయోధ్య ప్రేరకం. ముంబయిలోని ‘సహ్యాద్రి’ అతిథి గృహం ఈ సయోధ్యకు వేదిక. గత మార్చిలో ఉభయ రాష్ట్రాల మధ్య కుదిరిన సూత్రప్రాయమైన అంగీకారానికి విస్తృత భాష్యం వంటిది మంగళవారం తుది రూపం ధరించిన ఒప్పందం. తెలంగాణలో మూడు బృహత్ జలాశయాలను, మహారాష్టల్రో రెండు జలాశయాలను నిర్మించే ఐదు పథకాలకు ఉభయ రాష్ట్రాలు మార్చిలో అంగీకరించాయి. సంబంధిత అవగాహన పత్రంపై చంద్రశేఖరరావు, ఫడ్నీవీస్ మార్చి ఎనిమిదవ తేదీన మంగళవారం నాడు ‘సహ్యాద్రి’లోనే సంతకాలు చేశారు. మళ్లీ ఈ మంగళవారంనాడు ఉభయుల సమక్షంలో విస్తృతమైన వివరణాత్మకమైన ఒప్పందం కుదిరింది! మంగళకరమైన జల సయోధ్యకు ప్రాతిపదిక ఏర్పడింది! గోదావరి, తదుపరి నదుల నీరు పంపిణీలో చివరికి తెలంగాణకు ఎక్కువ లాభమా? లేక మహారాష్ట్రం అధికతర లబ్ధిని పొందగలిగిందా? అన్నది ప్రధానం కాదు. ఎందుకంటే ఒకటి రెండు శతకోటి ఘనపుటడుగుల నీరు తెలంగాణ పొలాలకు ఎక్కువగా లభించినప్పటికీ, మహారాష్ట్ర ప్రజలు తాగేసినప్పటికీ పట్టించుకోవలసిన పని లేదు, ఎందుకంటే ఉభయ రాష్ట్రాల ప్రజలూ భారతీయులు - భరతమాట ముద్దుబిడ్డలు - ‘్ఫరక్కా’ ఆనకట్ట ద్వారాను తీస్తా, గంగా జలాల పంపిణీ ద్వారాను మన దేశం బంగ్లాదేశ్‌కు న్యాయమైన వాటాకంటే చాలా ఎక్కువ కట్టబెట్టింది! సింధూ జలాల ఒప్పందం కూడా మన దేశానికంటే పాకిస్తాన్‌కు ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తోంది! ఇలా ఇతర దేశాలకు నీటిని ప్రదానం చేయడంలో మనదేశం అత్యంత ఉదారంగా వ్యవహరించింది! అందువల్ల మన దేశంలోనే ఒక ప్రాంతం మరో ప్రాంతంపట్ల ఒక భాషా జనసముదాయం, మరో భాషా జనసముదాయంపట్ల ఉదారంగా వ్యవహరించడం సహజ జీవన శైలి కావాలి, కాకపోవడం కృత్రిమ జీవన శైలి...
ఈ కృత్రిమ జీవన శైలిని ప్రజలు అంగీకరించడం లేదు. కేవలం రాజకీయ వాదులు పెంపొందించి విస్తృతం చేస్తున్నారు. అధికార పక్షం పొరుగు రాష్ట్రాలతో ఉదారంగా వ్యవహరించి నీటి తగాదాలను పరిష్కరించుకున్నట్లయితే ప్రతిపక్షాల వారు ఊరుకోరు, ఉర్వీతలం మారు మోగే విధంగా విమర్శలను, నిరసన ధ్వనులను వినిపిస్తున్నారు. అధికార పక్షం, ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ప్రచారం చేస్తున్నారు. 1947 నుంచీ ఇది కొనసాగుతున్న ప్రహసనం!! ప్రతిపక్షాల మాటలను ప్రజలు నమ్మేస్తారన్న భయం అధికార పక్షాలను నిరంతరం వెన్నాడుతూనే ఉంది!! అందువల్ల పొరుగు రాష్ట్రాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంవల్ల మాత్రమే స్వరాష్ట్ర నీటి ప్రయోజనాలను తాము కాపాడినట్టు కాగలదని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు విశ్వసిస్తున్నాయి. నీటి తగాదాలు నివారణ కాకపోవడానికి ఇది ప్రధాన కారణం!! కర్నాటక, తమిళనాడుల మధ్య కావేరీ జలం, కర్నాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణాజలం, మహారాష్ట్ర, ఒరిశా, ఛత్తీస్‌గఢ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నీటి తగాదాలు దశాబ్దాల తరబడి నిప్పులను కురిపించడానికి ఈ ‘రాజకీయం’ ప్రధాన కారణం! నర్మదా జలాలు, యమునా జలాలు, సట్లెజ్ నదీ జలాలు కూడా వివిధ రాష్ట్రాల మధ్య నిప్పుల వారధులుగా మారి ఉన్నాయి. చంద్రశేఖరరావు ‘సహ్యాద్రి’ వేదికపై ప్రస్తావించిన నీటి యుద్ధాలకు బహుశా ఇదంతా నేపథ్య వైపరీత్యం...
మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాలు ఈ వైపరీత్యాన్ని అతి గమించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను, కర్నాటకలోను, మహారాష్టల్రోను, కేంద్రంలోను ఒక రాజకీయ పక్షం ప్రభుత్వాలను నిర్వహించిన సమయంలో కూడా ‘కృత్రిమ వైరుధ్యాలు’ సమసిపోలేదు. తెలంగాణలోను, మహారాష్టల్రోను భిన్నభిన్న రాజకీయ పక్షాలు అధికారాన్ని నిర్వహిస్తున్న ఈ రెండేళ్లలో వైరుధ్యాలు అంతరించాయి. చంద్రశేఖరరావు, దేవేందర్ ఫడ్నవీస్ రాజకీయ విభేదాలకు అతీతంగా జాతీయతా నిష్టా నిబద్ధులుగా ఎదిగారు. అదీ చారిత్రక ఘట్టానికి అసలు ప్రాతిపదిక! ‘మేడిగడ్డ’ నీటిమట్టం ఒక మీటరు పెరిగిందా, ఎత్తు ఒక మీటరే పెరిగిందా అన్నవి ప్రాతిపదికలు కాలేదు. గోదావరి అమృత ప్రవాహం, ఆత్మీయ భావంతో పంచుకోగలిగితే ఈ అమృతఫలాలు, హరిత క్షేత్రాలు పరివాహ ప్రజలందరికీ సమకూడగలవన్న సత్యానికి ఈ ఒప్పందం చారిత్రక ధ్రువీకరణ! వయస్సులో చిన్నవాడైన ‘దేవేంద్రుడి’ని తెలుగు ‘చంద్రుడు’ ఆశీర్వదించడం ఈ భారత జాతీయ పరివార ప్రవృత్తికి చారిత్రక పతాకం. ఇదే స్ఫూర్తిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల పంచుకోవడం మరో ఆదర్శ చరిత్రకు అంకురార్పణ కాగలదు...